పంతాలకు పోయి..
‘అనంత’ నగర పాలక సంస్థ సమావేశం గందరగోళం
అనంత మేయర్, ఎమ్మెల్యే వర్గాల మధ్య వాగ్వాదం
సమావేశం నుంచి వాకౌట్ చేసిన చౌదరి వర్గం
జిల్లా కార్యాలయాలకు స్థల కేటాయింపుపై వైఎస్సార్ సీపీ అభ్యంతరం
అనంతపురం న్యూసిటీ : నగర పాలక సంస్థలో ఎమ్మెల్యే ప్రభాకర్‌చౌదరి వర్గీయుల తీరు మారలేదు. ఎప్పటిలాగే మేయర్ స్వరూపను లక్ష్యంగా చేసుకుని సర్వసభ్య సమావేశాన్ని అడుగడుగునా అడ్డుకునే ప్రయత్నం చేశారు. అనంతపురం మేయర్ స్వరూప అధ్యక్షతన శనివారం జరిగిన నగర పాలక సంస్థ సర్వసభ్య సమావేశంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సమావేశం ప్రారంభమైనప్పటి నుంచి వివిధ కారణాలను చూపుతూ ఎమ్మెల్యే వర్గానికి చెందిన కార్పొరేటర్లు గందరగోళాన్ని సృస్టించారు. ఆఖరుకు నల్లరిబ్బన్‌లు, ప్లకార్డుల ప్రదర్శన కూడా చేశారు.
ప్రతి డివిజన్ కార్పొరేటర్‌కు అవకాశం కల్పిస్తామని, వారి పరిధిలో నెలకొన్న సమస్యలు వివరించాలని ఇందుకు చివరిలో అధికారులు వివరణ ఇస్తారని మేయర్ పేర్కొనడంతో డిప్యూటీ మేయర్ గంపన్న అభ్యంతరం తెలిపారు. సమస్య చెప్పిన వెంటనే సమాధానం ఇవ్వాల్సిందేనని పట్టుబట్టారు. ఆయనకు టీడీపీ కార్పొరేటర్లు సరిపూటి రమణ, విజయశ్రీ, బల్లాపల్లవి, సద్దల హేమలత, లక్ష్మిరెడ్డి మద్దతు పలికారు. ఇందుకు మేయర్ అంగీకరించకపోవడంతో సమావేశం నుంచి వాకౌట్ చేశారు. తనకు తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదంటూ కోఆప్సన్ సభ్యురాలు శివబాల వాపోయారు.తన సూచనలు, సలహాలను పరిగణలోకి తీసుకోవడం లేదని, ప్రోటోకాల్ పాటించడం లేదని అసహనం వ్యక్తం చేశారు.
నగర పాలక సంస్థకు చెందిన విలువైన స్థలాన్ని కలెక్టర్ కాంప్లెక్స్, స్పోర్ట్స్ కాంప్లెక్స్, బీసీ భవన్, బీసీ బాలికల వసతి గృహం నిర్మించేందుకు కేటాయించడాన్ని వైఎస్సార్ సీపీ కార్పొరేటర్ బాలాంజినేయులు అభ్యంతరం వ్యక్తం చేశారు. జిల్లా కేంద్రంలో ఉండాల్సిన ప్రభుత్వ కార్యాలయాలను హిందూపురం నియోజకవర్గమైన రాప్తాడు ప్రాంతంలో ఏర్పాటు చేయాలనుకోవడం అవివేకమని అన్నారు. ఈ మూడు అంశాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఇందుకు వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లు జానకి, గిరిజమ్మ, గూడూరు మల్లికార్జున, షుకూర్, గంగన హిమబిందు, టీడీపీ కార్పొరేటర్లు సైతం మద్దతు తెలిపారు. ఈ అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి నిర్ణయం తీసుకోనున్నట్లు మేయర్ తెలిపారు. నడిమివంక వద్ద పట్టుమని పది నిమిషాలు కూడా నిలబడలేని పరిస్థితి ఉందని గంగన హిమబిందు తెలిపారు. భరించలేని కంపుతో ఆ ప్రాంత ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. నగరంలో పందులు, కుక్కలు స్వైర్యవిహారం చేస్తున్నాయని, చెత్త సేకరణ జరగడం లేదంటూ బోయ గిరిజమ్మ, జానకి, షుకూర్, చింతకుంట సుశీలమ్మ, పక్కీరమ్మ హెచ్చరించారు.
ఆర్టీసీ బస్టాండ్ నుంచి తాడిపత్రి రోడ్డు మార్గానికి రూ 25.09 కోట్ల ప్రభుత్వ నిధులు మంజూరు కావడం వెనుక ఎమ్మెల్యే కృషి ఉందన్న మేయర్ వాదనను నాల్గో డివిజన్ కార్పొరేటర్ కోగటం శ్రీదేవి త్రోసిపుచ్చారు. ఎమ్మెల్యే కృషి కాదని, ఎంపీ దివాకర్‌రెడ్డి చొరవతోనే నిధులు మంజూరయ్యాని స్పష్టం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా వెలుస్తున్న భవ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలంటూ షుకూర్, జానకి డిమాండ్ చేశారు. కార్పొరేటర్లు తమ దృష్టికి తీసుకొచ్చిన సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తామని మేయర్ స్వరూప, కమిషనర్ పీవీవీఎస్ మూర్తి పేర్కొన్నారు. అనంతరం అజెండాలోని 24 అంశాల్లో ఒకటి మినహా మిగిలిన వాటిని ఆమోదించారు.