వైద్య ఆరోగ్యశాఖలో విచిత్రం
– మూడు నోటిఫికేషన్లకు మెరిట్ లిస్ట్ విడుదల
– నోటీస్ బోర్డుల్లో ఉంచని అధికారులు
అనంతపురం మెడికల్ : తాంబూలాలిచ్చేశాం.. తన్నుకు చావండి.. అన్నట్లుంది వైద్య ఆరోగ్యశాఖ అధికారుల తీరు. ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్లు ఇచ్చి కొన్ని నెలలైంది. స్క్రూటినీ, ప్రొవిజినల్ లిస్ట్ తయారు చేయడానికి మరికొన్ని నెలలు పట్టింది. తీరా వాటిని విడుదల చేసే క్రమంలో నిబంధనలు ఉల్లంఘించారు. జాబితాలను కేవలం వెబ్‌సైట్‌కే పరిమితం చేసి ‘మీ కష్టం మీరే పడండి’ అన్న ధోరణి అవలంభిస్తున్నారు. జాబితాలను నోటీస్ బోర్డుల్లో ఉంచాల్సి ఉన్నా పట్టించుకోకుండా.. అభ్యంతరాల స్వీకరణకు ఎక్కువ సమయం ఇవ్వకుండా ఉద్యోగాల భర్తీ చేపడుతున్నారు. వైద్య ఆరోగ్యశాఖలో మూడు నోటిఫికేషన్లకు సంబంధించి మెరిట్ జాబితాలు విడుదలైనట్లు శనివారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఈనెల 20 నుంచి 22వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు అభ్యంతరాలు స్వీకరించనున్నట్లు పేర్కొన్నారు. అయితే వీటిని కేవలం వెబ్‌సైట్‌కే పరిమితం చేసి ప్రదర్శనకు ఉంచకపోవడంతో అభ్యర్థులు ఇబ్బందులు పడే అవకాశం ఉంది.
రాష్ట్రీయ బాలస్వాస్థ్య కార్యక్రమం (ఆర్‌బీఎస్‌కే)లో భాగంగా మొబైల్ హెల్త్ టీంలో మెడికల్ ఆఫీసర్లు, ఆయుష్ వైద్యులు, ఎంపీహెచ్‌ఏ (ఫిమేల్), ఫార్మసిస్ట్ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్న వారి ఫైనల్ జనరల్ మెరిట్ లిస్ట్, ప్రొవిజనల్ సెలెక‌్షన్ లిస్ట్‌ను విడుదల చేశారు. అనంతపురం, హిందూపురం, కదిరి ఆస్పత్రుల్లో ఫ్యామిలీ ప్లానింగ్ కౌన్సిలర్లతో పాటు ఆర్‌బీఎస్‌కే కింద డీఈఐసీ (డిస్ట్రిక్ట్ అర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్)లో మెడికల్ ఆఫీసర్, మేనేజర్, డెంటిస్ట్ ఫిజియోథెరపిస్ట్, ఆడియో అండ్ స్పీచ్ థెరపిస్ట్, క్లినికల్ సైకాలజిస్ట్, ఆప్టోమెట్రిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్, స్టాఫ్‌నర్స్, అర్లీ ఇంటర్వెన్షనిస్ట్ అభ్యర్థులకు సంబంధించి కూడా ప్రొవిజినల్ జనరల్ మెరిట్ లిస్ట్ విడుదల చేసినట్లు పేర్కొన్నారు. ఈనెల 20 నుంచి 22వ తేదీ వరకు తగిన ఆధారాలతో అభ్యంతరాలు తెలియజేయవచ్చని పేర్కొన్నారు. కాగా మెరిట్ జాబితాలు అప్‌లోడ్ చేయడానికి వైద్య ఆరోగ్యశాఖ అధికారులు కలెక్టరేట్‌లోని ఎన్‌ఐసీకి శనివారం సాయంత్రం వెళ్లారు. జాబితాలు ఎక్కువగా ఉండటంతో అప్‌లోడ్ ఆలస్యం అయ్యే సూచనలు కన్పిస్తున్నాయి.