
న్యూఢిల్లీ: సూపర్‌స్టార్ రజనీకాంత్ ‘బాబా ముద్ర’ ఓ స్టార్టప్ కంపెనీకి లోగోగా ఉండటం ఆ కంపెనీకి సమస్యగా మారింది. కొత్త రాజకీయ పార్టీని స్థాపిస్తానని రజనీకాంత్ ఇటీవల ప్రకటించడం, పార్టీ చిహ్నంగా బాబా ముద్ర ఉంటుందనే ప్రచారం కూడా జరుగుతుండటం తెలిసిందే. సోషల్ మీడియా యాప్ అయిన వోక్స్‌వెబ్ అనే స్టార్టప్ కంపెనీకి కూడా దాదాపుగా ఇలాంటి లోగోనే ఉంది.
దీంతో వోక్స్‌వెబ్ రజనీకాంత్ పార్టీకి అనుకూలంగా ఉంటుందా అని కొందరు తమను అడుగుతున్నారనీ, రజనీతోగానీ ఆయన స్థాపించే పార్టీతోగానీ తమకు ఏ సంబంధం లేదని వోక్స్‌వెబ్ వ్యవస్థాపకుడు యశ్ మిశ్రా చెప్పారు. రజనీ వర్గంలోని సంబంధిత వర్గాలకు తాము ఓ లేఖ కూడా రాసినప్పటికీ ఇంకా తమకు వారి నుంచి ఎలాంటి సమాచారం అందలేదని మిశ్రా వెల్లడించారు. బాబా ముద్రను పార్టీ చిహ్నంగా వాడకుండా ఉండేలా, లేదా కొన్ని మార్పులు చేసుకుని వాడేలా రజనీని కోరతామని ఆయన చెప్పారు.