రజనీకాంత్ కెరీర్‌లో గుర్తుండిపోయే చిత్రాల్లో బాబా ఒకటి. ఈ సినిమా ఫలితం ఎలాగున్నా చాలామంది ఇప్పటికీ దీన్ని ఎంతగానో ఇష్టపడతారు. రజనీ కూడా బాబా చిత్రం తనకెంతో ప్రత్యేకమని అనేకసార్లు నొక్కిచెప్పాడు. ఈ సినిమాలో మనీషా కొయిరాలా హీరోయిన్‌గా నటించింది. దీనికంటే ముందు ఆమె ఇండియన్, బాంబే, ఆలవందన్ వంటి పలు దక్షిణాది హిట్ చిత్రాల్లో నటించింది. అయితే బాబా తర్వాత తనకు సౌత్‌లో స్థానం లేకుండా పోయిందట.
ఈ విషయం గురించి తాజా ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. 'బాబా నా చివరి తమిళ చిత్రం. ఆ రోజుల్లో ఈ సినిమా ఫ్లాప్‌గా నిలిచింది. భారీ అంచనాలతో థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం ఘోరంగా చతికిలబడింది. సౌత్‌లో నా కెరీర్ ముగిసినట్లే అనుకున్నా.. చివరికి నేను ఊహించిందే జరిగింది. బాబా తర్వాత నాకు అవకాశాలు రాలేదు. అదేంటో కానీ విచిత్రంగా రీరిలీజ్ చేసినప్పుడు మాత్రం మంచి హిట్ కొట్టింది' అని చెప్పుకొచ్చింది.
మణిరత్నం బాంబే సినిమా గురించి చెప్తూ.. 'మొదట బాంబే సినిమా చేయకూడదనుకున్నాను. తల్లి పాత్రలో నటిస్తే కెరీర్ దెబ్బతింటుందని అందరూ హెచ్చరించారు. కానీ సినిమాటోగ్రాఫర్ అశోక్ మెహతా మాత్రం మణిరత్నం గురించి, ఆయన సినిమాల గురించి నీకేమైనా తెలుసా అసలు? ఆయన సినిమా వద్దుంటున్నావంటే నీ అంత పిచ్చివాళ్లు ఇంకొకరు ఉండరు అని తిట్టాడు. అప్పుడు వెంటనే నా నిర్ణయాన్ని మార్చుకున్న అమ్మ, నేను చెన్నై వెళ్లిపోయాం. బాంబే సినిమా చేసినందుకు నాకెంతో సంతోషంగా ఉంది' అని తెలిపింది. 1995లో వచ్చిన బాంబే మూవీ కల్ట్ క్లాసిక్ మూవీలో ఒకటిగా నిలిచింది. బాబా సినిమా విషయానికి వస్తే ఈ చిత్రానికి రజనీకాంతే స్వయంగా కథ అందించి, నిర్మించాడు. గతేడాది రజనీకాంత్ బర్త్‌డే సందర్భంగా బాబా రీరిలీజ్ చేయగా మంచి కలెక్షన్లు రాబట్టింది.
Comments
Please login to add a commentAdd a comment