► పారదర్శకత లేని ప్రవేశాలు
► నిబంధనలు పాటించని యాజమాన్యం
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లోని ఇంగ్లిష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీలో 2016–17వ సంవత్సరానికి ప్రవేశాల్లో జరుగుతున్న అవకతవకలు యూనివర్సిటీ ప్రతిష్టను దెబ్బతీస్తున్నాయి. యూజీసీ నిబంధనల ప్రకారం వర్సిటీలో ఎంపికైన విద్యార్థుల జాబితాను ప్రకటించినప్పుడు సీటు సంపాదించిన విద్యార్థితో పాటు 1:8 లెక్కన జనరల్ కేటగిరీలో వెయిటింగ్ లిస్ట్ ప్రకటించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీలైతే రాసిన అందరు విద్యార్థుల పేర్లను సీటు సంపాదించిన విద్యార్థి జాబితాతో పాటు వెయిటింగ్ లిస్ట్‌లో పెట్టాలి. కానీ ఇఫ్లూలో ఇంతవరకు ఏ విభాగంలోనూ వెయిటింగ్ లిస్టే పెట్టిన పాపాన పోలేదు.
ఇది యూజీసీ నిబంధనలను తుంగలో తొక్కడమేనని విద్యార్థులు వాపోతున్నారు. దీనికి తోడు ఇఫ్లూలోని మరో తంతు విద్యార్థులను ఆందోళనకు గురిచేస్తోంది. ఓపెన్ కేటగిరీలో వచ్చిన ఎస్సీ, ఎస్టీ విద్యార్థులను కూడా జనరల్ కేటగిరీలో కాకుండా రిజర్వుడు జాబితాలో పెడుతున్నారు. ఉదాహరణకు ఎంఏ స్పానిష్ కోసం దరఖాస్తు చేసిన వాడపల్లి వెంకటేశ్వరరావు (హాల్ టికెట్ నంబర్ 2060888) అనే ఎస్సీ విద్యార్థి 53 మార్కులతో జనరల్ వారికన్నా ముందున్నాడు. అయినప్పటికీ ఈ విద్యార్థికి ఓపెన్ కేటగిరీలో కాకుండా, ఎస్సీ కేటగిరీలోనే సీటు ఇచ్చారు. దీనివల్ల మరో ఎస్సీ విద్యార్థి సీటు కోల్పోవాల్సిన పరిస్థితి వస్తోందని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పైగా వెయిటింగ్ లిస్ట్ సైతం ప్రకటించకపోవడం మరింత అయోమయానికి దారి తీస్తోంది.