అయోమయంలో తెలంగాణ టీడీపీ!
► సవాలుగా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యేల వలసలతో పూర్తిగా ఆత్మరక్షణలో పడిపోయిన తెలంగాణ టీడీపీకి త్వరలో జరగనున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సవాలుగా మారనున్నాయి. ప్రతిపక్షంగా అధికార పక్షాన్ని ఎలా ఎదుర్కోవాలనే అంశంపై ఆ పార్టీ అయోమయంలో కొట్టుమిట్టాడుతోంది. మొత్తం 15 మంది ఎమ్మెల్యేలలో ఎర్రబెల్లి దయాకర్‌రావు సహా 10 మంది ఎమ్మెల్యేలు అధికార టీఆర్‌ఎస్‌లో చేరడం, పార్టీ మారిన తామందరినీ టీఆర్‌ఎస్‌లో విలీనం చేయాలని అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారికి లేఖ రాయడం వంటి పరిణామాలతో ఆ పార్టీలో ఎటూ పాలుపోని స్థితి నెలకొంది.
మిగిలిన ఐదుగురు ఎమ్మెల్యేలలోనూ ఎల్.బి.నగర్ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య పార్టీకి దూరంగా ఉంటుండటంతో టీడీపీ శిబిరం నలుగురు ఎమ్మెల్యేలకు కుంచించుకుపోయింది. స్పీకర్‌కు ఎర్రబెల్లి రాసిన లేఖ నేపథ్యంలో పార్టీ శాసనసభాపక్ష నేతగా రేవంత్‌రెడ్డిని నియమించామని, బీఏసీ సమావేశంలో ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యకూ అవకాశం ఇవ్వాలని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు స్పీకర్‌కు లేఖ ఇచ్చారు. ప్రస్తుతం ఈ రెండు లేఖలపై స్పీకర్ కార్యాలయం నుంచి ఎలాంటి నిర్ణయం వెలువడకపోవడం టీడీపీ నేతల్లో గుబులు రేపుతోంది. ఈ పరిస్థితుల్లో పార్టీకి మరో ప్రమాదం పొంచి ఉందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.
టీడీపీ నుంచి మరో ఇద్దరు ఎమ్మెల్యేలు పార్టీ మారితే శాసనసభాపక్ష కార్యాలయం కూడా ఆ పార్టీకి లేకుండా పోతుందని పేర్కొంటున్నారు. అయితే ఎర్రబెల్లి ‘విలీనం’ లేఖపై స్పీకర్ నిర్ణయం తీసుకునే వరకు ఎల్పీ నేతగా రేవంత్‌కు గుర్తింపు ఇచ్చే అంశం తేలదన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. కాగా, అసెంబ్లీ సమావేశాల తేదీలను ఇంకా అధికారికంగా ప్రకటించకున్నా ఈ నెల 10నుంచి సమావేశాలు మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి.