![Are you confused? - Sakshi](/styles/webp/s3/article_images/2018/03/22/selfcheck-04.jpg.webp?itok=7Jc4ywPD)
ఒక నిర్ణయం తీసుకోవటం, ఆ నిర్ణయాన్ని మార్చుకోవటం... తిరిగి ‘‘అరె మొదట అనుకున్నట్లయితేనే బాగుండేదే!’’ అని కన్ఫ్యూజ్ అవ్వటం. ఆలోచనలో పరిణతి, నమ్మకం లేకపోవటం. ఇలాంటి ప్రవర్తననే గందరగోళం అంటాం. దార్శనికత, కోరిక, సామర్థ్యం, అర్థం చేసుకోగలగటం, స్ఫూర్తి ఇవన్నీ కలిస్తేనే మీ ఆలోచనలో స్పష్టత ఏర్పడుతుంది. ప్రణాళికాబద్ధంగా నడుచుకుంటే లక్ష్యాలను చేరటం కష్టమేమీ కాదు. చదువు, వృత్తి, సాధారణ జీవితం ఇలా ఏ కోణంలోనైనా గందరగోళానికి తావివ్వకూడదు.
1. మీ ఇష్టాలు, సామర్థ్యాలను ఒక పట్టికలో, మీ బలహీనతలను మరొక పట్టికలో రాసుకుంటారు. దీనివల్ల వేటిలో మీరు మెరుగ్గా ఉన్నారో, ఏ విషయాల్లో బలహీనంగా ఉన్నారోనన్న విషయాన్ని గ్రహిస్తారు.
ఎ. అవును బి. కాదు
2. ఒకే ర కంగా కాకుండా, వివిధ రకాలుగా ఆలోచించి సమస్య పరిష్కారానికి కృషి చేస్తారు.
ఎ. అవును బి. కాదు
3. మీలోని క్వాలిటీస్‌ను గుర్తిస్తారు. అవకాశాలను వదులుకోరు. ఉత్సాహాన్ని ఎప్పుడూ ఒకేలా ఉంచుకుంటారు.
ఎ. అవును బి. కాదు
4. ఎప్పుడూ విశ్వాసాన్ని కోల్పోరు. నిజాన్ని తెలుసుకోవటానికి ప్రయత్నిస్తారు. శాస్త్రీయ దృక్పథాన్ని కలిగి ఉంటారు. భగవంతునిపై విశ్వాసం ఉంటే, మీ నమ్మకానికి భక్తిని జోడిస్తారు.
ఎ. అవును బి. కాదు
5. గుడ్డిగా దేనినీ నమ్మరు. మీరు తీసుకున్న నిర్ణయాలు సరైనవో? కాదో? అని భయపడరు. మీపై మీకు నమ్మకం ఉంటుంది.
ఎ. అవును బి. కాదు
6. ఒక సమయంలో ఒకదానిమీదే దృష్టిసారిస్తారు. దానిమీదే మీ నైపుణ్యాన్ని చూపిస్తారు.
ఎ. అవును బి. కాదు
7. మీ సామర్థ్యాలను ఎప్పటికప్పుడు సంస్కరించుకుంటుంటారు. మాటలకే పరిమితం కాకుండా మీరు చేయాల్సిన పనిని చేస్తూనే ఉంటారు.
ఎ. అవును బి. కాదు
8. స్థిరత్వంతో ఉంటారు. ఏ పనికైనా సగం బలం దీని ద్వారానే లభిస్తుందని మీకు తెలుసు. నిలకడ మనస్తత్వం ద్వారానే మానసిక బలాన్ని పొందవచ్చని నమ్ముతారు.
ఎ. అవును బి. కాదు
9. మీరు నేర్చుకోవాలనుకుంటున్న అంశాలను ఆయా నిపుణుల దగ్గర ప్రస్తావిస్తారు. మీ సందేహాలను పుస్తకాలు, ఇతర మార్గాల ద్వారా నివృత్తి చేసుకుంటారు.
ఎ. అవును బి. కాదు
10. ఏదైనా పని చేసేటప్పుడు గందరగోళానికి గురవుతుంటే ఆ పనికి కాసేపు విరామం ఇస్తారు. ఆలోచనలు కుదుటపడ్డాక ఆ పనిని ప్రారంభిస్తారు.
ఎ. అవును బి. కాదు
‘ఎ’ సమాధానాలు ఏడు దాటితే మీలో గందరగోళానికి తావుండదు. ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటారు. ఒకసారి తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంటారు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్‌తో ఉంటారు. ఎప్పుడూ పాజిటివ్‌గానే ఆలోచించే సామర్థ్యం మీలో ఉంటుంది. ‘బి’ లు ‘ఎ’ ల కన్నా ఎక్కువగా వస్తే మీ ఆలోచనల్లో స్పష్టత ఉండదు. నిలకడలేని మనస్తత్వం వల్ల తరచుగా ఆందోళనకు గురవుతారు. ‘ఎ’ లను సూచనలుగా భావించి ఆలోచనల్లో నిలకడను ఎలా సంపాదించవచ్చో తెలుసుకోండి.
Comments
Please login to add a commentAdd a comment