‘ఇంటర్నల్‌’ కిరికిరి! | confused in internal marks in meeseva enter | Sakshi
Sakshi News home page

‘ఇంటర్నల్‌’ కిరికిరి!

Published Sun, Apr 16 2017 11:15 PM | Last Updated on Tue, Oct 16 2018 3:38 PM

‘ఇంటర్నల్‌’ కిరికిరి! - Sakshi

‘ఇంటర్నల్‌’ కిరికిరి!

– మీ సేవా కేంద్రాల్లో మార్కుల నమోదు అస్తవ్యస్తం
– గడువు ముంచుకొస్తుండడంతో హెచ్‌ఎంల ఆందోళన

– నగరంలోని ఓ పాఠశాలలో చదువుతున్న విద్యార్థినికి ఎస్‌ఏ–2 గణితం పరీక్షలో 62 మార్కులు వచ్చాయి. అయితే మీసేవా కేంద్రంలో ఆ విద్యార్థినికి కేవలం ఆరు మార్కులు వచ్చినట్లు ఆన్‌లైన్‌లో నమోదు చేశారు. అంటే 56 మార్కుల తేడా. మరో పాఠశాలలో ఏ–1 గ్రేడులో నిలిచే విద్యార్థినికి ఎస్‌ఏ–2 ఇంగ్లీష్‌లో ‘0’ మార్కులు వచ్చినట్లు ఆన్‌లైన్‌లో నమోదు చేశారు.  అలాగే మరో అమ్మాయికి హిందీలో 47 మార్కులు వస్తే...ఆన్‌లైన్‌లో మాత్రం 37 మార్కులు కనిపిస్తున్నాయి.  అలాగే బత్తలపల్లి మండలం నల్లబోయనపల్లి, రామాపురం, కొడవండ్లపల్లి పాఠశాలలకు సంబంధించి ఇప్పటిదాకా అప్‌లోడ్‌  చేయలేదు. ఈ ఘటనలు చాలు ఇంటర్నల్‌ మార్కులు ఆన్‌లైన్‌ నమోదు ఎంత అస్తవ్యస్తంగా మారుతోందో తెలుసుకునేందుకు.
- అనంతపురం ఎడ్యుకేషన్‌

పదో తరగతి విద్యార్థులకు సంబంధించిన జవాబు పత్రాల మూల్యాంకనం ముగిసింది. అయితే  20 ఇంటర్నల్‌ మార్కుల కేటాయింపుపై ఇప్పటికీ స్పష్టత లేదు. దీంతో ముఖ్యంగా ప్రభుత్వ యాజమాన్యాల పాఠశాలల విద్యార్థులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఆన్‌లైన్‌లో కన్‌ఫర్మేషన్‌కు ఈనెల 20తో గడువు ముగుస్తుంది. గడువు ముంచుకొస్తుండడంతో ప్రధానోపాధ్యాయులు టెన్షన్‌ పడుతున్నారు.

అప్పటిదాకా బాగానే ఉంది...
నిర్మాణాత్మక మూల్యాంకనం (ఎఫ్‌ఏ)–1, 2, సంగ్రహణాత్మక మూల్యాంకనం (ఎస్‌ఏ)–1 జవాబు పత్రాలను అన్ని యాజమాన్యాల (ప్రభుత్వ, ప్రైవేట్‌) పాఠశాలల ప్రధానోపాధ్యాయులే ఆన్‌లైన్‌లో నమోదు చేశారు. ఇక్కడిదాకా బాగానే ఉంది. అయితే పని ఒత్తిడి, ఇతరత్రా పనుల నేపథ్యంలో ఇబ్బందులు పడుతున్న ప్రభుత్వ పాఠశాలల హెచ్‌ఎం సంఘాలు ఇందుకోసం ప్రత్యేకంగా కంప్యూటర్‌ ఆపరేటర్‌ను నియమించాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఈ మార్కుల నమోదును మీసేవా కేంద్రాలకు అప్పగించింది. ఒక్కో విద్యార్థికి రూ.3 చెల్లించేలా ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఈ క్రమంలో ఎఫ్‌ఏ–3,4, ఎస్‌ఏ–1 జవాబు పత్రాలను నేరుగా ఆయా మీసేవా కేంద్రాల్లో అప్పగించారు. వారు ఇష్టానుసారంగా నమోదు చేశారు. మరి కొందరి విద్యార్థుల మార్కులను నేటికీ నమోదు చేయలేదు.

ఒక్క విద్యార్థికీ కన్‌ఫర్మేషన్‌ ఇవ్వలేని దుస్థితి
మార్కుల వివరాలను మీసేవా కేంద్రాల నిర్వాహకులు ఆన్‌లైన్‌లో నమోదు చేసిన తర్వాత ఆయా స్కూళ్ల హెచ్‌ఎంలు వారి యూడైస్‌ కోడ్‌ ఆధారంగా ఆన్‌లైన్‌లో ఓపెన్‌ చేసుకుని వారు కన్‌ఫర్మేషన్‌ చేయాల్సి ఉంది. అయితే ఇప్పటిదాకా జిల్లాలో మీసేవా వారు ఆన్‌లైన్‌లో పొందుపరిచిన విద్యార్థులకు సంబంధించి ఒక్క విద్యార్థికీ కన్‌ఫర్మేషన్‌ చేయలేని పరిస్థితి. దీంతో హెచ్‌ఎంలు కన్‌ఫర్మేషన్‌ చేయకపోవడంతో కుప్పలు తెప్పలుగా పెండింగ్‌ పడ్డాయి. అయితే ప్రైవేట్‌ పాఠశాలలకు ఆన్‌లైన్‌ నుంచి మినహాయింపు ఇచ్చారు. వారే స్వయంగా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకునే అవకాశం ఇవ్వడంతో దాదాపు అన్ని పాఠశాలల్లోనూ ముగింపు దశకు చేరుకుంది. ఎటొచ్చి ప్రభుత్వ విద్యార్థులకు అన్యాయం జరుగుతోందని ఉపాధ్యాయులు వాపోతున్నారు.

ఎట్టకేలకు ఎడిట్‌ ఆప్షన్‌
ఇదిలా ఉండగా ఆన్‌లైన్‌లో తప్పుల తడకగా నమోదైన వాటిని సరిదిద్దుకునేందుకు హెచ్‌ఎంలకు అవకాశం ఇచ్చారు. ఎడిట్‌ ఆప్షన్‌ ఇవ్వడంతో వారి వారి విద్యార్థుల మార్కుల జాబితాలను దగ్గర పెట్టుకుని సరిదిద్దుతూ కన్‌ఫర్మేషన్‌ చేసే పనిలో హెచ్‌ఎంలు ఉన్నారు. అయితే ప్రభుత్వం విధించిన గడువు (ఈనెల 20)లోగా అందరి పిల్లల వివరాలు నమోదు చేయడం సాధ్యం కాదని హెచ్‌ఎంలు స్పష్టం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement