మూడు అట్టల పుస్తకం | Three mounted book | Sakshi
Sakshi News home page

మూడు అట్టల పుస్తకం

Published Tue, Jan 26 2016 11:49 PM | Last Updated on Sun, Sep 3 2017 4:21 PM

మూడు అట్టల పుస్తకం

మూడు అట్టల పుస్తకం

ముగ్గురూ క్లాస్‌మేట్స్ ముగ్గురిదీ ఒకే ఫైట్ వాళ్లు చదువుకోవాలి. ఊరినీ చదివించాలి పెద్దలు వీల్లేదన్నారు వినలేదు.   పరిస్థితులు  అనుకూలించలేదు లెక్క చేయలేదు సంకల్పబలంతో ముందుకుసాగారు అసామాన్య పోరాటం జరిపారు  విజయం సాధించారు
 
ఒక పుస్తకానికి మూడు అట్టలు ఉండవు.
తబుస్సమ్.. తరన్నుమ్.. రుబీనా...
ముగ్గురూ చదువు అన్న పుస్తకానికి మూడు అట్టలు.
చదువు వద్దంటే చదువుకుని నిలబడ్డారు
చదువు చెప్పొద్దంటే చదివించి చూపారు.
చదువు వల్ల ఏం ఒరుగుతుందంటే
ఊరంతటినీ చదివించారు.
అవును.
సజోయి అనే పుస్తకానికి మూడు అట్టలు.
ఆరాటం.. పోరాటం.. ప్రోత్సాహం.
 
వారణాసి.. దేశ ఆధ్యాత్మిక రాజధాని! ప్రాచీనత, పట్టు వస్త్రాలు.. సుగంధ ద్రవ్యాలకు నిలయం. స్వదేశీ, విదేశీ టూరిస్టులతో నిత్యం కళకళలాడుతూ ఉండే పాతకొత్త కలయికల ఈ పట్టణానికి కొంచెం దూరంలో ఉంది సజోయి గ్రామం! కాశీకి కూతవేటులో ఉన్నా దాని అద్భుత ఛాయలేవీ సజోయి మీద లేవు. చాలా ఊళ్లలాగే ఇదీ ఓ సాధారణ పల్లె. ఎంత సామాన్యమైందంటే.. ఇంటి పనులు చేయడానికి, భర్త వంశాంకురాలను కనిపెంచడానికి మాత్రమే ఆడపిల్లలు పుడతారని.. అంతకుమించి వారికేం ప్రాధాన్యం లేదనే నిశ్చితాభిప్రాయాలతో ఉండేంత! కానీ అలాంటి ముతక ఊరూ ఒక అసామాన్యతకు జన్మనిచ్చింది.. బెనారస్ వెండి జరీలు వెలవెలబోయే వెలుగులతో! ఆ ఆత్మవిశ్వాసం ముందు కాశీ అద్భుతం ఎంత? వారణాసి పంచే ఆధ్మాత్మికతను మించిన జీవనతాత్వికత అది! ఆ అసామాన్య ఆత్మవిశ్వాస జీవన తాత్వికతల పేర్లు... తబస్సుమ్.. తరన్నుమ్.. రుబీనా!

ఆ నిజంలోకి వెళితే...
ఈ ముగ్గురిదీ ఇంచుమించు ఒకే వయసు. క్లాస్‌మేట్స్.. స్నేహితులు! ఎదుర్కొన్న సమస్యా ఒక్కటే. ఏర్పర్చుకున్న లక్ష్యం.. పోరాట స్ఫూర్తీ ఒక్కటే! సజోయిలోని పెద్దలకు చదువు మీద పెద్దపట్టింపు లేదు. ప్రాముఖ్యత అసలే తెలియదు. అందుకే ఆ ఊళ్లో అబ్బాయిలకు చదువు పోరుండదు.. అమ్మాయిలకైతే ఆ అవకాశమే ఉండదు. ఇలాంటి నేపథ్యంలోనే పెరిగారు తబస్సుమ్, తరన్నుమ్, రుబీనా. అయితే పెద్దవాళ్ల అభీష్టాలకు వ్యతిరేకంగా... ఆ ఊరి సంప్రదాయానికి విరుద్ధంగా ఇంటర్ వరకూ చదువు కొనసాగించారు. తొమ్మిది తర్వాత ప్రతి యేడూ చదువుకోసం పెద్ద యుద్ధమే చేశారు.
   
తబస్సుమ్, తరన్నుమ్, రుబీనా తల్లిదండ్రులు తమ పిల్లలు తొమ్మిదో తరగతి వచ్చేవరకు వాళ్ల చదువులకు అభ్యంతరం చెప్పలేదు. తొమ్మిదో తరగతి వేసవి సెలవులు ఆ ముగ్గురి మీదా ‘పెద్దరికాన్ని’ మోపి చదువు ఆపించేయాలని చూశాయి. ప్రతి ఆడపిల్ల జీవితంలో అది సహజంగా జరిగే ప్రక్రియనీ.. దానికి, మా చదువుకి లంకె ఎందుకని తల్లిదండ్రులను ప్రశ్నించారు. చిన్న నోట పెద్ద మాట.. పెద్దలు అవాక్కయ్యేలా చేసింది. అంత విజ్ఞతకు విస్మయం చెందినా... చుట్టుపక్కల, చుట్టపక్కాల మాటలకు జడిసి చదువు మాన్పించాలనే నిర్ణయానికే వచ్చారు. అయినా ఆ పిల్లలు పట్టువీడలేదు. తమ చదువుకోసం వాళ్లేమీ డబ్బు పెట్టక్కర్లేదని... ఏదో ఒక పనిచేసుకుంటూ చదువుకుంటామని తండ్రులనూ వేడుకున్నారు. పిల్లల అభ్యర్థనకు తల్లులు కరిగినా తండ్రులు బింకంగానే ఉన్నారు. అయినా ఓటమిని ఒప్పుకోలేదు ఆ ముగ్గురు. ఇంట్లో నిరహారదీక్షకు కూర్చున్నారు. నాలుగు రోజులు సాగాక అయిదోరోజుకి నాన్నల మనసూ కరిగింది. బంధువుల మాటలను లెక్కచేయక ఎట్టకేలకు చదువుకి అనుమతిచ్చారు. అది వాళ్ల మొదటి విజయం. టెన్త్‌లో ఫస్ట్‌క్లాస్ ఆ పిల్లలకు రెండో గెలుపునిచ్చింది. ఇంటర్‌లో చేరడానికి మళ్లీ పోరాడారు. ఇందులోనూ జయమే. ఇంటర్ కూడా ఫస్ట్ డివిజన్.
   
ఇంటర్ తర్వాత తబస్సుమ్‌కి పై చదువులకు వెళ్లాలని ఉన్నా పెద్దవాళ్లు తమ వల్లకాదని చెప్పారు. తతిమా ఇద్దరు స్నేహితురాళ్లు ‘మనం కనీసం ఇంటర్ వరకైనా చదివాం.. మన ఊళ్లో చాలామంది ఆడపిల్లలు ఓనమాలక్కూడా నోచుకోలేదు. కాబట్టి ముగ్గురం ఊళ్లోని ఆడపిల్లలకు చదువు చెప్దాం’ అనే ప్రతిపాదన చేశారు. ముగ్గురికీ ఆ ఆలోచన నచ్చింది. ఆ తెల్లవారి నుంచే ఇంటింటికి వెళ్లి ‘చదువు చెప్తాం రండి’ అంటూ పిలిచారు. ఆడపిల్లల కోసం మాత్రమే అని చెప్తే పంపరని మగపిల్లలను పంపించమని తల్లిదండ్రులను కోరారు. ఆరేళ్లలోపు మగపిల్లలు రావడం మొదలుపెట్టారు. ‘హ్యూమన్ వెల్‌ఫేర్ అసోసియేషన్’ అనే స్థానిక స్వచ్ఛంద సంస్థ సహాయంతో ఓ గదిని అద్దెకు తీసుకున్నారు. ఆ మగపిల్లల్ని ఈ బడిలో వదలడానికి వెంట ఆడపిల్లలూ వస్తున్నారు. వీళ్లు ఊహించిందీ అదే. పాచిక పారింది. వాళ్లనూ బడిలో కూర్చోబెట్టసాగారు. తమ్ముళ్లతోపాటు ఈ అక్కలకూ అక్షరాలు దిద్దించసాగారు. అయితే ఈ సంబరం ఎంతోకాలం సాగలేదు. ఇంట్లో పని వదిలేసి బడిలోనే ఆడపిల్లలు కాలక్షేపం చేయడంతో మగపిల్లలను బడి మాన్పించారు తల్లిదండ్రులు. దాంతో అమ్మాయిలూ రావడం బంద్ అయింది. ఊహించని పరిణామానికి షాక్ అయ్యారు ముగ్గురూ.
 
టైలరింగ్‌తో..
ఈసారి కొత్త ఆలోచనతో అడుగువేశారు. అసోసియేషన్ ఆర్థిక సహాయంతో మూడు కుట్టు మెషీన్లను కొని టైలరింగ్ ఇన్‌స్టిట్యూట్ పెట్టారు. ఆ సంస్థ కార్యకర్తలతో ఇంటింటి ప్రచారం నిర్వహించారు.. ‘ఆడపిల్లలకు కుట్టు మిషన్ నేర్పిస్తాం పంపించండ’ంటూ. పరిచయమున్న ఎన్‌జీవో కార్యకర్తలే రావడంతో తల్లిదండ్రులూ కాదనలేదు. ఆ ముగ్గురు ఎదురుచూసిందీ దాని కోసమే.

రోజుకి మూడు గంటలు క్లాస్ అయితే ఒక గంట హెచ్‌డబ్ల్యూఏ వాళ్ల టైలరింగ్ క్లాస్, తర్వాత రెండు గంటలు ఈ పిల్లలు ఆ పిల్లలకు చెప్పే చదువు. అయితే ఇదీ ఎంతోకాలం సాగలేదు. టైలరింగ్ పేరుతో చదువు నేర్పించి అమ్మాయిలను పాడు చేస్తున్నారంటూ పెద్దవాళ్లు వీళ్లతో గొడవకు దిగారు. ‘టైలరింగ్‌లోని కొలతలు తెలియాలంటే చదువు కావాలి.. అంకెలు రావాలి. అవి నేర్చుకోకుండా టైలరింగ్ ఎట్లా వస్తుంది?’ అంటూ ఎదురు ప్రశ్నించారు. అయితే వాళ్లు ఒప్పుకోకపోగా.. ఈ ముగ్గురి తల్లిదండ్రుల దగ్గరకు వెళ్లి.. ‘మీ పిల్లలు చెడిపోయింది కాక మా ఆడపిల్లలనూ చెడగొడ్తున్నారు’అని దుమ్మెత్తిపోశారు. ఇంట్లోంచి కాలు బయటపెడితే ఊర్లోని మగపిల్లలూ గేలిచేసేవారు. ఆ అవమానం తట్టుకోలేని ఆ ముగ్గురి తల్లిదండ్రులు వీళ్లను ఇల్లు దాటకుండా కట్టడి చేశారు. పెళ్లి సంబంధాలు చూడ్డం మొదలుపెట్టారు. ఇంత కష్టమూ మొదటికి వచ్చిందే అని తలపట్టుకున్నారు తబస్సుమ్, తరన్నుమ్, రుబీనా! అపజయాన్ని అంగీకరించలేదు. కనీసం పదిమంది ఆడపిల్లలనైనా అక్షరాస్యులను చేయందే ఈ ఊరు వదిలివెళ్లేది లేదని.. ప్రతిజ్ఞ చేశారు.

అన్నట్టుగానే..
తిరిగి సున్నా దగ్గర ప్రారంభమైంది వీళ్ల పోరు. చదువుకోవడం కోసం ఎంత బతిమాలుకున్నారో... చదువు చెప్పడం కోసం అంతకన్నా ఎక్కువే బతిమాలాల్సి వచ్చింది. మళ్లీ నిరసన, నిరహారదీక్షలతో ఒప్పించుకోగలిగారు. అయితే ఓ షరతుతో... ‘ఈసారి గనుక మీ మీద ఎలాంటి కంప్లయింట్ వచ్చినా నిఖాకు సిద్ధం కావల్సిందే’ నని.
 
మరి ఇప్పుడు...
సజోయ్‌లోని 99 శాతం ఆడపిల్లలకు ఇప్పుడు చదవడం, రాయడం వచ్చు. పదుల సంఖ్యలో పొరుగూరికి వెళ్లి డిగ్రీ చదువుతున్నారు. కూతుళ్లు చదువుతుంటే ప్రేరణపొంది వాళ్ల తల్లులూ పలకా, బలపంతో ఈ ముగ్గురి దగ్గరకు వచ్చారు. దాంతో ఈ స్నేహితుల ఆనందానికి అంతులేదు. వాళ్ల కోసం రాత్రి బడిని తెరిచారు. ఇప్పుడా రాత్రి బడిలో ‘పెద్ద పిల్లల’ సంఖ్య 270. ‘ఇదంతా ఆషామాషీగా సాగిన వ్యవహారం కాదు. ఒకానొక టైమ్‌లో చదువు చెప్పడానికి ఊళ్లో ఎవరూ జాగా ఇవ్వకపోతే మా పెరట్లో చెత్త వేసే ప్రదేశాన్ని శుభ్రం చేసి అక్కడ బడి పెట్టాం. మా ఈ సుదీర్ఘ ప్రయత్నంలో, పోరులో మా తల్లిదండ్రుల ప్రోత్సాహం లేకపోతే ఈ విజయాన్ని సాధించలేకపోయేవాళ్లం’ అంటారు ఎంతో వినయంగా ఈ త్రీ మస్కటీర్స్.    
 
 
35 మందితో మొదలై...
మూడోప్రయత్నం నేరుగానే ఉంది. ఇంటింటికీ వెళ్లి ఆడపిల్లల చదువు గురించి, చదువుకుంటే వాళ్ల భవిష్యత్తే కాదు ఇంటి భవిష్యత్తు ఎంత బాగుంటుందో కథలుగా చెప్పారు. రాత్రిపూట చిన్నచిన్న నాటకాలుగా వేసి చూపించారు. మెల్లగా ఆలోచించడం మొదలుపెట్టారు పెద్దలు. చివరకు ఒప్పుకోక తప్పలేదు. అలా ముందు 35 మందితో ఈ ముగ్గురు పెట్టిన బడిలో ప్రేయర్ బెల్ మోగింది. యేడాది తర్వాత ఈ స్కూల్ స్ట్రెన్త్ 170. ఇలా ఓ వైపు ఊళ్లో పిల్లలకు చదువు చెప్తూనే మరోవైపు ప్రైవేట్‌గా డిగ్రీ పూర్తి చేశారు. ఇదంతా 2007 నాటి సంగతి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement