Tabassum
-
బీజేపీకు 3.. విపక్షాలకు 11
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 4 పార్లమెంటు స్థానాలు, 10 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో అధికార ఎన్డీయేకు ఎదురుదెబ్బ తగిలింది. కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్షాలు 11 సీట్లు గెలుచుకోగా.. బీజేపీ కూటమి మూడు స్థానాలకే పరిమితమైంది. ఈ ఉపఎన్నికల ఫలితాలు విపక్షాలకు భారీ విజయం వంటివే. అత్యంత ప్రతిష్టాత్మకంగా మారిన యూపీలోని కైరానా లోక్‌సభ స్థానంలో బీజేపీ (సిట్టింగ్ స్థానంలో) ఓటమిపాలైంది. ఇక్కడ విపక్షాల తరపున బరిలో దిగిన ఆర్ఎల్డీ అభ్యర్థి తబస్సుమ్ హసన్ బీజేపీ అభ్యర్థి మృగాంక సింగ్‌పై విజయం సాధించారు. యూపీలోని నూర్పూర్ అసెంబ్లీ నియోజకవర్గంలోనూ (బీజేపీ సిట్టింగ్ స్థానం) విపక్షాల ఉమ్మడి అభ్యర్థి (సమాజ్‌వాదీ పార్టీ) గెలిచారు. పంజాబ్, పశ్చిమబెంగాల్, కేరళ, కర్ణాటక, జార్ఖండ్ లలో జరిగిన అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికల్లోనూ బీజేపీ ఓటమిపాలైంది. మహారాష్ట్రలోని పాల్ఘర్ ఎంపీ స్థానంలో 29వేల పై చిలుకు ఓట్లతో, ఉత్తరాఖండ్‌లో ఒక ఎమ్మెల్యే స్థానాన్ని బీజేపీ గెలుచుకుంది. మరాఠా గడ్డపై ఫిఫ్టీ–ఫిఫ్టీ మహారాష్ట్రలో పాల్ఘర్, భండారా–గోందియా లోక్‌సభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాల్లో బీజేపీ ఒకచోట గెలిచి.. మరోచోట ఓటమి పాలైంది. పాల్ఘర్ ఎన్నికల్లో శివసేనతో చివరి వరకు నువ్వా నేనా అన్నట్లు జరిగిన పోటీలో బీజేపీ విజయం 29,572 ఓట్లతో సాధించింది. బీజేపీ తరపున రాజేంద్ర గవిట్, శివసేన తరపున శ్రీనివాస్ వనగా పోటీపడ్డారు. బీజేపీ మిత్రపక్షమైన శివసేన ఈ ఎన్నికల్లో అధికార పార్టీకి వ్యతిరేకంగా బరిలో దిగింది. బీజేపీకి 2,72,782 ఓట్లు, శివసేనకు 2,43,210 ఓట్లు రాగా.. బహుజన్ వికాస్ అఘాడీ (బీవీఏ) పార్టీ 2,22,838 ఓట్లతో మూడోస్థానంలో నిలిచింది. కాంగ్రెస్ 47,714 ఓట్లతో ఐదో స్థానానికి పరిమితమైంది. ఈ ఎన్నికకు ముందే కాంగ్రెస్ నుంచి గవిట్ బీజేపీలో చేరారు. అటు, భండారా–గోందియా స్థానానికి జరిగిన ఎన్నికల్లోనూ బీజేపీ, ఎన్సీపీ మధ్య హోరాహోరీగానే పోటీ నెలకొంది. బీజేపీ అభ్యర్థి హేమంత్పై ఎన్సీపీ అభ్యర్థి 48,907 ఓట్లతో విజయం సాధించారు. ఇక్కడ కాంగ్రెస్, ఆర్పీఐ మరో స్వతంత్రుడు కలిపి ఎన్సీపీకి మద్దతిచ్చారు. ఈ విజయంతో ఎన్సీపీ ఎంపీల సంఖ్య ఐదుకు పెరగగా.. లోక్‌సభలో బీజేపీ సభ్యుల సంఖ్య (మహారాష్ట్ర నుంచి) 22కు తగ్గింది. గోందియాలో బీజేపీ ఓటమితో మోదీ అహంకార పూరిత పాలనపై ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమైందని ఎన్సీపీ విమర్శించింది. నాగాలాండ్‌లోని ఏకైక ఎంపీ స్థానానికి జరిగిన ఎన్నికల్లో ఎన్డీయే మిత్రపక్షమైన ఎన్డీపీపీ అభ్యర్థి తోఖెహో యెప్తోమీ లక్షా 73వేల ఓట్లతో ఘనవిజయం సాధించారు. 2014లో ఈ స్థానం నుంచి ఎన్డీపీపీ అధ్యక్షుడు, నాగాలాండ్ ప్రస్తుత సీఎం నీఫూ రియో విజయం సాధించారు. బిహార్‌లో ఆర్జేడీ.. బెంగాల్లో మమత బిహార్‌లోని జోకిహత్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉపఎన్నికల్లో అధికార జేడీయూకు, సీఎం నితీశ్ కుమార్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గతంలో ఈ స్థానంలో జేడీయూ గెలిచింది. అయితే ఉప ఎన్నికల్లో మాత్రం ఆర్జేడీ భారీ మెజారిటీతో విజయం సాధించటంతో ఎన్డీయే కూటమికి ప్రతికూలంగా మారింది. లాలూ జైలుకు వెళ్లిన నేపథ్యంలో ఆర్జేడీ, కాంగ్రెస్ కూటమికి ఈ విజయం భారీగా నైతిక బలాన్నిచ్చింది. ఈ విజయం మోదీ అహంకారపూరిత పాలనకు ప్రజలు ఇచ్చిన తీర్పు అని ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ విమర్శించారు. అటు పశ్చిమబెంగాల్లోని మహేస్తల అసెంబ్లీ ఉప ఎన్నికల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ 62వేల పై చిలుకు ఓట్లతో ఘన విజయం సాధించింది. ఇక్కడ బీజేపీ రెండోస్థానంలో నిలవగా, లెఫ్ట్–కాంగ్రెస్ కూటమి అభ్యర్థి మూడో స్థానానికే పరిమితమయ్యారు. కేరళలోని చెంగన్నూర్ స్థానం ఉప ఎన్నికలో అధికార సీపీఎం అభ్యర్థి సాజిచెరియన్ 20,956 ఓట్లతో కాంగ్రెస్‌పై గెలిచారు. పంజాబ్‌లో అకాలీదళ్ కంచుకోట షాకోట్లో కాంగ్రెస్ పాగా వేసింది. కాంగ్రెస్ అభ్యర్థి హర్దేవ్ సింగ్ లాడీ 38,801 ఓట్లతో అకాలీ–ఆప్ సంయుక్త అభ్యర్థిపై గెలిచారు. ఉత్తరాఖండ్‌లోని థరాళీలో బీజేపీకి చెందిన మున్నీదేవీ షా 1900 ఓట్లతో కాంగ్రెస్‌పై విజయం సాధించారు. జార్ఖండ్‌లోని సిల్లీ, గోమియా నియోజకవర్గాలో జేఎంఎం ఘన విజయం సాధించింది. మేఘాలయాలో కాంగ్రెస్ తన స్థానాన్ని నిలుపుకుంది. కాంగ్రెస్ నేత ముకుల్ సంగ్మా కూతురు మియానీ షిరా 3191 మెజారిటీతో అంపతీ నియోజకవర్గంలో గెలిచారు. కర్ణాటకలోని రాజరాజేశ్వరి నగర్లో కాంగ్రెస్ అభ్యర్థి మునిరత్న నాయుడు 41వేల ఓట్లతో బీజేపీ అభ్యర్థిని ఓడించారు. యూపీలో హసన్‌ల హవా 2014 సార్వత్రిక ఎన్నికల్లో, 2017లో అసెంబ్లీ ఎన్నికల్లోనూ యూపీపై స్పష్టమైన ఆధిపత్యాన్ని ప్రదర్శించిన బీజేపీ.. ఆ తర్వాత మెల్లమెల్లగా పట్టుకోల్పోతోంది. మార్చిలో యూపీలో గోరఖ్‌పూర్, ఫుల్పూర్ ఎంపీ స్థానాల ఉప ఎన్నికల్లో ఓడిన బీజేపీ.. గురువారం వెల్లడైన కైరానా ఫలితాల్లోనూ పరాజయం పాలైంది. నూర్పూర్ అసెంబ్లీ స్థానంలోనూ ఓటమిపాలైంది. కైరానాలో బీజేపీ, ఆర్ఎల్డీ అభ్యర్థుల మధ్య నువ్వానేనా అన్నట్లుగానే పోలింగ్ జరిగింది. విపక్షాల (ఆర్ఎల్డీ, కాంగ్రెస్, ఎస్పీ, బీఎస్పీ) ఉమ్మడి అభ్యర్థి తబస్సుమ్ హసన్ 44,618 ఓట్లతో విజయం సాధించారు. ఈ విజయంతో తబస్సుమ్.. యూపీ నుంచి 16వ లోక్‌సభకు ఎన్నికైన తొలి ముస్లింగా నిలిచారు. నూర్పూర్లో ఎస్పీ అభ్యర్థి నయీముల్ హసన్ (కాంగ్రెస్, బీఎస్పీ, ఆప్ మద్దతు) 5,662 సీట్లతో గెలిచారు. ఈ రెండు స్థానాలూ బీజేపీ నుంచే విపక్షాలు గెలుచుకున్నాయి. 2019లో యూపీలో ప్రధాని మోదీ ప్రభావమేమీ ఉండదని ఫలితాలు నిరూపిస్తున్నాయని తబస్సుమ్ అన్నారు. ‘ప్రజాస్వామ్యాన్ని విశ్వసించని వారికి, విభజన రాజకీయాలు చేసేవారికి ఈ ఫలితాలు చెంపపెట్టు’ అని ఎస్పీ చీఫ్ అఖిలేశ్ చెప్పారు. ఎవరేమన్నారంటే.. ఉప ఎన్నికల ఫలితాలతో బీజేపీకి చావుగంట మోగింది. నేను ప్రతిపాదించిన మూడో కూటమి ఫార్ములా విజయవంతమైంది. ప్రజలకు బీజేపీపై ఉన్న భ్రమలు తొలగిపోయాయి. ఆ పార్టీ పతనం ఉత్తరప్రదేశ్ నుంచే ప్రారంభమైంది. ఎస్పీ, బీఎస్పీ, ఆర్ఎల్డీ కలసి పనిచేస్తే యూపీలో బీజేపీ ఓటమి ఖాయం. ప్రస్తుతం దేశంలో ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నాయి. – మమతా బెనర్జీ ప్రజాస్వామ్యంపై విశ్వాసం లేని, విభజన రాజకీయాలకు పాల్పడే వారి ఓటమి ఇది. బీజేపీకి ప్రజలు గట్టి గుణపాఠం చెప్పారు. ఇది దళితులు, రైతులు, పేదల విజయం. – అఖిలేశ్ యాదవ్ నాలుగేళ్ల ఎన్డీయే పాలనకు వ్యతిరేకంగా ప్రజలు ఓటేశారు. అబద్ధాలు, మోసంతో పాలిస్తున్న బీజేపీ ప్రభుత్వ పతనానికి ఇదే నాంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఓటమి, కాంగ్రెస్–మిత్ర పక్షాల విజయం తథ్యం. – కాంగ్రెస్ యూపీలోని కైరానాలో బీజేపీ ఓటమితో ప్రజలు కుల రాజకీయాలను తిరస్కరించారన్న సంగతి స్పష్టమవుతోంది. వచ్చే ఎన్నికల్లో హిందూత్వ ఓటుబ్యాంకును ఏర్పర్చుకోవడానికి బీజేపీ కుల, మత విద్వేషాలను రెచ్చగొట్టే ముప్పు ఉంది. – సీతారాం ఏచూరి మోదీ నిరంకుశ విధానాలకు వ్యతిరేకంగా ప్రజలు ఓటేశారు. ఓట్ల చీలిక వల్లే పాల్ఘర్లో బీజేపీ గెలుపొందింది. బీజేపీ పతనం ఆరంభమైందని అసెంబ్లీ ఉప ఎన్నికల ఫలితాలే తేటతెల్లం చేస్తున్నాయి. – ఎన్సీపీ -
తొలి ముస్లిం లోక్‌సభ సభ్యురాలు
లక్నో: కైరానా (యూపీ) లోక్‌సభ స్థానం నుంచి విజయం సాధించిన తబస్సుమ్ హసన్ చరిత్ర సృష్టించారు. 2014 నుంచి తొలిసారిగా లోక్‌సభలో అడుగుపెట్టిన యూపీ ముస్లింగా ఆమె చర్రిత సృష్టించారు. బీజేపీ అభ్యర్థి మృగంకా సింగ్‌పై తబస్సుమ్ హసన్ 55 వేల ఓట్ల మెజార్టీతో కైరానా నుంచి విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ విజయంతో లోక్‌సభలో యూపీ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న తొలి ముస్లింగా తబస్సుమ్ నిలిచారు. 2014లో బీజేపీ-ఆప్నాదళ్ కూటమి మోదీ హవాతో రాష్ట్రంలోని 80 స్థానాలకు గాను 73 స్థానాల్లో విజయం సాధించింది. మిగిలిన సీట్లను కాంగ్రెస్-ఎస్సీ కూటమి సొంతం చేసుకుంది. వీరిలో ఒక్క ముస్లిం కూడా విజయం సాధించలేకపోవడం విశేషం. ఇటీవల జరిగిన గోరఖ్‌పూర్, పూల్పూర్ లోక్‌సభ ఉప ఎన్నికల్లో విజయం సాధించిన ఎస్సీ- బీఎస్సీ కూటమి ముస్లిం అభ్యర్ధులను బరిలో నిలపలేదు. ప్రస్తుతం లోక్‌సభకు ప్రాతినిథ్యం వహిస్తున్న ఏకైక యూపీ ముస్లిం లోక్‌సభ సభ్యురాలిగా తబస్సుమ్ నిలవగా, రాజ్యసభలో ఇద్దరు ముస్లింలు జావేద్ అలీ ఖాన్, తన్జీమ్ ఫాట్మాలు ఎస్సీ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. -
కైరానా విపక్షాల కైవసం
సాక్షి, న్యూఢిల్లీ : కైరానా(ఉత్తరప్రదేశ్) లోక్‌సభ స్థానాన్ని విపక్షాలు కైవసం చేసుకున్నాయి. దాదాపు 55 వేల ఓట్ల మెజార్టీతో రాష్ట్రీయ లోక్ దళ్(ఆర్ఎల్డీ) అభ్యర్థి తబస్సుమ్ హసన్ తన సమీప ప్రత్యర్థి మృగంకా సింగ్‌పై ఘన విజయం సాధించారు. ఈ నియోజకవర్గంలో విపక్షాలు(సమాజ్ వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ, కాంగ్రెస్) అన్నీ కలసి ఆర్ఎల్డీ అభ్యర్థి తబస్సుమ్‌కు మద్దతు ఇచ్చిన విషయం తెలిసిందే. భారతీయ జనతా పార్టీ(బీజేపీ) చేసిన అభివృద్ధిని ప్రజల్లోకి సరిగా తీసుకెళ్లలేకపోవడమే పరాజయానికి కారణమని ఓటమి అనంతరం మృగంకా వ్యాఖ్యానించారు. ఫలితాలు నిరాశకు గురి చేసినా, భవిష్యత్‌లో తిరిగి నియోజకవర్గంపై పట్టు సాధిస్తామని ఆమె ధీమా వ్యక్తం చేశారు. బీజేపీలో అంతర్గత కలహాల వల్లే ఓటమిని ఎదుర్కొవాల్సి వచ్చిందనే వార్తలను ఆమె కొట్టిపారేశారు. విపక్షాలు అన్నీ ఏకమై బీజేపీను ఓడించాయని అన్నారు. ఇందుకు బీజేపీ మరింత సన్నద్ధం కావాల్సివుందని అభిప్రాయపడ్డారు. కాగా, కైరానా ఉప ఎన్నికలో విజయం సాధించిన తబస్సుమ్ మాట్లాడుతూ ఈ విజయం కైరానా ప్రజలదని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సుడిగాలి రాష్ట్రంలో లేదని చెప్పడానికి ఈ ఫలితమే నిదర్శమని అన్నారు. మహ్మద్ అలీ జిన్నా వివాదాన్ని తెరపైకి తెచ్చి ఉప ఎన్నికలో గెలవాలని చూసిన బీజేపీకి ప్రజలు తగిన బుద్ధి చెప్పారని అభిప్రాయపడ్డారు. అంతకుముందు కైరానా నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ ఎంపీ హుకుమ్ సింగ్ ఫిబ్రవరిలో అర్థాంతరంగా తుది శ్వాస విడిచారు. దీంతో ఆయన తనయ మృగంకా సింగ్‌ను కైరానా నుంచి బీజేపీ బరిలో నిలిపింది. -
మూడు అట్టల పుస్తకం
ముగ్గురూ క్లాస్మేట్స్ ముగ్గురిదీ ఒకే ఫైట్ వాళ్లు చదువుకోవాలి. ఊరినీ చదివించాలి పెద్దలు వీల్లేదన్నారు వినలేదు. పరిస్థితులు అనుకూలించలేదు లెక్క చేయలేదు సంకల్పబలంతో ముందుకుసాగారు అసామాన్య పోరాటం జరిపారు విజయం సాధించారు ఒక పుస్తకానికి మూడు అట్టలు ఉండవు. తబుస్సమ్.. తరన్నుమ్.. రుబీనా... ముగ్గురూ చదువు అన్న పుస్తకానికి మూడు అట్టలు. చదువు వద్దంటే చదువుకుని నిలబడ్డారు చదువు చెప్పొద్దంటే చదివించి చూపారు. చదువు వల్ల ఏం ఒరుగుతుందంటే ఊరంతటినీ చదివించారు. అవును. సజోయి అనే పుస్తకానికి మూడు అట్టలు. ఆరాటం.. పోరాటం.. ప్రోత్సాహం. వారణాసి.. దేశ ఆధ్యాత్మిక రాజధాని! ప్రాచీనత, పట్టు వస్త్రాలు.. సుగంధ ద్రవ్యాలకు నిలయం. స్వదేశీ, విదేశీ టూరిస్టులతో నిత్యం కళకళలాడుతూ ఉండే పాతకొత్త కలయికల ఈ పట్టణానికి కొంచెం దూరంలో ఉంది సజోయి గ్రామం! కాశీకి కూతవేటులో ఉన్నా దాని అద్భుత ఛాయలేవీ సజోయి మీద లేవు. చాలా ఊళ్లలాగే ఇదీ ఓ సాధారణ పల్లె. ఎంత సామాన్యమైందంటే.. ఇంటి పనులు చేయడానికి, భర్త వంశాంకురాలను కనిపెంచడానికి మాత్రమే ఆడపిల్లలు పుడతారని.. అంతకుమించి వారికేం ప్రాధాన్యం లేదనే నిశ్చితాభిప్రాయాలతో ఉండేంత! కానీ అలాంటి ముతక ఊరూ ఒక అసామాన్యతకు జన్మనిచ్చింది.. బెనారస్ వెండి జరీలు వెలవెలబోయే వెలుగులతో! ఆ ఆత్మవిశ్వాసం ముందు కాశీ అద్భుతం ఎంత? వారణాసి పంచే ఆధ్మాత్మికతను మించిన జీవనతాత్వికత అది! ఆ అసామాన్య ఆత్మవిశ్వాస జీవన తాత్వికతల పేర్లు... తబస్సుమ్.. తరన్నుమ్.. రుబీనా! ఆ నిజంలోకి వెళితే... ఈ ముగ్గురిదీ ఇంచుమించు ఒకే వయసు. క్లాస్మేట్స్.. స్నేహితులు! ఎదుర్కొన్న సమస్యా ఒక్కటే. ఏర్పర్చుకున్న లక్ష్యం.. పోరాట స్ఫూర్తీ ఒక్కటే! సజోయిలోని పెద్దలకు చదువు మీద పెద్దపట్టింపు లేదు. ప్రాముఖ్యత అసలే తెలియదు. అందుకే ఆ ఊళ్లో అబ్బాయిలకు చదువు పోరుండదు.. అమ్మాయిలకైతే ఆ అవకాశమే ఉండదు. ఇలాంటి నేపథ్యంలోనే పెరిగారు తబస్సుమ్, తరన్నుమ్, రుబీనా. అయితే పెద్దవాళ్ల అభీష్టాలకు వ్యతిరేకంగా... ఆ ఊరి సంప్రదాయానికి విరుద్ధంగా ఇంటర్ వరకూ చదువు కొనసాగించారు. తొమ్మిది తర్వాత ప్రతి యేడూ చదువుకోసం పెద్ద యుద్ధమే చేశారు. తబస్సుమ్, తరన్నుమ్, రుబీనా తల్లిదండ్రులు తమ పిల్లలు తొమ్మిదో తరగతి వచ్చేవరకు వాళ్ల చదువులకు అభ్యంతరం చెప్పలేదు. తొమ్మిదో తరగతి వేసవి సెలవులు ఆ ముగ్గురి మీదా ‘పెద్దరికాన్ని’ మోపి చదువు ఆపించేయాలని చూశాయి. ప్రతి ఆడపిల్ల జీవితంలో అది సహజంగా జరిగే ప్రక్రియనీ.. దానికి, మా చదువుకి లంకె ఎందుకని తల్లిదండ్రులను ప్రశ్నించారు. చిన్న నోట పెద్ద మాట.. పెద్దలు అవాక్కయ్యేలా చేసింది. అంత విజ్ఞతకు విస్మయం చెందినా... చుట్టుపక్కల, చుట్టపక్కాల మాటలకు జడిసి చదువు మాన్పించాలనే నిర్ణయానికే వచ్చారు. అయినా ఆ పిల్లలు పట్టువీడలేదు. తమ చదువుకోసం వాళ్లేమీ డబ్బు పెట్టక్కర్లేదని... ఏదో ఒక పనిచేసుకుంటూ చదువుకుంటామని తండ్రులనూ వేడుకున్నారు. పిల్లల అభ్యర్థనకు తల్లులు కరిగినా తండ్రులు బింకంగానే ఉన్నారు. అయినా ఓటమిని ఒప్పుకోలేదు ఆ ముగ్గురు. ఇంట్లో నిరహారదీక్షకు కూర్చున్నారు. నాలుగు రోజులు సాగాక అయిదోరోజుకి నాన్నల మనసూ కరిగింది. బంధువుల మాటలను లెక్కచేయక ఎట్టకేలకు చదువుకి అనుమతిచ్చారు. అది వాళ్ల మొదటి విజయం. టెన్త్‌లో ఫస్ట్‌క్లాస్ ఆ పిల్లలకు రెండో గెలుపునిచ్చింది. ఇంటర్లో చేరడానికి మళ్లీ పోరాడారు. ఇందులోనూ జయమే. ఇంటర్ కూడా ఫస్ట్ డివిజన్. ఇంటర్ తర్వాత తబస్సుమ్‌కి పై చదువులకు వెళ్లాలని ఉన్నా పెద్దవాళ్లు తమ వల్లకాదని చెప్పారు. తతిమా ఇద్దరు స్నేహితురాళ్లు ‘మనం కనీసం ఇంటర్ వరకైనా చదివాం.. మన ఊళ్లో చాలామంది ఆడపిల్లలు ఓనమాలక్కూడా నోచుకోలేదు. కాబట్టి ముగ్గురం ఊళ్లోని ఆడపిల్లలకు చదువు చెప్దాం’ అనే ప్రతిపాదన చేశారు. ముగ్గురికీ ఆ ఆలోచన నచ్చింది. ఆ తెల్లవారి నుంచే ఇంటింటికి వెళ్లి ‘చదువు చెప్తాం రండి’ అంటూ పిలిచారు. ఆడపిల్లల కోసం మాత్రమే అని చెప్తే పంపరని మగపిల్లలను పంపించమని తల్లిదండ్రులను కోరారు. ఆరేళ్లలోపు మగపిల్లలు రావడం మొదలుపెట్టారు. ‘హ్యూమన్ వెల్ఫేర్ అసోసియేషన్’ అనే స్థానిక స్వచ్ఛంద సంస్థ సహాయంతో ఓ గదిని అద్దెకు తీసుకున్నారు. ఆ మగపిల్లల్ని ఈ బడిలో వదలడానికి వెంట ఆడపిల్లలూ వస్తున్నారు. వీళ్లు ఊహించిందీ అదే. పాచిక పారింది. వాళ్లనూ బడిలో కూర్చోబెట్టసాగారు. తమ్ముళ్లతోపాటు ఈ అక్కలకూ అక్షరాలు దిద్దించసాగారు. అయితే ఈ సంబరం ఎంతోకాలం సాగలేదు. ఇంట్లో పని వదిలేసి బడిలోనే ఆడపిల్లలు కాలక్షేపం చేయడంతో మగపిల్లలను బడి మాన్పించారు తల్లిదండ్రులు. దాంతో అమ్మాయిలూ రావడం బంద్ అయింది. ఊహించని పరిణామానికి షాక్ అయ్యారు ముగ్గురూ. టైలరింగ్‌తో.. ఈసారి కొత్త ఆలోచనతో అడుగువేశారు. అసోసియేషన్ ఆర్థిక సహాయంతో మూడు కుట్టు మెషీన్లను కొని టైలరింగ్ ఇన్స్టిట్యూట్ పెట్టారు. ఆ సంస్థ కార్యకర్తలతో ఇంటింటి ప్రచారం నిర్వహించారు.. ‘ఆడపిల్లలకు కుట్టు మిషన్ నేర్పిస్తాం పంపించండ’ంటూ. పరిచయమున్న ఎన్జీవో కార్యకర్తలే రావడంతో తల్లిదండ్రులూ కాదనలేదు. ఆ ముగ్గురు ఎదురుచూసిందీ దాని కోసమే. రోజుకి మూడు గంటలు క్లాస్ అయితే ఒక గంట హెచ్‌డబ్ల్యూఏ వాళ్ల టైలరింగ్ క్లాస్, తర్వాత రెండు గంటలు ఈ పిల్లలు ఆ పిల్లలకు చెప్పే చదువు. అయితే ఇదీ ఎంతోకాలం సాగలేదు. టైలరింగ్ పేరుతో చదువు నేర్పించి అమ్మాయిలను పాడు చేస్తున్నారంటూ పెద్దవాళ్లు వీళ్లతో గొడవకు దిగారు. ‘టైలరింగ్లోని కొలతలు తెలియాలంటే చదువు కావాలి.. అంకెలు రావాలి. అవి నేర్చుకోకుండా టైలరింగ్ ఎట్లా వస్తుంది?’ అంటూ ఎదురు ప్రశ్నించారు. అయితే వాళ్లు ఒప్పుకోకపోగా.. ఈ ముగ్గురి తల్లిదండ్రుల దగ్గరకు వెళ్లి.. ‘మీ పిల్లలు చెడిపోయింది కాక మా ఆడపిల్లలనూ చెడగొడ్తున్నారు’అని దుమ్మెత్తిపోశారు. ఇంట్లోంచి కాలు బయటపెడితే ఊర్లోని మగపిల్లలూ గేలిచేసేవారు. ఆ అవమానం తట్టుకోలేని ఆ ముగ్గురి తల్లిదండ్రులు వీళ్లను ఇల్లు దాటకుండా కట్టడి చేశారు. పెళ్లి సంబంధాలు చూడ్డం మొదలుపెట్టారు. ఇంత కష్టమూ మొదటికి వచ్చిందే అని తలపట్టుకున్నారు తబస్సుమ్, తరన్నుమ్, రుబీనా! అపజయాన్ని అంగీకరించలేదు. కనీసం పదిమంది ఆడపిల్లలనైనా అక్షరాస్యులను చేయందే ఈ ఊరు వదిలివెళ్లేది లేదని.. ప్రతిజ్ఞ చేశారు. అన్నట్టుగానే.. తిరిగి సున్నా దగ్గర ప్రారంభమైంది వీళ్ల పోరు. చదువుకోవడం కోసం ఎంత బతిమాలుకున్నారో... చదువు చెప్పడం కోసం అంతకన్నా ఎక్కువే బతిమాలాల్సి వచ్చింది. మళ్లీ నిరసన, నిరహారదీక్షలతో ఒప్పించుకోగలిగారు. అయితే ఓ షరతుతో... ‘ఈసారి గనుక మీ మీద ఎలాంటి కంప్లయింట్ వచ్చినా నిఖాకు సిద్ధం కావల్సిందే’ నని. మరి ఇప్పుడు... సజోయ్లోని 99 శాతం ఆడపిల్లలకు ఇప్పుడు చదవడం, రాయడం వచ్చు. పదుల సంఖ్యలో పొరుగూరికి వెళ్లి డిగ్రీ చదువుతున్నారు. కూతుళ్లు చదువుతుంటే ప్రేరణపొంది వాళ్ల తల్లులూ పలకా, బలపంతో ఈ ముగ్గురి దగ్గరకు వచ్చారు. దాంతో ఈ స్నేహితుల ఆనందానికి అంతులేదు. వాళ్ల కోసం రాత్రి బడిని తెరిచారు. ఇప్పుడా రాత్రి బడిలో ‘పెద్ద పిల్లల’ సంఖ్య 270. ‘ఇదంతా ఆషామాషీగా సాగిన వ్యవహారం కాదు. ఒకానొక టైమ్‌లో చదువు చెప్పడానికి ఊళ్లో ఎవరూ జాగా ఇవ్వకపోతే మా పెరట్లో చెత్త వేసే ప్రదేశాన్ని శుభ్రం చేసి అక్కడ బడి పెట్టాం. మా ఈ సుదీర్ఘ ప్రయత్నంలో, పోరులో మా తల్లిదండ్రుల ప్రోత్సాహం లేకపోతే ఈ విజయాన్ని సాధించలేకపోయేవాళ్లం’ అంటారు ఎంతో వినయంగా ఈ త్రీ మస్కటీర్స్. 35 మందితో మొదలై... మూడోప్రయత్నం నేరుగానే ఉంది. ఇంటింటికీ వెళ్లి ఆడపిల్లల చదువు గురించి, చదువుకుంటే వాళ్ల భవిష్యత్తే కాదు ఇంటి భవిష్యత్తు ఎంత బాగుంటుందో కథలుగా చెప్పారు. రాత్రిపూట చిన్నచిన్న నాటకాలుగా వేసి చూపించారు. మెల్లగా ఆలోచించడం మొదలుపెట్టారు పెద్దలు. చివరకు ఒప్పుకోక తప్పలేదు. అలా ముందు 35 మందితో ఈ ముగ్గురు పెట్టిన బడిలో ప్రేయర్ బెల్ మోగింది. యేడాది తర్వాత ఈ స్కూల్ స్ట్రెన్త్ 170. ఇలా ఓ వైపు ఊళ్లో పిల్లలకు చదువు చెప్తూనే మరోవైపు ప్రైవేట్‌గా డిగ్రీ పూర్తి చేశారు. ఇదంతా 2007 నాటి సంగతి.