
తబస్సుమ్(ఎడమ), మృగంకా సింగ్(కుడి)
సాక్షి, న్యూఢిల్లీ : కైరానా(ఉత్తరప్రదేశ్) లోక్‌సభ స్థానాన్ని విపక్షాలు కైవసం చేసుకున్నాయి. దాదాపు 55 వేల ఓట్ల మెజార్టీతో రాష్ట్రీయ లోక్ దళ్(ఆర్‌ఎల్డీ) అభ్యర్థి తబస్సుమ్ హసన్ తన సమీప ప్రత్యర్థి మృగంకా సింగ్‌పై ఘన విజయం సాధించారు. ఈ నియోజకవర్గంలో విపక్షాలు(సమాజ్ వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ, కాంగ్రెస్) అన్నీ కలసి ఆర్‌ఎల్డీ అభ్యర్థి తబస్సుమ్‌కు మద్దతు ఇచ్చిన విషయం తెలిసిందే.
భారతీయ జనతా పార్టీ(బీజేపీ) చేసిన అభివృద్ధిని ప్రజల్లోకి సరిగా తీసుకెళ్లలేకపోవడమే పరాజయానికి కారణమని ఓటమి అనంతరం మృగంకా వ్యాఖ్యానించారు. ఫలితాలు నిరాశకు గురి చేసినా, భవిష్యత్‌లో తిరిగి నియోజకవర్గంపై పట్టు సాధిస్తామని ఆమె ధీమా వ్యక్తం చేశారు. బీజేపీలో అంతర్గత కలహాల వల్లే ఓటమిని ఎదుర్కొవాల్సి వచ్చిందనే వార్తలను ఆమె కొట్టిపారేశారు.
విపక్షాలు అన్నీ ఏకమై బీజేపీను ఓడించాయని అన్నారు. ఇందుకు బీజేపీ మరింత సన్నద్ధం కావాల్సివుందని అభిప్రాయపడ్డారు. కాగా, కైరానా ఉప ఎన్నికలో విజయం సాధించిన తబస్సుమ్ మాట్లాడుతూ ఈ విజయం కైరానా ప్రజలదని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సుడిగాలి రాష్ట్రంలో లేదని చెప్పడానికి ఈ ఫలితమే నిదర్శమని అన్నారు. మహ్మద్ అలీ జిన్నా వివాదాన్ని తెరపైకి తెచ్చి ఉప ఎన్నికలో గెలవాలని చూసిన బీజేపీకి ప్రజలు తగిన బుద్ధి చెప్పారని అభిప్రాయపడ్డారు.
అంతకుముందు కైరానా నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ ఎంపీ హుకుమ్ సింగ్ ఫిబ్రవరిలో అర్థాంతరంగా తుది శ్వాస విడిచారు. దీంతో ఆయన తనయ మృగంకా సింగ్‌ను కైరానా నుంచి బీజేపీ బరిలో నిలిపింది.