స్లమ్ టూ బాంద్రా! | Bandra slum Too! | Sakshi
Sakshi News home page

స్లమ్ టూ బాంద్రా!

Published Mon, Sep 14 2015 11:16 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

స్లమ్ టూ బాంద్రా! - Sakshi

స్లమ్ టూ బాంద్రా!

రుబీనా అలీ
 
బాలీవుడ్ స్టార్ల అడ్డాగా ఉన్న బాంద్రా సిటీలోకి మరో బుల్లి తార అడుగుపెట్టబోతోంది. ఆ చైల్డ్ ఆర్టిస్ట్ ఎన్నో సినిమాలు తీయలేదు... కేవలం ఒకే చిత్రంలో నటించి ప్రతిష్టాత్మక అవార్డును అందుకుంది. ఆ చిన్నారే... ఇప్పటి 16 ఏళ్ల రుబీనా అలీ. ఎనిమిది ఆస్కార్లను కైవసం చేసుకొన్న ‘స్లమ్ డాగ్ మిల్లీనియర్’ లో హీరోయిన్ ఫ్రీదా పింటో చిన్ననాటి పాత్రను పోషించి బాలనటిగా పరిచయమైన రుబీనా ఓ పేదింటి అమ్మాయి. ఆమె ఉండే ఇల్లు... ముంబై గరీబ్ నగర్ స్లమ్‌లోని ఓ పూరి గుడిసెలో. అయితే ఎనిమిది నెలల క్రితం స్లమ్‌లో అగ్నిప్రమాదం జరిగి ఆమె ఇల్లు పూర్తిగా కాలిపోయింది. అలాగే ఆ మంటల్లో ఆమె అందుకున్న జాతీయ, అంతర్జాతీయ సత్కారాల జ్ఞాపికలు, ప్రశంసా పత్రాలు కూడా కాలి బూడిదయ్యాయి! అప్పుడు రుబీనా స్కూల్ ఫైనల్ ఎగ్జామ్స్ రాస్తోంది. తర్వాత వేరే దారి లేక ఆమె కుటుంబం బాంద్రా సిటీలో ఓ చిన్న ఇంట్లో అద్దెకు దిగింది.

అయితే వచ్చే దీపావళి లేదా బక్రీద్ లోపు రుబీనా తన సొంత ఫ్లాట్‌లోకి అడుగుపెట్టనుంది! అదీ షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్, ప్రీతి జింటా, సంజయ్‌దత్, దిలీప్‌కుమార్ లాంటి దిగ్గజాలు ఉండే బాంద్రా సిటీలో. అక్కడ రాజకీయ నాయకులు, సినీ స్టార్స్, క్రికెటర్ సచిన్ టెండూల్కర్ లాంటి వారి నివాసాలు ఉన్నాయి. ఆ ప్రాంతంలోకి ఈ పేద అమ్మాయి వెళ్లడం ఎలా అనుకుంటున్నారా? అదే అదృష్టం అంటే! స్లమ్ డాగ్ మిలియనీర్ చిత్ర దర్శకుడు డానీ బోయెల్ ఈ మధ్య ‘జైహో’ పేరుతో ట్రస్ట్ ప్రారంభించి రుబీనాకు ఓ ఇల్లు కొనివ్వాలని నిర్ణయించాడు. అందుకు ఆ ట్రస్ట్ సభ్యులు ఆమె తల్లిదండ్రులతో కలసి మంచి ఇంటి కోసం వెతికారు. చివరికి బాంద్రా వెస్ట్ ప్రాంతంలో ఓ సింగిల్ బెడ్ రూమ్ ఫ్లాట్ పట్టుకున్నారు. వీలైనంత త్వరగా దానిని రుబీనాకు అందించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. అన్నట్టు.. దాని ధర ఎంతనుకుంటున్నారు? అక్షరాల రూ.45 లక్షలు!

‘‘నాకు అమ్మానాన్నలతో పాటు ఇద్దరు సిస్టర్స్, ఒక బ్రదర్ ఉన్నారు. ఇప్పుడు మేమందరం కొత్త ఇంట్లో వెళ్తున్నామంటే ఎంతో ఆనందంగా ఉంది. ఒక సొంత ఇల్లు కట్టుకొని, అందులో నాకంటూ ఓ బెడ్‌రూం ఉండాలని ఆశ పడేదాన్ని. ఇప్పుడు నా కల బోయెల్ సర్ వల్ల నిజమవుతోంది. ప్రస్తుతం నటనకన్నా చదువుకే నా ప్రాధాన్యం. నా కాలేజ్ స్టడీస్ కూడా అయిపోయాక అప్పుడు ఫుల్ టైమ్ నటిని కావాలని నా ఆలోచన’’ అని ఆనందంగా చెప్పుకొచ్చింది రుబీనా. ఇక రుబీనా ‘లార్డ్ ఒవెన్స్ లేడి’ అనే మరో అంతర్జాతీయ చిత్రంలో నటించనుంది. దాన్ని ఇండియా, బ్రిటన్ దేశాల్లో చిత్రీకరించనున్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement