
సినీ రంగంలో ప్రతిష్ఠాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డ్స్ నుంచి ఒక ప్రకటన జారీ అయింది. 2026లో జరగనున్న అస్కార్ అవార్డ్స్ తేదీలను అకాడమీ ప్రకటించింది. 98వ అకాడెమీ అవార్డుల వేడుక వచ్చే ఏడాది మార్చి 15న జరగనున్నట్లు అకాడమీ తెలిపింది. అయితే, అందుకు నామినేట్ అయిన చిత్రాల జాబితాను జనవరి 22న వెల్లడిస్తామని పేర్కొంది. ఈసారి ఏఐ ఉపయోగించిన చిత్రాలను కూడా పరిగణనలోకి తీసుకోనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. అమెరికాలోని లాస్ ఏంజెలెస్ (Los Angeles)లో ఈ వేడుక జరగనుంది. 2025 జనవరి నుంచి డిసెంబర్ వరకు విడుదలైన చిత్రాలకు అస్కార్ ఎంట్రీకి అవకాశం ఉంటుంది. కానీ, ఒరిజినల్ సాంగ్ విభాగం కోసం మాత్రం 2025 నవంబర్ 3 వరకు విడుదలైన మూవీలకు మాత్రమే ఛాన్స్ ఉంటుంది.