
సాక్షి, బాసర : ప్రసిద్ధిగాంచిన బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో అధికారుల నిర్లక్ష్యం మరోసారి బట్టబయలైంది. ఆలయంలోని అమ్మవారి మూలవిరాట్ విగ్రహం మకుటంలోని ఓ వజ్రం కనిపించకుండా పోయింది. నవరత్నాలతో కూడిన అమ్మవారి కిరీటంలో మరకతం (పచ్చ) గల్లంతయినట్లు గుర్తించిన భక్తులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారం కాస్తా వివాదాస్పదంగా మారటంతో దేవదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి విచారణకు ఆదేశించారు.
కెంపు గల్లంతుకు సంబంధించి పూర్తి నివేదిక సమర్పించాలని మంత్రి, దేవాదాయ శాఖ కమిషనర్‌ను ఆదేశించారు. ఇందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. గతంలో విగ్రహాన్ని మరో ప్రాంతానికి తీసుకొచ్చి పూజలు నిర్వహించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆలయ అధికారులు... మరోసారి ఇంకో వివాదంలో ఇరుక్కోవడం గమనార్హం.