పాతబస్తీ.. హైదరాబాద్ షాన్‌కెంత ప్రసిద్ధో.. గరీబీకీ అంతే పరిచయం! ఆ పేదరికం.. అనుభవించేవాళ్లనందరినీ కష్టపెడుతున్నా బలికోరుతున్నది మాత్రం ఆడపిల్లలనే! ఎప్పుడో జరిగిన అమీనా నిఖానే కాదు ఇప్పటికీ ఆగని ఆ పెళ్లిళ్లు, బాలికావధువులే అందుకు ఉదాహరణ.. ఇప్పుడు చదవబోయే రుబీనా (పేరు మార్చాం) కథ కూడా అలాంటిదే..
..:: సరస్వతి రమ
జావేద్‌ఖాన్ (పేరు మార్చాం), రజియా (పేరు మార్చాం)లకు ముగ్గురు ఆడపిల్లలు. వాళ్లలో పెద్దమ్మాయే రుబీనా. జావేద్‌ఖాన్ భార్య రజియాని బాగా హింసించేవాడు. అది తట్టుకోలేక రజియా ఇంట్లోంచి వెళ్లిపోయింది. అప్పుడు రుబీనాకు మూడేళ్లు. రజియా వెళ్లిపోవడంతో ముగ్గురు పిల్లల్ని తన తల్లిదగ్గర వదిలాడు జావేద్‌ఖాన్. ఓ నాలుగేళ్లు నానమ్మ దగ్గరున్నారు పిల్లలు.
తర్వాత..
రుబీనా నానమ్మకు గల్ఫ్‌లో పనిదొరకడంతో ఆ దేశానికి టేకాఫ్ అయింది. పిల్లలు తల్లి గూటికి చేరారు. అప్పటికే రజియా ఇంకో పెళ్లిచేసుకుంది. ఇటు జావేద్‌ఖాన్ తాగుడికి బానిసయ్యాడు, డ్రగ్స్‌కీ అలవాటు పడ్డాడు. రుబీనా సవతి తండ్రి ఈ పిల్లల్ని శ్రద్ధగా చూసేవాడుకాదు. బాగా కొట్టేవాడు. స్కూల్‌కి పంపకుండా దగ్గర్లో కార్ఖానాల్లో పనికి పంపేవాడు. అదంతా రజియాకు మళ్లీ హింసలా తయారైంది.
పదమూడేళ్లు వచ్చేసరికి..
ముగ్గురు పిల్లల్నీ తీసుకొని ఇల్లు వదిలింది రజియా. పాతబస్తీలోనే ఓ ఇల్లు తీసుకొని ఉండసాగింది. ఓ ఏడాది గడిచాక నెమ్మదిగా రుబీనాకు పెళ్లిచేసేస్తే తన బాధ్యత కొంత తీరుతుందనుకొని ఆ పిల్లకు సంబంధాలు చూడటం మొదలుపెట్టింది. ఈలోపే సవతి తండ్రి మళ్లీ వీళ్లను చేరాడు. దాంతో ముగ్గురు పిల్లల్ని తన తల్లి దగ్గర పెట్టింది రజియా. అయితే అమ్మమ్మ పద్నాలుగేళ్ల రుబీనాకు 55 ఏళ్ల అరబ్ షేక్‌తో పెళ్లి జరిపించింది. రుబీనా అసలు తండ్రితోపాటు, సవతి తండ్రీ వచ్చి ఆమె అమ్మమ్మతో గొడవ పెట్టుకున్నారు. అంతా అయిపోయాక ఎంత గొడవపడితే ఏం లాభం?
మళ్లీ ఇంటికి..
ఈ వ్యవహారం సద్దుమణిగాక రజియా మిగిలిన ఇద్దరు పిల్లల్ని సముదాయించి, వాళ్లను తీసుకొని రెండో భర్తతో వెళ్లిపోయింది. ఓ రెండు నెలలు గడిచాయి. అరబ్‌షేక్ వెళ్లిపోయాడు. రుబీనా తల్లిదగ్గరికి వచ్చేసింది. ఓ వారానికి రుబీనా గర్భవతి అని తేలింది. అరబ్‌షేక్‌కి ఫోన్‌చేసి విషయాన్ని చెవినవేశారు. ‘అయితే నాకేంటి? నాకెందుకు ఫోన్ చేస్తున్నారు? చేయొద్దు’ అంటూ నోటికొచ్చినట్టు తిట్టి ఫోన్‌పెట్టేశాడు. ఆరు నెలల వరకు డబ్బులు పంపించి ఆపై ఆపేశాడు. అంతేకాదు రుబీనాను అనుమానిస్తూ ఆమెకు వివాహేతర సంబంధం ఉందంటూ నిందవేశాడు. రుబీనా ఆడపిల్లను కన్నది. బిడ్డ పుట్టిందని మళ్లీ అరబ్‌షేక్‌కి ఫోన్ చేసినా అక్కడి నుంచి ఎలాంటి పలుకూ లేదు. మధ్యవర్తుల ద్వారా చెప్పించినా స్పందనలేదు. ఇంట్లో భయంకరమైన పేదరికం. ముగ్గురు పిల్లలకు తోడు చంటిది. పాలబొట్టూ కరువైంది ఆ పసిదానికి.
రెండో తప్పు..
ఈ పేదరికం నుంచి బయటపడటానికి రజియా తన రెండో కూతురికీ అరబ్‌షేక్‌ని వె దికింది. అక్క జీవితాన్ని కళ్లారా చూసిన ఈ చెల్లి తనకూ అదే గతి పడుతుందని గ్రహించి ఇంట్లోంచి వెళ్లిపోయింది. ఇదిలా ఉంటే రుబీనా తన కూతురు, మూడో చెల్లెలితో తండ్రి దగ్గరికి వచ్చేసింది. కొన్నాళ్లు బాగానే చూసుకున్నాడు. తర్వాత రోడ్డుమీదకి తెచ్చాడు. మళ్లీ తల్లి ఇల్లే గతి అయింది వాళ్లకు. ఈసారి సవతి తండ్రి రుబీనాకు ఆఫ్రికన్ వరుడిని వెదికాడు. ప్రమాదం పసిగట్టిన రుబీనా బిడ్డను తీసుకొని ఇంటి నుంచి వెళ్లిపోయింది. తర్వాత నిస్సహాయులైన మహిళలకు ఆసరగా నిలుస్తున్న ‘షాహీన్’ సంస్థను చేరుకుంది. అక్కడే టైలరింగ్ నేర్చుకుంటూ తన బిడ్డకు మంచి జీవితాన్నివ్వాలని ఆశపడుతోంది. ఆమె కూతురికిప్పుడు నాలుగేళ్లు. రుబీనా ఎంచుకున్న దార్లో ఆమెను నడవనిద్దాం.. అలసిపోయినప్పుడు అండగా నిలబడదాం.. ఆ పసిబిడ్డను కాపాడుకుందాం!
అంతులేని వ్యథ
Published Fri, Feb 13 2015 1:00 AM | Last Updated on Tue, Aug 21 2018 3:08 PM
Advertisement