‘మ్యాజిక్ బస్’ ఆటపాఠాలు | Always your service | Sakshi
Sakshi News home page

‘మ్యాజిక్ బస్’ ఆటపాఠాలు

Published Sat, Dec 6 2014 1:00 AM | Last Updated on Mon, Oct 8 2018 4:31 PM

‘మ్యాజిక్ బస్’ ఆటపాఠాలు - Sakshi

‘మ్యాజిక్ బస్’ ఆటపాఠాలు

‘సదా మీ సేవలో..’ అంటూ సాక్షి సిటీప్లస్ ఇచ్చిన పిలుపునకు స్వచ్ఛంద సంస్థల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. సిటీ జీన్స్‌లోనే చారిటీ ఉందంటూ..నగరం వేదికగా తాము నిర్వహిస్తున్న సామాజిక సేవా కార్యక్రమాల వివరాలను పంపిస్తున్నాయి. సదా మీ సేవలో మేముసైతం అంటూ చేతులు కలిపి... తమ చేతల వివరాలను పంచుకుంటున్నాయి. ఈ వరుసలో ప్రచురితమవుతున్నపదవ కథనమిది...
 
మురికి  వీధుల్లో మసులుతున్న బాల్యం.. పెద్దయ్యాక భారంగా మారుతుంది. అదే బాల్యాన్ని అక్కున చేర్చుకుని అక్కరకు వచ్చే విషయాలు చెబితే.. భవిష్యత్తుపై భరోసా ఏర్పడుతుంది. గుడిసెల చుట్టూ గిరి గీసుకుని బతుకుతున్న పేదపిల్లలకు ప్రపంచాన్ని దగ్గరగా చూపించే ప్రయత్నం చేస్తోంది ‘మ్యాజిక్ బస్’.  అక్షర జ్యోతి వెలిగించినంత మాత్రాన పేదరికం చీకట్లలో ఉన్న వారి జీవితాల్లో వెలుగులు ప్రకాశించవు. మారుతున్న లోకంలో నిలబడే జ్ఞానం అందించాలి. ఆ పని మేం చేస్తామంటోంది ‘మ్యాజిక్ బస్’.
 
మాథ్యూస్పేసి ఇంగ్లండ్‌కు చెందిన వ్యాపారి. ఓసారి ముంబై వీధుల్లో ఆయనేదో గేమ్ ఆడుతున్నాడు. అదే సమయంలో ఆ పక్కనే మురికివాడల్లో ఉన్న యువకులను గమనించి.. నిండు మనసుతో వారికి ఉద్యోగాలు ఇప్పించాడు. కానీ.. ఏం లాభం.. కాస్తో కూస్తో చదువున్నా.. సరైన కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోవడం వల్ల ఆ యువకులు ఉద్యోగాల్లో కొనసాగలేకపోయారు. ఇచ్చిన అవకాశాన్ని ఆ కుర్రాళ్లు సద్వినియోగం చేసుకోలేకపోవడం మాథ్యూస్పేసికి కోపం తెప్పించలేదు. వారికే కాదు.. మురికివాడల్లో ఉన్న మరెందరికో దారి చూపాలన్న ఆలోచనకు బీజం వేసింది. అలా పుట్టిందే ‘మ్యాజిక్ బస్’ అనే స్వచ్ఛంద సంస్థ.
 
రైట్.. రైట్..

మురికివాడల్లో మరుగున పడి పోతున్న బాల్యాన్ని మేలిమి ముత్యంలా తయారు చేయడమే మ్యాజిక్ బస్ లక్ష్యం. ఆ సంస్థ సభ్యులు వారాంతాల్లో స్లమ్స్‌కు వెళ్తారు. చిన్నారులను ఆటపాటలతో ఆకట్టుకుంటారు. ఆ తర్వాత పాఠాలు చెబుతారు. విద్య, వైద్యం, జెండర్ ఈక్వాలిటీ, సోషియల్ అండ్ ఎమోషనల్ లెర్నింగ్.. ఇలా ఐదు అంశాలపై ప్రత్యేక తరగతులు నిర్విహ స్తారు. పదిహేనేళ్ల కిందట ముంబైలో స్టార్ట్ అయిన మ్యాజిక్ బస్ దేశవ్యాప్తంగా ఇరవై రాష్ట్రాల్లోని మురికివాడల్లో చక్కర్లు కొడుతోంది. మూడు లక్షల మంది పేదపిల్లల జీవితాలను మ్యాజిక్ చేసే పనిలో బిజీగా ఉంది.
 
భాగ్యనగరంలో..

మ్యాజిక్ బస్ సేవలు 2009 నుంచి హైదరాబాద్‌లో మొదలయ్యాయి. ప్రస్తుతం నగరంలో రెండు కేంద్రాల్లో పూర్తి స్థాయిలో పనిచేస్తోంది. పాతబస్తీలోని మురికివాడల్లో ఈ సంస్థ తన కార్యకలాపాలు నిర్వహిస్తోంది. సాయం చేయాలనే తపన ఉన్న యువకుల సహకారంతో చిన్నారుల జీవితాల్లో చిరునవ్వులు నింపుతోంది. ‘పాతబస్తీలో 90 మంది వాలంటీర్లు ఉన్నారు. వీరంతా వారి వారి ప్రాంతాల్లోని మురికివాడల్లో పనిచేస్తారు. ఉదయం రెండు గంటల పాటు పాఠాలు బోధిస్తారు. తర్వాత పిల్లలకు ఇష్టమైన ఆటలు ఆడిస్తారు. వాలీబాల్, హ్యాండ్‌బాల్, ఖోఖో వంటి ఆటలకు కావాల్సిన కిట్స్, డ్రెస్‌లను కూడా మా సంస్థే సమకూరుస్తుంది.

ఆటల్లో ప్రతిభ కనబరిచే పిల్లలకు ప్రత్యేక శిక్షణ కూడా ఇప్పిస్తున్నాం. పాతబస్తీ ఏరియాలో రెండున్నర వేల మంది చిన్నారులు మా కార్యక్రమంలో పాల్గొంటున్నారు. మా సంస్థ రెండో కేంద్రం శామీర్‌పేట దగ్గర్లోని బాలాజీ నగర్‌లో ఉంది. అక్కడ కూడా ఇదే స్థాయిలో పిల్లలున్నారు’ అని చెప్పారు మ్యాజిక్ బస్ సీనియర్ జనరల్ మేనేజర్ సంధ్యాశ్రీనివాస్. దేశవ్యాప్తంగా 7,500 మంది వాలంటీర్లు మ్యాజిక్‌బస్‌లో పని చేస్తున్నారు. వీరిని కమ్యూనిటీ యూత్ లీడర్ అని పిలుస్తారు.

నాలుగు అక్షరం ముక్కలు.. ఆటపాటలు

పిల్లల దగ్గరికి వెళ్లి జీవిత పాఠాలు నేర్పిస్తాం రండి అంటే ఎవరొస్తారు..? అందుకే ముందుగా ఆటలు.. ఆ తర్వాత పాఠాలు చెబుతూ పిల్లలకు చేరువవుతోంది మ్యాజిక్ బస్. నాలుగు అక్షరం ముక్కలు.. కాసింత లోక జ్ఞానం.. కొద్దిపాటి ప్రోత్సాహం.. ఈ మూడూ ఉంటే ఓ సామాన్యుడు కూడా మాన్యుడు కాగలడని చరిత్రలో ఎన్నోసార్లు చదువుకున్నాం. ఈ మూడింటినీ అందిస్తున్న మ్యాజిక్ బస్, ఈ సంస్థ పయనంలో అండగా నిలుస్తున్న యువ వాలంటీర్లకు సలామ్ చేద్దాం. బస్తీల్లో తిరుగుతున్న ఈ బస్ మరెందరో చిన్నారులను పికప్ చేసుకోవాలని, వారిని బంగారు భవిష్యత్తు వైపు తీసుకెళ్లాలని కోరుకుందాం.

గేమ్ అండ్ గోల్

‘మా చేతిలో వాలీబాల్ ఉంటే పిల్లలు మా చుట్టూ చే రిపోతారు. కాసేపు ఆడుకున్నాక.. మిగతా విషయాలను కూడా వారి బుర్రలకెక్కిస్తాం. పేదరికంలో పెరిగే చిన్నారులకు అక్షరజ్ఞానం ఒక్కటే ఉంటే సరిపోదు. వ్యక్తిత్వ వికాసానికి అవకాశం కూడా ఇవ్వాలి. మ్యాజిక్‌బస్ ఇదే చెబుతుంది. వారి జీవితాలను అద్భుతమైన మలుపు తిప్పుతామని చెప్పడం లేదు. కానీ, వారిని అమాయకత్వం నుంచి జ్ఞానం వైపు నడిపించగల్గుతున్నామని.. గర్వంగా చెప్పగలం’.
 
- ధీమంత్ టొవాటియా, సీనియర్ మేనేజర్
 
 ప్రజెంటేషన్: భువనేశ్వరి
 bhuvanakalidindi@gmail.com
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement