నవ సేవకులు | Nava servants | Sakshi
Sakshi News home page

నవ సేవకులు

Published Fri, Apr 3 2015 2:14 AM | Last Updated on Sat, Sep 2 2017 11:45 PM

నవ సేవకులు

నవ సేవకులు

మనిషన్నాక కాస్తంత కళాపోషణే కాదు... ఎంతో కొంత సామాజిక సేవ కూడా చేయాలి! సినిమా డైలాగులా ఉన్నా... దీన్ని అక్షర సత్యం చేసి చూపిస్తున్నారు ఐటీ ఉద్యోగులు. ఐటీయన్స్ అనగానే... క్షణం తీరిక లేని పని... దాంతో పాటే వచ్చిపడే మానసిక ఒత్తిడి... ఎవర్ని అడిగినా కామన్‌గా వచ్చే డైలాగ్! సెల్ఫ్ సర్వీస్‌కే టైమ్ లేదు... ఇక సోషల్ సర్వీస్ ఎక్కడిదనే వారిలో నిలువెత్తు స్ఫూర్తి నింపుతున్నారు. వివిధ కంపెనీల్లో పనిచేసే సాఫ్ట్ వేర్ ఉద్యోగులంతా ఒక్కటై... తమలోని ఆలోచనకు రూపం ఇచ్చారు. ‘నవ సేవక్’గా అవతరించి...
 నవ నగర నిర్మాణానికి తమ వంతు చేయూతనిస్తున్నారు.  
 
బంజారాహిల్స్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి మహేష్ ఉరుగొండ తొలుత దీనికి అంకురార్పణ చేశారు. ఆయన ఆధ్వర్యంలో ఏర్పాటైన ‘నవసేవక్’... యూసుఫ్‌గూడ చుట్టు పక్కల ప్రాంతాల్లో సేవలు ప్రారంభించింది. స్వచ్ఛభారత్‌ను చూసి స్ఫూర్తి పొందిన ఆయన మిత్రులతో చేతులు కలిపారు. ప్రధానంగా నగరంలో పేరుకుపోతున్న అపరిశుభ్రత, చెత్త సమస్యలపై దృష్టి పెట్టారు. ప్రతి ఆదివారం ఓ ప్రాంతాన్ని ఎంచుకుని శుభ్రం చేయడం మొదలు పెట్టారు. అంతే కాకుండా... స్థానికులకు పరిశుభ్రతపై అవగాహన పెంచేలా కరపత్రాలు
 పంచుతున్నారు. పరిసరాలు, పరిశుభ్రత, ఆరోగ్యకర జీవన విధానంపై అవగాహన కల్పిస్తున్నారు.
 
ఆచరణ... అవగాహన

యూసుఫ్‌గూడ, శ్రీనగర్‌కాలనీ, పంజగుట్ట, అమీర్‌పేట, ఈఎస్‌ఐ, ఎర్రగడ్డ, నాంపల్లి, బేగంపేట తదితర ప్రాంతాలను శుభ్రం చేశారు. దీంతో పాటు అర్ధరాత్రి రోడ్లపైనే విశ్రమిస్తున్న అభాగ్యులకు దుప్పట్టు పంపిణీ చేశారు. బస్తీలు, పాఠశాలకు వెళ్లి... స్వైన్ ఫ్లూపై పూర్తి స్థాయి అవగాహన కల్పించి, నివారణ మందులు పంచిపెట్టారు. చెత్త కుప్పలున్న పరిసరాలతో ఎలా అనారోగ్యం పాలవుతారో చుట్టు పక్కలవారికి వివరించే ప్రయత్నం చేస్తున్నారు. ‘అందరూ ఓ చేయి వేస్తే సాధ్యం కానిదేదీ ఉండదు. ప్రతి ఒక్కరూ తమ ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకొంటే దేశం పరిశుభ్రంగా ఉండటమే కాదు... వ్యాధులు దరి చేరవు. ఆరోగ్యానికి ఢోకా ఉండదు. ప్రతి చిన్న పనికీ ప్రభుత్వంపై ఆధారపడకుండా... మనమే పరిష్కరించుకోవాలి. అప్పుడే నవభారత్ నిర్మాణం సాధ్యమవుతుంది’ అంటారు మహేష్. తమతో కలిసి సేవ చేయాలనుకొనేవారెవరైనా సరే... ‘నవసేవక్’ ఫేస్‌బుక్ పేజీ ద్వారా సభ్యులు కావచ్చన్నారాయన.
  శ్రీధర్‌రెడ్డి జూబ్లీహిల్స్
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement