సేవా దీపం | Service lamp | Sakshi
Sakshi News home page

సేవా దీపం

Published Sat, Dec 13 2014 12:20 AM | Last Updated on Sat, Sep 2 2017 6:04 PM

సేవా దీపం

సేవా దీపం

వెలుగు , వెలిగించు
 
‘సదా మీ సేవలో..’ అంటూ సాక్షి సిటీప్లస్ ఇచ్చిన పిలుపునకు స్వచ్ఛంద సంస్థల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. సిటీ జీన్స్‌లోనే చారిటీ ఉందంటూ.. నగరం వేదికగా తాము నిర్వహిస్తున్న సామాజిక సేవా కార్యక్రమాల వివరాలను పంపిస్తున్నాయి. ఈ వరుసలో ప్రచురితమవుతున్న పన్నెండవ కథనమిది...
 
తరతరాలు తిన్నా తరగని ఆస్తి ఉన్నా.. పది మందికి అన్నం పెట్టేందుకు చేతులు రాని వారెందరో.. చేసిన దానానికి పదింతలు ప్రచారం చేసుకునే వారూ కోకొల్లలు. తనకున్న దాంట్లో పది మందికీ సాయపడేవారు కొందరే... వారు ప్రతిఫలం ఆశించరు. ఆ కోవలోకే వస్తారు ‘స్నేహదీపం’ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకుడు ఎమ్.నర్సయ్య. వెలుగు.. వెలిగించు ట్యాగ్ లైన్‌తో సేవబాట పట్టిన నర్సయ్య సాయం చేయడం అంటే వేలో.. లక్షలో దానం చేయడం కాదంటారు.‘అనాథ పిల్లలకు హెయిర్ కట్ చేయడం, యాచకులకు వస్త్రాలివ్వడం, నీకున్న పరిచయాలతో పది మందికీ ఆరోగ్య పరీక్షలు చేయించడం ఇవన్నీ గొప్ప సేవలే’ అంటారు. ‘స్నేహదీపం’ ద్వారా ఇవన్నీ
 చేస్తున్నారాయన.
 
నర్సయ్య.. గీజర్లు, ఇన్వర్టర్లు అమ్ముకునే వ్యాపారి. తాను సంపాదించిన దాంట్లో అవసరాలకు పోగా.. పదో పరకో ఇతరులకు వెచ్చిస్తున్నాడు. ఆ సాయం పది మందికీ అందడానికి రెండేళ్ల క్రితం ‘స్నేహదీపం’ స్వచ్ఛంద సంస్థని స్థాపించారు. ‘మొదట్లో ఒంటరి సేవకు సంస్థ ఎందుకు అనుకున్నాను. కానీ అలా చేస్తేనే పదిమందిలో స్పూర్తి నింపగలనని, నాలాంటి నలుగురిని కలుపుకుని పోవచ్చని అనుకుని 2012లో స్నేహదీపం చారిటబుల్ ట్రస్ట్‌ను నెలకొల్పాను. చిన్నప్పటి నుంచి పది మందికీ హెల్ప్ చేయాలని అనుకునేవాణ్ని. చదువు పూర్తయ్యాక వ్యాపారం చేసుకుంటూనే.. నల్లగొండ జిల్లా నూతన్‌కల్ మండలంలోని మా ఊర్లో ఉచితంగా చదువు చెప్పే పాఠశాలను పెట్టాను. ఆర్థిక ఇబ్బందులతో పాఠశాల మూసేశాను. హైదరాబాద్‌కు వచ్చి ఇక్కడ స్థిరపడ్డాక మళ్లీ తోచిన సాయం గురించి ఆలోచించాను. మొదట అనాథ పిల్లలపై దృష్టి పెట్టాను’ అని చెప్పారు నర్సయ్య.
 
హెయిర్‌కట్ సాయం..

నెలలో మొదటి శని, ఆదివారాల్లో.. నర్సయ్య ఇద్దరు క్షురకులను తీసుకుని అనాథ పిల్లల ఆశ్రమానికి బయలుదేరుతారు. అక్కడున్న పిల్లలందరికీ హెయిర్‌కట్ చేయిస్తారు. ‘అనాథ పిల్లలకు వేళకు కటింగ్ కూడా చేయించరు. ఆ పని చేస్తే చాలనుకున్నాను. రెండేళ్లుగా అమ్మ ఫౌండేషన్, జనవికాస సొసైటీ సంస్థలకు చెందిన అనాథ పిల్లల హెయిర్‌కట్ బాధ్యతను తీసుకున్నాను. వీరితో పాటు కొన్ని ప్రభుత్వ బీసీ హాస్టళ్లకు కూడా వెళ్తుంటాను. నేను కూడా హెయిర్ కట్ చేయడం నేర్చుకున్నాను. పిల్లలు కొందరే ఉంటే నేను ఒక్కడ్నే చేస్తాను. నాతో వచ్చిన క్షురకులకు రోజుకి రూ.500 చొప్పున ఇస్తాను. నెలకు ఐదారువేలు ఖర్చు చేస్తుంటాను. ఇదేం పెద్ద మొత్తం కాకపోయినా.. నా పరిధిలో గొప్పగా భావిస్తాను’ అని చెప్పిన నర్సయ్య సేవలకు అనాథ పిల్లలకే కాదు.. ఆయన కంటపడ్డ యాచకులకు కూడా హెయిర్‌కట్ చేసి వస్త్రదానం చేస్తుంటారు.
 
బాలకార్మికుల కోసం...

చెత్త ఏరుకుని బతికే పిల్లలకు కౌన్సెలింగ్ చేసి వారి తల్లిదండ్రులను ఒప్పించి వారిని పాఠశాలలో చేర్పించే ప్రయత్నంలో నర్సయ్య చాలాసార్లు సక్సెస్ అయ్యారు. నిజానికి ఇది చాలా పెద్ద ఛాలెంజ్.  బాలకార్మికులను పాఠశాలలకు పంపేందుకు తల్లిదండ్రులు ఓ పట్టాన ఒప్పుకోరు. డంపింగ్ యార్డ్‌ల దగ్గర కనిపించే పిల్లల మనస్తత్వాన్ని మార్చడం చాలా కష్టం. ఈ పని చేయడానికి చాలా ఓపిక కావాలి. ‘నిజమే.. చెత్త ఏరుకునే పిల్లలు ఎవరినీ లెక్కచేయరు. వారి తల్లిదండ్రులకు కూడా పిల్లల సంపాదనే ముఖ్యం. అలాంటి వారిని ఒక్కరిని మార్చినా చాలా తృప్తి ఉంటుంది. ఈ మధ్యనే ఒకబ్బాయిని ఎల్బీనగర్ ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాను’ అని చెప్పారు నర్సయ్య.
 
హెల్త్ ముఖ్యం...

మురికివాడల్లోని పేదలు ఆరోగ్య జాగ్రత్తలపై శ్రద్ధ చూపరు. వారి కోసం నర్సయ్య అప్పుడప్పుడు హెల్త్‌క్యాంపులు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా పిల్లలకు సంబంధించిన క్యాంపులకే ప్రాధాన్యం ఇస్తూ తన పరిధిలోని కాలనీల్లో ఈ కార్యక్రమాలు చేపడుతున్నారు. దీంతో పాటు తన మనసు చలించే సంఘటనలపై కూడా దృష్టి పెట్టడం ఆయనకు అలవాటు.
 
ఆ మధ్యన సరూర్‌నగర్ సర్కిల్‌లో ఉన్న గాంధీ విగ్రహానికి కుడిచెయ్యి విరిగింది. ఎంతమంది అధికారులకు ఆ సంగతి చెప్పినా ఎవరూ చెవిన పెట్టలేదు. ఇక లాభం లేదని నర్సయ్యే తన సొంతడబ్బులతో గాంధీ విగ్రహానికి కుడిచేయి పెట్టించి, రంగులు వేయించి క్షీరాభిషేకం చేసి దేశభక్తిని చాటుకున్నారు. ఒక బాధ్యతగల పౌరుడికి నిలువెత్తు నిదర్శనంగా కనిపించే నర్సయ్యతో వీలైతే మనం కూడా చేతులు కలుపుదాం.
 
 ప్రజెంటేషన్: భువనేశ్వరి
 bhuvanakalidindi@gmail.com  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement