మేలుకొలుపు | Wake-up call | Sakshi
Sakshi News home page

మేలుకొలుపు

Published Thu, Dec 25 2014 12:00 AM | Last Updated on Sat, Sep 2 2017 6:41 PM

మేలుకొలుపు

మేలుకొలుపు

ముక్కూముఖం తెలియకపోయినా ముంగిటకొచ్చేస్తారు. మనతో మనసారా ముచ్చట్లు పెట్టేస్తారు.వీనుల విందుగా పాడేస్తారు. వెలుగులు నింపాలని మన తరఫున దేవుడ్ని ప్రార్థిస్తారు. ముందుగానే పండుగ కళ తెచ్చేస్తారు. మధురానుభూతిని మిగిల్చి వెళ్లిపోతారు. అర్ధరాత్రిళ్లు వచ్చే అతిథులు వీరు. అను‘రాగాల’ బంధువులు వీరు.
 ..:: ఎస్.సత్యబాబు
 
దేవుడు తనను తల్లిగా స్వీకరించనున్నాడని తెలియగానే మేరీ మాతకు పట్టలేని ఆనందం కలుగుతుంది. దాంతో ఆమె ఆ సంతోషాన్ని తన సోదరితో పంచుకోవడానికి మార్గంగా పాటను ఎంచుకుంది. అయితే అంతకు ముందే ఆమె సోదరి పాటతో ఆమెకు స్వాగతం పలికింది. ఏసుప్రభువు జన్మదిన సంబరాలకు, ఎల్లలెరుగని సంగీతానికి ఉన్న అనుబంధం బైబిల్ కథల్లో అడుగడుగునా ప్రస్ఫుటిస్తుంది. క్రిస్మస్ వచ్చిందంటే ఇళ్లన్నీ ఇంపైన సంగీత నిలయాలవుతాయి. ప్రార్థనా మందిరాలన్నీ పాటల వేదికలవుతాయి. వీటిలో అత్యంత ఆసక్తి కలిగించేవి అర ్ధరాత్రుల్లో సందడి చేసే కేరల్స్.
 
పుట్టుక వెనుక...

తొలుత క్రీస్తు రాక గురించిన సమాచారాన్ని ఏంజెల్స్ ద్వారా తెలుసుకున్న మూగజీవాలు ఆనందంతో వీధుల్లో తిరుగుతూ అందరికీ ఈ విషయాన్ని పాటల రూపంలో తెలియజేశాయట. ఈ కథను ఆధారం చేసుకుని ఆవిర్భవించినవే కేరల్స్ సంబరాలు. క్రిస్మస్ పండుగకు కొన్ని రోజుల ముందుగా (సుమారుగా 5 నుంచి వారం రోజులు) ప్రారంభమై డిసెంబర్ 23 రాత్రితో ఈ కేరల్స్ సందడి ముగుస్తుంది.
 
చీకటిలో వెలుగుపాటలు

సాధారణంగా డిసెంబర్ 15 తర్వాత ప్రారంభమవుతుంది కేరల్స్ సందడి. రాత్రి 9 గంటల ప్రాంతంలో కేరల్స్ గ్రూప్స్ వీధుల్లో సంచరిస్తాయి. ఇళ్లలో మేలుకొలుపు పాటలు అందుకుంటాయి. తెల్లవారుఝామున 5 గంటల వరకూ వీరి సందడి కొనసాగుతుంది. అందుబాటులో ఉండే ఇళ్లను ఎంచుకుని వారికి ముందస్తు సమాచారం ఇచ్చి ఆయా ఇళ్లకు వెళ్తారు. క్రిస్మస్  శుభవార్త చెప్పడం, పాటలు పాడడం, ఆనందాన్ని పంచడం, ఆయా కుటుంబీకుల క్షేమం గురించి ప్రార్థించడం, బైబిల్ ఇచ్చి వెళ్లడం.. ఈ బృందం పనులు. ‘చర్చి మెంబర్స్ ఇళ్లకు మాత్రమే కాక నాన్ చర్చి మెంబర్స్ ఇళ్లకూ వెళ్తుంటాం. ఒకచోట కార్యక్రమం జరుగుతుంటే పొరుగింటివాళ్లు వచ్చి అడుగుతారు. అప్పుడు అక్కడికీ వెళ్తాం’ అని సిటీలోని కేరల్‌గ్రూప్ సభ్యురాలైన అమూల్య షెరాన్ చెప్పారు. ఒక్కో ఇంట్లో అత్యధికంగా 15 నిమిషాలకు మించి గడపరు. రోజులో 10 నుంచి 15 ఇళ్ల వరకూ చుట్టేస్తారు. ఇంగ్లిష్, హిందీ, తెలుగు.. ఇలా పలు భాషల్లో పాటలు పాడతారు.

అందరూ బంధువులే...

అపరిచితుల్ని అను‘రాగ’బందీలుగా మారుస్తూ ఈ కేరల్స్ సంప్రదాయం నగరంలో అద్భుతంగా అల్లుకుపోతోంది. సాధారణంగా పాస్టర్‌ల అనుమతితో చర్చిలకు సంబంధించిన బృందాలు కేరల్స్ గ్రూప్స్‌గా ఏర్పాటవుతాయి. ఈ కార్యక్రమానికి పెరుగుతున్న ఆదరణ కారణంగా కొందరు స్వచ్ఛందంగా బృందాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. పరిచయస్తులు, బంధువులు, మిత్రుల ఇళ్లకు ఒక్కోసారి అపరిచితుల ఇళ్లకు సైతం వెళుతున్నారు. ఈ బృందాల్లో  విద్యార్థులు, వ్యాపారులు, ఐటీ ప్రొఫెషనల్స్.. ఇలా భిన్న రంగాలకు చెందిన వారు సభ్యులుగా మారుతున్నారు.

సింగర్స్, గిటారిస్ట్‌లు, కీబోర్డ్ ప్లేయర్స్, కాంగో ప్లేయర్స్.. ఇలా విభిన్న రకాల వాద్యాలు పలికించగల నేర్పు ఉన్నవారు తమ టాలెంట్ చూపించడానికి ఈ సందర్భం అద్భుతమైన అవకాశంగా మారుతోంది. కుల, మతాలకు అతీతంగా సంగీతాభిమానులను, వినూత్న వేడుకలను ఆస్వాదించే వారిని అమితంగా ఆకట్టుకుంటోంది. వణికించే చలిని సైతం లెక్కచేయకుండా పెద్దసంఖ్యలో కేరల్స్ గ్రూప్‌లలో సభ్యులవుతున్నారు. కొన్నిసార్లు కేరల్ గ్రూప్స్ మెంబర్స్ సంఖ్య ఎక్కువైపోతుండడంతో మినీ బస్సులు సైతం ఏర్పాటు చేసుకోవాల్సి వస్తోంది.
 
ఇతరుల బాగు కోసం
 
మా న్యూలైఫ్ అసెంబ్లీస్ ఆఫ్ గాడ్ చర్చి తరపున కేర్‌సెల్ గ్రూప్స్ అని వ్యవహరిస్తాం. పారడైజ్ కేర్‌సెల్, అల్వాల్ కేర్‌సెల్.. అలా ఇవి లొకేషన్ వైజ్ డివైడ్ అవుతాయి. మా గ్రూప్‌లో 20 మంది ఉన్నాం. నేను 2012 నుంచి కేరల్ గ్రూప్‌తో వెళుతున్నా. చలిలో వెళ్లడం. కొత్త వ్యక్తుల్ని కలవడం, అపరిచితులైనా వారి బాగు కోసం మనస్ఫూర్తిగా ప్రార్థించడం.. ఇవన్నీ గొప్ప ఫీలింగ్‌ని అందిస్తాయి. కొంత మంది టీ, కాఫీ, బిస్కెట్స్ మాతో షేర్ చేసుకుంటారు. మాకు ఒక లీడ్ సింగర్, గిటారిస్ట్ ఐసెక్, ఫిమేల్ ఓకలిస్ట్ మీతీ ఉన్నారు. ప్రీతమ్, నేను కో ఆర్డినేట్ చేస్తాం.

- అమూల్య షెరాన్
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement