సర్కస్ జనాలతో కిక్కిరిసిపోయింది. ఆ ఊళ్ళో అదే మొదటి ఆట.నింగిలో వేలాడే ఉయ్యాలల మీద నాజూకైన అమ్మాయిలు చేస్తున్న విన్యాసాలు, వారిని అనుకరించబోయి విఫలమై అంత ఎత్తునుంచీ కిందకి వలలో పడిపోతున్న మరగుజ్జు హాస్యగాళ్ళు, వారిని చూస్తూ కేరింతలు కొడుతున్న జనం. ఏమీ మారలేదు. జనాల కేరింతలు తనకి ఇప్పటికీ అదే ఉత్సాహాన్ని ఇస్తున్నాయి. ఆ కేరింతలు విని ఎంతకాలం అయ్యిందో! జైల్లో, ఆ నాలుగు గోడల మధ్యన, కేవలం తన ఉఛ్వాసనిశ్వాసలే తప్ప ఈ సందడేది?పరదా పక్కకి జరిపి ఆ జనాలకేసి చూశాడు మణి, అలియాస్ తల్వార్ మణి. అప్పట్లో తన ప్రదర్శన చూడటానికి జనాలు ఎగబడేవాళ్ళు. కేవలం తనవల్లే ఆ సర్కస్ నడిచిందన్నా అతిశయోక్తి కాదేమో! కానీ మునుపటి ఓపిక ఇప్పుడు లేదు. చూపు కూడా మందగించింది. కేవలం చినబాబు అడిగాడనే కాదు, తనMీ ఈ సర్కస్‌తో విడదీయలేని అనుంబంధం ఉంది. తను రూబీని కలిసింది కూడా ఇక్కడే. ఒకటా రెండా పద్నాలుగు సంవత్సరాల అనుబంధం, మరో పద్నాలుగు సంవత్సరాల ఎడబాటు! తన బలమైన కోరికో, లేక దైవేచ్చో మళ్ళీ ఇన్నేళ్ళకి ఇక్కడ అడుగుపెట్టాడు. తాను ఈ స్థితిలో ఉండటానికి కారణం అయిన పెద్దయ్య ఇప్పుడు పక్షవాతం వచ్చి కేవలం కుర్చీకే పరిమితం అయ్యాడని తెలిసినా, చినబాబుని బ్రతిమిలాడి ఆయనముందే మళ్ళీ తన పునరాగమనం జరగాలని, మొదటివరుసలోనే కూర్చొని దగ్గరగా పెద్దయ్య తనని చూడాలని పట్టుబట్టాడు మణి. సరే అనక తప్పలేదు చినబాబుకి. దూరంగా అచేతన స్థితిలో ఉన్న పెద్దయ్య మణిని ఒక కంట కనిపెడుతూనే ఉన్నాడు.
తరువాతి ప్రదర్శన తనదే. సిద్ధమవుతున్నాడు మణి. విసరవలసిన కత్తులు, కంటికి కట్టుకొనే ఆ నల్లగుడ్డ, అన్నింటినీ ఒకసారి తడిమి చూసుకున్నాడు. ఆ కత్తులంటే అతనికి ఎంతో ప్రేమ. వెలుపల నుంచి తన పేరు పిలుస్తున్నారు. ఆ క్షణం రానే వచ్చింది. నోటితో గట్టిగా గాలి తీసి వదిలాడు. పరదా తొలగించుకుంటూ జనాల మధ్యలోకి వచ్చి నిలబడ్డాడు తల్వార్ మణి. చెయ్యెత్తి అందరికీ అభివాదం చేశాడు. జనాలు లేచి మరీ చప్పట్లు కొట్టారు. అదీ అతని స్థాయి. దేశంలోనే అతనిలా కళ్ళకు గంతలు కట్టుకొని మనిషికి తగలకుండా కత్తులు విసరగలిగేవాడు మరొకడు లేడని అప్పట్లో అన్ని వార్తా పత్రికల్లో ఎన్నో కథనాలు వచ్చాయి. జనాలు స్థిమితపడ్డారు. ఎదురుగా సుమారు ఒక యిరవై అడుగుల దూరంలో గుండ్రపు చెక్కకి ఒక అమ్మాయిని తెచ్చి కట్టేశారు. ఎదురుగా అమ్మాయి. ఆమెకి కొంచెం పక్కగా పెద్దయ్య. అదీ మణికి కనిపిస్తున్న దృశ్యం. ఆ అమ్మాయిని అలా చూస్తూ ఉండిపోయాడు మణి. రూబీ గుర్తొచ్చింది. ఇంతలో పక్కన ఉన్న వ్యక్తి, మణి దగ్గరున్న నల్లటి గుడ్డని తీసి అతని కళ్ళకు గట్టిగా బిగించాడు. నిశ్శబ్దం. అందరూ ఊపిరి బిగపట్టి మరీ చూస్తున్నారు, ఏం జరబోతోందో! ఆ ఆసక్తి వారి ముఖాల్లో స్పష్టంగా కనపడుతోంది. ఆ ఆమ్మాయిని కట్టేసిన గుండ్రపు చెక్కని తిప్పాడు పక్కనున్న వ్యక్తి. మణి కత్తి తీశాడు. తిరుగుతున్న ఆ చట్రంతో పాటు అతని బుర్రలో పాత జ్ఞాపకాలు కూడా గిర్రున తిరుగుతున్నాయి. ఎన్నడూ లేనిది తల్వార్ మణì æచెయ్యి మొదటిసారిగా వణికింది.
రూబీ. పేరుకి తగ్గ రూపం. మొదటిసారి తనని చూసినప్పుడే తాను విసిరే కత్తిలా అనిపించింది మణికి. ప్రేమలో పడిపోయాడు. అది ప్రేమో, ఆరాధనో లేక మైకమో తేల్చుకోలేని స్థితి అతనిది. ఆమె కళ్ళను చూస్తూ జీవితాంతం గడిపేయగలననుకున్నాడు. అంతటి కట్టిపడేసే సౌందర్యం ఆమెది. ఇంతలోనే నిరాశ! తాను ప్రేమిస్తే సరిపోతుందా? ఆమె కూడా తిరిగి తనని ప్రేమించద్దూ! ఆశ పడటానికైనా హద్దుండాలని సరిపెట్టుకున్నాడు. తనని ఆమెకి తగ్గ అందగాడిగా ఎందుకు పుట్టించలేదని దేవుణ్ణి నిందించేశాడు కూడా! ‘‘ఇదిగో మణీ! ఈ అమ్మాయి నీతో పనిచేస్తుంది. పేరు రూబీ. నువ్వు రేపటి నుంచి ఈమెతోనే నీ ప్రదర్శనలు చేయాలి’’. ఒక్కసారి సర్కస్ ఫోకస్ లైట్లలాగా వెలిగిపోయింది మణి ముఖం. ఇంకా తాను వరమే కోరలేదు, అప్పుడే దేవత వరమిచ్చేసింది కాబోలు అనుకున్నాడు. చెంపలు వేసుకున్నాడు. తొందరపడి దేవుణ్ణి నిందించేశానే అని బాధపడ్డాడు. ‘‘ఆ అమ్మాయికి ఇదంతా కొత్త. నువ్వే దగ్గరుండి అన్నీ చూసుకోవాలి’’ అంటున్న సర్కస్ ఇంచార్జ్, మణి కంటికి అప్పగింతలు చేస్తున్న మామగారిలాగా కనబడ్డాడు. బయటపడలేని సంబరంతో లోపల ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నాడు మణి.
కాలం గడుస్తోంది. రూబీపైన విపరీతమైన ప్రేమని పెంచేసుకున్నాడు మణి. ఎంతగా అంటే, తాను రోజూ విసిరేవి కత్తులు కాదు, తన ప్రేమ రాయబారాన్ని మోసుకు వెళ్ళే బాణాలు అనుకునే వరకూ చేరింది అతని వైఖరి. కానీ అతను విసిరే కత్తుల్లాగే ఆ బాణాలు కూడా ఆమెకి అస్సలు తగల్లేదు. చాలాసార్లు రూబీ మణికి నచ్చజెప్పింది. ఒకరోజు కుండ బద్దలు కొట్టేసింది, తనకి అలాంటి ఉద్దేశం ఏమీ లేదని, లేనిపోని ఆశలు పెట్టుకోవద్దని. మణి ముఖం మీదే చెప్పేసింది. తన ప్రపంచం ఒక్కసారి తల్లకిందులైపోయినట్టు అనిపించింది మణికి. తట్టుకోలేకపోయాడు. అర్ధరాత్రి గడిచింది. రూబీ ఉండే గదివైపు తడబడుతూ అడుగులు వేస్తున్నాడు మణి. చేతిలో కల్లుసీసా. తనని తాను నిగ్రహించుకునే స్థితిలో లేడు. పెద్దగా అరుస్తూ రూబీని నిద్రలేపాడు. ఆ గొడవకి మిగతావాళ్ళు కూడా నిద్రలేచారు. పెద్ద రభసే అయ్యింది. తనని పెళ్ళి చేసుకోకుంటే æచంపేస్తా అంటూ ఊగిపోతూ చేతిలో సీసాని పగలగొట్టి రూబీ మీదకి వెళ్ళబోయాడు మణి. చుట్టూ ఉన్నవాళ్ళు వచ్చి ఆపారు. రూబీ, మణికి దగ్గరగా వెళ్ళి గట్టిగా అతని చెంప పగలగొట్టింది. ఆ ఊపుకి వెళ్ళి పక్కన పడిపోయాడు. అందరూ అక్కడనుంచి వెళ్ళిపోయారు. రూబీ మాత్రం మళ్ళీ మణికి దగ్గరగా వెళ్ళింది. అతడి తల నిమిరింది. ఏదో గిలిగింత కలిగినట్టు ఆ మత్తులోనే నవ్వేసాడు మణి. ఆ స్పర్శ బహుశా అతని మనసుని తాకింది కాబోలు! రూబీ... రూబీ... అంటూ కలవరిస్తున్నాడు. రూబీకి కూడా మణి అంటే ఇష్టమే. కాకపోతే ఈ జీవితం రూబీకి నచ్చలేదు. ఏవో కుటుంబ పరిస్థితుల వల్ల ఇక్కడకి రావల్సి వచ్చిందేకానీ మనస్ఫూర్తిగా ఇష్టపడి మాత్రం కాదు. కానీ మణి పరిస్థితి అది కాదు. ఈ సర్కస్ అతని జీవితం. అతనికి ఇక్కడ మంచి భవిషత్తు కూడా ఉంది. తనవల్ల మణి జీవితం మారిపోవటం, అతను ఇష్టపడ్డ ప్రపంచాన్ని తనకోసం మార్చుకోవటం రెండూ రూబీకి ఇష్టంలేదు. అందుకే అతని ప్రేమకి దూరం అవ్వాలని అనుకుంది.
అర్ధరాత్రి దాటింతర్వాత. ఏదో పెనుగులాట. ఏదోఅలజడి. బలవంతంగా మత్తునుంచి బయటపడటానికి ప్రయత్నం చేస్తున్నాడు మణి. తన వల్ల కావటం లేదు. ఐనా ప్రయత్నిస్తున్నాడు. మసకమసగ్గా కళ్ళముందు ఆడుతున్న ఆ దృశ్యాల్లో ఎవరో ఒక అమ్మాయి. ఒక మగమనిషి. ఆ అమ్మాయి అరవటానికి ప్రయత్నిస్తోంది. కానీ ఆ మగ మృగం కిరాతకంగా ఆమెని లోబరచుకోవాలని ప్రయత్నం చేస్తోంది.బలం మొత్తం కూడగట్టుకొని లేచి నిలబడ్డాడు.‘‘ఎవరదీ! ఏయ్ వదులు’’ అంటూ ఆ మనిషి చొక్కా పట్టుకున్నాడు. అంత దగ్గరగా ఆ ముఖాన్ని చూసి ఖంగుతిన్నాడు. ఎదురుగా ఉన్న ఆ మనిషి టపీమని తలపై గట్టిగా రాయితో మోదడంతో అక్కడే స్పృహ కోల్పోయాడు మణి.పొద్దున్నే ఎవరో బూటుకాలితో గట్టిగా తంతుంటే మెలకువ వచ్చింది మణికి. ఎదురుగా ఉన్న రక్తపు మడుగులోంచి సూర్యోదయమయ్యింది అతనికి. ఒక్కసారి మబ్బులు విడిపోయాయి. అది రూబీ శవం. పొత్తికడుపులో పగలగొట్టిన గాజు సీసా గుచ్చుకొని ఉంది.‘‘ఏరా, అమ్మాయి ప్రేమించకపోతే పాడుచేసి ప్రాణాలు తీసేస్తార్రా మీరు...’’ అంటూ తంతున్నాడు కానిస్టేబుల్. మణికి ఏమీ అర్థంకాలేదు. ‘‘వీడిని ఇక్కడనుంచి తీసుకుపోండి సార్!
వీడిలాంటి వాళ్ళుంటే మా సర్కస్‌కే చెడ్డపేరు’’ అంటున్న పెద్దయ్య వైపు కోపంగా చూశాడు మణి. కానీ పెద్దయ్య మాత్రం మణి కళ్ళలోకి చూడలేకపోయాడు. అది ఎందుకో మణికి మాత్రమే తెలుసు. ‘‘నడవరా స్టేషన్కి’’ అంటూ మెడ పట్టుకొని తీసుకెళ్ళారు పోలీసులు. అలా వెళుతూ కూడా వెనక్కి తిరిగి మరీ పెద్దయ్యవైపే చూశాడు మణి. ‘‘వెళ్ళొస్తా పెద్దయ్యా’’ అన్నాడు. పెద్దయ్యకి మణి కళ్ళలోకి చూసే ధైర్యం రాలేదు. బహుశా ఇంకెప్పటికీ రాదేమో!జైల్లో ఎవ్వరితో పెద్దగా మాట్లాడేవాడు కాదు మణి. ఎక్కువగా ఒంటరితనాన్నే ఇష్టపడేవాడు. మధ్యమధ్యలో వెక్కివెక్కి ఏడుస్తూ ఉండేవాడు. ఆ జైల్లో కూడా మణికి అభిమానులు లేకపోలేదు. వారి సహాయంతో ఒక చిన్న గడ్డి బొమ్మని, కొన్ని డమ్మీ చాకులని సమకూర్చుకొని గంటలు తరబడి సాధన చేసేవాడు. ఇదీ క్లుప్తంగా మణి జైలు జీవితం. మణి జైలునుంచి విడుదలయ్యాక ఆ గడ్డిబొమ్మని బయటపారేస్తూ కానిస్టేబుల్ గమనించిన ఒక వింత విషయం ఏంటంటే ఇన్నాళ్ళూ మనిషికి తగలకుండా కత్తులు వేయటంలో నేర్పరి అయిన మణి, ఇప్పుడు మాత్రం ఒకేచోట గురి తప్పకుండా ఆ గడ్డిబొమ్మ గుండెల్లోకే చాకుని విసరగలగటం. చిద్రమైపోయిన హృదయంతో ఉన్న ఆ బొమ్మ, బహుశా రూబీని మరిచిపోలేని మణికి ప్రతిరూపమేమో అనుకున్నాడు.‘మణి... మణి...మణి...’ అంటూ ప్రేక్షకులు కొడుతున్న కేరింతలతో మళ్ళీ ఈ ప్రపంచంలోకి వచ్చాడు. వణుకుతున్న చేతినుంచి బాణంలాగా దూసుకువెళ్ళింది కత్తి. ఎప్పటిలాగే ఈసారి కూడా అది గురి తప్పలేదు. జైల్లో రూబీనే తలచుకుంటూ, ఆ గడ్డిబొమ్మలో పెద్దయ్యనే చూస్తూ మణి చేసిన సాధన మొత్తానికి ఫలించింది. ప్రేక్షకుల దృష్టిలో అతని గురి తప్పినప్పటికీ, మణì æలక్ష్యం మాత్రం నెరవేరింది.
- యేటూరి రోహణ్
గురి
Published Sun, Jul 8 2018 12:39 AM | Last Updated on Sun, Jul 8 2018 12:39 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment