కూతురిపై తండ్రి అఘాయిత్యం
సిగ్గుచేటు! గర్భం దాల్చిన బాలిక
ఇంట్లోనే పురుడు పోసి రక్తపు మడుగులోనే బంధించిన కామాంధుడు
అధికారుల జోక్యంతో బాధితురాలికి విముక్తి
ఆస్పత్రిలో కోలుకుంటున్న తల్లీబిడ్డ
మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు.. మచ్చుకైనా లేడు చూడూ మానవత్వం ఉన్నవాడు... యాడ ఉన్నాడో కాని
కంటికి కానరాడు! అన్న కవి మాటలు అక్షర సత్యాలయ్యాయి. మానవత్వం మరిచిన కిరాతక తండ్రి తన పదహారేళ్ల కుమార్తెపై నిరంతర అత్యాచారం సాగించాడు. ఈ విషయాన్ని బయట పెట్టకుండా ఆమెను గదిలో నిర్బంధించాడు. చివరకు బాలిక గర్భం దాల్చింది.
నెలలు నిండాయి. ఆస్పత్రికి తీసుకెళితే గుట్టురట్టు అయితే తన ఉనికికే ప్రమాదమని భావించి మానవత్వాన్ని మంటగలిపాడు. పురిటినొప్పులతో బాధపడుతున్న బాలికకు తానే పురుడు పోశాడు. తర్వాత ఏమి చేయాలో అర్థం కాక నెత్తుటి మడుగులో నిర్ధాక్షిణ్యంగా వదిలి ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయాడు. సమాజం సిగ్గుతో తలదించుకునేలా చేసిన ఆ కామాంధుడు చివరకు ఊచలు లెక్కిస్తున్నాడు.
శివమొగ్గ : కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ తండ్రి తన 16ఏళ్ల కూతురిపై అత్యాచారానికి పాల్పడుతున్న ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. కర్ణాటక శివమొగ్గ పోలీసుల సమాచారం మేరకు... కార్కలకు చెందిన కెంప(45)కి వివాహమై ముగ్గురు పిల్లలు ఉన్నారు. అతని ప్రవర్తన సక్రమంగా లేకపోవడంతో కొన్ని సంవత్సరాల క్రితమే ఇద్దరు బిడ్డలను తీసుకుని భార్య విడిపోయింది. ఓ కుమార్తెతో పాటు కెంప శివమొగ్గ తాలూకాలోని కాచినకొప్ప సమీపంలో ఉన్న మండఘట్ట గ్రామ శివారులో నివాసం ఉంటున్నాడు. అక్కడే గొర్రెల పెంపక కేంద్రంలో కూలీగా చేరాడు. ఇంటిలో ఒంటరిగా ఉంటున్న కుమార్తె(16)పై కొన్ని సంవత్సరాలుగా కెంప అత్యాచారం చేస్తూ వచ్చాడు. ఈ విషయాన్ని బయట పెడితే హతమారుస్తానని బెదిరించడంతో పాటు ఆమెను ఇంటిలో బంధించాడు.
తన జరుగుతున్న దౌర్జన్యాన్ని ఆమె కన్నీట మధ్యనే దాచుకుంది. ఈ నేపథ్యంలోనే ఆమె గర్భం దాల్చిటంతో నెలలు నిండాయి. శనివారం సాయంత్రం పురిటి నొప్పులు మొదలయ్యాయి. ఆస్పత్రికి తీసుకెళితే గుట్టురట్టు అవుతుందని భావించిన కెంప ఆఖరుకు ఇంటిలోనే కుమార్తెకు పురుడు పోశాడు. తర్వాత ఏమి చేయాలో అర్థంకాక రక్తం మడుగులోనే తల్లీబిడ్డను వదిలేశాడు. జనావాసాలకు దూరంగా వీరుంటున్న ఇల్లు ఉండడంతో ఈ విషయం ఎవరికీ తెలియలేదు. కాగా బుధవారం ఉదయం అటుగా కూలీ పనులకు వెళ్లిన మహిళలకు బాలిక ఏడుపు వినిపించడంతో వెళ్లి చూశారు. నెత్తుటి మడుగులో అత్యంత దయనీయంగా పడి ఉన్న తల్లీబిడ్డను చూసి వెంటనే గ్రామస్తుల సాయంతో పోలీసులకు తెలిపారు.
ఘటనాస్థలికి కోటె పోలీస్ స్టేషన్ సీఐ దీపక్ హెగ్డే, మహిళా పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ అనితాకుమారి చేరుకుని పరిశీలించారు. బాధితురాలి నుంచి విషయం తెలుసుకుని అక్కడే ఉన్న కెంపను వెంటనే అదుపులోకి తీసుకున్నారు. అనంతరం బాధితురాలని చిన్నారితో సహా శివమొగ్గలోని మెగ్గాన్ ఆస్పత్రికి ఆఘమేఘాలపై తరలించారు. సమాచారం అందుకున్న స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. బాలిక కోలుకున్న తర్వాత శిశు సంక్షేమ శాఖ కేంద్రానికి తీసుకెళ్లనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఆస్పత్రిలో తల్లీబిడ్డ కోలుకుంటున్నట్లు వైద్యులు తెలిపారు.