మెహిదీపట్నం,న్యూస్‌లైన్: త్వరలో ఏర్పాటు కానున్న తెలంగాణ రాష్ట్రంలో నియోజకవర్గానికో పాలిటెక్నిక్ కళాశాలను ఏర్పాటు చేసేందుకు యత్నిస్తానని సాంకేతిక విద్యాశాఖమంత్రి, ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ హామీఇచ్చారు. పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రాథమిక సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు.
తెలంగాణ గెజిటెడ్ పాలిటెక్నిక్ అధ్యాపకుల సంఘం ప్రధమ సర్వసభ్య సమావేశం శని వారం మాసబ్‌ట్యాంక్ జేఎన్‌ఏఎఫ్‌ఏయూ ఆర్కిటెక్చర్ కళాశాలలో జరిగింది. ముఖ్యఅతిథిగా విచ్చేసిన డిప్యూటీ సీఎం మాట్లాడుతూ తెలంగాణలో సాంకేతికవిద్య అభ్యున్నతికి తనవంతు కృషి చేస్తానని ప్రకటించారు. తెలంగాణ జిల్లాల్లో యేటా 2.35 లక్షలమంది విద్యార్థులు పదోతరగతిలో ఉత్తీర్ణత సాధిస్తుంటే కేవలం 45వేల పాలిటెక్నిక్ డిప్లొమా సీట్ల్లే ఉండడంతో ఆసక్తి ఉన్న ఎందరో విద్యార్థులు పాలిటెక్నిక్ కోర్సులను అభ్యసించలేకపోతున్నారని పాలిటెక్నిక్ అధ్యాపకుల సంఘం ప్రతినిధుల ఉప ముఖ్యమంత్రి రాజనర్సింహ దృష్టికి తీసుకెళ్లారు.
ఈ సందర్భంగా తెలంగాణ ప్రకటన రావడంలో విశేష చొరవ చూపించారంటూ రాజనర్సింహను నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. ఈ సర్వసభ్య సమావేశానికి తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొ.కోదండరాం, తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్‌లు కూడా విచ్చేసి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ గెజిటెడ్ పాలిటెక్నిక్ అధ్యా పకుల సంఘం అధ్యక్షుడు వై.నర్సయ్యగౌడ్, ప్రధానకార్యదర్శి మురళీధర్‌గుప్తా, అసోసియేట్ అధ్యక్షుడు చక్రవర్తి,కోశాధికారి బి.రాజాలతో పాటు తెలంగాణజిల్లాల్లోని 45 ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల అధ్యాపకులు,సిబ్బంది పాల్గొన్నారు.
నియోజకవర్గానికో పాలిటెక్నిక్ కళాశాల: దామోదర రాజనర్సింహ
Published Sun, Sep 15 2013 2:59 AM | Last Updated on Thu, Sep 27 2018 8:33 PM
Advertisement
Advertisement