
పైది బేగంపేట కార్యాలయం, కిందది కుందన్‌బాగ్ కార్యాలయం
ఎన్నికలైపోయాయి. ఓడిపోయినవారికి ఏదీలేదు. గెలిచినవారికి ముహూర్తాలు, వాస్తు గొడవ పట్టుకుంది. ఇది ప్రధాన సమస్యగా మారింది. ప్రజా సమస్యలకంటే దీనిని ముందు పరిష్కరించవలసిన పరిస్థితి ఏర్పడింది. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల దగ్గర నుంచి మంత్రులకు, ఉన్నతాధికారులకు వాస్తు అనేది ప్రధాన సమస్యగా మారింది. ముహూర్తాలు, వాస్తంటే తెలుసుగా తిధులు, నక్షత్రాలు, గ్రహాలు, దిక్కులు, ఏది ఏ మూల ఉండాలి? ఏది ఎక్కడ ఉండాలి? ఎటువైపు నడవాలి? .....ఇలా అనేకం ఉంటాయి. వాటిమీద నమ్మకం ఉన్నవారికి ఏ పని చేయాలన్నా ఇవన్నీ కలసిరావాలి.
ఆషాఢ మాసంలోగా బేగంపేటలోని క్యాంప్ ఆఫీసుకు మారడంతో పాటు, మంత్రి వర్గాన్ని విస్తరించాలన్న ఆలోచనలో తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు ఉన్నారు. క్యాంప్ ఆఫీసులో వెనక భాగాన్ని మాత్రమే వాడుకోవాలని కెసిఆర్ నిర్ణయించారు. ఈనెల 22లోగా కెసిఆర్ క్యాంప్ ఆఫీసుకు మారే అవకాశం ఉంది. అలాగే, 25వ తేదీలోగా మంత్రివర్గ విస్తరణ జరుగుతుందని సమాచారం.
ముహూర్తాలు, వాస్తుపై గట్టి నమ్మకం ఉన్న తెలంగాణ సిఎం కెసిఆర్ బేగంపేట క్యాంప్ ఆఫీసుకు మారడంపై టైమ్‌ను దాదాపు ఖరారు చేసుకున్నారు. ఆ క్యాంప్ ఆఫీసు ముందు భాగంలో వాస్తు దోషాలున్నాయని భావిస్తున్నారు. కేవలం వెనక భాగాన్ని మాత్రమే వాడుకోవాలని నిర్ణయించారు. కుందన్‌బాగ్‌లో ఎంపిక చేసిన క్వార్టర్ల మరమ్మతు పనులకు కనీసం మూడు, నాలుగు నెలల సమయం పడుతుందని అంచనా. అంతే కాకుండా ఆ ప్రదేశం ఇరుగ్గా ఉందని భావించి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈనెల 22లోగా కెసిఆర్ బేగంపేట క్యాంప్ ఆఫీసుకు మారనున్నారు.
మరో ముఖ్య విషయం ఏమిటంటే సచివాలయంలో తెలంగాణ సీఎం కాన్వాయ్ రూట్ మార్పుకు నిర్ణయం తీసుకున్నారు. సీఎం కార్యాలయం ఉన్న సి బ్లాక్‌కు వెళ్ళే దారి మార్పు చేయనున్నారు. వాస్తుప్రకారం కేసీఆర్ సూచించిన విధంగా కాన్వాయ్ రూటు మార్పు చేస్తారు. కెసిఆర్ చెప్పిన ప్రకారం అధికారులు ప్రతిపాదనను సిద్ధం చేశారు. ఇంటెలిజెన్స్, పోలీసుశాఖ ఉన్నతాధికారులు కాన్వాయ్ రూట్‌ను పరిశీలించారు.
మరోవైపు ఈనెల 26న ఆషాఢ మాసం రానుండడంతో ఆలోగానే మంత్రివర్గాన్ని విస్తరించాలని కెసిఆర్ భావిస్తున్నారు. ఈసారి ఆరుగురికి మంత్రివర్గంలో చోటు లభించనుందని సమాచారం. మహబూబ్‌నగర్ జిల్లా నుంచి లక్ష్మారెడ్డి, జూపల్లి కృష్ణారావుతో పాటు, కరీంనగర్ జిల్లాకు చెందిన కొప్పుల ఈశ్వర్‌కు బెర్త్‌లు దాదాపు ఖాయమయ్యాయి. మరో ముగ్గురు మంత్రుల ఎంపికై వచ్చే వారం సీనియర్ నేతలతో కెసిఆర్ చర్చిస్తారని తెలుస్తోంది.