‘కోరుకున్న రంగంలో రాణించాలంటే మనలో ఒక తపన ఉండాలి. ఒక తపస్సులా ఆ రంగాన్ని స్వీకరించాలి. ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఎదుర్కోడానికి సిద్ధంగా ఉండాలి’ అంటారు
ఐదు పదుల వయసు దాటిన విపుల్ వర్షిణే. లక్నోవాసి అయిన విపుల్ వర్షిణే ముప్పైఏళ్లుగా ఆర్కిటెక్చర్ రంగంలో తనదైన ముద్ర వేస్తూ, గుర్తింపు పొందారు.
ఒక్కరూ తన మాట వినడం లేదు అనే నిరాశ నుంచి రెండు విమానాశ్రయాల రూపకల్పన చేసేంత స్థాయికి ఎదిగారు. విపుల్ వర్షిణే తనను తాను శక్తిగా మలుచుకున్న విధానం నేటి మహిళలకు స్ఫూర్తిని కలిగిస్తుంది.
‘నా పేరు విపుల్ అనే ఉండటంతో మగ ఆర్కిటెక్ట్ అనుకుని, సంప్రదించేవారు. నేను మహిళను అని తెలిసి వర్క్ ఇవ్వడానికి వెనకడుగు వేసేవారు. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో కొంతమార్పు చూస్తున్నాను కానీ, 30 ఏళ్ల క్రితం నేను ఆర్కిటెక్ట్ అని చెబితే చాలామంది ఆశ్చర్యపోయేవారు. ఇప్పుడు నేను రెండు విమానాశ్రయాలను డిజైన్ చేసే స్థాయికి ఎదిగాక ఈ రంగంలో అమ్మాయిలూ రాణించగలరు అనే స్పష్టత వచ్చింది. ఈ విషయాన్ని నిరూపించడానికి నేను చేసిన ప్రయత్నం ఆషామాషీ కాదు.
సృజనతో అడుగు
పుట్టి, పెరిగింది లక్నోలో. స్కూల్ ఏజ్ నుంచి పెయిం టింగ్స్ వేయడం, కార్టూన్స్ గీయడం వంటివి చూసి వాటిని పత్రికలకు పంపించే వారు నాన్న. మొదట నేను మెడిసిన్ చదవాలని కోరుకున్న మా నాన్న నాలోని సృజనాత్మకత చూసి ఆర్కిటెక్ట్ ఇంజినీరింగ్ చేయమని సలహా ఇచ్చారు. ఎందుకంటే ఆర్కిటెక్చర్ సైన్స్, సృజనాత్మకతల సమ్మేళనంగా ఉంటుంది. మా నాన్న మనసులో నేను గవర్నమెంట్ ఉద్యోగం చేయాలని, అది నాకు సురక్షితమైనదని భావించేవారు. నేను ఎంచుకున్న రంగం చాలా శ్రమతో కూడుకున్నదని ఆయనకు తెలియదు. అప్పట్లో కంప్యూటర్లు లేవు కాబట్టి రాత్రంతా డ్రాయింగ్ బోర్డ్ పైనే పని చేయాల్సి వచ్చేది.
ఎవరూ సీరియస్‌గా తీసుకోలేదు..
’’నేను ఆర్కిటెక్చరల్ ఇంజినీరింగ్ చదువుతున్నప్పుడు మా క్లాస్‌లో ముగ్గురం మాత్రమే అమ్మాయిలం. ఈ వృత్తిలో అబ్బాయిలదే అధిపత్యమని అప్పుడు అర్థమైంది. కాలేజీలో చదివే సమయంలోనే పెళ్లి అయ్యింది. మావారు సివిల్ ఇంజనీర్ కాబట్టి పెళ్లయ్యాక ఆయనతోనే కెరీర్‌ప్రారంభించాను. భవనాలు కట్టే లొకేషన్‌కు వెళ్లేటప్పుడు నాతో మాట్లాడేందుకు కూలీలు తడబడేవారు. మేస్త్రీలు నా మాటలను అస్సలు పట్టించుకునేవారు కాదు. ఒక మహిళ యజమానిగా మారడం వారెవరికీ ఇష్టం ఉండదని అప్పుడు అర్ధమైంది.
అసలు నన్ను వారు నిర్మాణశిల్పిగా అంగీకరించలేదు. నిరాశగా అనిపించేది. కానీ, నా డిజైన్ ప్రకారమే పనిచేయాల్సి ఉంటుందని నా నిర్ణయాన్ని సున్నితంగానూ, అంతే కచ్చితంగానూ తెలియజేశాను. అక్కడ నుంచి ఆర్కిటెక్ట్‌గా ఎదగడానికి నన్ను నేను మార్చుకుంటూ వెళ్లాల్సి వచ్చింది. ఆఫీస్‌లో నాకు, నా భర్తకు విడివిడిగా క్యాబిన్లు ఉండేవి. క్లయింట్స్ వచ్చినప్పుడల్లా నా సలహా తీసుకోవాలని నా భర్త తరచూ వారికి చె΄్పాల్సి వచ్చేది. తీసుకున్నప్రాజెక్ట్ పూర్తి చేయడం పట్ల పూర్తి శ్రద్ధ పెట్టేదాన్ని. కానీ వచ్చిన వాళ్లు మాత్రం ‘మిస్టర్ విపుల్ వర్షిణే ఎప్పుడు వస్తారు’ అని అడిగేవారు. నేనే విపుల్ అని, ఆర్కిటెక్ట్ అని తెలిసి ఆశ్చర్యపోయేవారు.
200 భవనాల జాబితా
భవన నిర్మాణంలో నా వర్క్‌ని కొనసాగిస్తూనే లక్నోలోని చారిత్రక కట్టడాలపై, వాటి పరిరక్షణ గురించిప్రాజెక్ట్ వర్క్ చేశాను. అక్కడి వారసత్వ కట్టడాల పట్ల ఎలాంటి జాగ్రత్తలూ తీసుకోవడం లేదని తెలుసుకొని దాదాపు 200 భవనాల జాబితాను తయారు చేశాను. ఆ జాబితాను పురావస్తు శాఖకు అప్పగించాను. ఆ సమయంలోనే 500 పేజీల ఆప్రాజెక్ట్ వర్క్‌ని పుస్తకంగా తీసుకువస్తే ప్రయోజనకరంగా ఉంటుందన్న సన్నిహితుల సలహాతో బుక్‌గా తీసుకువచ్చాను. అలా రచనా ప్రపంచంలోకి అడుగుపెట్టాను. ఇప్పటి వరకు మన దేశ వారసత్వ సంపదపైన ముఖ్యంగా లక్నో సంస్కృతి, వారసత్వ నగరం, చరిత్ర ద్వారా నడక, మ్యూజింగ్స్ ఇన్ బెనారస్, ఎ కెలిడోస్కోప్ ఆఫ్ ది హార్ట్, లక్నో ఎ ట్రెజర్ పేర్లతో 5 పుస్తకాలు ప్రచురిత మయ్యాయి. ఇటేవలే అయోధ్యకు సంబంధించి ఎ వాక్ త్రూ ది లివింగ్ హెరిటేజ్ ప్రచురితమైంది.
‘షామ్ ఎ అవద్ పుస్తకంలో లక్నో సంస్కృతిపై స్కెచ్‌లు కూడా వేశాను. లక్నోలోని చికంకారీ ఎంబ్రాయిడరీ, ఈ నగరంలోని వీధులు, మార్కెట్ల గురించి ప్రస్తావించాను. లక్నో ఇన్‌టాక్‌కి కన్వీనర్‌గా ఉన్నాను.
లేహ్ విమానాశ్రయం .. ఓ సవాల్!
2018లో లేహ్ ఎయిర్‌పోర్ట్ డిజైన్ చేసే అవకాశం వచ్చింది. ఈప్రాజెక్ట్ నాకు అత్యంత సవాల్‌గా ఉండేది. ఎందుకంటే అక్కడ భూమి, పర్యావరణం చాలా భిన్నంగా ఉంటాయి. పర్వతాల కారణంగా భూభాగం చాలా తేడాగా ఉంటుంది. విమానాశ్రయం అరైవల్, డిపార్చర్ లాంజ్‌ల మధ్య 3 అంతస్తుల వ్యత్యాసం ఉంది. అక్కడ లగేజీ బెల్ట్ రివర్స్ చేయాల్సి వచ్చింది. ఉష్ణోగ్రత చాలా తక్కువ కాబట్టి, ఎయిర్ కండీషనర్లలో ఉపయోగించే ద్రవం ఘనీభవన స్థానం కంటే తక్కువగా ఉంది. అలాంటప్పుడు ప్రత్యేక రసాయనాలను ఉపయోగించి, దానిని ఏర్పాటు చేశాను.
లేహ్‌లో అనేక బౌద్ధ విహారాలు ఉన్నాయి. ప్రవేశం ద్వారం వద్ద 30 అడుగుల ఎత్తైన బుద్ధుని విగ్రహాన్ని ఉంచాను. అక్కడి స్థానిక సంస్కృతి, కళ, హస్తకళలను దృష్టిలో ఉంచుకుని రంగు రంగుల వలలు,ప్రార్థన చక్రాలను ఏర్పాటు చేయించాను. అయోధ్య విమానాశ్రయం పనిప్రారంభించినప్పుడు అక్కడ మహంతులు, సాధువులను కలుస్తూ ఉండేదాన్ని. ఎందుకంటే అక్కడి నిర్మాణాన్ని బాగా అర్థం చేసుకోవాలి, సరైన సమాచారం కోసం చాలా పుస్తకాలు చదివాను. వివిధ వృత్తులలో ఉన్న వ్యక్తులతో మాట్లాడాను. దీంతో అయోధ్యపై నాకు ఆసక్తి పెరుగుతూ వచ్చింది. ఆ తర్వాత దానినే పుస్తకంగా తీసుకు వచ్చాను.
ఒక సృజనాత్మక వ్యాపకం నన్నూ నా దిశను మార్చింది. సవాల్‌గా ఉన్న రంగంలో సమున్నతంగా నిలబడేలా చేసింది. ఏ రంగం ఎంచుకున్నా అందులో మనదైన ముద్ర తప్పక వేయాలి. అప్పుడే, ఎక్కడ ఉన్నా సరైన గుర్తింపు లభిస్తుంది’ అని వివరిస్తారు విపుల్ వర్షిణే.
Comments
Please login to add a commentAdd a comment