womens position
-
Rahul Gandhi: మహిళలంటే చిన్నచూపు!
న్యూఢిల్లీ: మహిళలను బీజేపీ రెండో శ్రేణి పౌరులుగానే చూస్తోందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. నార్త్ వెస్ట్ ఢిల్లీ పార్టీ అభ్యర్థి ఉదిత్ రాజ్ తరఫున గురువారం ఢిల్లీలోని మంగోల్‌పురిలో మహిళలు మాత్రమే పాల్గొన్న ఎన్నికల ప్రచార కార్యక్రమంలో రాహుల్ ప్రసంగించారు. ‘‘ఎంతో ఆర్భాటంగా ఇప్పుడే మహిళాలోకం కలలు సాకారం చేస్తున్నట్లు పార్లమెంట్లో నారీశక్తి వందన్ అధినయమ్(మహిళా రిజర్వేషన్ బిల్లు) ప్రవేశపెట్టారు. ఆ చట్టం ఇప్పుడు కాదు ఏకంగా పదేళ్ల తర్వాత అమలుచేస్తామని తీరిగ్గా చెప్పారు. ఈ నిర్ణయం వెనుక ఒక సిద్దాంతముంది. అదే ఆర్ఎస్ఎస్. బీజేపీ సైద్ధాంతిక మాతృసంస్థ ఆర్ఎస్ఎస్ అయితే ఏకంగా మహిళలను కనీసం ‘శాఖ’లోకి అడుగుపెట్టనివ్వడంలేదు. మహిళలను రెండో తరగతి పౌరులుగా భావించాలని ఆర్ఎస్ఎస్ నరనరాల్లో నాటుకుపోయింది’ అని విమర్శలు గుప్పించారు. వర్కింగ్ ఉమెన్ పనికి గుర్తింపు దక్కట్లేదు ‘‘భారత్‌లో ప్రతీ రంగం గురించి మాట్లాడతాంగానీ వర్కింగ్ ఉమెన్ ఇంట్లోనూ చేసే శ్రమకు ఎక్కడా గుర్తింపు దక్కట్లేదు. రోజంగా ఆఫీస్/కార్యస్థలంలో పనిచేసి అలసిపోయిన మహిళలు ఇంటికొచ్చాక మళ్లీ రెండో షిప్ట్ మొదలెడతారు. పిల్లల ఆలనాపాలనా చూసుకుని ఇంటి పనులన్నీ చేస్తారు. ఈ పనికి వాళ్లకు ఎలాంటి చెల్లింపులు ఉండవు. పురుషులు రోజుకు 8 గంటలు పనిచేస్తే మహిళలు 16 గంటలపైనే పనిచేస్తారు. వారి శ్రమకు ప్రతిఫలంగా ఏమీ దక్కట్లేదు. ఇది ఒక రకంగా చెల్లింపులులేని గుర్తింపులేని పని. మేం అధికారంలోకి వస్తే మహాలక్ష్మీ యోజన ద్వారా పేద మహిళలకు నెలకు రూ.8,500 చొప్పున ఏటా రూ.1 లక్ష వారి ఖాతాలో జమచేస్తాం’’ అని రాహుల్ అన్నారు. మే 25నాటి పోలింగ్‌కు ప్రచారం గురువారంతో ముగుస్తుండటంతో ఢిల్లీ మెట్రోలోనూ రాహుల్ ప్రయాణించారు. ‘‘నార్త్ ఈస్ట్ ఢిల్లీ కాంగ్రెస్ అభ్యర్థి కన్హయ్య కుమార్ తరఫున సైతం రాహుల్ దిల్షాద్ గార్డెన్ ప్రాంతంలో ప్రచారంలో పాల్గొన్నారు. ఏపీ భవన్లో మధ్యాహ్న భోజనం ఎన్నికల ప్రచారంలో అలసిపోయిన రాహుల్ మధ్యాహ్నం భోజనం చేసేందుకు ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్/తెలంగాణ భవన్‌కు వచ్చారు. మధ్యాహ్నం 2.30 గంటల ప్రాంతంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌సహా దాదాపు 10 మందితో కలిసి రాహుల్ భోజనం చేశారు. రాహుల్ పూరీలు, చపాతీలు, కోడికూర వేపుడు, రొయ్యల వేపుడు ఆర్డర్ ఇచ్చారు. తొలుత పూరీ/చపాతీని పప్పుతో కలిపి తిన్నారు. తర్వాత చికెన్ ఫ్రై, రొయ్యల ఫ్రైతో చపాతీ/పూరీ తిన్నారు.మీ కీలక పాత్ర పోషించండి...సోనియా గాంధీ ఢిల్లీ పరిధిలో ప్రచారం చివరిరోజు సందర్భంగా కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ గురువారం ఓటర్లకు ఒక వీడియో సందేశం విడుదలచేశారు. ‘‘ ప్రజాస్వామ్య పరిరక్షణకు జరుగుతున్న కీలక ఎన్నికలివి. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, రాజ్యాంగబద్ధ సంస్థలపై దాడులు కొనసాగుతున్న వేళ వచి్చన ఎన్నికలివి. ఈ పోరాటంలో మీరు మీ కీలక పాత్ర పోషించండి. మీ ఓటు ఉపాధి కల్పనకు బాటలువేస్తుంది. ఎగసిన ధరలను కిందకు దింపుతుంది. మహిళలకు సాధికారతను కట్టబెడుతుంది. మెరుగైన భవిష్యత్తుతో సమానత్వాన్ని సాధిస్తుంది. ఢిల్లీ పరిధిలోని ఏడు ఎంపీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్, ‘ఇండియా’ కూటమి అభ్యర్థులను గెలిపించండి’ అని సోనియా సందేశమిచ్చారు. -
Vipul Varshney: ఎదుర్కోడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి
‘కోరుకున్న రంగంలో రాణించాలంటే మనలో ఒక తపన ఉండాలి. ఒక తపస్సులా ఆ రంగాన్ని స్వీకరించాలి. ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఎదుర్కోడానికి సిద్ధంగా ఉండాలి’ అంటారు ఐదు పదుల వయసు దాటిన విపుల్ వర్షిణే. లక్నోవాసి అయిన విపుల్ వర్షిణే ముప్పైఏళ్లుగా ఆర్కిటెక్చర్ రంగంలో తనదైన ముద్ర వేస్తూ, గుర్తింపు పొందారు. ఒక్కరూ తన మాట వినడం లేదు అనే నిరాశ నుంచి రెండు విమానాశ్రయాల రూపకల్పన చేసేంత స్థాయికి ఎదిగారు. విపుల్ వర్షిణే తనను తాను శక్తిగా మలుచుకున్న విధానం నేటి మహిళలకు స్ఫూర్తిని కలిగిస్తుంది. ‘నా పేరు విపుల్ అనే ఉండటంతో మగ ఆర్కిటెక్ట్ అనుకుని, సంప్రదించేవారు. నేను మహిళను అని తెలిసి వర్క్ ఇవ్వడానికి వెనకడుగు వేసేవారు. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో కొంతమార్పు చూస్తున్నాను కానీ, 30 ఏళ్ల క్రితం నేను ఆర్కిటెక్ట్ అని చెబితే చాలామంది ఆశ్చర్యపోయేవారు. ఇప్పుడు నేను రెండు విమానాశ్రయాలను డిజైన్ చేసే స్థాయికి ఎదిగాక ఈ రంగంలో అమ్మాయిలూ రాణించగలరు అనే స్పష్టత వచ్చింది. ఈ విషయాన్ని నిరూపించడానికి నేను చేసిన ప్రయత్నం ఆషామాషీ కాదు. సృజనతో అడుగు పుట్టి, పెరిగింది లక్నోలో. స్కూల్ ఏజ్ నుంచి పెయిం టింగ్స్ వేయడం, కార్టూన్స్ గీయడం వంటివి చూసి వాటిని పత్రికలకు పంపించే వారు నాన్న. మొదట నేను మెడిసిన్ చదవాలని కోరుకున్న మా నాన్న నాలోని సృజనాత్మకత చూసి ఆర్కిటెక్ట్ ఇంజినీరింగ్ చేయమని సలహా ఇచ్చారు. ఎందుకంటే ఆర్కిటెక్చర్ సైన్స్, సృజనాత్మకతల సమ్మేళనంగా ఉంటుంది. మా నాన్న మనసులో నేను గవర్నమెంట్ ఉద్యోగం చేయాలని, అది నాకు సురక్షితమైనదని భావించేవారు. నేను ఎంచుకున్న రంగం చాలా శ్రమతో కూడుకున్నదని ఆయనకు తెలియదు. అప్పట్లో కంప్యూటర్లు లేవు కాబట్టి రాత్రంతా డ్రాయింగ్ బోర్డ్ పైనే పని చేయాల్సి వచ్చేది. ఎవరూ సీరియస్‌గా తీసుకోలేదు.. ’’నేను ఆర్కిటెక్చరల్ ఇంజినీరింగ్ చదువుతున్నప్పుడు మా క్లాస్‌లో ముగ్గురం మాత్రమే అమ్మాయిలం. ఈ వృత్తిలో అబ్బాయిలదే అధిపత్యమని అప్పుడు అర్థమైంది. కాలేజీలో చదివే సమయంలోనే పెళ్లి అయ్యింది. మావారు సివిల్ ఇంజనీర్ కాబట్టి పెళ్లయ్యాక ఆయనతోనే కెరీర్ప్రారంభించాను. భవనాలు కట్టే లొకేషన్‌కు వెళ్లేటప్పుడు నాతో మాట్లాడేందుకు కూలీలు తడబడేవారు. మేస్త్రీలు నా మాటలను అస్సలు పట్టించుకునేవారు కాదు. ఒక మహిళ యజమానిగా మారడం వారెవరికీ ఇష్టం ఉండదని అప్పుడు అర్ధమైంది. అసలు నన్ను వారు నిర్మాణశిల్పిగా అంగీకరించలేదు. నిరాశగా అనిపించేది. కానీ, నా డిజైన్ ప్రకారమే పనిచేయాల్సి ఉంటుందని నా నిర్ణయాన్ని సున్నితంగానూ, అంతే కచ్చితంగానూ తెలియజేశాను. అక్కడ నుంచి ఆర్కిటెక్ట్‌గా ఎదగడానికి నన్ను నేను మార్చుకుంటూ వెళ్లాల్సి వచ్చింది. ఆఫీస్‌లో నాకు, నా భర్తకు విడివిడిగా క్యాబిన్లు ఉండేవి. క్లయింట్స్ వచ్చినప్పుడల్లా నా సలహా తీసుకోవాలని నా భర్త తరచూ వారికి చె΄్పాల్సి వచ్చేది. తీసుకున్నప్రాజెక్ట్ పూర్తి చేయడం పట్ల పూర్తి శ్రద్ధ పెట్టేదాన్ని. కానీ వచ్చిన వాళ్లు మాత్రం ‘మిస్టర్ విపుల్ వర్షిణే ఎప్పుడు వస్తారు’ అని అడిగేవారు. నేనే విపుల్ అని, ఆర్కిటెక్ట్ అని తెలిసి ఆశ్చర్యపోయేవారు. 200 భవనాల జాబితా భవన నిర్మాణంలో నా వర్క్‌ని కొనసాగిస్తూనే లక్నోలోని చారిత్రక కట్టడాలపై, వాటి పరిరక్షణ గురించిప్రాజెక్ట్ వర్క్ చేశాను. అక్కడి వారసత్వ కట్టడాల పట్ల ఎలాంటి జాగ్రత్తలూ తీసుకోవడం లేదని తెలుసుకొని దాదాపు 200 భవనాల జాబితాను తయారు చేశాను. ఆ జాబితాను పురావస్తు శాఖకు అప్పగించాను. ఆ సమయంలోనే 500 పేజీల ఆప్రాజెక్ట్ వర్క్‌ని పుస్తకంగా తీసుకువస్తే ప్రయోజనకరంగా ఉంటుందన్న సన్నిహితుల సలహాతో బుక్‌గా తీసుకువచ్చాను. అలా రచనా ప్రపంచంలోకి అడుగుపెట్టాను. ఇప్పటి వరకు మన దేశ వారసత్వ సంపదపైన ముఖ్యంగా లక్నో సంస్కృతి, వారసత్వ నగరం, చరిత్ర ద్వారా నడక, మ్యూజింగ్స్ ఇన్ బెనారస్, ఎ కెలిడోస్కోప్ ఆఫ్ ది హార్ట్, లక్నో ఎ ట్రెజర్ పేర్లతో 5 పుస్తకాలు ప్రచురిత మయ్యాయి. ఇటేవలే అయోధ్యకు సంబంధించి ఎ వాక్ త్రూ ది లివింగ్ హెరిటేజ్ ప్రచురితమైంది. ‘షామ్ ఎ అవద్ పుస్తకంలో లక్నో సంస్కృతిపై స్కెచ్‌లు కూడా వేశాను. లక్నోలోని చికంకారీ ఎంబ్రాయిడరీ, ఈ నగరంలోని వీధులు, మార్కెట్ల గురించి ప్రస్తావించాను. లక్నో ఇన్టాక్కి కన్వీనర్‌గా ఉన్నాను. లేహ్ విమానాశ్రయం .. ఓ సవాల్! 2018లో లేహ్ ఎయిర్పోర్ట్ డిజైన్ చేసే అవకాశం వచ్చింది. ఈప్రాజెక్ట్ నాకు అత్యంత సవాల్‌గా ఉండేది. ఎందుకంటే అక్కడ భూమి, పర్యావరణం చాలా భిన్నంగా ఉంటాయి. పర్వతాల కారణంగా భూభాగం చాలా తేడాగా ఉంటుంది. విమానాశ్రయం అరైవల్, డిపార్చర్ లాంజ్‌ల మధ్య 3 అంతస్తుల వ్యత్యాసం ఉంది. అక్కడ లగేజీ బెల్ట్ రివర్స్ చేయాల్సి వచ్చింది. ఉష్ణోగ్రత చాలా తక్కువ కాబట్టి, ఎయిర్ కండీషనర్లలో ఉపయోగించే ద్రవం ఘనీభవన స్థానం కంటే తక్కువగా ఉంది. అలాంటప్పుడు ప్రత్యేక రసాయనాలను ఉపయోగించి, దానిని ఏర్పాటు చేశాను. లేహ్‌లో అనేక బౌద్ధ విహారాలు ఉన్నాయి. ప్రవేశం ద్వారం వద్ద 30 అడుగుల ఎత్తైన బుద్ధుని విగ్రహాన్ని ఉంచాను. అక్కడి స్థానిక సంస్కృతి, కళ, హస్తకళలను దృష్టిలో ఉంచుకుని రంగు రంగుల వలలు,ప్రార్థన చక్రాలను ఏర్పాటు చేయించాను. అయోధ్య విమానాశ్రయం పనిప్రారంభించినప్పుడు అక్కడ మహంతులు, సాధువులను కలుస్తూ ఉండేదాన్ని. ఎందుకంటే అక్కడి నిర్మాణాన్ని బాగా అర్థం చేసుకోవాలి, సరైన సమాచారం కోసం చాలా పుస్తకాలు చదివాను. వివిధ వృత్తులలో ఉన్న వ్యక్తులతో మాట్లాడాను. దీంతో అయోధ్యపై నాకు ఆసక్తి పెరుగుతూ వచ్చింది. ఆ తర్వాత దానినే పుస్తకంగా తీసుకు వచ్చాను. ఒక సృజనాత్మక వ్యాపకం నన్నూ నా దిశను మార్చింది. సవాల్‌గా ఉన్న రంగంలో సమున్నతంగా నిలబడేలా చేసింది. ఏ రంగం ఎంచుకున్నా అందులో మనదైన ముద్ర తప్పక వేయాలి. అప్పుడే, ఎక్కడ ఉన్నా సరైన గుర్తింపు లభిస్తుంది’ అని వివరిస్తారు విపుల్ వర్షిణే. -
ఫార్చూన్ 500 లీడర్లలో మహిళలు అంతంతే ..
న్యూఢిల్లీ: కార్పొరేట్ ప్రపంచంలో మహిళలు దూసుకెడుతున్నా.. కంపెనీలకు సారథ్యం వహిస్తున్న వారి సంఖ్య అంతంతమాత్రంగానే ఉంటోంది. ఫార్చూన్ ఇండియా 500 కంపెనీల్లో కేవలం 1.6 శాతం సంస్థలు మాత్రమే మహిళల సారథ్యంలో ఉండటం ఇందుకు నిదర్శనం. ఫార్చూన్ ఇండియా, ఎస్పీ జైన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ రీసెర్చ్ నిర్వహించిన ఒక అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ, బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ దీనికి తోడ్పాటు అందించగా, ముంబై, కోల్‌కతా, బెంగళూరు, ఢిల్లీ–ఎన్సీఆర్లో 16 రౌండ్‌టేబుల్ సమావేశాలు నిర్వహించారు. వీటిలో 130 మంది పైచిలుకు పరిశ్రమ దిగ్గజాలు పాల్గొన్నారు. అలాగే సర్వే ప్రశ్నాపత్రం ద్వారా ఫార్చూన్ 500 కంపెనీల అభిప్రాయాలు కూడా సేకరించారు. ‘మహిళల సారథ్యంలో అభివృద్ధి లక్ష్యాన్ని సాధించే దిశగా పరిష్కరించుకోవాల్సిన సమస్యలను గుర్తించడంలో పరిశ్రమ పారదర్శకంగా వ్యవహరిస్తుండటం ప్రశంసనీయం‘ అని నివేదికను ఆవిష్కరించిన సందర్భంగా కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ .. సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పేర్కొన్నారు. అధ్యయనం విశేషాలు.. ► ఫార్చూన్ ఇండియా ఏటా అత్యధిక ఆదాయాలు ఆర్జించే 500 టాప్ కంపెనీలతో జాబితా విడుదల చేస్తుంటుంది. అధ్యయనం ప్రకారం వీటిలో కేవలం 1.6 శాతం సంస్థల్లోనే మహిళా ఎండీలు/సీఈవోలు ఉన్నారు. తర్వాత స్థానంలో ఉండే నెక్ట్స్ 500 సంస్థల్లో 5 శాతం, ఫార్చూన్ ఇండియా 1000 కంపెనీల లిస్టులో 3.2 శాతం మంది ఉన్నారు. ► కుటుంబ బాధ్యతల కారణంగా 30–40 శాతం మంది ఉద్యోగినులు .. మిడిల్ మేనేజ్మెంట్ స్థాయికి రాగానే నిష్క్రమిస్తుండటంతో వారి ప్రాతినిధ్యం తగ్గుతోంది. ప్రసూతి సెలవులు తీసుకోవడం, ప్రసవం తర్వాత తిరిగి ఉద్యోగాల్లో చేరడం సవాలుగా ఉంటోంది. ► కార్పొరేట్ మైండ్సెట్పరమైన సమస్యలు కూడా కెరియర్లో మహిళల పురోగతికి సమస్యాత్మకంగా ఉంటున్నాయి. ఉద్యోగినులు ఆరు నెలల పాటు మెటర్నిటీ లీవులు తీసుకునే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో మిడ్–మేనేజ్మెంట్ స్థాయి ఉద్యోగాల్లో మహిళలను తీసుకోవడానికి సంస్థలు సంకోచిస్తున్నాయి. ఇది పెయిడ్ లీవు కావడంతో చాలా మటుకు సంస్థలు – ముఖ్యంగా చిన్న సంస్థలు – పెట్టుబడి పెట్టడానికి ఇష్టపడటం లేదు. అలాగే పిల్లల బోర్డు ఎగ్జామ్ల కోసం, తల్లిదండ్రులు..లేదా అత్తమామల సంరక్షణ కోసం నలభైలలో బ్రేక్ తీసుకోవాల్సి వస్తుండటం వంటివి కూడా మహిళ ఉద్యోగులకు సమస్యాత్మకంగా ఉంటున్నాయి. ► వేరే ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తే మహిళలు వెళ్లలేరు, లాభనష్టాల పరిస్థితులను సరిగ్గా చక్కబెట్టగలిగే సామరŠాధ్యలు వారికి ఉండవు అనే మూస అభిప్రాయాలు కూడా వారి పురోగతికి అవరోధాలుగా ఉంటున్నాయి. ఇలాంటి అభిప్రాయాల వల్ల వారిని నేరుగా అడగకుండానే యాజమాన్యాలు మహిళా ఉద్యోగుల విషయంలో ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకునే పరిస్థితి ఉంటోంది. ► అయితే, కంపెనీల్లో లింగ అసమానతలపై అవగాహన పెరుగుతోంది. రూ. 200 కోట్లు ఆర్జించిన ఎయిర్‌బీఎన్‌బీ మహిళా హోస్ట్‌లు ఆన్లైన్ హోస్టింగ్ ప్లాట్‌ఫాం ఎయిర్బీఎన్బీలోని మహిళా హోస్ట్‌లు (ఆతిథ్య సేవలు అందించేవారు) దేశీయంగా 2023లో రూ. 200 కోట్లు పైగా ఆర్జించారు. స్థానిక ఆర్థిక వ్యవస్థలు, కమ్యూనిటీల వృద్ధిపై మహిళలు చూపుతున్న సానుకూల ప్రభావాలకు ఇది నిదర్శనమని ఎయిర్‌బీఎన్‌బీ తెలిపింది. భారత్‌లోని తమ హోస్టింగ్ కమ్యూనిటీలో సుమారు 30 శాతం మంది మహిళలు ఉన్నారని ఎయిర్‌బీఎన్‌బీ ఇండియా జనరల్ మేనేజర్ అమన్‌ప్రీత్ బజాజ్ తెలిపారు. మహిళా పర్యాటకులకు, మహిళా హోస్ట్‌లకు సురక్షితమైన పరిస్థితులు కలి్పంచేందుకు తాము కట్టుబడి ఉన్నామని ఆయన పేర్కొన్నారు. మహిళా అతిథులు భారత్‌లో ఎక్కువగా గోవా, బెంగళూరు, ఢిల్లీ, పుణె, డెహ్రాడూన్, జైపూర్లను ఎంచుకుంటున్నారని వివరించారు. అంతర్జాతీయంగా లండన్, దుబాయ్, టొరంటో, ప్యారిస్ మొదలైనవి భారతీయ మహిళా పర్యాటకులకు ఫేవరెట్‌గా ఉంటున్నాయని బజాజ్ పేర్కొన్నారు. 2023 మహిళా రుణాల్లో భారీ పురోగతి మహిళా రుణాల విషయంలో 2023లో మంచి పురోగతి కనిపించింది. మహిళా రుణాలు పెరిగినట్లు క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీ ఒకటి పేర్కొంది. వ్యక్తిగత రుణాలు, ద్విచక్ర వాహన రుణాల పోర్ట్‌ఫోలియో అత్యంత వేగంగా 26 శాతం వృద్ధిని కనబరిచినట్లు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా క్రిఫ్ హై మార్క్ విడుదల చేసిన నివేదిక పేర్కొంది. నివేదిక ప్రకారం మహిళలకు సంబంధించి మొత్తం రుణ పోర్ట్‌ఫోలియో 2022 చివరి నాటికి రూ. 26 లక్షల కోట్ల నుండి 2023లో రూ. 30.95 లక్షల కోట్లకు ఎగసింది. వ్యాపారవేత్తలుగా మారేందుకు ఆసక్తి మహిళా ఉద్యోగస్థుల్లో అత్యధికుల అభిమతం ఇండియాలెండ్స్ సర్వేలో 76 శాతంమంది ఓటు ఫైనాన్షియల్ ఇన్‌స్ట్రుమెంట్స్‌పై అవగాహనకూ సై దేశీయంగా ఉద్యోగాలు చేస్తున్న మహిళల్లో అత్యధిక శాతంమంది వ్యాపారవేత్తలు(ఎంటర్ప్రెన్యూర్)గా మారేందుకు ఆసక్తిని ప్రదర్శించారు. సొంత బిజినెస్ ప్రారంభించాలనే ఆలోచనను కలిగి ఉన్నట్లు ఇండియాలెండ్స్ నిర్వహించిన సర్వే పేర్కొంది. 24–55 ఏళ్ల మధ్య వయసున్న 10,000 మంది వర్కింగ్ ఉమన్‌తో సర్వే చేపట్టినట్లు వ్యక్తిగత రుణాలు, క్రెడిట్ కార్డుల గణాంకాలు అందించే ఆన్లైన్ మార్కెట్‌ప్లేస్ ఇండియాలెండ్స్ తెలియజేసింది. మెట్రో నగరాలతోపాటు టైర్–1, టైర్–2 పట్టణాలలో ఉద్యోగాలు చేసే మహిళలను సర్వేకు పరిగణించినట్లు వెల్లడించింది. వీరిలో 76 శాతం మంది సొంత బిజినెస్‌ను ప్రారంభించాలనే కోరికను వ్యక్తం చేసినట్లు పేర్కొంది. 86 శాతంమంది మహిళలు బడ్జెటింగ్, పెట్టుబడులు, పొదుపు తదితర విభిన్న ఆర్థిక ప్రొడక్టుల(ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్)పై అవగాహనను పెంపొందించుకోవాలనే పట్టుదలను ప్రదర్శించినట్లు వివరించింది. వ్యాపారవేత్తలు సైతం పలువురు మహిళా వ్యాపారవేత్తలను సైతం సర్వేకు పరిగణించినట్లు ఇండియాలెండ్స్ పేర్కొంది. వీరిలో 68 శాతం ఉమన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ తమ కంపెనీ ఖాతాలను స్వతంత్రంగా నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. 32 శాతంమంది మాత్రమే ఇందుకు భర్తలు, కుటుంబ సభ్యులు, వృత్తి నిపుణులపై ఆధారపడుతున్నట్లు తెలియజేశారు. ఇక బిజినెస్ ఉమన్‌లో దాదాపు 69 శాతంమంది, వేతనాలు అందుకునే మహిళల్లో 51 శాతంమంది తమ సొమ్మును పెట్టుబడులకు మళ్లిస్తున్నట్లు వెల్లడించారు. వీరిలో 79 శాతంమంది సొంతంగా ఇన్వెస్ట్ చేస్తున్నట్లు తెలియజేశారు. కేవలం 21 శాతంమంది పెట్టుబడులకు సంబంధించి తమ భాగస్వాములు లేదా తల్లిదండ్రుల సహాయం తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఇక 25 శాతంమంది మహిళలు విశ్వాసంలేక సొంత పెట్టుబడి నిర్ణయాలు తీసుకోకపోగా.. మరో 29 శాతంమంది ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్పట్ల పరిమిత అవగాహన కారణంగా వెనకడుగు వేస్తున్నట్లు వెల్లడించారు. సర్వే వివరాలిలా సర్వేలో పాల్గొన్నవారిలో దాదాపు 34 శాతంమంది మహిళలు 25–34 మధ్య వయసు కలిగినవారుకాగా.. సుమారు 26 శాతంమంది 35–44 మధ్యవయసు గలవారిగా ఇండియాలెండ్స్ తెలియజేసింది. 22 శాతంమంది 18–24 ఏజ్ గ్రూప్‌కాగా.. 45 ఏళ్లకుపైబడినవారు 19 శాతంగా వెల్లడించింది. ఈ మహిళల్లో 44.5 శాతంమంది ఉద్యోగస్థులు, సొంత ఉపాధిగలవారు 31 శాతంమంది, గృహిణులు 12 శాతంమంది, సీఏలు, అడ్వకేట్లు తదితర వ్యక్తిగత వృత్తి నిపుణులు 4.4 శాతంమందిగా తెలియజేసింది. -
మహిళామణులకు పట్టాభిషేకం
సాక్షి, అమరావతి: ఎమ్మెల్సీ జకియా ఖానంను పెద్దల సభగా పేరొందిన శాసనమండలి వైస్ చైర్మన్ కుర్చీలో కూర్చోబెట్టడం ద్వారా మహిళా మణులకు అత్యున్నత గౌరవం కల్పించారు. రాష్ట్రంలో ముందెన్నడూ లేనివిధంగా ఒక ముస్లిం మహిళకు పెద్ద బాధ్యతలు అప్పగించడం ద్వారా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దేశానికే ఆదర్శంగా నిలిచారు. బీసీ మహిళ అయిన ఉప్పాల హారికకు కృష్ణా జిల్లా పరిషత్ చైర్పర్సన్ బాధ్యతలు అప్పగించి తన ఆదర్శాన్ని చాటారు. జనరల్ మహిళకు కేటాయించిన కృష్ణా జెడ్పీ చైర్పర్సన్ పదవిని బీసీ మహిళకు కట్టబెట్టిన సీఎం జగన్ రాజకీయ రంగంలో మహిళా లోకానికి కొత్త దారులు వేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే రాష్ట్రంలో మహిళామణులకు పదవుల పట్టాభిషేకం చేయడంలో సీఎం వైఎస్ జగన్ మూడేళ్లలో రికార్డుల మీద రికార్డులు సృష్టించారు. మరే రాష్ట్రంలోనూ లేనివిధంగా రాజకీయంగా, ఆర్థికంగా మహిళల సాధికారత, స్వావలంబనకు విప్లవాత్మక చర్యలు చేపట్టిన ఏకైక రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ తలెత్తుకుని దేశం ముందు సగర్వంగా నిలబడేలా చేశారు. మంత్రి వర్గంలోనూ పెద్దపీట మంత్రివర్గంలో మహిళలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పెద్దపీట వేశారు. 2019 మంత్రివర్గంలో ముగ్గురు మహిళలకు స్థానం కల్పించగా.. 2022 మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణలో నలుగురు మహిళలకు మంత్రి పదవులు కట్టబెట్టారు. రెండు పర్యాయాలు కూడా కీలకమైన హోంశాఖను దళిత మహిళలకే అప్పగించారు. ప్రస్తుతం రాష్ట్ర హోంశాఖను తానేటి వనిత, ఆరోగ్య శాఖను విడదల రజని, మహిళా శిశు సంక్షేమ శాఖను ఉషశ్రీ చరణ్, పర్యాటక, యువజన సర్వీసుల శాఖను ఆర్కే రోజాకు అప్పగించడం విశేషం. పదవులు.. పనుల్లో 50 శాతం రిజర్వేషన్ చట్టసభల్లో మహిళలకు 33 శాతం సీట్లు కేటాయించాలని 1993 నుంచి పార్లమెంట్లో బిల్లులు పెడుతూనే ఉన్నారు. కానీ.. ఇప్పటివరకు కేటాయించిన దాఖలాలు ఎక్కడా లేవు. ఏ డిమాండ్లు, ఏ ఉద్యమాలు లేకుండానే.. ఎవరు అడగకపోయినా సీఎం వైఎస్ జగన్ చొరవ తీసుకుని రాష్ట్రంలో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు అమలు చేసి చూపించారు. నామినేటెడ్ పదవుల్లో 50 శాతం, నామినేషన్ పనుల్లోనూ 50 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ చట్టం చేసిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానికి దక్కింది. గడచిన మూడేళ్లలో మహిళలకు 50 శాతానికి మించి పదవులు కట్టబెట్టడం గమనార్హం. నామినేటెడ్, కార్పొరేషన్ డైరెక్టర్ పోస్టుల భర్తీలో మహిళలకు 51 శాతం వాటా దక్కింది. రాష్ట్రంలో వివిధ కార్పొరేషన్ల చైర్పర్సన్ పదవులు 202 ఉంటే.. వాటిలో 102 చైర్పర్సన్ పదవులను మహిళలకే ఇచ్చారు. 1,154 డైరెక్టర్ పదవుల్లో 586 పదవులు కూడా మహిళలకే కట్టబెట్టారు. 202 మార్కెట్ కమిటీ చైర్మన్ పదవుల్లో 102 మహిళలకే కేటాయించారు. 1,356 రాజకీయ పదవుల నియామకాల్లో 688 పదవులు అంటే 51 శాతం అక్కచెల్లెమ్మలకే ఇచ్చారు. వార్డు పదవి నుంచి జెడ్పీ చైర్మన్ వరకు.. రాష్ట్రంలో 13 జిల్లా పరిషత్ ఎన్నికలు జరగ్గా.. వాటిలో 7 జిల్లాల జెడ్పీ పీఠాలను మహిళలకు కేటాయించడం ద్వారా 54 శాతం అవకాశం కల్పించారు. 26 జెడ్పీ వైస్ చైర్మన్లలో 15 మంది మహిళలే. మొత్తంగా 12 మేయర్, 24 డిప్యూటీ మేయర్ కలిపి 36 పదవులు ఉంటే.. వాటిలో 18 పదవులు మహిళలవే. వార్డు మెంబర్లు 671 మందిలో 361 మంది మహిళలే ఉన్నారు. 75 మునిసిపాలిటీల్లో 45 మంది మహిళా చైర్పర్సన్లే. మునిసిపాలిటీల్లోని 2,123 వార్డు మెంబర్లలో 1,161 పదవులు మహిళలకే దక్కాయి. గ్రామ సర్పంచ్ పదవుల్లో 57 శాతం, ఎంపీటీసీ పదవుల్లో 54 శాతం, మండల పరిషత్ అధ్యక్ష స్థానాల్లో 53 శాతం, జెడ్పీటీసీల్లో 53 శాతం మహిళలకే పట్టాభిషేకం చేయడం విశేషం. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన అనంతరం అమలులోకి తెచ్చిన వలంటీర్ ఉద్యోగాలు 2.60 లక్షల మందిలో 53 శాతం యువతులే సేవలు అందిస్తుండటం గమనార్హం. ప్రతి వార్డు, గ్రామ సచివాలయంలోనూ మహిళా పోలీస్‌లను నియమించారు. మహిళా సంక్షేమంలోను ముందడుగు మహిళలు ఆర్థికంగా బలంగా ఉంటేనే సమాజం బాగుంటుందన్న ఉద్దేశంతో సంక్షేమ పథకాల లబ్ధిని నేరుగా అక్కచెల్లెమ్మల బ్యాంక్ అకౌంట్లకు జమ చేస్తోంది ప్రభుత్వం. మహిళల కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా బడ్జెట్ పెట్టి వారి పురోగతికి ఊతమిస్తోంది. ఈ మూడేళ్లలో (ఈ ఏడాది ఏప్రిల్ వరకు) రూ.1,22,472.23 కోట్ల లబ్ధి చేకూర్చిన ప్రభుత్వం మహిళా సంక్షేమంలో ముందడుగు వేసింది. వాటిలో మచ్చుకు కొన్ని వివరాలు ఇవి.. ► రాష్ట్రంలో పేదింటి అక్కచెల్లెమ్మలకు సొంతింటి కలను నిజం చేస్తూ ప్రభుత్వం పారదర్శకంగా 30.76 లక్షల మందికి ఇళ్ల పట్టాల పంపిణీ చేసింది. వారికి శాశ్వత గృహ వసతితోపాటు మౌలిక సదుపాయాలను సమకూర్చే యజ్ఞాన్ని నిర్విఘ్నంగా కొనసాగిస్తోంది. ఇందుకుగాను 2022 సంవత్సరానికి ప్రతిష్టాత్మక స్కోచ్ మెరిట్ ఆఫ్ ఆర్డర్ అవార్డు కూడా లభించింది. ► 2019 ఎన్నికల రోజు వరకు మహిళలకు ఉన్న పొదుపు సంఘాల రుణాలను మొత్తాన్ని నాలుగు వాయిదాల్లో వారి చేతికే అందించేలా చర్యలు చేపట్టారు. రాష్ట్రంలో 7.97 లక్షల పొదుపు సంఘాల్లోని 78.76 లక్షల మహిళల పేరుతో బ్యాంకుల్లో ఉన్న అప్పు రూ.25,517 కోట్లను నాలుగు విడతలుగా నేరుగా ఆయా సంఘాల పొదుపు ఖాతాల్లో జమ చేసే ప్రక్రియను ప్రారంభించి ఇప్పటి వరకు (ఈ ఏడాది ఏప్రిల్) రూ.12,758 కోట్లను ప్రభుత్వం జమ చేసింది. ► వైఎస్సార్ సున్నా వడ్డీ పథకంలో పొదుపు సంఘాల ద్వారా మహిళలు బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలపై వడ్డీ మొత్తాన్ని ఆయా సంఘాల రుణ ఖాతాల్లోనే జమ చేస్తోంది ప్రభుత్వం. ప్రభుత్వ తోడ్పాటుతో 99.27 శాతం సంఘాలకు చెందిన అక్కచెల్లెమ్మలు సకాలంలో రుణాల కిస్తీలను చెల్లిస్తున్నారు. ఈ విషయంలో ఏపీ దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. డ్వాక్రా సంఘాల అభ్యున్నతి కోసం రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకర్లతో మాట్లాడి వడ్డీ శాతం 13.5 నుంచి 9.5 శాతానికి తగ్గించింది. ఇప్పటివరకు 1.02 కోట్ల మందికి రూ.3,615 కోట్లు వడ్డీ సాయం అందించింది. ► వైఎస్సార్ సంపూర్ణ పోషణ పథకం కింద రాష్ట్రంలోని 55,607 అంగన్వాడీ కేంద్రాల్లో గర్భిణులు, బాలింతలు, ఆరేళ్లలోపు చిన్నారులకు పోషకాహారాన్ని అందించేందుకు ఇప్పటివరకు 34.19 లక్షల మంది లబ్ధిదారులకు రూ.4,895.45 కోట్లు ఖర్చు చేసింది. ► వైఎస్సార్ చేయూత పథకం కింద 45 నుంచి 60 ఏళ్ల మధ్య వయసు గల బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ పేద అక్కచెల్లెమ్మలకు ఏటా రూ.18,750 చొప్పున నాలుగేళ్లలో రూ.75 వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తున్నారు. ఈ డబ్బులు వారి జీవనోపాధికి ఎంతగానో ఉపయోగపడుతోంది. ఇప్పటివరకు 24.96 లక్షల మందికి రూ.9,180 కోట్లను ప్రభుత్వం అందజేసింది. ► స్వేచ్ఛ పథకం కింద రుతుక్రమ సమయంలో స్కూళ్లకు వెళ్లలేక బాలికలు పడుతున్న ఇబ్బందులను పరిష్కరించారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో 7వ తరగతి నుంచి 12వ వరకు చదువుతున్న కిశోర బాలికలకు నెలకు 10 చొప్పున ఏడాదికి 120 శానిటరీ నాప్కిన్లు పంపిణీ చేస్తున్నారు. ఇప్పటివరకు 10 లక్షల మందికి రూ.32 కోట్లతో నాప్కిన్లు అందించారు. ► మహిళల సత్వర రక్షణే ధ్యేయంగా, దోషులకు సత్వర శిక్షే లక్ష్యంగా.. మహిళల సమస్యలకు నూరు శాతం పరిష్కారం చూపేలా దిశ బిల్లు తెచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ఆచరణలో దేశంలోనే ఆదర్శంగా నిలిచింది. ► పూర్తిస్థాయిలో మహిళా కమిషన్ ఏర్పాటు చేసి మహిళలు, చిన్నారుల సమస్యల పరిష్కారానికి కృషి చేయడంతోపాటు వారికి భరోసా ఇచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. -
ఈ సంవత్సరం ఏం చేసింది?.. వీరిని స్ఫూర్తిదాతలుగా నిలిపింది..
2021 సంవత్సరం ఏం చేసింది? చెప్పులు లేని ఒక మహిళను పార్లమెంటులో సగౌరవంగా నడిపించింది. భుజానికి మందుల సంచి తగిలించుకుని తిరిగే సామాన్య ఆరోగ్య కార్యకర్తను ‘ఫోర్బ్స్’ పత్రిక ఎంచేలా చేసింది. ఈ సంవత్సరం ఒక తెలుగు అమ్మాయిని అంతరిక్షాన్ని చుంబించేలా చేసింది. ఈ సంవత్సరం ఒక దివ్యాంగురాలికి ఒలింపిక్స్ పతకాలను మెడ హారాలుగా మలిచింది. ఈ సంవత్సరం భారత సౌందర్యానికి విశ్వకిరీటపు మెరుపులు అద్దింది. ఈ సంవత్సరం దేశ మహిళ జాతీయంగా అంతర్జాతీయంగా తానొక చెదరని శక్తినని మరోమారు నిరూపించుకునే అవకాశం ఇచ్చింది. 2021 మెరుపులు ఎన్నో. కాని 2022లో ఈ శక్తి మరింత ప్రచండమై స్ఫూర్తిని ఇవ్వాలని.. కీర్తిని పెంచాలని కోరుకుందాం. కరోనా వారియర్! మెటిల్డా కుల్లు (45) ► అత్యంత మారుమూల ఏజెన్సీ ప్రాంతాల్లో కోవిడ్‌పైనా, ఆరోగ్య విషయాలపైన విస్తృతంగా అవగాహన కల్పించింది మెటిల్డా కుల్లు. దానికిగాను ఆమెకు ‘‘ఫోర్బ్స్ ఇండియా విమెన్ పవర్–2021’’ గుర్తింపు లభించింది. ► భుజానికో చిన్న చేతి సంచి, కాలి కింద సైకిల్ పెడల్, గుండెనిండా సంకల్పం, సంచి నిండా ఆరోగ్యంపై అవగాహన కల్పించే ప్రింటింగ్ మెటీరియల్‌తో బయలుదేరింది ఒడిశా సుందర్ఘర్ జిల్లాలోని గర్గద్బహాల్ గ్రామానికి చెందిన ఆశా వర్కర్ మెటిల్డా కుల్లు. కరోనా మహమ్మారి అంటేనే ప్రపంచమంతా గడగడలాడుతున్న సమయమిది. ఇంతటి క్లిష్టమైన తరుణంలోనూ ఎంతో భరోసా ఇస్తూ కోవిడ్ కిట్లూ, ఇతర సామగ్రితో కొండాకోనల్లోని మారుమూల గిరిజన ప్రాంతాల్లో సైకిల్‌పై ఇంటింటికీ తిరిగింది. అసలే వెనకబడిన ఖారియా అనే ఓ గిరిజన తెగకు చెందిన మహిళ. చుట్టూ ఆమె మాటలు లెక్కచేయని కులతత్వాలూ, ఆధునిక వైద్యాన్ని నమ్మని చేతబడులూ, మంత్రతంత్రాలను నమ్మే ప్రజలు. ఈ నేపథ్యంలో పడరానిపాట్లు పడుతూ, మూఢనమ్మకాలను నమ్మవద్దంటూ నచ్చజెప్పింది. ► కేవలం కోవిడ్పైనేగాక... మలేరియా గురించి, గిరిజన తండాల్లోని మహిళలకు పారిశుద్ధ్యం, వ్యక్తిగత పరిశుభ్రత గురించి చెప్పింది. అంగన్వాడీ మహిళలతో కలిసి కుటుంబనియంత్రణ అవసరాల గురించి బోధించి, ఎరుకపరచింది. అత్యంత దుర్గమ ప్రాంతాలకు వెళ్లినప్పుడు అక్కడ కనీసం తినడానికి తిండి లేక మలమలమాడిపోయినా తన లక్ష్యాన్ని విడువలేదు. తాను చికిత్స అందించాల్సిన 250 ఇళ్లలోని 964 మందిలో ప్రతి ఒక్కరికీ వైద్య సహాయాన్ని అందించింది. ఇలా అత్యంత వెనకబడిన ప్రాంతాల్లోని సమూహాలను ప్రభావితం చేసినందుకు భారత్‌లోని అత్యంత శక్తిమంతమైన, ప్రభావపూర్వకమైన 21 మంది మహిళల్లో తానూ ఒకరంటూ ‘‘ఫోర్బ్స్ ఇండియా విమెన్ పవర్–2021’’ గుర్తించేలా పేరుతెచ్చుకుంది. మరెందరికో స్ఫూర్తిమంతంగా నిలిచింది. ఫైటర్ అండ్ షూటర్! అవనీ లేఖరా (20 ) ► పారా ఒలింపిక్ క్రీడల్లో రెండు మెడల్స్ సాధించిన తొలి భారతీయ మహిళగా ప్రతిష్ఠ సాధించింది. అంతేకాదు మహిళల పది మీటర్ల రైఫిల్ షూటింగ్ విభాగంలో ప్రపంచ నంబర్ 2 క్రీడాకారిణిగా నిలిచింది. ► అవని లేఖరా తన పదకొండవ ఏట ఓ కారు ప్రమాదంలో వెన్నెముక దెబ్బతినడంతో ‘పారాప్లీజియా’ అనే మెడికల్ కండిషన్‌కు లోనైంది. ఫలితంగా ఓ వైపు దేహమంతా చచ్చుబడిపోయింది. అయినా ఏమాత్రం నిరాశ పడలేదు. ఏదైనా క్రీడను ఎంచుకుని రాణించాలంటూ తండ్రి ప్రోత్సహించారు. దాంతో అభినవ్ భింద్రా నుంచి స్ఫూర్తి పొంది తానూ ఓ షూటర్‌గా రాణించాలనుకుంది. సుమా శిశిర్ అనే కోచ్ నేతృత్వంలో తన 15వ ఏట ఎయిర్ రైఫిల్ షూటింగ్లో శిక్షణ పొందడం ప్రారంభించింది. ఈ ఏడాది జరిగిన పారా ఒలింపిక్ క్రీడల్లో రెండు మెడల్స్ సాధించిన తొలి భారతీయ మహిళగా రికార్డు నెలకొల్పింది. అంతేకాదు... ఒకే పారా ఒలింపిక్స్‌లో ఒకటి కంటే ఎక్కువ పతకాలు పొందిన తొలి మహిళగానూ రికార్డులకెక్కింది. పది మీటర్ల రైఫిల్ విభాగంలో బంగారు పతకంతో పాటు 50 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో కాంస్య పతకం సాధించింది. దేశ కీర్తిపతాకను సగర్వంగా నిలిపిన అవని ప్రస్తుతం అసిస్టెంట్ ఫారెస్ట్ కన్సర్వేటర్ (ఏసీఎఫ్)గా పనిచేస్తోంది. ‘బ్యూటీ’ఫుల్ విజయం ఫాల్గుణి నాయర్ (58) ► మల్టీ–బ్రాండ్ బ్యూటీ రిటైలర్ ‘నైకా’ వ్యవస్థాపకురాలు. ► సరైన శిక్షణ, చదువు, మద్దతు ఉంటే మహిళలు ఎంత ఎత్తుకైనా చేరుకోగలరు, దేనినైనా సాధించగలరు అనడానికి నిలువెత్తు నిదర్శనం. అత్యంత తక్కువ మొత్తంతో ప్రారంభించిన సౌందర్య ఉత్పత్తుల సామ్రాజ్యం నైకా ఆమెను దేశంలోని తొలి 20 మంది సంపన్నుల జాబితాలో నిలిపింది. ► తనను తాను సరికొత్తగా ఆవిష్కరించుకొని ఎదిగిన మహిళగా పేరున్న ఫాల్గుణి నాయర్ గుజరాతీ కుటుంబంలో పుట్టి పెరిగిన ముంబయ్వాసి. ఐఐఎం అహ్మదాబాద్ నుంచి పోస్ట్‌గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. కోటక్ మహింద్ర గ్రూప్‌లో 20 ఏళ్లు పనిచేసిన అనుభవం ఆమెది. ఆ తర్వాత సేవింగ్ మనీ బిజినెస్‌కు సంబంధించిన కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్‌గా వ్యవహరించారు. 2012లో తనను తాను కొత్తగా ఆవిష్కరించుకోవడానికి ‘నైకా’ పేరుతో సౌందర్య ఉత్పత్తుల కంపెనీని ప్రారంభించింది. మేకప్ పట్ల ఉన్న ప్రేమతో ఆమె ఎంచుకున్న ఈ వ్యాపార మార్గం భారతదేశంలో ఆన్లైన్ మార్కెట్‌కు కొత్త ఒరవడిని సృష్టించింది. ► ఇద్దరు కవల పిల్లలకు తల్లి అయిన ఫాల్గుణి నాయర్ వారు ఎదిగి, పైచదువుల కోసం అమెరికా వెళ్లాక ఉన్న ఖాళీ సమయాన్ని ఇలా సద్వినియోగం చేసుకున్నారు. ‘నేను మంచి స్విమ్మర్‌ను కాదు. కానీ, ముందు దూకేస్తాను. ఆ సమయంలో కాలో చెయ్యో విరిగితే ఎలా? అనే ఆలోచనే నాకు రాదు’ అంటూ చిరునవ్వులు చిందిస్తారు. ఆమె విజయంతో పోల్చుతూ ఇతర మహిళల గురించి ఎవరైనా ప్రస్తావిస్తే – ‘మహిళలు సాఫ్ట్ స్కిల్స్‌తో పాటు అవసరమైన నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసుకోవాలి. అలాగే, అవసరమైన సమాచారాన్ని పొందడంతో పాటు, రిస్క్ తీసుకునే సామర్థ్యం కూడా పెంచుకోవాలి. అప్పుడు ఎంతటి ఎల్తైన శిఖరాలైనా అవలీలగా అధిరోహిస్తారు’ అంటారు ఫాల్గుణి. కేవలం ఎనిమిదేళ్లలో సాధించిన ఆమె వ్యాపార ఘనత గురించి అంతర్జాతీయంగానూ అత్యంత శక్తిమంతమైన మహిళగా గుర్తింపు పొందారు. ‘మిస్’ కిరీటం మానసా వారణాసి (24) ► ఫెమినా నిర్వహించిన అందాల పోటీల్లో గెలిచిన ‘మిస్ ఇండియా (వరల్డ్) 2020 పెజంట్’ కిరీటధారి. రాబోయే ఏడాది ప్యూయెర్టో దీవిలోని సాన్ జాన్ నగరంలో జరిగే ‘మిస్ వరల్డ్ 2021 పెజెంట్’లో భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించనుంది. (కరోనా కారణంగా ఈ పోటీల నిర్వహణ ఆలస్యమైంది). ► ఈ తెలుగమ్మాయి హైదరాబాద్‌లో పుట్టింది, మలేసియాలో పెరిగింది. కాలేజ్ చదువుకి తిరిగి హైదరాబాద్ వచ్చిన మానస కంప్యూటర్ సైన్స్‌లో ఇంజనీరింగ్ చేసి, ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ ఎక్సే్ఛంజ్ ఎనలిస్ట్‌గా కెరీర్ ప్రారంభించింది. సంగీతం, డాన్స్, యోగా సాధన, మోడలింగ్ ఆమె హాబీలు. అందాల పోటీల మీద ఆమెకు కాలేజ్ రోజుల్లోనే ఆసక్తి ఉండేది. ఇంజనీరింగ్ ఫస్టియర్‌లో ‘మిస్ ఫ్రెషర్’ టైటిల్ కైవసం చేసుకుంది. ఫెమినా ‘మిస్ ఇండియా’ పోటీలకు తెలంగాణ రాష్ట్రం నుంచి పాల్గొన్నది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ముంబయిలో జరిగిన పోటీల్లో మానసా వారణాసి విజయం సాధించి ‘మిస్ ఇండియా వరల్డ్ 2020’ అందాల కిరీటానికి తలవంచింది. ఈ పోటీల్లో జరిగిన అనేక ఈవెంట్లలో ఆమె ‘మిస్ ర్యాంప్‌వాక్’ అవార్డును కూడా సొంతం చేసుకుంది. ► అందాల పోటీ విజేతలు నిర్వర్తించాల్సిన సామాజిక బాధ్యతల్లో భాగంగా మానసా వారణాసి పిల్లల రక్షణ చట్టాల పటిష్టత కోసం పని చేయనుంది. ఇందులో భాగంగా ‘వియ్ కెన్’ పేరుతో పిల్లల మీద లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా చైతన్యవంతం చేసే ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. తొలి తెలుగు వాణిజ్య వ్యోమగామి బండ్ల శిరీష (34) ► ఇండియన్ అమెరికన్ ఏరోనాటికల్ ఇంజినీర్. వాణిజ్య వ్యోమగామి. వర్జిన్ గెలాక్టిక్ అధినేతతో కలిసి అంతరిక్షంలోకి వెళ్లిన తెలుగు సంతతి అమ్మాయి. అంతరిక్ష రేఖ దాటిన రాకేష్‌శర్మ, కల్పనా చావ్లా, సునితా విలియమ్స్ తర్వాత నాల్గవ భారతీయురాలుగా బండ్ల శిరీష గుర్తింపు పొందారు. ► గుంటూరు జిల్లాలో పుట్టిన శిరీష ఐదేళ్ల వయసులో తల్లిదండ్రులతో కలిసి అమెరికాలోని హ్యూస్టన్ వెళ్లి, అక్కడే చదువు పూర్తి చేశారు. అంతరిక్షం గురించి తెలుసుకోవాలన్న ఆసక్తితో ఏరోనాటికల్ ఇంజినీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీని పొందారు. ఆ తర్వాత బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు. నాసా వ్యోమగామి కావాలనుకున్నా, కంటిచూపులో వైద్యపరమైన కారణాలతో తన ఆశకు దూరమైంది. 2015లో వర్జిన్ గెలాక్టిక్‌లో చేరి, అందులో ప్రభుత్వ వ్యవహారాల వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేస్తున్నారు. జూలై 2021 ఆదివారం నాడు బండ్ల శీరిష వర్జిన్ గెలాక్టిక్ యూనిటీ 22 టెస్ట్ ఫై్టట్లో ఆరుగురు సభ్యుల బృందంతో కలిసి అంతరిక్షయాత్ర దిగ్విజయంగా పూర్తి చేశారు. దీనితో శిరీష ‘ఫెడరల్ ఏవిషయన్ అథారిటీ’ స్పేస్ టూరిస్ట్ జాబితాలో నిలిచారు. అంతరిక్షంలో విజయ కేతనం స్వాతి మోహన్ (38) ► భారత సంతతికి చెందిన అమెరికన్ ఏరోస్పేస్ ఇంజనీర్ స్వాతి మోహన్. నాసా ప్రయోగించిన రోవర్‌ని మార్స్పైన విజయవంతంగా ల్యాండ్ చేయడంలో మిషన్ గైడెన్స్, కంట్రోల్స్ ఆపరేషన్స్ లీడర్‌గా సమర్థంగా నిర్వహించారు. ► బెంగుళూరులో పుట్టిన స్వాతి ఏడాది వయసులోనే ఆమె తల్లిదండ్రులతో అమెరికా వెళ్లారు. స్వాతి 9వ యేట టీవీలో స్టార్ ట్రెక్ చూసి, అంతరిక్షంపై ఎనలేని ఆసక్తి చూపించారు. పిల్లల డాక్టర్ కావాలనుకుని 16 ఏళ్ల వయసులో ఫిజిక్స్‌ను ఎంచుకున్నా, ఆ తర్వాత అంతరిక్ష పరిశోధనే వృత్తిగా కొనసాగించడానికి మార్గమైన ఇంజనీరింగ్ చదవాలని నిర్ణయించుకున్నారు. మాస్టర్స్ డిగ్రీ, పిహెచ్డి పూర్తి చేయడానికి ముందు కార్నెల్ విశ్వవిద్యాలయంలో మెకానికల్, ఏరోస్పేస్ ఇంజినీరింగ్ పూర్తి చేశారు. ► ప్రొఫెసర్ డేవ్ మిల్లర్‌తో కలిసి స్పేస్ సిస్టమ్స్ లాబొరేటరీలో ఆన్–ఆర్బిట్ కార్యకలాపాలపై విస్తృత పరిశోధనలు చేశారు. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో అనేక పరీక్షలను నిర్వహించారు. పూర్వ విద్యార్థుల వ్యోమగాములతోనూ, ఉన్నత పాఠశాల విద్యార్థుల కోసం స్పేర్స్ జీరో రోబోటిక్స్ పోటీలో కూడా పనిచేశారు. కాలిఫోర్నియాలోని పసాదేనాలో నాసా జెట్ ప్రొపల్షన్ లాబొరేటరీలో పనిచేస్తున్నారు స్వాతిమోహన్. 2013లో రోవర్‌ను మోసుకెళ్లే అంతరిక్ష నౌక అంగారక గ్రహానికి ప్రయాణించేటప్పుడు, గ్రహం ఉపరితలంపై ల్యాండింగ్ చేసేటప్పుడు సరైన దిశలో ఉండేలా చూసుకునే బాధ్యతను పోషించారు. ఫిబ్రవరి 18, 2021న అంగారకుడిపై పెర్సెవెరెన్స్ రోవర్ ల్యాండ్ అయినప్పుడు మిషన్‌ను కంట్రోల్ నుంచి ల్యాండింగ్ ఈవెంట్లను వివరించారు. ఆమె ‘టచ్ డౌన్ కన్ఫర్మ్’ అని ప్రకటించగానే జెపిఎల్ మిషన్ కంట్రోల్ సెంటర్లో సంబరాలు మిన్నంటాయి. చప్పట్ల హోరుతో ఆమెకు అభినందనలు తెలిపారు. గతంలో, స్వాతి మోహన్ శని గ్రహానికి సంబంధించిన కాస్సిని మిషన్‌లో పనిచేశారు. అలాగే చంద్రుని గురుత్వాకర్షణ క్షేత్రాన్ని మ్యాప్ చేయడంలో అంతరిక్ష నౌక గ్రెయిల్కు బాధ్యత వహించారు. నడిచే వన దేవత తులసీ గౌడ (72) ► కర్ణాటకలోని హలక్కీ తెగకు చెందిన గిరిజన మహిళ తులసీ గౌడను దేశంలో నాలుగో అత్యున్నత పురస్కారమైన ‘పద్మశీ’ వరించింది. తులసీ గౌడ పెద్ద చదువులు చదువుకోలేదు. ఆ మాటకొస్తే బడి చదువు కూడా పూర్తి చేయలేదు. అయితేనేం, నడిచే వనదేవతగా, ఔషధ మొక్కలు, భిన్నమైన జాతుల గురించి విశేషమైన పరిజ్ఞానం ఉన్న వ్యక్తిగా పేరు పొందారు. ► పేదవాళ్లయిన ఆమె తల్లిదండ్రులు కనీసం పెళ్లి చేసి ఓ అయ్య చే తిలో పెడితే అయినా కడుపునిండా అన్నం తినగలదనే ఉద్దేశంతో పదకొండేళ్ల్ల వయసులోనే గోవింద గౌడ అనే వ్యక్తితో ఆమెకు పెళ్లి చేశారు. పెళ్లయిన కొద్దికాలానికే ఆమె భర్త మరణించాడు. తన జీవితంలో చీకట్లు కమ్మినందుకు కుంగిపోకుండా ఆమె 12 ఏళ్ల వయస్సున్నప్పటి నుంచే మొక్కలు నాటడం ప్రారంభించారు. అటవీశాఖలో టెంపరరీ వాలంటీర్‌గా చేరింది. ప్రకృతిపై ఆమెకున్న అంకితభావమే ఆ తర్వాత అదే డిపార్ట్మెంట్లో ఆమె ఉద్యోగాన్ని సుస్థిరం చేసింది. ఏకంగా 40 వేల వృక్షాలతో వనసామ్రాజ్యాన్నే నెలకొల్పిందామె. గత ఆరు దశాబ్దాలుగా పర్యావరణానికి ఆమె చేసిన ఈ సేవే.. దేశ నాలుగో అత్యున్నత పౌర పురస్కారాన్ని అందుకునేందుకు తోడ్పడింది. ► ఈ వయసులోనూ తులసి ఏ మాత్రం అలసట చెందకుండా మొక్కలు నాటుతారు. నీళ్లు పోసి కన్నబిడ్డలా వాటిని పెంచుతారు. తనకొచ్చే పింఛను మొత్తాన్ని కూడా ఇందుకే ఖర్చు చేస్తున్నారామె. టేకు మొక్కల పెంపకంతో మొదలైన ఆమె ప్రస్థానం పనస, నంది, ఇంకా పెద్ద వృక్షాలు పెంచే వరకూ వెళ్లింది. కేవలం మొక్క నాటితేనే సంతృప్తి రాదు.. అది కొత్త చివుళ్లు పెట్టి శాఖోపశాఖలుగా విస్తరించి మానుగా మారితేనే ఆనందం అని చెప్పే తులసి జీవితం నేటి తరానికి ఆదర్శప్రాయం. ‘యూపీఎస్సీ’లో రెండో స్థానం జాగృతి అవస్థి (24) ► యూపీఎస్సీ పరీక్షల్లో దేశంలోనే రెండో ర్యాంకర్‌గా నిలిచింది. ఇక మహిళల్లోనైతే ఆమెదే ఫస్ట్ ర్యాంక్. ► భోపాల్‌కు చెందిన 24 ఏళ్ల జాగృతి అవస్థి ఓ సాధారణ మధ్యతరగతి మహిళ. తండ్రి ప్రభుత్వ హోమియో మెడికల్ కాలేజీలో ప్రొఫెసర్. తల్లి మధులత సాధారణ గృహిణి. మౌలానా ఆజాద్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (మానిట్) నుంచి 2017లో ఇంజనీరింగ్ పూర్తిచేసింది జాగృతి. ప్రతిష్ఠాత్మకమైన ‘గేట్’ పరీక్షలోనూ మంచి ర్యాంక్ సాధించింది. తొలుత బీహెచ్ఈఎల్ (భోపాల్)లో ఇంజనీర్‌గా చేరింది. రెండేళ్లపాటు పనిచేశాక యూపీఎస్ఈ పరీక్షల కోసం పూర్తికాలం కేటాయించాలకుంది. మొదట్లో ఢిల్లీ వెళ్లి కోచింగ్ తీసుకుందామని అనుకుంది. కానీ కరోనా కారణంగా ఇంటి దగ్గరే శ్రద్ధగా చదివింది. తల్లిదండ్రులూ ఎంతగానో ప్రోత్సహించారు. దేశానికి ఎలాంటి సేవలందిస్తావంటూ అడిగిన ఓ ప్రశ్నకు బదులిస్తూ... ‘మన దేశం పల్లెపట్టులకు నెలవైన ప్రదేశం. అందుకే గ్రామీణాభివృద్ధే తన లక్ష్యం’ అంటూ వినమ్రంగా చెప్పింది జాగృతి. గర్జించిన కంఠం స్నేహా దూబే (28) ► ఘనత: ఐరాసలో భారతదేశ మొదటి కార్యదర్శి. ‘ఐరాస’ వేదికపై ‘పాక్’పై నిప్పులు కురిపించి దీటైన జవాబు చెప్పడం ద్వారా ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. ► కొన్నిసార్లు ‘మాటలు’ కూడా తూటాల కంటే శక్తిమంతంగా పేలుతాయని అంతర్జాతీయ వేదికగా నిరూపించింది స్నేహా దూబే. ► ‘ఉగ్రవాద బాధిత దేశం మాది అని చెప్పుకుంటున్న పాకిస్థాన్ మరోవైపు ఉగ్రవాదులకు ఆశ్రయం ఇస్తోంది. తన ఇంటికి తానే నిప్పు పెట్టుకొని ఆ మంటల్ని ఆర్పడానికి ప్రయత్నిస్తున్నట్లు నటిస్తోంది’ అంటూ యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ(యూఎన్జీఏ)లో ఆమె చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. ► ‘పాక్’ మైండ్ బ్లాక్ అయ్యేలా చేసిన ఆమె మాటలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. ‘ఎవరీ స్నేహ?’ అని ఆరా తీసేలా చేశాయి. ► గోవాలో పుట్టిన స్నేహ అక్కడ పాఠశాల విద్య, పుణేలో కాలేజి విద్య పూర్తి చేసింది. దిల్లీ జేఎన్‌యూ, స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టడీ నుంచి ఎంఫిల్ పట్టా తీసుకుంది. 2012 బ్యాచ్ ఇండియన్ ఫారిన్ సర్వీస్ (ఐఎఫ్ఎస్) ఆఫీసర్ అయిన స్నేహా దూబే ప్రస్తుతం ఐక్యరాజ్య సమితి (యూఎన్)లో భారతదేశం మొదటి కార్యదర్శి. ► పన్నెండు సంవత్సరాల వయసులో సివిల్ సర్వీస్ గురించి గొప్పగా విన్నది స్నేహ. కొత్త ప్రదేశాలకు వెళ్లడం, ప్రపంచంలోని కొత్త కొత్త విషయాలు తెలుసుకోవడం అంటే తనకు మొదటి నుంచి ఆసక్తి. ఈ ఆసక్తే తనను ‘ఐఎఫ్ఎస్’ను ఎంచుకునేలా చేసింది. ఏ సివిల్స్ పరీక్షలు పూరై్త, ఇంటర్వ్యూకు వెళ్లే ముందు, ఇంట్లోని అద్దం ముందు నిల్చొని గట్టిగా మాట్లాడుతూ బాడీలాంగ్వేజ్‌ను పరిశీలించుకుంటూ తనలోని బెరుకును పోగొట్టుకున్నది స్నేహ. విశ్వ సౌందర్యం హర్నాజ్ కౌర్ సంధూ (21) ► రెండు దశాబ్దాల తర్వాత మన దేశానికి మిస్ యూనివర్స్ కిరీటాన్ని సాధించిన అందాల యువతి. ► ఇజ్రాయెల్‌లోని ఇల్లియాట్‌లో డిసెంబర్ 14న జరిగిన 70వ అందాల పోటీల్లో భారత యువతి హర్నాజ్ సంధూ మిస్ యూనివర్స్ కిరీటాన్ని కైవసం చేసుకున్నారు. ఆమె కంటే ముందు లారా దత్తా 2000వ సంవత్సరంలో ఈ టైటిల్‌ను అందుకోగా, తిరిగి 21 ఏళ్ల తర్వాత çహర్నాజ్ కౌర్ సంధూను వరించింది. ► పంజాబ్ ప్రాంతానికి చెందిన హర్నాజ్ కౌర్ సంధూ తనకెంతో ఇష్టమైన మోడలింగ్‌లో రాణించడంతోపాటు పలు పంజాబీ చిత్రాల్లోనూ నటించింది. మిస్ యూనివర్స్ టైటిల్ కన్నా ముందు ఆమె మిస్ దివా 2021 కిరీటాన్ని గెలుచుకుంది. గతంలో ఫెమినా మిస్ ఇండియా పంజాబ్ 2019 కిరీటాన్ని కైవసం చేసుకుంది. ఫెమినా మిస్ ఇండియా 2019లో సెమీ ఫైనలిస్ట్‌గా నిలిచింది. ► మార్చి 3, 2000 చంఢీగఢ్‌లో జన్మించిన సంధూ శివాలిక్ పబ్లిక్ స్కూల్లో పాఠశాల విద్యను పూర్తి చేసి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో డిగ్రీ పట్టా అందుకుంది. ప్రస్తుతం పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌లో మాస్టర్స్ డిగ్రీ చేస్తోంది. ► ఐదడుగుల తొమ్మిందంగుళాల పొడవున్న సంధూ, మానసిక సౌందర్యంలోనూ మిన్న అని నిరూపించుకుని ఇజ్రాయెల్‌లోని ఐలాట్‌లో జరిగిన విశ్వసుందరి పోటీలో విజయం సాధించింది. View this post on Instagram A post shared by Miss Universe (@missuniverse) -
ధైర్యము నీవే కదా
భయంలో పిల్లాడు ‘అమ్మా’ అని వెళ్లి అమ్మ పొట్టలో తల దూరుస్తాడు. తండ్రిపులికి సిఫారసు కోసం ‘అక్కా’ అని వెళ్లి అక్కను ఆశ్రయిస్తాడు తమ్ముడు. అధైర్యంలో, అగమ్యంలో.. ఆలోచన కోసం భార్య వైపు చూస్తాడు భర్త. ‘జాబ్ వచ్చాక ఇస్తాలే’ అని గర్ల్‌ఫ్రెండ్‌ని చేబదులు అడుగుతాడు నిరుద్యోగి. కష్టాల్లో యావత్ మానవాళి ప్రత్యక్ష దైవం స్త్రీ. ‘ఆ చేత్తోనే మాకూ ఇంత అభయం ప్రసాదించమని’ ఇప్పుడీ కరోనా సంక్షోభంగా పెద్ద పెద్ద కంపెనీలు మహిళల్ని రిక్రూట్ చేసుకుంటున్నాయి. ‘వర్క్‌ఫ్రమ్ హోమ్’ ఇస్తున్నాయి. ఆకాశంలో సగంగా ఉన్న మహిళ.. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఆఫీస్‌లలోనూ సగంగా ఉండబోతోంది. ఎత్తులో సన్నటి తాడుపై పడిపోకుండా ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు నిరంతరం నడుస్తూ ఉండటమే స్త్రీకి ఇల్లూ ఆఫీస్. ఇంటిని చూసుకునేవారు ఎవరైనా ఉంటే, ఇంటిని తను కూడా చూసుకోవాలన్న తపన భర్తకూ ఉంటే ఆమె మరింత మెరుగ్గా తన ఉద్యోగ బాధ్యతల్ని నెరవేర్చగలదు. ఈ విషయం లాక్డౌన్ కాలంలో రుజువైంది కూడా. వర్క్ ఫ్రమ్ హోమ్‌లో మహిళలు అత్యుత్తమమైన ఫలితాలను తమ కంపెనీలకు సాధించి పెట్టాయి. వారి పని తీరు మెరుగైంది. వేగవంతం అయింది. ఎక్కువ పని కూడా జరిగింది. పురుషులు మాత్రం ఆఫీస్‌లో ఎంత పని చేశారో ఇంట్లోనూ అంతే పని, లేదంటే అంతకు తక్కువ పని చేసినట్లు కొన్ని సర్వేల్లో వెల్లడైంది కూడా. అందుకే ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీలు ప్రస్తుత కరోనా సంక్షోభ కాలాన్ని నెగ్గుకు రావడానికి, మునుపటి లాభాల్లోకి త్వరితంగా వెళ్లిపోడానికి మహిళల్ని ఎక్కువ సంఖ్యలో ఉద్యోగాల్లోకి తీసుకుంటున్నాయి. అదీ వర్క్ ఫ్రమ్ హోమ్‌లోకి! దీనివల్ల మహిళల శక్తి సామర్థ్యాలకు, నైపుణ్యాలకు డిమాండ్ పెరిగింది. మగవాళ్లు ఆఫీస్‌లో వర్క్ చేస్తుంటే.. వాళ్ల కన్నా మిన్నగా, మెరుగ్గా మహిళలు ఇంటి నుంచి చేస్తున్నారు. ∙∙ ఒక రంగం అని కాదు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసులు, మాన్యుఫాక్చరింగ్, హెల్త్‌కేర్, మెటల్ అండ్ మైనింగ్ మహిళా శక్తిని ఆలంబనగా చేసుకుంటున్నాయి! యాక్సిస్ బ్యాంకు, ఇన్ఫోసిస్, టాటా స్టీల్, వేదాంత, ఆర్పీజీ గ్రూప్, దాల్మియా సిమెంట్, టాటా కెమికల్స్ వంటి సంస్థలు మహిళల్ని చేర్చుకోడానికి ఆసక్తి చూపుతున్నాయి. వర్క్ ఫ్రమ్ హోమ్ అనడంతో మహిళలూ ఉత్సాహంగా ముందుకు వస్తున్నారు. యాక్సిస్ బ్యాంకు వచ్చే ఏడాది తమ మేనేజ్మెంట్, ఇంజనీరింగ్, చార్టర్డ్ అకౌంటెన్సీ విభాగాలకు దేశంలోని రెండు వేల క్యాంపస్‌ల నుంచి ఉద్యోగుల్ని ఎంపిక చేసుకోవాలని నిర్ణయించింది. అందులో 40 శాతం వరకు మహిళా అభ్యర్థులకే కేటాయించింది! ఇక ఇన్ఫోసిన్ కంపెనీ 2021–22 ఆర్థిక సంవత్సరంలో ‘అప్పుడే కాలేజీ నుంచి బయటపడిన’ (ఫ్రెష్ బ్యాచ్) పట్టభద్రులకు 17 వేల ఉద్యోగాలను ఇచ్చేందుకు ప్రణాళికను సిద్ధం చేసి పెట్టుకుంది. అందులో సగం పూర్తిగా యువతులకే. దాల్మియా సిమెంట్స్ కూడా ప్రత్యేకంగా మహిళల కోసమే నియామకాల్ని చేపట్టనుంది. అందుకోసం మహిళా కళాశాలల్లో, మహిళా విశ్వ విద్యాలయాలలో ముఖాముఖి ఇంటర్వ్యూలు నిర్వహించనుంది. టాటా స్టీల్స్‌లో కూడా వచ్చే ఆర్థిక సంవత్సరంలో మేనేజ్మెంట్ విభాగంలో నలభై శాతం వరకు మహిళలే ఉండబోతున్నారు. పనివేళల్ని సులభతరం చేస్తే మహిళల పని సామర్థ్యం పెరిగి మంచి ఫలితాలు వస్తాయని ఈ కంపెనీల అనుభవంలోకి వచ్చింది కనుకనే మహిళా ఉద్యోగులకు ప్రాధాన్యం ఇస్తున్నాయని ప్రముఖ ‘జాబ్స్ ఫర్ హయర్’ సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నేహా బగారియా చెబుతున్నారు. ‘‘అంతేకాదు.. స్త్రీ, పురుషుల నియామకాలలో ప్రస్తుతం ఉన్న అంతరం తగ్గి, జెండర్ డైవర్సిటీ వృద్ధి చెందుతుంది’’ అని కూడా ఆమె అంటున్నారు. నేహా బగారియా, ‘జాబ్స్ ఫర్ హయర్’ సంస్థ సీఈవో. -
యశస్విని సింగ్ పసిడి గురి...
ప్రపంచ కప్ షూటింగ్ టోర్నమెంట్లో భారత్‌కు మూడో స్వర్ణ పతకం లభించింది. బ్రెజిల్‌లోని రియో డి జనీరోలో జరుగుతున్న ఈ ఈవెంట్లో శనివారం మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో భారత అమ్మాయి యశస్విని సింగ్ స్వర్ణం సాధించింది. ఫైనల్లో యశస్విని 236.7 పాయింట్లు స్కోరు చేసి విజేతగా నిలిచింది. అదే క్రమంలో భారత్‌కు ఈ విభాగంలో టోక్యో ఒలింపిక్స్ బెర్త్‌ను అందించింది. ఒలీనా (ఉక్రెయిన్–234.8 పాయింట్లు) రజతం, జాస్మీనా (సెర్బియా –215.7 పాయింట్లు) కాంస్యం గెలిచారు. ఈ టోర్నీలో భారత్‌కు ఇలవేనిల్, అభిషేక్ వర్మ స్వర్ణాలు అందించారు. -
‘ఇంతి’తై.. ఏలుకో!
ఆమె.. ఆకాశంలో సగం. మరి చట్టసభల్లో, ఇతరత్రా అవకాశాల్లో..?!. గ్రేటర్ పరిధిలో చట్టసభల్లో ప్రాతినిధ్యం విషయంలో ఆమె సగం కంటే తీసికట్టే.. మహా నగరం పరిధిలో 1951 హైదరాబాద్ రాష్ట్ర శాసనసభకు జరిగిన ఎన్నికలు మొదలు 2009లో జరిగిన సార్వత్రిక ఎన్నికల వరకు శాసనసభ్యులుగా ఎన్నికైన మహిళల సంఖ్య చాలా తక్కువ. మహిళా సాధికారత, హక్కుల గురించి వల్లెవేసే ప్రధాన రాజకీయ పార్టీలు.. టికెట్ల విషయానికి వచ్చే సరికి 33 శాతమైనా కేటాయించట్లేదు. 2011 జనాభా లెక్కల ప్రకారం గ్రేటర్ పరిధిలో పురుషులు 39,18,570, స్త్రీలు 37,43,425 మంది ఉన్నారు. అంటే 1,75,145 మేర పురుషులే అత్యధికంగా ఉన్నారన్నమాట. అయితే ఈసారి జనాభా ప్రాతిపదికన గ్రేటర్ పరిధిలోని 25 శాసనసభ స్థానాల్లో కనీసం సగం స్థానాల్లోనైనా ప్రధాన రాజకీయ పార్టీలు మహిళలకు టిక్కెట్లు కేటాయించాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. మహిళలపై పెరుగుతున్న అకృత్యాలను కట్టడి చేసేలా చట్టాలను రూపొందించాలంటే మహిళలు అత్యధికంగా చట్టసభల్లో ప్రవేశించాల్సిందేనని అంటున్నాయి. ఆయా రాజకీయ పార్టీలు ఈసారి మహిళలకు సముచిత స్థానం కల్పించకుంటే తిరస్కారానికి గురికాక తప్పదని హెచ్చరిస్తున్నాయి. గ్రేటర్లో ఇదీ అతివల ‘స్థానం’ 1951 సార్వత్రిక ఎన్నికల్లో శాలిబండ నుంచి మాసూమా బేగం తొలి మహిళా కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలుపొంది అసెంబ్లీలో అడుగుపెట్టారు. 1957 ఎన్నికల్లో పత్తర్‌ఘట్టి నుంచి గెలుపొందిన ఆమె.. 1962లో ఓటమి పాలయ్యారు 1957 ఎన్నికల్లో మలక్‌పేట నుంచి ఫతీజా ఆలం (పీడీపీ) పోటీచేసి ఓడిపోయారు. అవే ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నుంచి సుమిత్రాదేవి (కాంగ్రెస్) విజయం సాధించారు 1962లో హైదరాబాద్ (తూర్పు) నియోజకవర్గం నుంచి సుమిత్రాదేవి, జూబ్లీహిల్స్ నుంచి రొడామిస్త్రీ విజయకేతనం ఎగురవేశారు 1967 ఎన్నికల్లో మలక్‌పేట నుంచి సరోజిని పుల్లారెడ్డి విజయదుందుభి మోగించారు. 1972లోనూ తన స్థానాన్ని పదిలం చేసుకున్నారు 1978లో లక్ష్మీకాంతమ్మ (హిమాయత్‌నగర్), 1983లో కాట్రగడ్డ ప్రసూన (సనత్‌నగర్-టీడీపీ) విజయం సాధించారు 1989లో మేరీ రవీంద్రనాథ్ (సికింద్రాబాద్-కాంగ్రెస్) గెలుపొంది.. 1994, 1999 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు 1989లో మాజీ ముఖ్యమంత్రి టి.అంజయ్య సతీమణి మణెమ్మ సికింద్రాబాద్ ఎంపీగా గెలుపొందారు. 2009 శాసనసభ ఎన్నికల్లో ముషీరాబాద్ అభ్యర్థినిగా మణెమ్మ, సికింద్రాబాద్ నుంచి సినీనటి జయసుధ, మహేశ్వరం నుంచి సబితా ఇంద్రారెడ్డి (కాంగ్రెస్) విజయం సాధించారు. సబిత.. దేశంలో తొలి మహిళా హోంమంత్రిగా రికార్డు సృష్టించారు. అక్షరాస్యతలోనూ వెనుకంజే.. నగరంలో అక్షరాస్యులైన పురుషులు 29,97,979 మంది ఉండగా, మహిళలు 25,93,017 మంది ఉన్నారు పాఠశాల స్థాయిలో డ్రాపవుట్స్, బస్తీల్లో పాఠశాలలు అందుబాటులో లేకపోవడం వంటివి ఇందుకు కారణాలని తెలుస్తోంది 0-6 వయసు గ్రూపులో బాలుర కంటే బాలికల సంఖ్య తక్కువ. ఈ గ్రూపులో బాలురు 4,73,195, బాలికలు 4,36,255 మంది ఉన్నారు.