ఫార్చూన్‌ 500 లీడర్లలో మహిళలు అంతంతే .. | Only 1. 6percent of companies listed on Fortune India 500 have women at the helm | Sakshi
Sakshi News home page

ఫార్చూన్‌ 500 లీడర్లలో మహిళలు అంతంతే ..

Published Thu, Mar 7 2024 5:24 AM | Last Updated on Thu, Mar 7 2024 5:24 AM

Only 1. 6percent of companies listed on Fortune India 500 have women at the helm - Sakshi

1.6 శాతం సంస్థలకే మహిళల సారథ్యం

ఫార్చూన్‌ ఇండియా, ఎస్‌పీ జైన్‌ ఇనిస్టిట్యూట్‌ అధ్యయనంలో వెల్లడి

మార్చి 8 మహిళా దినోత్సవం సందర్భంగా..

న్యూఢిల్లీ: కార్పొరేట్‌ ప్రపంచంలో మహిళలు దూసుకెడుతున్నా.. కంపెనీలకు సారథ్యం వహిస్తున్న వారి సంఖ్య అంతంతమాత్రంగానే ఉంటోంది. ఫార్చూన్‌ ఇండియా 500 కంపెనీల్లో కేవలం 1.6 శాతం సంస్థలు మాత్రమే మహిళల సారథ్యంలో ఉండటం ఇందుకు నిదర్శనం. ఫార్చూన్‌ ఇండియా, ఎస్‌పీ జైన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ రీసెర్చ్‌ నిర్వహించిన ఒక అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.

కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ, బిల్‌ అండ్‌ మెలిండా గేట్స్‌ ఫౌండేషన్‌ దీనికి తోడ్పాటు అందించగా, ముంబై, కోల్‌కతా, బెంగళూరు, ఢిల్లీ–ఎన్‌సీఆర్‌లో 16 రౌండ్‌టేబుల్‌ సమావేశాలు నిర్వహించారు. వీటిలో 130 మంది పైచిలుకు పరిశ్రమ దిగ్గజాలు పాల్గొన్నారు. అలాగే సర్వే ప్రశ్నాపత్రం ద్వారా ఫార్చూన్‌ 500 కంపెనీల అభిప్రాయాలు కూడా సేకరించారు. ‘మహిళల సారథ్యంలో అభివృద్ధి లక్ష్యాన్ని సాధించే దిశగా పరిష్కరించుకోవాల్సిన సమస్యలను గుర్తించడంలో పరిశ్రమ పారదర్శకంగా వ్యవహరిస్తుండటం ప్రశంసనీయం‘ అని నివేదికను ఆవిష్కరించిన సందర్భంగా కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ .. సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పేర్కొన్నారు.  

అధ్యయనం విశేషాలు..
► ఫార్చూన్‌ ఇండియా ఏటా అత్యధిక ఆదాయాలు ఆర్జించే 500 టాప్‌ కంపెనీలతో జాబితా విడుదల చేస్తుంటుంది. అధ్యయనం ప్రకారం వీటిలో కేవలం 1.6 శాతం సంస్థల్లోనే మహిళా ఎండీలు/సీఈవోలు ఉన్నారు. తర్వాత స్థానంలో ఉండే నెక్ట్స్‌ 500 సంస్థల్లో 5 శాతం, ఫార్చూన్‌ ఇండియా 1000 కంపెనీల లిస్టులో 3.2 శాతం మంది ఉన్నారు.
► కుటుంబ బాధ్యతల కారణంగా 30–40 శాతం మంది ఉద్యోగినులు .. మిడిల్‌ మేనేజ్‌మెంట్‌ స్థాయికి రాగానే నిష్క్రమిస్తుండటంతో వారి ప్రాతినిధ్యం తగ్గుతోంది. ప్రసూతి సెలవులు తీసుకోవడం, ప్రసవం తర్వాత తిరిగి ఉద్యోగాల్లో చేరడం సవాలుగా ఉంటోంది.  
► కార్పొరేట్‌ మైండ్‌సెట్‌పరమైన సమస్యలు కూడా కెరియర్‌లో మహిళల పురోగతికి సమస్యాత్మకంగా ఉంటున్నాయి. ఉద్యోగినులు ఆరు నెలల పాటు మెటర్నిటీ లీవులు తీసుకునే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో మిడ్‌–మేనేజ్‌మెంట్‌ స్థాయి ఉద్యోగాల్లో మహిళలను తీసుకోవడానికి సంస్థలు సంకోచిస్తున్నాయి. ఇది పెయిడ్‌ లీవు కావడంతో చాలా మటుకు సంస్థలు – ముఖ్యంగా చిన్న సంస్థలు – పెట్టుబడి పెట్టడానికి ఇష్టపడటం లేదు. అలాగే పిల్లల బోర్డు ఎగ్జామ్‌ల కోసం, తల్లిదండ్రులు..లేదా అత్తమామల సంరక్షణ కోసం నలభైలలో బ్రేక్‌ తీసుకోవాల్సి వస్తుండటం వంటివి కూడా మహిళ ఉద్యోగులకు సమస్యాత్మకంగా ఉంటున్నాయి.
► వేరే ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తే మహిళలు వెళ్లలేరు, లాభనష్టాల పరిస్థితులను సరిగ్గా చక్కబెట్టగలిగే సామరŠాధ్యలు వారికి ఉండవు అనే మూస అభిప్రాయాలు కూడా వారి పురోగతికి అవరోధాలుగా ఉంటున్నాయి. ఇలాంటి అభిప్రాయాల వల్ల వారిని నేరుగా అడగకుండానే యాజమాన్యాలు మహిళా ఉద్యోగుల విషయంలో ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకునే పరిస్థితి ఉంటోంది.
► అయితే, కంపెనీల్లో లింగ అసమానతలపై అవగాహన పెరుగుతోంది.  


రూ. 200 కోట్లు ఆర్జించిన ఎయిర్‌బీఎన్‌బీ మహిళా హోస్ట్‌లు
ఆన్‌లైన్‌ హోస్టింగ్‌ ప్లాట్‌ఫాం ఎయిర్‌బీఎన్‌బీలోని మహిళా హోస్ట్‌లు (ఆతిథ్య సేవలు అందించేవారు) దేశీయంగా 2023లో  రూ. 200 కోట్లు పైగా ఆర్జించారు. స్థానిక ఆర్థిక వ్యవస్థలు, కమ్యూనిటీల వృద్ధిపై మహిళలు చూపుతున్న సానుకూల ప్రభావాలకు ఇది నిదర్శనమని ఎయిర్‌బీఎన్‌బీ తెలిపింది. భారత్‌లోని తమ హోస్టింగ్‌ కమ్యూనిటీలో సుమారు 30 శాతం మంది మహిళలు ఉన్నారని ఎయిర్‌బీఎన్‌బీ ఇండియా జనరల్‌ మేనేజర్‌ అమన్‌ప్రీత్‌ బజాజ్‌ తెలిపారు.

మహిళా పర్యాటకులకు, మహిళా హోస్ట్‌లకు సురక్షితమైన పరిస్థితులు కలి్పంచేందుకు తాము కట్టుబడి ఉన్నామని ఆయన పేర్కొన్నారు. మహిళా అతిథులు భారత్‌లో ఎక్కువగా గోవా, బెంగళూరు, ఢిల్లీ, పుణె, డెహ్రాడూన్, జైపూర్‌లను ఎంచుకుంటున్నారని వివరించారు. అంతర్జాతీయంగా లండన్, దుబాయ్, టొరంటో, ప్యారిస్‌ మొదలైనవి భారతీయ మహిళా పర్యాటకులకు ఫేవరెట్‌గా ఉంటున్నాయని బజాజ్‌ పేర్కొన్నారు.  

2023 మహిళా రుణాల్లో భారీ పురోగతి
మహిళా రుణాల విషయంలో 2023లో మంచి పురోగతి కనిపించింది. మహిళా రుణాలు  పెరిగినట్లు క్రెడిట్‌ ఇన్‌ఫర్మేషన్‌ కంపెనీ ఒకటి పేర్కొంది. వ్యక్తిగత రుణాలు, ద్విచక్ర వాహన రుణాల పోర్ట్‌ఫోలియో అత్యంత వేగంగా 26 శాతం వృద్ధిని కనబరిచినట్లు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా  క్రిఫ్‌ హై మార్క్‌ విడుదల చేసిన నివేదిక పేర్కొంది. నివేదిక ప్రకారం మహిళలకు సంబంధించి మొత్తం రుణ పోర్ట్‌ఫోలియో 2022 చివరి నాటికి రూ. 26 లక్షల కోట్ల నుండి 2023లో రూ. 30.95 లక్షల కోట్లకు
ఎగసింది.  

వ్యాపారవేత్తలుగా మారేందుకు ఆసక్తి

మహిళా ఉద్యోగస్థుల్లో అత్యధికుల అభిమతం
ఇండియాలెండ్స్‌ సర్వేలో 76 శాతంమంది ఓటు
ఫైనాన్షియల్‌ ఇన్‌స్ట్రుమెంట్స్‌పై అవగాహనకూ సై


దేశీయంగా ఉద్యోగాలు చేస్తున్న మహిళల్లో అత్యధిక శాతంమంది వ్యాపారవేత్తలు(ఎంటర్‌ప్రెన్యూర్‌)గా మారేందుకు ఆసక్తిని ప్రదర్శించారు. సొంత బిజినెస్‌ ప్రారంభించాలనే ఆలోచనను కలిగి ఉన్నట్లు ఇండియాలెండ్స్‌ నిర్వహించిన సర్వే పేర్కొంది. 24–55 ఏళ్ల మధ్య వయసున్న 10,000 మంది వర్కింగ్‌ ఉమన్‌తో సర్వే చేపట్టినట్లు వ్యక్తిగత రుణాలు, క్రెడిట్‌ కార్డుల గణాంకాలు అందించే ఆన్‌లైన్‌ మార్కెట్‌ప్లేస్‌ ఇండియాలెండ్స్‌ తెలియజేసింది.

మెట్రో నగరాలతోపాటు టైర్‌–1, టైర్‌–2 పట్టణాలలో ఉద్యోగాలు చేసే మహిళలను సర్వేకు పరిగణించినట్లు వెల్లడించింది. వీరిలో 76 శాతం మంది సొంత బిజినెస్‌ను ప్రారంభించాలనే కోరికను వ్యక్తం చేసినట్లు పేర్కొంది. 86 శాతంమంది మహిళలు బడ్జెటింగ్, పెట్టుబడులు, పొదుపు తదితర విభిన్న ఆర్థిక ప్రొడక్టుల(ఫైనాన్షియల్‌ ఇన్‌స్ట్రుమెంట్స్‌)పై అవగాహనను పెంపొందించుకోవాలనే పట్టుదలను ప్రదర్శించినట్లు వివరించింది.

వ్యాపారవేత్తలు సైతం
పలువురు మహిళా వ్యాపారవేత్తలను సైతం సర్వేకు పరిగణించినట్లు ఇండియాలెండ్స్‌ పేర్కొంది. వీరిలో 68 శాతం ఉమన్‌ ఎంటర్‌ప్రెన్యూర్స్‌ తమ కంపెనీ ఖాతాలను స్వతంత్రంగా నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. 32 శాతంమంది మాత్రమే ఇందుకు భర్తలు, కుటుంబ సభ్యులు, వృత్తి నిపుణులపై ఆధారపడుతున్నట్లు తెలియజేశారు. ఇక బిజినెస్‌ ఉమన్‌లో దాదాపు 69 శాతంమంది, వేతనాలు అందుకునే మహిళల్లో 51 శాతంమంది తమ సొమ్మును పెట్టుబడులకు మళ్లిస్తున్నట్లు వెల్లడించారు.

వీరిలో 79 శాతంమంది సొంతంగా ఇన్వెస్ట్‌ చేస్తున్నట్లు తెలియజేశారు. కేవలం 21 శాతంమంది పెట్టుబడులకు సంబంధించి తమ భాగస్వాములు లేదా తల్లిదండ్రుల సహాయం తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఇక 25 శాతంమంది మహిళలు విశ్వాసంలేక సొంత పెట్టుబడి నిర్ణయాలు తీసుకోకపోగా.. మరో 29 శాతంమంది ఫైనాన్షియల్‌ ఇన్‌స్ట్రుమెంట్స్‌పట్ల పరిమిత అవగాహన కారణంగా వెనకడుగు వేస్తున్నట్లు వెల్లడించారు.   

సర్వే వివరాలిలా
సర్వేలో పాల్గొన్నవారిలో దాదాపు 34 శాతంమంది మహిళలు 25–34 మధ్య వయసు కలిగినవారుకాగా.. సుమారు 26 శాతంమంది 35–44 మధ్యవయసు గలవారిగా ఇండియాలెండ్స్‌ తెలియజేసింది. 22 శాతంమంది 18–24 ఏజ్‌ గ్రూప్‌కాగా.. 45 ఏళ్లకుపైబడినవారు 19 శాతంగా వెల్లడించింది. ఈ మహిళల్లో 44.5 శాతంమంది ఉద్యోగస్థులు, సొంత ఉపాధిగలవారు 31 శాతంమంది, గృహిణులు 12 శాతంమంది, సీఏలు, అడ్వకేట్లు తదితర వ్యక్తిగత వృత్తి నిపుణులు 4.4 శాతంమందిగా తెలియజేసింది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement