Fortune India
-
అడ్వాన్స్ ట్యాక్స్‌లో ‘కింగ్’ ఖాన్!
న్యూఢిల్లీ: గత ఆర్థిక సంవత్సరం అత్యధికంగా అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించిన సెలబ్రిటీల్లో బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ అగ్రస్థానంలో నిల్చారు. ఆయన రూ. 92 కోట్లు చెల్లించారు. తమిళ నటుడు విజయ్ రూ. 80 కోట్లతో రెండో స్థానంలో ఉన్నారు. 2023–24లో భారీ స్థాయిలో అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించిన సెలబ్రిటీలతో ఫార్చూన్ ఇండియా రూపొందించిన ’ది స్టార్ కాస్ట్’ లిస్టులో ఈ విషయాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం బాలీవుడ్ నటులు సల్మాన్ ఖాన్ (రూ. 75 కోట్లు), అమితాబ్ బచ్చన్ (రూ. 71 కోట్లు) వరుసగా మూడు, నాలుగో స్థానాల్లో ఉన్నారు. క్రికెటర్లలో విరాట్ కోహ్లి అత్యధికంగా రూ. 66 కోట్లు చెల్లించగా, ఎంఎస్ ధోని రూ. 38 కోట్లు, సచిన్ టెండూల్కర్..సౌరవ్ గంగూలీ వరుసగా రూ.28 కోట్లు, రూ. 23 కోట్లు చెల్లించారు. పెద్ద మొత్తంలో అడ్వాన్స్ ట్యాక్స్ కట్టిన సినీ ప్రముఖుల్లో అల్లు అర్జున్, మోహన్‌లాల్ చెరో రూ. 14 కోట్లు కట్టగా ఆమిర్ ఖాన్ రూ. 10 కోట్లు చెల్లించారు. -
ఫార్చూన్ 500 లీడర్లలో మహిళలు అంతంతే ..
న్యూఢిల్లీ: కార్పొరేట్ ప్రపంచంలో మహిళలు దూసుకెడుతున్నా.. కంపెనీలకు సారథ్యం వహిస్తున్న వారి సంఖ్య అంతంతమాత్రంగానే ఉంటోంది. ఫార్చూన్ ఇండియా 500 కంపెనీల్లో కేవలం 1.6 శాతం సంస్థలు మాత్రమే మహిళల సారథ్యంలో ఉండటం ఇందుకు నిదర్శనం. ఫార్చూన్ ఇండియా, ఎస్పీ జైన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ రీసెర్చ్ నిర్వహించిన ఒక అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ, బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ దీనికి తోడ్పాటు అందించగా, ముంబై, కోల్‌కతా, బెంగళూరు, ఢిల్లీ–ఎన్సీఆర్లో 16 రౌండ్‌టేబుల్ సమావేశాలు నిర్వహించారు. వీటిలో 130 మంది పైచిలుకు పరిశ్రమ దిగ్గజాలు పాల్గొన్నారు. అలాగే సర్వే ప్రశ్నాపత్రం ద్వారా ఫార్చూన్ 500 కంపెనీల అభిప్రాయాలు కూడా సేకరించారు. ‘మహిళల సారథ్యంలో అభివృద్ధి లక్ష్యాన్ని సాధించే దిశగా పరిష్కరించుకోవాల్సిన సమస్యలను గుర్తించడంలో పరిశ్రమ పారదర్శకంగా వ్యవహరిస్తుండటం ప్రశంసనీయం‘ అని నివేదికను ఆవిష్కరించిన సందర్భంగా కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ .. సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పేర్కొన్నారు. అధ్యయనం విశేషాలు.. ► ఫార్చూన్ ఇండియా ఏటా అత్యధిక ఆదాయాలు ఆర్జించే 500 టాప్ కంపెనీలతో జాబితా విడుదల చేస్తుంటుంది. అధ్యయనం ప్రకారం వీటిలో కేవలం 1.6 శాతం సంస్థల్లోనే మహిళా ఎండీలు/సీఈవోలు ఉన్నారు. తర్వాత స్థానంలో ఉండే నెక్ట్స్ 500 సంస్థల్లో 5 శాతం, ఫార్చూన్ ఇండియా 1000 కంపెనీల లిస్టులో 3.2 శాతం మంది ఉన్నారు. ► కుటుంబ బాధ్యతల కారణంగా 30–40 శాతం మంది ఉద్యోగినులు .. మిడిల్ మేనేజ్మెంట్ స్థాయికి రాగానే నిష్క్రమిస్తుండటంతో వారి ప్రాతినిధ్యం తగ్గుతోంది. ప్రసూతి సెలవులు తీసుకోవడం, ప్రసవం తర్వాత తిరిగి ఉద్యోగాల్లో చేరడం సవాలుగా ఉంటోంది. ► కార్పొరేట్ మైండ్సెట్పరమైన సమస్యలు కూడా కెరియర్లో మహిళల పురోగతికి సమస్యాత్మకంగా ఉంటున్నాయి. ఉద్యోగినులు ఆరు నెలల పాటు మెటర్నిటీ లీవులు తీసుకునే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో మిడ్–మేనేజ్మెంట్ స్థాయి ఉద్యోగాల్లో మహిళలను తీసుకోవడానికి సంస్థలు సంకోచిస్తున్నాయి. ఇది పెయిడ్ లీవు కావడంతో చాలా మటుకు సంస్థలు – ముఖ్యంగా చిన్న సంస్థలు – పెట్టుబడి పెట్టడానికి ఇష్టపడటం లేదు. అలాగే పిల్లల బోర్డు ఎగ్జామ్ల కోసం, తల్లిదండ్రులు..లేదా అత్తమామల సంరక్షణ కోసం నలభైలలో బ్రేక్ తీసుకోవాల్సి వస్తుండటం వంటివి కూడా మహిళ ఉద్యోగులకు సమస్యాత్మకంగా ఉంటున్నాయి. ► వేరే ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తే మహిళలు వెళ్లలేరు, లాభనష్టాల పరిస్థితులను సరిగ్గా చక్కబెట్టగలిగే సామరŠాధ్యలు వారికి ఉండవు అనే మూస అభిప్రాయాలు కూడా వారి పురోగతికి అవరోధాలుగా ఉంటున్నాయి. ఇలాంటి అభిప్రాయాల వల్ల వారిని నేరుగా అడగకుండానే యాజమాన్యాలు మహిళా ఉద్యోగుల విషయంలో ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకునే పరిస్థితి ఉంటోంది. ► అయితే, కంపెనీల్లో లింగ అసమానతలపై అవగాహన పెరుగుతోంది. రూ. 200 కోట్లు ఆర్జించిన ఎయిర్‌బీఎన్‌బీ మహిళా హోస్ట్‌లు ఆన్లైన్ హోస్టింగ్ ప్లాట్‌ఫాం ఎయిర్బీఎన్బీలోని మహిళా హోస్ట్‌లు (ఆతిథ్య సేవలు అందించేవారు) దేశీయంగా 2023లో రూ. 200 కోట్లు పైగా ఆర్జించారు. స్థానిక ఆర్థిక వ్యవస్థలు, కమ్యూనిటీల వృద్ధిపై మహిళలు చూపుతున్న సానుకూల ప్రభావాలకు ఇది నిదర్శనమని ఎయిర్‌బీఎన్‌బీ తెలిపింది. భారత్‌లోని తమ హోస్టింగ్ కమ్యూనిటీలో సుమారు 30 శాతం మంది మహిళలు ఉన్నారని ఎయిర్‌బీఎన్‌బీ ఇండియా జనరల్ మేనేజర్ అమన్‌ప్రీత్ బజాజ్ తెలిపారు. మహిళా పర్యాటకులకు, మహిళా హోస్ట్‌లకు సురక్షితమైన పరిస్థితులు కలి్పంచేందుకు తాము కట్టుబడి ఉన్నామని ఆయన పేర్కొన్నారు. మహిళా అతిథులు భారత్‌లో ఎక్కువగా గోవా, బెంగళూరు, ఢిల్లీ, పుణె, డెహ్రాడూన్, జైపూర్లను ఎంచుకుంటున్నారని వివరించారు. అంతర్జాతీయంగా లండన్, దుబాయ్, టొరంటో, ప్యారిస్ మొదలైనవి భారతీయ మహిళా పర్యాటకులకు ఫేవరెట్‌గా ఉంటున్నాయని బజాజ్ పేర్కొన్నారు. 2023 మహిళా రుణాల్లో భారీ పురోగతి మహిళా రుణాల విషయంలో 2023లో మంచి పురోగతి కనిపించింది. మహిళా రుణాలు పెరిగినట్లు క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీ ఒకటి పేర్కొంది. వ్యక్తిగత రుణాలు, ద్విచక్ర వాహన రుణాల పోర్ట్‌ఫోలియో అత్యంత వేగంగా 26 శాతం వృద్ధిని కనబరిచినట్లు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా క్రిఫ్ హై మార్క్ విడుదల చేసిన నివేదిక పేర్కొంది. నివేదిక ప్రకారం మహిళలకు సంబంధించి మొత్తం రుణ పోర్ట్‌ఫోలియో 2022 చివరి నాటికి రూ. 26 లక్షల కోట్ల నుండి 2023లో రూ. 30.95 లక్షల కోట్లకు ఎగసింది. వ్యాపారవేత్తలుగా మారేందుకు ఆసక్తి మహిళా ఉద్యోగస్థుల్లో అత్యధికుల అభిమతం ఇండియాలెండ్స్ సర్వేలో 76 శాతంమంది ఓటు ఫైనాన్షియల్ ఇన్‌స్ట్రుమెంట్స్‌పై అవగాహనకూ సై దేశీయంగా ఉద్యోగాలు చేస్తున్న మహిళల్లో అత్యధిక శాతంమంది వ్యాపారవేత్తలు(ఎంటర్ప్రెన్యూర్)గా మారేందుకు ఆసక్తిని ప్రదర్శించారు. సొంత బిజినెస్ ప్రారంభించాలనే ఆలోచనను కలిగి ఉన్నట్లు ఇండియాలెండ్స్ నిర్వహించిన సర్వే పేర్కొంది. 24–55 ఏళ్ల మధ్య వయసున్న 10,000 మంది వర్కింగ్ ఉమన్‌తో సర్వే చేపట్టినట్లు వ్యక్తిగత రుణాలు, క్రెడిట్ కార్డుల గణాంకాలు అందించే ఆన్లైన్ మార్కెట్‌ప్లేస్ ఇండియాలెండ్స్ తెలియజేసింది. మెట్రో నగరాలతోపాటు టైర్–1, టైర్–2 పట్టణాలలో ఉద్యోగాలు చేసే మహిళలను సర్వేకు పరిగణించినట్లు వెల్లడించింది. వీరిలో 76 శాతం మంది సొంత బిజినెస్‌ను ప్రారంభించాలనే కోరికను వ్యక్తం చేసినట్లు పేర్కొంది. 86 శాతంమంది మహిళలు బడ్జెటింగ్, పెట్టుబడులు, పొదుపు తదితర విభిన్న ఆర్థిక ప్రొడక్టుల(ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్)పై అవగాహనను పెంపొందించుకోవాలనే పట్టుదలను ప్రదర్శించినట్లు వివరించింది. వ్యాపారవేత్తలు సైతం పలువురు మహిళా వ్యాపారవేత్తలను సైతం సర్వేకు పరిగణించినట్లు ఇండియాలెండ్స్ పేర్కొంది. వీరిలో 68 శాతం ఉమన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ తమ కంపెనీ ఖాతాలను స్వతంత్రంగా నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. 32 శాతంమంది మాత్రమే ఇందుకు భర్తలు, కుటుంబ సభ్యులు, వృత్తి నిపుణులపై ఆధారపడుతున్నట్లు తెలియజేశారు. ఇక బిజినెస్ ఉమన్‌లో దాదాపు 69 శాతంమంది, వేతనాలు అందుకునే మహిళల్లో 51 శాతంమంది తమ సొమ్మును పెట్టుబడులకు మళ్లిస్తున్నట్లు వెల్లడించారు. వీరిలో 79 శాతంమంది సొంతంగా ఇన్వెస్ట్ చేస్తున్నట్లు తెలియజేశారు. కేవలం 21 శాతంమంది పెట్టుబడులకు సంబంధించి తమ భాగస్వాములు లేదా తల్లిదండ్రుల సహాయం తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఇక 25 శాతంమంది మహిళలు విశ్వాసంలేక సొంత పెట్టుబడి నిర్ణయాలు తీసుకోకపోగా.. మరో 29 శాతంమంది ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్పట్ల పరిమిత అవగాహన కారణంగా వెనకడుగు వేస్తున్నట్లు వెల్లడించారు. సర్వే వివరాలిలా సర్వేలో పాల్గొన్నవారిలో దాదాపు 34 శాతంమంది మహిళలు 25–34 మధ్య వయసు కలిగినవారుకాగా.. సుమారు 26 శాతంమంది 35–44 మధ్యవయసు గలవారిగా ఇండియాలెండ్స్ తెలియజేసింది. 22 శాతంమంది 18–24 ఏజ్ గ్రూప్‌కాగా.. 45 ఏళ్లకుపైబడినవారు 19 శాతంగా వెల్లడించింది. ఈ మహిళల్లో 44.5 శాతంమంది ఉద్యోగస్థులు, సొంత ఉపాధిగలవారు 31 శాతంమంది, గృహిణులు 12 శాతంమంది, సీఏలు, అడ్వకేట్లు తదితర వ్యక్తిగత వృత్తి నిపుణులు 4.4 శాతంమందిగా తెలియజేసింది. -
'మోస్ట్ పవర్ఫుల్ ఉమెన్' లిస్ట్‌లో నీతా అంబానీ
Fortune India Most Powerful Woman 2021: రిలయన్స్ ఫౌండేషన్ ఫౌండర్, చైర్పర్సన్ నీతా అంబానీ వ్యాపార రంగంలో అద్భుతాలు చేస్తున్నారు. లాక్ డౌన్ టైమ్‌లో కరోనా బాధితులకు ఉచితంగా సేవల్ని అందించినందుకు గాను ఆమెకు అరుదైన గౌరవం లభించింది. ఫార్చున్ మ్యాగజైన్ రిలీజ్ చేసిన 'మోస్ట్ పవర్ ఫుల్ ఉమెన్' జాబితాలో రెండో స్థానంలో చోటు దక్కించుకున్నారు. దేశంలో కరోనా కారణంగా ఆస్పత్రులలో బెడ్ల కొరత ఏర్పడింది. అయితే ఆ బెడ్ల కొరత లేకుండా కోవిడ్ బాధితులకు నీతా అంబానీ అండగా నిలిచారు. రిలయన్స్ ఫౌండేషన్ బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్‌తో కలిసి ముంబైలో తొలిసారి 250 పడకల కోవిడ్ వార్డ్‌ను ఏర్పాటు చేయించి ట్రీట్మెంట్ ప్రారంభించారు. ఆక్సిజన్ కొరత లేకుండా 2,000 పడకలకు పెంచి ఉచితంగా ట్రీట్మెంట్ అందించేలా చేశారు. ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతి రోజూ 15,000 కంటే ఎక్కువగా కోవిడ్-19 టెస్టులు నిర్వహించేలా టెస్టింగ్ ల్యాబ్‌తో పాటు ప్రతిరోజూ లక్ష పీపీఈ కిట్లతో పాటు ఎన్-95 మాస్క్‌లను అందించారు. రిలయన్స్ ఫౌండేషన్ ఫౌండర్‌గా ఉన్న నీతా అంబానీ జియో హెల్త్ హబ్ సాయంతో ఇప్పటివరకు 25 లక్షల మందికి కోవిడ్ టీకాలు అందేలా చేశారు. 100 జిల్లాలు, 19 రాష్ట్రాలు, నాలుగు కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన నిరుపేదలకు, రోజూవారీ కూలీలకు, ఫ్రంట్‌లైన్ వర్కర్లతో సహా 8.5 కోట్లకు పైగా ఉచిత భోజన సదుపాయాన్ని కల్పించి మానవత్వం చాటుకున్నారు. అయితే మహమ్మారి విలయం తాండవం చేస్తున్న సమయంలో బాధితులకు అండగా నిలిచినందుకు గాను ఫార్చున్ మ్యాగజైన్ దేశంలోనే 'మోస్ట్ పవర్ ఫుల్ ఉమెన్' జాబితాలో నీతా అంబానిని ఎంపిక చేసింది. చదవండి: ప్రపంచంలో అత్యంత సంపన్న కుటుంబాలు ఇవే..! టాప్-10 లో ఇండియన్ ఫ్యామిలీ..! -
ఫార్చూన్ ఇండియా 500లో ఆర్ఐఎల్ టాప్
న్యూఢిల్లీ: ఫార్చూన్ 500 జాబితాలో భారత్ నుంచి అత్యంత విలువైన కంపెనీగా (ఆదాయం పరంగా) రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) ప్రథమ స్థానంలో నిలిచింది. ఈ జాబితాలో ఇన్నాళ్లు భారత్‌లోని టాప్ కంపెనీగా కొనసాగుతూ వచ్చిన ప్రభుత్వ రంగ సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ)ని వెనక్కినెట్టింది. తాజా ఫార్చూన్ గ్లోబల్ 500లో భారతదేశ సంపన్న పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీకి చెందిన ఆర్ఐఎల్ 106వ స్థానానికి ఎగబాకింది. ఆ తరువాత స్థానంలో ఉన్న దేశీయ కంపెనీ ఐఓసీ 117వ స్థానంలో నిలిచింది. 2018లో 62.3 బిలియన్ డాలర్లుగా ఉన్న ఆర్ఐఎల్ ఆదాయం 2019లో 32.1 శాతం వృద్ధి చెంది 82.3 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఇదే సమయంలో ఐఓసీ ఆదాయం 17.7 శాతం వృద్ధి చెంది 77.6 బిలియన్ డాలర్లుగా ఉన్నట్లు వెల్లడైంది. గడిచిన పదేళ్లలో ఆర్ఐఎల్ ఆదాయం 7.2 శాతం చొప్పున చక్రగతి వృద్ధి రేటును నమోదుచేయగా.. ఐఓసీ ఆదాయం 3.64 శాతం వృద్ధితో కొనసాగుతోంది. ఇక ఫార్చూన్ 500లో స్థానం సంపాదించిన ఇతర భారత కంపెనీల జాబితాలో.. ఓఎస్జీసీ(160), ఎస్బీఐ(236), టాటా మోటార్స్(265), బీపీసీఎల్(275), రాజేష్ ఎక్స్పోర్ట్ (495) స్థానాల్లో నిలిచాయి. జాబితాలోని మొదటి స్థానంలో అమెరికాకు చెందిన వాల్‌మార్ట్ ఉంది. -
ఫార్చూన్ ఇండియా లిస్టులో ఐఆర్సీటీసీ
నెక్ట్స్ 500 జాబితాలో మేక్మైట్రిప్, ఆర్బీఎల్ బ్యాంకులకు చోటు న్యూఢిల్లీ : ఫార్చూన్ ఇండియా నెక్స్ట్ 500 జాబితాలో ఐఆర్సీటీసీ సహా మేక్మైట్రిప్, ఆర్బీఎల్ బ్యాంక్, ఐనాక్స్ విండ్ తదితర సంస్థలు చోటు దక్కించుకున్నాయి. రాబోయే రోజుల్లో ఇండియా 500 లిస్టులో చోటు దక్కించుకోగలిగే సత్తా ఉన్న మధ్య స్థాయి కంపెనీలతో ఫార్చూన్ మ్యాగజైన్ ఈ జాబితాను రూపొందించింది. సుమారు రూ. 1,690 కోట్ల వార్షిక ఆదాయాలతో ఐఫోన్ల పంపిణీ సంస్థ రెడింగ్టన్ ఇండియా ఈ లిస్టులో టాప్‌లో నిల్చింది. ఐనాక్స్ విండ్(రూ.1,689 కోట్ల ఆదాయం), ఐఎస్ఎంటీ (రూ.1,685 కోట్లు), ఎమ్క్యూర్ ఫార్మా(రూ. 1,683.5 కోట్లు), ఓరియంట్క్రాఫ్ట్ (రూ.1,683 కోట్లు) ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. లిస్టింగ్ సన్నాహాల్లో ఉన్న ఆర్బీఎల్ బ్యాంక్(గతంలో రత్నాకర్ బ్యాంక్) 31వ స్థానంలో, ఆన్లైన్ ట్రావెల్ సంస్థ మేక్మైట్రిప్ 122వ స్థానం, భారతీయ రైల్వే టూరిజం, కేటరింగ్ విభాగం ఐఆర్సీటీసీ 328వ స్థానంలో ని ల్చాయి. మొత్తం 500 కంపెనీల్లో 434 సంస్థలు ప్రైవేటువి కాగా, 31 సంస్థలు ప్రభుత్వ రంగంలోనివి. -
ఫార్చ్యూన్ టాప్ ర్యాంక్ మళ్లీ ఐఓసీదే
న్యూఢిల్లీ: ఫార్చ్యూన్ ఇండియా-500 కంపెనీల ఈ ఏడాది జాబితాలో మళ్లీ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐఓసీ-ఆదాయం రూ.4,75,867 కోట్లు) అగ్రస్థానంలో నిలిచింది. ముకేశ్ అంబానీ నేతృత్వం లోని రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆదాయం రూ. 4,09,883 కోట్లు) రెండో స్థానంలో నిలిచింది. ప్రతి ఏటా ఫార్చ్యూన్ బిజినెస్ మ్యాగజైన్ ఆదాయాల పరంగా అగ్రశ్రేణి 500 భారతీయ కంపెనీలతో జాబితాను రూపొందిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ ఏడాది టాప్ టెన్‌లో ఆరు ప్రభుత్వ రంగ సంస్థలు, వాటిల్లో నాలుగు చమురు కంపెనీలు కావడం విశేషం. టాటా గ్రూప్‌కు చెందిన రెండు కంపెనీలు టాప్‌టెన్‌లో నిలిచాయి. అమ్మకాల వృద్ధి మందగించినప్పటికీ, లాభాల్లో రికవరీ సూచనలు కనిపిస్తున్నాయని ఈ ఏడాది జాబితా సూచిస్తోందని ఈ మ్యాగజైన్ పేర్కొంది. భారత కంపెనీలు పరిపక్వత చెందుతున్నాయని వివరించింది. ప్రతిభ గల ఉద్యోగుల కోసం భారీ ప్యాకేజీలు ఇవ్వడానికి వెనకాడ్డం లేదని పేర్కొంది. అందుకే ప్రస్తుత ఆర్థిక అనిశ్చిత పరిస్థితుల్లోనూ ఉద్యోగుల వేతనాలు, జీతాలు పెరిగాయని వివరించింది. టాప్ 8 కంపెనీలు గతేడాది తాము పొందిన స్థానాలనే ఈ ఏడాది కూడా నిలుపుకున్నాయి. ఇక ఈ జాబితాలో స్థానం సాధించిన ఇతర కంపెనీలు. భారతీ ఎయిర్టెల్(12వ స్థానం), ఐసీఐసీఐ బ్యాంక్(14), ఎన్టీపీసీ(15), టీసీఎస్ (18), ఇన్ఫోసిస్(27వ స్థానం). టాప్ టెన్ కంపెనీలు ర్యాంక్ కంపెనీ 1 ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ 2 రిలయన్స్ ఇండస్ట్రీస్ 3 భారత్ పెట్రోలియం 4 హిందూస్తాన్ పెట్రోలియం 5 స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 6 టాటా మోటార్స్ 7 ఓఎన్జీసీ 8 టాటా స్టీల్ 9 ఎస్సార్ ఆయిల్ 10 కోల్ ఇండియా