
మహిళల ప్రాతినిధ్యం తక్కువగా ఉండటమే కారణం
మైక్రోసాఫ్ట్ అధికారి హిమానీ అగ్రవాల్ వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: కృత్రిమ మేధస్సు (ఏఐ) రంగంలో మహిళల ప్రాతినిధ్యం తక్కువగా ఉంది. దీంతో భవిష్యత్ సాంకేతిక పరిజ్ఞానాలలో ప్రబలంగా ఉన్న సామాజిక వివక్ష శాశ్వతంగా పెరిగే ప్రమాదం ఉందని మైక్రోసాఫ్ట్ ఇండియా, దక్షిణాసియా చీఫ్ పార్ట్‌నర్ ఆఫీసర్ హిమానీ అగ్రవాల్ అన్నారు. ‘మహిళలను చేర్చుకోవడం అనేది ఉమ్మడి బాధ్యత. విభిన్న దృక్కోణాలు లేకుండా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌ను (ఏఐ) రూపొందించడం కొనసాగితే.. నేటి వివక్ష రేపటి సాంకేతికతలోకి బలంగా మారే ప్రమాదం ఉంది.
ఇది కేవలం సంఖ్యల సమస్య కాదు. మనం నిర్మిస్తున్న భవిష్యత్తు గురించి. ఏఐ ప్రపంచాన్ని రూపొందిస్తుంటే.. ఏఐని రూపొందిస్తున్న వ్యక్తులు ప్రపంచ వైవిధ్యాన్ని ప్రతిబింబించాలి’ అని అభిప్రాయపడ్డారు. అందుకే మనం ముందుగానే అడుగు వేయాలని అన్నారు. ఏఐని ముందుకు నడిపించడానికి యువతులలో ఉత్సుకతను రేకెత్తించడం, మెంటార్‌షిప్ నెట్‌వర్క్‌లను బలోపేతం చేయడం, మహిళలకు నైపుణ్యాలు, నాయకత్వ అవకాశాలు ఉన్నాయని తెలియజెప్పాలని పిలుపునిచ్చారు.
ఒక కఠిన పనిగా.. ఉద్యోగ రంగంలోకి ప్రవేశించడం, నిలదొక్కుకోవడం చాలా మంది మహిళలకు ఒక కఠిన పనిగా అనిపిస్తుందని హిమానీ అగ్రవాల్ అన్నారు. మైక్రోసాఫ్ట్ ప్రధాన ఉద్యోగులలో మహిళలు 31.6 శాతం ఉన్నారని చెప్పారు. మరింత మంది మహిళలను చేర్చుకోవడం కోసం కంపెనీ చురుకుగా పనిచేస్తోందని ఆమె వివరించారు. సైబర్ సెక్యూరిటీ వంటి అభివృద్ధి చెందుతున్న రంగాలలో మహిళల భాగస్వామ్యం ఎక్కువగా ఉండటం చాలా ముఖ్యమని చెప్పారు.
అయితే ఈ విభాగంలో డిమాండ్ అధికంగా ఉన్నప్పటికీ మహిళల ప్రాతినిధ్యం తక్కువగా ఉందని తెలిపారు. మహిళలు కేవలం ఉద్యోగ రంగంలోకి ప్రవేశించడమేగాక కెరీర్‌లో అభివృద్ధి చెందేలా చూసుకోవడంలో నిజమైన సవాల్, అవకాశం ఉందన్నారు. ‘సాంకేతికత సమానత్వాన్ని అందించే శక్తిని కలిగి ఉంది. సౌకర్యవంత కెరీర్‌లు, విభిన్న ఉద్యోగ బాధ్యతలు అపరిమిత అవకాశాలను అందిస్తుంది. అయినప్పటికీ మధ్య స్థాయి నుండి నాయకత్వానికి కీలక మార్పు చాలా మంది మహిళలకు అడ్డంకిగా మిగిలిపోయింది. ఇక్కడే మహిళలను చేర్చుకునే సంస్కృతి మార్పును కలిగిస్తుంది’ అని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment