social discrimination
-
కుల వివక్షకు పెత్తందారుల ఆజ్యం!
నాగా వెంకటరెడ్డి – సాక్షి ప్రత్యేక ప్రతినిధి : ‘‘దళితులుగా పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా?’’.. స్వయంగా చంద్రబాబు సందేహం ఇదీ!! ‘‘ఒరేయ్ మీకెందుకురా ఈ రాజకీయాలు? అవేవో మేం చేసుకుంటాం, మేం చూసుకుంటాం..!’’ ఎస్సీలనుద్దేశించి టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని అనుచిత వ్యాఖ్యలివీ! ఆవు చేలో మేస్తుంటే దూడ గట్టున మేస్తుందా? టీడీపీ అధినేత ప్రోద్బలంతో ఆ పార్టీ నేతలు ఇప్పుడు అంతకంటే ఇంకో అడుగు ముందుకేశారు! దళిత ప్రజాప్రతిని ధులు తమ గ్రామాలకు వస్తుంటే చాలు ఇళ్లకు తాళాలు వేసి వెళ్లిపోవడంతోపాటు పసుపు నీళ్లతో వీధులను శుభ్రం చేస్తున్నారు. అదీ ఎక్కడో కాదు.. స్వయంగా నారా చంద్రబాబు సొంతూరు ఉన్న మండలానికి చేరువలోనే కావడం గమనార్హం. పసుపు నీళ్లు చల్లుతూ... చిత్తూరు జిల్లాలో అధికారపార్టీకి చెందిన ఎస్సీ ఎమ్మెల్యేలు గ్రామాల్లోకి వస్తున్నట్లు తెలియగానే చంద్రబాబు సామాజిక వర్గీయులు తలుపులకు తాళాలు వేసుకుని ఇళ్లలో నుంచి వెళ్లిపోవడం, ఇతరులు ఎవరూ అందుబాటులో ఉండకూడదని హుకుం జారీచేయడం, ఎమ్మెల్యేలు వెళ్లిపోయిన తరువాత రోడ్లపై పసుపు నీళ్లు చల్లడం, పాలతో అభిషేకాలు చేయించడం లాంటి దారుణాలకు ఒడి గడుతున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథ కాల గురించి ప్రజలకు నేరుగా వివరిస్తూ గడప గడ పకూ మన ప్రభుత్వం కార్యక్రమాన్ని వైఎస్సార్సీపీ ప్రజా ప్రతినిధులు, నాయకులు రాష్ట్రవ్యాప్తంగా కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా చిత్తూరు జిల్లాలోని గంగాధర నెల్లూరు (జీడీ నెల్లూరు), పూతలపట్టు నియోజకవర్గాల నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న ఉప ముఖ్యమంత్రి కళ త్తూరు నారాయణస్వామి, ఎం.ఎస్.బాబు తమ తమ ప్రాంతాల్లో చురుగ్గా పర్యటిస్తున్నారు. దళిత ఎమ్మెల్యేలు వచ్చే సమయానికి అందరూ ఇళ్లకు తాళాలు వేసి వెళ్లిపోవాలని, ఎవరూ స్వాగతం పలకరాదని, పర్యటనలకు అడుగడుగునా అడ్డంకులు సృష్టించాలంటూ టీడీపీ అధినేత జారీ చేసిన ఆదేశాలను స్థానిక నాయకత్వం అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇంటికి తాళం.. పెరటిలో సర్పంచ్ ఎమ్మెల్యే ఎం.ఎస్.బాబు ఇటీవల పూతలపట్టు మండలం గుంతూరు గ్రామ సచివాలయం పరిధిలోని 170 గొల్లపల్లె పర్యటనకు వెళ్లే సమయానికి టీడీపీ నాయకులు ఇళ్లకు తాళాలు వేసుకుని వెళ్లిపోయారు. ఎమ్మెల్యే వచ్చే సమయానికి ఎవరూ ఇళ్లలో ఉండకూడదని గ్రామ సర్పంచ్, టీడీపీ నాయకుడు ప్రకాష్‌నాయుడు హుకుం జారీచేయడంతో సుమారు వంద కుటుంబాలు గ్రామం వీడి వెళ్లక తప్పలేదు. సర్పంచ్ తన ఇంటికి తాళం వేసి పెరట్లోనే ఉండటం గమనార్హం. గత నెల 24వతేదీన పేట అగ్రహారం గ్రామానికి వెళ్లినప్పుడు కూడా చంద్రబాబు వర్గం దారుణంగా వ్యవహరించింది. పంచాయతీ పరిధిలోని ఐదు గ్రామాల ప్రజలను బెదిరిస్తూ ఎవరైనా అందుబాటులో ఉంటే అంతు చూసా్తమని హెచ్చరించారు. ఎమ్మెల్యే పర్యటన అనంతరం వీధులను పసుపునీళ్లతో శుభ్రం చేయడం అగ్రకుల దురహంకారానికి మచ్చు తునకగా నిలుస్తోంది. దళిత నేతలకు దూరం దూరం...! ఉప ముఖ్యమంత్రి కె.నారాయణస్వామి గత నెల 24వతేదీన జీడీ నెల్లూరు మండలం పాచిగుంటలో గడప గడపకూ కార్యక్రమానికి వెళ్లిన సమయంలో టీడీపీ నాయకుడు మనోహర్‌నాయుడు స్థానికులను బెదిరింపులకు గురి చేయడం విస్మయం కలిగిస్తోంది. ఇళ్లకు తాళాలు వేసి వెళ్లిపోవాలంటూ స్థానికులను హెచ్చరించారు. దళిత ఎమ్మెల్యేలను దరిచేరనివ్వకపోవడం, గ్రామాలకు రానివ్వకపోవడం చంద్రబాబు పెత్తందారీ మనస్తత్వానికి తాజా నిదర్శనమని డిప్యూటీ సీఎం నారాయణస్వామి పేర్కొన్నారు. ‘చంద్రబాబు, లోకేష్ డైరెక్షన్ మేరకే మనోహర్‌నాయుడు వ్యవహరిస్తున్నారు. పాచిగుంటలో కమ్మ సామాజిక వర్గానికి చెందిన 22 కుటుంబాలు ఇళ్లకు తాళాలు వేసి వెళ్లిపోయేలా ఒత్తిడి చేశారు. తాటిమాకులపల్లెలో 10 కుటుంబాల వారు కూడా అదేవిధంగా వెళ్లిపోయారు. దళితులంటే చంద్రబాబుకు ఎందుకంత చులకన భావం?’ అని నారాయణస్వామి ప్రశ్నించారు. పూతలపట్టు, జీడీ నెల్లూరు చంద్రబాబు సొంత ఊరు ఉన్న మండలానికి చేరువలో ఉండటం గమనార్హం. సమాజంలో తప్పుడు సంకేతాలు రాజకీయ పార్టీల మధ్య సైద్ధాంతిక విభేదాలు సహజం. దళిత ఎమ్మెల్యేలు గ్రామాల్లో కార్యక్రమాలు ముగించుకుని తిరిగి వెళ్లాక వీధులను పసుపు నీళ్లతో కడగడం, పాలాభిషేకాలు చేయడం దారుణం. దీనివల్ల ప్రజా సమస్యలు పక్కదారి పట్టడమే కాకుండా సమాజంలో తప్పుడు సంకేతాలు వెళతాయి. ఏ రాజకీయ పార్టీ కూడా ఇలాంటి వాటిని అంగీకరించకూడదు. – వందవాసి నాగరాజు, సీపీఎం జిల్లా కార్యదర్శి, తిరుపతి ప్రత్యక్ష కార్యాచరణకు దిగాలి.. ఇన్నేళ్ల స్వతంత్ర భారత దేశంలో ఇంతటి అవమానకర వివక్ష దారుణం. వీధుల్లో పసుపునీళ్లు చల్లడం, ఇళ్లకు తాళాలు వేసుకుని బహిష్కరించడం, హేళనగా చూడటం ఏమాత్రం సరికాదు. ఇలాంటి దుర్మార్గాలకు కారకులఫై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు వివక్షను నిర్మూలించాలి. ప్రజా సంఘాలు స్పందించి ప్రత్యక్ష కార్యాచరణకు నడుం బిగించాలి . – ఆండ్ర మాల్యాద్రి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కుల వివక్ష వ్యతిరేక పోరాట సమితి (కేవీపీఎస్) -
కొనసాగుతున్న ‘శంబుకవధ’లు
సామాజిక వివక్షను నిరసించి, సాంఘిక సమానత్వాన్ని పాదుగొల్పే కృషిలోనే అగ్రవర్ణ పాలకుల కత్తివేటుకు బలైపోయిన వాడికథే శంబుక రిషి వధ. నేడు శతజయంతి జరుపుకుంటున్న తెలుగుజాతి వైతాళికులలో అగ్రశ్రేణికి చెందిన కవిరాజు త్రిపురనేని రామస్వామి రచన ‘శంబుక వధ’! అది శంబుకుని వధే కాదు, సామాజిక న్యాయం కోసం, వర్ణవివక్షా చట్రంలో దాగుడుమూతలాడుతూ వచ్చిన ఆనాటి రాచరిక వర్గానికి బాసటగా నిలిచిన అగ్రవర్ణ కుట్రలకు దాసోహమన్న పాలకుల కథే ‘శంబుక వధ’ ‘దళితజాతులకు శతాబ్దాల తరబడిగా విద్యార్జన హక్కును నిరాకరిస్తూ రావడం జరి గింది. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబే డ్కర్ కృషిఫలితంగా వారికి విద్యార్జన హక్కు అనేది రాజ్యాంగంలో పొందుపర్చడం వల్ల సంక్రమించింది. కానీ ఆ హక్కును అణగారిన వర్గాలు అనుభవించకుండా ఆచరణలో నేటి వరకు వారిని ప్రత్యక్షంగా, పరోక్షంగా నిరంతర వేధింపులకు, అవమానాలకు గురి చేస్తూనే ఉన్నారు.’ – యధాయ చత్రన్ : వైర్ ఇంటర్వ్యూ (25–07–2019) ఈ ఇంటర్వ్యూ వెలువడి ఏడాది కూడా గడవకముందే దేశంలోని కులవ్యవస్థ ఎంతో పైకి రావలసిన 26 ఏళ్ల వైద్యవిద్యార్థిని పాయల్ తద్వీని బలితీసుకుందని ఆమె తల్లిదండ్రులు అబీదా తద్వీ, సలీం తద్వీ ప్రకటించారని మరవరాదు. ఇంతకూ వీళ్లెవరు? ఆదివాసీ తెగ లలో ఒకటైన భిల్ తెగకు చెందిన కుటుంబం నుంచి ఎండీ విద్యా స్థాయికి వచ్చిన 26 సంవత్సరాల విద్యార్థిని పాయల్ చేసిన తప్పే మిటి? రాజ్యాంగం ప్రకారం మెడిసిన్‌లో ఆమెకు సీటు రావడం! కానీ పాయల్‌కు దక్కిన అవకాశం చూసి ఓర్వలేక అగ్ర కులానికి చెందిన ముగ్గురు మహిళా డాక్టర్లు పాయల్‌ను వేధించి ఆమెను చిత్రహింసల పాలు చేసి ఆమె ఆత్మహత్యకు కారకులయ్యారు. కానీ ఆ మహిళా డాక్టర్లను జైలుకు పంపిన వ్యవస్థ అంత త్వరగానూ కొద్దిరోజులకే వారిని విడుదల చేసింది. ఈ విషాదానికి కుమిలి పోయిన తల్లి అబీదా తద్వీ, సలీమ్లు ‘మా బిడ్డ మా కళ్లలో సదా సజీవురాలిగానే ఉంటుంది. ఆమె విద్యార్జన కోసం పడిన కష్టనష్టాలు నిరంతర పోరాటం వృథా కావు. మా బిడ్డకోసమే కాదు, మా బిడ్డ లాంటి ఇతర బిడ్డల భవిష్యత్తు కోసమూ నిరంతరం మేం పోరాడుతూనే ఉంటాం’ అని ప్రకటించారు. అంతేకాదు, ఈ దంపతులు మరొక లేఖను విడు దల చేస్తూ, ప్రభుత్వమూ, న్యాయస్థానాలూ కూడా ఇలాంటి కేసుల విషయంలో తాత్సారం చేస్తున్నాయని ఆరోపించారు. ఈ అశ్రద్ధ వల్ల పెద్ద పెద్ద విద్యాసంస్థల్లో ఈ క్షణం దాకా బహుజన విద్యార్థులపై అత్యాచారాలు, వేధింపులు కొనసాగుతున్నాయని తీవ్ర నిరసనను ప్రకటించారు. సామాజిక వివక్షను వాచ్యంగా నిరసించే శిక్షాస్మృతులు పేరుకు రూపం మార్చుకుంటూ ఉంటాయే కానీ, దళిత వర్గాలను పీడకులు పీడించకుండా ఆగడం లేదని వారు ఆగ్రహం ప్రకటించాల్సి వచ్చింది. సరిగ్గా ఈ సామాజిక వివక్షను నిరసించి, సాంఘిక సమానత్వాన్ని పాదుకొల్పే కృషిలోనే అగ్రవర్ణ పాలకుల కత్తివేటుకు బలైపోయిన వాడికథే రామాయణ కాలం నాటి శంబుక రిషి వధ. అదే నేడు శతజయంతి జరుపుకుంటున్న తెలుగుజాతి వైతాళికులలో అగ్రశ్రేణికి చెందిన కవి రాజు త్రిపురనేని రామస్వామి ‘శంబుక వధ’..! అది శంబుకుని వధే కాదు, సామాజిక న్యాయం కోసం, వర్ణవివక్షా చట్రంలో దాగుడుమూతలాడుతూ వచ్చిన ఆనాటి రాచరిక వర్గానికి బాసటగా నిలిచిన అగ్రవర్ణ కుట్రలకు దాసోహమన్న పాలకుల కథే ‘శంబుక వథ’ నాటకం. వేమన, గురజాడ మహాకవులలో ఉన్న హేతు వాద, మానవతావాదమే రామస్వామి కలం కవాతును వేయిన్నొక్క విధులుగా తీర్చిదిద్దింది. హేతువు ఆధారపడిన ప్రశ్న పరంపర ఆయన కలం నుంచి కురిపించిన శరపరంపరలెన్నో. తెలుగువారి మేలుకొలు పులకు, తద్వారా సామాజిక చైతన్యంతో వారిని ముందుకు నడిపించ డానికి తోడునీడై నిలిచిన రచనలు ‘శంబుక వధ’కు తోడు సూత పురాణం, భగవద్గీత, ఖూనీ రచనలు. ఇవన్నీ తెలుగునాట భావ విప్లవానికి దారితీసిన ఉద్దీపనలే. రామాయణ కథానాయకుడైన పాలక చక్రవర్తి రాముడు.. రిషి, శాంతస్వభావుడైన శంబుకుడిని చంపడానికి కారణం ఏమిటి? నాటి రాచరిక వ్యవస్థకు (ఈనాటి ఆధునిక పాలక చక్రవర్తులకు) సలహాదారుగా నిప్పు రాజేసే తగవులమధ్యనే తమ పనులు చక్క దిద్దుకునే ఏదో ఒక అగ్రవర్ణం ఉన్నంతకాలం– సర్వులకు సమాన ఫాయాలో సామాజిక న్యాయం వాయిదా పడుతూనే వస్తుం దన్నది శంబుక రిషి అనుభవం. అక్కడికీ శంబుకుడు నిరపరాధి, శాంత స్వభావుడు, సామాజిక న్యాయం కోసం పోరాడుతున్నాడని రాముడికి తెలుసు, ఒప్పుకున్నాడు కూడా. భవభూతి ‘ఉత్తర రామచరిత’ సాక్ష్యం ఉండబట్టిగానీ శంబుకునికి జరిగిన ఘోర అన్యాయంగానీ, ఆయన ప్రవచించిన సామాజిక న్యాయం కోసం శంబుకుడు సాగిస్తున్న పోరాటంగానీ మనకు తెలిసేది కాదు. తరాలు గడిచినా ‘శంబుక వధ’లు నేటికీ స్వతంత్ర భారతంలో విచ్చలవిడిగా కొనసాగడానికి మూల కారణం– భూస్వామ్య, పెట్టుబడి దారీ వ్యవస్థలో సామాజిక న్యాయాన్ని అక్షరాలా పాటించడానికి మౌలి కంగానే వ్యతిరేకమన్న సత్యాన్ని నిద్రలో కూడా విస్మరించరాని సత్యం. అందుకే భవభూతి రచనలో అగ్రవర్ణ వశిష్టుడు రాచరిక సలహాదారుగా మధ్యలో వచ్చి, తనపై విధిగా ఆధారపడవలసి వచ్చిన చక్రవర్తి రాము డిని శాసించి మరీ శంబుకుని చంపేయమని సలహా ఇచ్చాడు. తమ ‘మత విశ్వాసాల’ వ్యాప్తికి అలా శంబుకుని కడతేర్చారు. పురోహిత వర్గంమీద ఆధారపడి రాజ్యపాలన నడిపితే ఇలాంటి అనర్థాలే కలుగు తాయని వశిష్టుడిని నమ్ముకున్న రాముడికి ‘యాది’ లేకపోబట్టే, తన భార్య సీతమ్మ మీద దారిన పోయే దానయ్య వేసిన దారుణమైన అప వాదును నమ్మి అగ్నిపరీక్షకు గురిచేశాడు. ఆ రీతిగానే ఆనాడు పరాయివారైన ఆర్యుల నుంచి దాడులకు గురైన స్వతంత్ర ద్రావిడ జాతుల రక్షణకు, సామాజిక న్యాయం కోసం పోరు బాట పట్టినవాడు శంబుకుడు. అందువల్ల తపోభంగం వల్లనే శంబుకుడు ద్రావిడునిగా పుట్టి ఉంటాడన్న కట్టుకథలు అల్లినవాళ్లు వశిష్ట, సోమయాజాదులు. ఇలాంటి కథలతోనే ఈ రోజుకీ మన దేశంలో పాలకవర్గాలు తమ విధానాలను నిశితంగా విమర్శించే ప్రజల్ని చైతన్యపరిచే సామాజిక శాస్త్రవేత్తలను, రాజకీయ శాస్త్ర, వైజ్ఞానిక శాస్త్ర ఉద్దండులైన ప్రొఫెసర్ కల్బుర్గి, పన్సారి, లంకేష్, డాక్టర్ సాయిబాబ లాంటి పోరాటయోధుల్ని వేధించడమో నర్మగర్భంగా పరిమార్చడమో, సాక్ష్యాలు లేకుండా హంతకుల్ని కాపాడటమో యథే చ్ఛగా జరుగుతూనే ఉంది. అంతేగాదు, కురుక్షేత్ర సంగ్రామానికి, పల్నాటి యుద్ధానికి కారణం ఆస్తిపాస్తుల పంపిణీ కోసం దాయాదుల తగవులాటలే అయినా రెంటికీ మధ్య ఒక్క స్పష్టమైన తేడా ఉంది. అది– పల్నాటి యుద్ధ ఫలితం కుల, మతాల వివక్షకు అతీతంగా చరిత్రలో మొదటిసారిగా సామాజిక న్యాయానికి తెర ఎత్తిన తొలి ‘చాపకూడు’ సిద్ధాంత ప్రతిష్టాపన. అందుకే కారెంపూడి క్షేత్రంగా సాగిన పల్నాటి యుద్ధం సామాజిక న్యాయ ప్రతిష్టాపనకు జరిగిన తొలి ప్రయత్నం అయినందుననే శ్రీనాథుడు నాగులేటి ఒడ్డున ఉన్న ‘గంగాధరమడుగు’ను పుణ్యక్షే త్రంగా భావించి కాశీలోని మణికర్ణిక ఘట్టంతో పోల్చాడు, ఆ మడుగు సమీపంలోనే పల్నాటి ‘వీరుల అడుగుజాడలు’ ఉండటమూ ఓ విశేషం. ఈ వీరుల స్మత్యర్థంగానే మతాతీతంగా. ఓ మహ్మదీయ సేనా పతి గుడి కట్టించాడు. శ్రీనాథుడు ఆనాడు మేడపి, కారెంపూడి యుద్ధాలు తెలుసుకున్నాడు. తర్వాత నిన్నగాక మొన్న ఆ పల్నాటిలోని ఆత్మకూరులో కూడా స్థానికులు కోడిపుంజుల్లా రెచ్చిపోవటం చూశాం –అదీ సామాజిక న్యాయం కోసం సాగుతున్న అణగారిన వర్గాల నిరంతర పోరాటమే. కనుకనే శంబుకుని లాంటి గడసరి దళిత విజ్ఞాని కుత్తుకను కాస్తా కోసి పారేస్తేగానీ పీడ వదలదనుకున్నాడు అగ్రవర్ణ వశిష్టుడు. సామాజిక న్యాయాన్ని పాటించడానికి, ప్రజలందరినీ సమాన దృష్టితో పాలించడానికి సమాన హక్కులు అవసరమని, అని వార్యమని, ఇది మత ప్రసక్తి లేని పౌర హక్కులకు గర్వకారణమన్నది శంబుకుని ధర్మదీక్ష. ఆ మార్గంలోనే ముందుకు సాగి కన్నడ సమా జాన్ని ప్రభావితం చేసినవాడు బసవన్న. అతని కులాతీత, వర్గాతీత వచనాలు. అందుకే 13వ శతాబ్ది నాటి నలందా బౌద్ధ విశ్వవిద్యాలయ ప్రసిద్ధ ఆచార్యుడు ధర్మకీర్తి తన ‘ప్రమాణవార్తికం’లో– వైజ్ఞానిక దృష్టికీ, భౌతికవాదానికీ దూరమైన కొద్దీ మూఢవిశ్వాసాలు ఎలా పెరుగుతూ వస్తాయో ఒక శ్లోకంలో వర్ణించాడు. దాని అర్థం– ‘వేదాన్ని ప్రమాణం అనుకోవడం, కర్త ఈశ్వరుడొకడున్నాడని భావించడం, గంగలో మునిగితే పుణ్యం వస్తుందనుకోవడం, జాతి, కుల మతాల్ని చూసుకుని గర్వపడిపోవడం, పరులపట్ల అన్యాయం, పాపం చేసి, దాన్ని మాఫీ చేయడానికి ఉపవాసాల ద్వారా శరీరాన్ని బాధపెట్టు కోవడం–ఈ అయిదున్నూ మూర్ఖులు చేసే పనులు’ అన్నాడు. అందుకే శంబుకుని వధలు, వ్యథలు త్రిపురనేని రామస్వామి రచించిన నూరేళ్ల తర్వాత కూడా కొనసాగుతూనే ఉన్నాయి. అందుకే కవి రాజు కలం చిరంజీవం. జాతీయోద్యమ కాలంలో తెలుగువారిలో ఆనాడు స్ఫూర్తిని ప్రదీప్తం చేయడం కోసం చేతిలో వీరగంథం అందుకొని కన పడిన వీరులకల్లా పూసిపోదామని త్రిపురనేని ఎదురుతెన్నులు కాచాడు. ఇప్పుడా వీరగంథం సామాజిక న్యాయం కోసం తపించే ఏ పాలకుడి కోసం, ఏ వీరుడి కోసం వేచి ఉంటుందో చూడాలి. ఏబీకే ప్రసాద్, సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
కరోనా: అధిక మరణాలకు ఆ రెండే కారణాలు
కోల్‌కతా: సామాజిక సమస్యలు, తక్కువ సంఖ్యలో పరీక్షలు జరడం.. ఈ రెండు కారణాల వల్లే పశ్చిమ బెంగాల్లో కోవిడ్–19 కారక మరణాల సంఖ్య ఎక్కువగా ఉందని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ నెల 7వ తేదీ నాటికి బెంగాల్లో మొత్తం 1,548 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 151 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం మరణాల సంఖ్యను తక్కువ చేసి చూపుతోందని, కరోనా వైరస్‌ను ఎదుర్కొనే విషయంలో అనేక తప్పటడుగులు వేసిందని కేంద్రం తరచూ ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్ర ఆరోగ్య శాఖ మాత్రం వైరస్ సోకి మరణించింది 79 మంది మాత్రమేనని, మిగితా వారు ఇతర జబ్బులతో మరణించారని అంటోంది. బెంగాల్లో ఏప్రిల్ 18వ తేదీ నాటికి కేవలం 4,400 పరీక్షలు చేపట్టగా.. ప్రస్తుతం రోజుకు 2,500 చొప్పున పరీక్షలు జరుగుతున్నాయి. మొత్తమ్మీద ఇప్పటివరకూ 30 వేల పరీక్షలు జరిగినట్లు అంచనా వేస్తున్నారు. (కరోనా: మృతుల్లో వారే ఎక్కువ.. ఎందుకు?) నమోదైన కేసుల్లో అత్యధికం కోల్‌కతా, హౌరా, హుగ్లీ, నార్త్, సౌత్ 24 పరగణాల ప్రాంతాల్లోనే ఉన్నాయని.. దీన్నిబట్టి ప్రస్తుతానికి వ్యాధి కేవలం నగరాలకు పరిమితమైందని అనుకోవచ్చునని వైద్యనిపుణులు అంటున్నారు. రోగులు చాలామంది సామాజికంగా వెలివేతకు గురవుతున్న కారణంగా ఈ సమస్యను ఎదుర్కొనే విషయంలో చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయని కోవిడ్–19 రోగగ్రస్తులను గుర్తించడంలో సామాజిక వివక్ష ప్రధాన పాత్ర పోషిస్తోందని వివరించారు. కేసుల సంఖ్య ఎక్కువవుతున్న నేపథ్యంలో సామాజిక వివక్ష భయంతోనే చాలామంది ఆసుపత్రులకు రావడం మాసి, ఇళ్లకే పరిమితమవుతున్నారని, దీంతో వ్యాధి కాస్తా ముదురుతోందని ఎస్ఎస్కేఎం ఆసుపత్రి సీనియర్ సర్జన్ దీప్తీంద్ర సర్కార్ తెలిపారు. సామాజికంగా నిందలకు గురవుతామన్న భయం ప్రజల్లో పోతేనే ఎక్కువ మంది పరీక్షలు చేయించుకునేందుకు ముందుకు వస్తారని ఆయన అన్నారు. ఇతర దేశాల్లో కోవిడ్ మరణాల శాతం 2 నుంచి 3 శాతం మాత్రమే ఉంటే.. బెంగాల్లో ఇది 13.2 శాతంగా ఉందని, పరీక్షలు తక్కువ చేస్తూండటమే దీనికి కారణమని మరో వైద్యుడు మానస్ గుమ్టా అభిప్రాయపడ్డారు. (విదేశాల నుంచి వస్తే క్వారంటైన్కే..) -
ఉద్యోగాల్లోనూ ఎస్సీలది వెనక‘బాటే’
సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన షెడ్యూల్డ్ కులాల అభ్యున్నతికి ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటోంది. ఎస్సీల ఉద్యోగ, ఉపాధి కోసం వివిధ పథకాల కింద వేల కోట్లు వెచ్చిస్తోంది. అయితే, క్షేత్రస్థాయి వాస్తవాలు గమనిస్తే ఉద్యోగ, ఉపాధి విషయాల్లో ఎస్సీలు వెనుకబడి ఉన్నారని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. సామాజిక వివక్ష, సామాజిక–ఆర్థిక స్థాయి ఈ వెనకబాటుకు కారణాలని తెలుస్తోంది. జాతీయ నమూనా సర్వే కార్యాలయం(ఎన్ఎస్ఎస్వో)2011–12 తర్వాత దేశంలో ఉద్యోగాల పరిస్థితిపై ఎలాంటి సర్వే చేయలేదు.అయితే అందుబాటులో ఉన్న గణాంకాల ప్రకారం మిగతా కులాల వారితో పోలిస్తే ఎస్సీలు ఉద్యోగాల విషయంలో వివక్షకు గురవుతున్నారని స్పష్టమవుతోంది. వేతన కూలీలు 63% ఎన్ఎస్ఎస్ఓ 2011–12 సర్వే ప్రకారం ఎస్సీలలో 63% వేతన కూలీలు (ఉద్యోగ భద్రతలేని చిన్నాచితకా పని చేసే వాళ్లు –అంటే ఇళ్లలో పని చేసేవారు, హమాలీలు మొదలైన వారు) గా పని చేస్తున్నారు. ఇది ఓబీసీల్లో 44%, ఉన్నత కులాల్లో 42%, ఇతర కులాల్లో46%గా ఉంది. ఈ వేతన కూలీల్లో కూడా దినసరి కూలీలుగా పని చేస్తున్న వారిలోనూ ఎస్సీలే అధికంగా ఉన్నారు. దేశ జనాభాలో ఎస్సీలు 16శాతం ఉంటే, దినసరి కూలీల్లో ఎస్సీలు 32 శాతం ఉన్నారు. ఇతర కులాల్లో ఇది 20–30 శాతానికి మించలేదు. కులం కారణంగా వీరిని ఉద్యోగాల్లోకి తీసుకోవడానికి ప్రైవేటు రంగం ఇష్టపడకపోవడమే దీనికి కారణం. ఎన్ఎస్ఎస్ఓ తాజా గణాంకాల ప్రకారం దేశ వ్యాప్తంగా ఎస్సీల్లో నిరుద్యోగ రేటు జాతీయ సగటు కంటే 1.7 శాతం ఎక్కువ ఉంది. 1990ల నుంచి ఎస్సీల్లో నిరుద్యోగ రేటు శాతం మిగతా వారితో పోలిస్తే ఎక్కువగానే ఉంటోంది. మన సమాజంలో తరతరాలుగా కొన్ని ఉద్యోగాలు ఉన్నత కులస్థులకని, మరి కొన్ని ఉద్యోగాలు నిమ్న జాతులకని నిర్దేశించడం జరిగింది. ఉన్నత కులస్థుల ఉద్యోగాల్లోకి ఎస్సీలను తీసుకోవడానికి యాజమాన్యాలు ఇష్టపడటం లేదు. ఇక విద్య, నైపుణ్యం వంటివి కూడా ఉద్యోగాల్లో ఎస్సీల వెనకబాటుకు కారణమవుతున్నా సామాజిక వివక్షే కీలక పాత్ర వహిస్తోంది. ఉన్నత కులస్తుల ఇళ్లలో వంటవాళ్లుగా, పనివాళ్లుగా, హోటళ్లలో సర్వర్లుగా, ప్రార్థనా స్థలాల నిర్మాణంలో కూలీలుగా ఎస్సీలను తీసుకోవడానికి విముఖత చూపుతున్నట్టు ఇనిస్టిట్యూట్ ఆఫ్ దళిత్ స్టడీస్ సర్వేలో తేలింది. ఉన్నత కులాలకు చెందిన సంస్థల్లో ఉద్యోగాలకు ఉన్నత కులస్తులనే ఎంపిక చేస్తున్నట్టు ఈ సర్వేలో వెల్లడైంది. ఒక ఉద్యోగానికి సమాన అర్హతలున్న ఎస్సీ, ఇతర అభ్యర్ధులు దరఖాస్తు చేస్తే వారిలో ఉన్నత కులస్థులకే ఇంటర్వ్యూ పిలుపు వస్తోందని థోరట్ అండ్ అటెవెల్ సంస్థ అధ్యయనంలో తేలింది. ఉన్నత చదువులు చదివిన ఎస్సీల కంటే తక్కువ చదువున్న ఇతర కులస్థులకే ఉద్యోగావకాశాలు ఎక్కువగా లభిస్తున్నాయి ఆ సంస్థ వెల్లడించింది. ఈ వివక్ష కారణంగా ఉద్యోగాలు లభించక చాలా మంది ఎస్సీలు పేదలుగానే ఉండిపోతున్నారు. ఎన్ఎస్ఎస్ఓ లెక్కల ప్రకారం 2011–12లో ఎస్సీల్లో మూడింట ఒక వంతు మంది పేదలు కాగా ఓబీసీల్లో 20శాతం, ఇతర కులాల్లో 9 శాతం పేదలు ఉన్నారు. -
దళిత అధ్యయనాలకు నిధులు కట్
– దేశవ్యాప్తంగా వివిధ వర్శిటీల్లో 35 స్టడీస్ సెంటర్లు – ఇకపై నిధులు ఇవ్వబోమంటూ యూజీసీ లేఖ – కాషాయీకరణ అజెండాలో భాగంగానే తాజా చర్య అని విమర్శలు (సాక్షి నాలెడ్జ్ సెంటర్) సాంఘిక అసమానతలు, వివక్షపై అధ్యయనం జరిపే కేంద్రాలకు నిధుల విడుదలను నిలిపివేయాలని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. దళితుల స్థితిగతులు, వివక్ష, రిజర్వేషన్లు... తదితర అంశాలపై అధ్యయనం చేయడం ద్వారా ఈ కేంద్రాలు గణంకాలను రూపొందిస్తాయి. దళితుల చేతుల్లో ఉన్న భూమి ఎంత, కుటుంబాల జీవనాధారం ఏమిటి? ఆరోగ్యపరంగా, విద్యపరంగా ఏ స్థాయిలో ఉన్నారనే గణాంకాలను తయారుచేస్తాయి. వీటి ఆధారంగా దళితులు, ఆదివాసీల అభివృద్ధికి ప్రభుత్వాలు దృష్టి కేంద్రీకరించాల్సిన అంశాలపై అవగాహన వస్తుంది. 11వ పంచవర్ష ప్రణాళిక (2007–12)లో వీటిని నెలకొల్పాల్సిన ఆవశ్యకతను ప్రస్తావించారు. తర్వాత 35 కేంద్ర వర్శిటీలు, రాష్ట్ర వర్శిటీల్లో ఇలాంటి అధ్యయన కేంద్రాలు ఏర్పాటయ్యాయి. తర్వాత ఆరో పంచవర్ష ప్రణాళికలో వీటికి నిధుల కేటాయింపును కొనసాగించారు. ఆరో పంచవర్ష ప్రణాళిక ఈనెల 31తో ముగియనున్న నేపథ్యంలో... ఇకమీదట వీటికి ఎలాంటి నిధుల కేటాయింపు ఉండదని స్పష్టం చేస్తూ జవహర్లాల్ నెహ్రూ యూనివర్శిటీకి యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) నుంచి లేఖ అందింది. ’మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు... ఆరో పంచవర్ష ప్రణాళిక ముగిశాక ఈ కేంద్రాలకు యూజీసీ నుంచి ఎలాంటి నిధులు అందవని తెలియజేస్తున్నాం. ఈ అధ్యయన కేంద్రాల కొనసాగింపుతో ఇకపై యూజీసీకి ఎలాంటి సంబంధం ఉండదు. ఈ విషయంలో ఎలాంటి ఉత్తరప్రత్యుత్తరాలకు యూజీసీ ఆస్కారం ఇవ్వదు’ అని యూజీసీ కార్యదర్శి సుష్మా రాథోడ్ పేరిట వర్శిటీలకు లేఖలు అందాయి. ఇదే విషయంపై యూజీసీ చైర్మన్ వేద్ ప్రకాశ్‌ను టెలిగ్రాఫ్ పత్రిక సంప్రదించగా... ‘ప్రణాళిక పద్దు కింద నిధులు రావని చెప్పాం... ప్రణాళికేతర నిధులు కాదు’ అని అస్పష్టంగా సమాధానమిచ్చి ఫోన్ పెట్టేశారు. నిజానికి అధ్యయన కేంద్రాలకు ప్రణాళికేతర వ్యయంలో నుంచి నిధులేమీ రావు. దాంతో ఈ కేంద్రాల్లో ఎంఫిల్, పీహెచ్‌డీలకు నమోదు చేసుకున్న విద్యార్థులు, వీటిల్లో బోధిస్తున్న ప్రొఫెసర్ల భవిష్యత్తు ప్రశ్నార్థకమయ్యింది. ఏడాదిన్నర కిందట సంఘ్ వారపత్రిక పాంచజన్యలో జేఎన్‌యూలో ఉన్న అధ్యయన కేంద్రాన్ని విమర్శిస్తూ వ్యాసం రావడం గమనార్హం. కుట్రలో భాగంగానే వీటి ఏర్పాటు జరిగిందని, లెఫ్టిస్టులను, క్రిస్టియన్ మిషనరీలను ఉద్యోగాల్లోకి తీసుకొని... చదువుకున్న యువత బుర్రలను పాడుచేస్తున్నారని అది పేర్కొంది. ‘ఒకవైపు వేదాలపై అధ్యయనానికి నిధులిస్తూ... మరోవైపు దళితుల స్థితిగతులు మెరుగుపర్చేందుకు అధ్యయనాలు చేసే కేంద్రాలను యూజీసీ మూసివేయిస్తోంది. తరతరాలుగా వస్తున్న బ్రాహ్మణ ఆధిపత్య పోకడలను ప్రశ్నించకూడదనేది యూజీసీ భావన’ – ప్రొఫెసర్ ఎన్.సుకుమార్, ఢిల్లీ యూనివర్శిటీ -
ఎక్కివచ్చిన మెట్లనే మరుస్తారా?
ఒకప్పటితో పోలిస్తే దళిత, బడుగు వర్గాల ఉద్యోగుల సంఖ్య ఎన్నో రెట్లు పెరిగింది. కానీ వారిలో తమ జాతి బాగు కోసం ఆలోచిస్తున్న వాళ్లు అతి తక్కువ. చదువుకున్న మధ్యతరగతి వర్గం మౌనంగా ఉండే సమాజానికి భవిత ఉండదు. ముఖ్యంగా దళితుల విషయంలో ఇది మరింత ఎక్కువగా వర్తిస్తుంది. దళితుల ఏకైక ఆస్తి చదువుకున్న వాళ్లే. ఎవరు ఇబ్బందుల్లో ఉన్నా ఉన్నంతలోనే అంతా తమ వారిని ఆదుకునే పద్ధతి గ్రామాల్లోని దళితుల్లో ఇంకా ఉంది. దళిత ఉద్యోగులు మాత్రం పైకి వెళ్లే కొద్దీ ఎక్కివచ్చిన మెట్లనే మరచిపోతున్నారు. నవనీత ఆ చిన్నారి పేరు. ఆ చిన్ని గుండె రంపపు కోతకు రవ్వంత ఓదార్పు లేదు. కానీ అది సామాజిక వివక్ష కు, పాలకుల నిర్లక్ష్యానికి ఎదురొడ్డి నిలచిన దిటవు గుండె. కాకపోతే పన్నెండేళ్ల పసితనంలో తానే అమ్మా, నాన్న పాత్రలు రెండూ పోషించగలదా? బతుకు బండి లాక్కుంటూ జీవితం బడిలో పాఠాలు చదువుతున్న నవనీతది రంగారెడ్డి జిల్లా దోమ మండలం మోత్కూరు గ్రామం. గూడ రామచంద్ర, యాదమ్మలకు ముగ్గురు పిల్లలు. పెళ్లయిన అక్క, ఆరో తరగతి చదివే తమ్ముడు. బళ్లో చదువు, ఇంట్లో పనీపాటూ, ఆటా పాటే జీవితంగా గడుపుతున్న నవనీత తండ్రి రామచంద్రకు క్షయవ్యాధి సోకింది. సర్కారు ఆసుపత్రి వైద్యానికి కూడా స్తోమతలేని కటిక దారిద్య్రం అతని ప్రాణాన్ని హరించేసింది. దీంతో తల్లి పిచ్చిదయ్యింది. తండ్రిని ఎత్తుకెళ్లిన క్షయ వ్యాధి అక్కనూ కబళించింది. కనికరం లేని బావ, అక్క కొడుకునీ వదిలేసి వెళ్లాడు. శ్మశానాన్ని తలపించే ఇంట్లో ముగ్గురు చిన్నారులూ బిక్కుబిక్కుమంటూ మిగిలారు. అన్నం పెట్టే దిక్కులేక పస్తులున్నారు. ఏడ్చి ఏడ్చి కళ్లల్లో నీళ్లన్నీ ఎండిపోయాక, ఒకానొక ఆకలి రాత్రి నవనీత ప్రాణప్రదమైన చదువుకి స్వస్తి పలికి, కూలి పనులకు పోవాలని నిశ్చయించింది. తమ్ముడ్ని బడికి పంపుతూ, కూలి పని కోసం తను పత్తి చేల బాటపట్టింది. ఇది సాక్షిలో వచ్చిన కథనం. ఇలా వెలుగు చూడకుండా కనుమరుగైన, అవుతున్న వ్యథార్థ జీవితాలకు లెక్కలేదు. ఇద్దరు పసివాళ్ల కోసం మరో పసిపిల్ల నవనీత చేస్తున్న త్యాగంకన్నా ఎక్కువగా ఆలోచించాల్సిన అంశం మరొకటుంది. అది సామాజిక నిర్లక్ష్యం. ఎదిగి వచ్చిన సామాజిక వర్గం తమ వర్గ సహోదరుల పట్ల ఏ మాత్రం బాధ్యతతో ఆలోచించినా నవనీత బడి మాని, పనికి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చేదే కాదు. సమాజం కోసం విద్యావంతులు పనిచేయాలి ఇలాంటి దుస్థితిని డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ముందుగానే ఊహించారు. 1956, మార్చి 18న ఆయన ఆగ్రా బహిరంగసభలో మాట్లాడుతూ ఉద్యోగస్తులు, రాజకీయ నాయకులు, విద్యార్థి, యువజనుల వైఖరి పట్ల ఆందోళన, ఆవేదన వ్యక్తం చేశారు. అందివచ్చిన రిజర్వేషన్ల వలన అప్పటికే లబ్ధి పొందిన వారి నిర్వాకంపై ధ్వజమెత్తారు. ప్రభుత్వ ఉద్యోగులను ఉద్దేశిస్తూ ‘‘మన సమాజంలో కొంత పురోగతి కనిపిస్తోంది. విద్యావంతులైన కొందరు ఉన్నతస్థాయికి చేరారు. చదువు పూర్తయ్యాక వారు సమాజానికి సేవ చేస్తారని ఆశించాను. కానీ వారు నన్ను మోసగించారు. విద్యాభ్యాసంతో చిన్న, పెద్ద గుమస్తాల గుంపు బయలుదేరి, తమ పొట్టల్ని నింపుకోవడం మాత్రమే కనిపిస్తున్నది. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్న వారు తమ జీతంలో 20 శాతం తమ జాతి కోసం ఉద్యమ విరాళంగా ఇవ్వాలి. అప్పుడు మాత్రమే సమాజం పురోగమిస్తుంది. లేకపోతే, ఒక కుటుంబం మాత్రమే అభివృద్ధి చెందుతుంది. చదువుకున్న వారిపై గ్రామాలలో ఉన్న వారు ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. విద్యావంతుడైన సామాజిక కార్యకర్త లభించడం వారికి ఒక వరం లాంటిది’’ అని ఆయన ఎంతో మనోవ్యథతో అన్నారు. గ్రామాలలోని భూమిలేని పేద కూలీలకు తాను ఏమీ చేయలేక పోయానని కూడా అంబేద్కర్ బాధపడ్డారు. ‘‘గ్రామాలలో నివసిస్తున్న భూమిలేని శ్రామికుల గురించి నేను చాలా బాధపడుతుంటాను. నేను వారికి ఏమీ చేయలేక పోయాను. వారు అత్యాచారాలకు, అవమానాలకు గురవుతున్నారు. భూమి పొందితేగానీ వారికి విముక్తి లేదు. ఆ భూమి కోసం ఎన్ని అడ్డంకులు వచ్చినా నా పోరాటం సాగిస్తాను’’ అని ఆ రోజు ఆయన ప్రతినబూనారు. కానీ అది ఇప్పటికీ నెరవేరని స్వప్నంగానే మిగిలింది. నూటికి డెభ్బై మంది దళితులు భూమిలేని వ్యవసాయ కూలీలుగానే బతుకు వెళ్లదీస్తున్నారు. వలసపోతూ, ఊరూరూ తిరుగుతున్నారు. అంబేద్కర్ ఉద్యమం సాధించిన రిజర్వేషన్ల ద్వారా లబ్ధి పొందిన రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు ఈ సమస్యలన్నిటినీ పరిష్కరించే బాధ్యతను తీసుకున్నారు. కానీ వారు ఆయా పార్టీల నాయకుల చేతుల్లో, ముఖ్యంగా అగ్రకులాల కనుసన్నల్లో మెలుగుతున్నారు. దీనికి నేటి మన ఎన్నికల విధానం ఒక కారణం కావచ్చు. అవకాశవాదంతో అనర్థమే దళితుల కోసమే పనిచేస్తే, మెజారిటీ హిందూ సమాజం నుంచి ఓట్లు రావేమోనని, అసలు సీటు ఇస్తారో, లేదోనని వారి మన సుల్లో భయం నిండి ఉంటోంది. దీంతో వారు మరింత అవకాశవాదం వైపు వెళుతున్నారు. ఇటువంటి వారిని ఉద్దేశించి అంబేద్కర్ అన్న మాటలను గుర్తు చేసుకుందాం. ‘‘ఎవరైనా మిమ్మల్ని తమ రాజభవనంలోకి ఆహ్వానిస్తే సంతోషంగా వెళ్లండి. కానీ మీ గుడిసెలను తగలబెట్టుకొని మాత్రం వెళ్లకండి. కొన్ని రోజుల తరువాత ఆ రాజు మిమ్మల్ని కోటలోంచి గెంటేస్తే ఎక్కడికి వెళతారు? మీరు అమ్మడుపోవాలనుకుంటే, అమ్ముడుపోండి. కానీ మీ సంస్థలను, పునాదులను నాశనం చేసి మాత్రం కాదు. బయటి వారి నుంచి నాకే ప్రమాదం లేదు. ప్రమాదమంతా సొంత వారి నుంచే’’ అన్న ఆయన వ్యాఖ్యలు కటువుగా అనిపించినా అందులోని నిజాన్ని విస్మరించలేం. అదే విధంగా ఆయన గ్రామాలు, పట్టణాల్లోని సామాన్య దళితులకు ఒక హెచ్చరిక, మార్గనిర్దేశన చేశారు. ‘‘గత ముప్పై సంవత్సరాల నుంచి మీకు రాజకీయ అధికారాలను సముపార్జించడానికి ప్రయాసపడుతున్నాను. చట్టసభల్లో మీకు సీట్లు రిజర్వు చేయించగలిగాను. మీ పిల్లల చదువు కోసం అవసరమైన నిబంధనలు చేయించాను. ఇక మనం పురోగమించవచ్చు. విద్య, ఆర్థిక, సామాజిక అసమానతలను తొలగించుకోవడానికి ఉమ్మడి పోరాటం సాగించడం మీ ప్రస్తుత కర్తవ్యం. ఈ అవసరం కోసం అన్ని రకాల త్యాగాలకూ అవసరమైతే రక్తాన్ని చిందించడానికి కూడా మీరు సిద్ధం కావలసి ఉంది’’ అని ఉద్బోధించారు. ‘‘విద్యార్థి, యువకులకు నా విజ్ఞాపన ఏమంటే, చదువు పూర్తికాగానే వారందరూ ఏదో ఓ ఉద్యోగం చూసుకోకుండా, వారి గ్రామ ప్రజలకు, స్థానికులకు సేవ చేయాలి. అజ్ఞానం వలన ఉత్పన్నం అవుతున్న దోపిడీని, అన్యాయాన్ని తద్వారా అరికట్టగలుగుతాం. మీ విముక్తి సమాజ విముక్తిపై ఆధారపడి ఉంది. నా పరిస్థితి ఇప్పుడు ఒక పెద్ద డేరాని నిలబెడుతున్న గుంజ లాంటిది. ఆ గుంజ ఉండని పరిస్థితి ఎలా ఉంటుందో అనే ఆవేదన నాకున్నది. నా ఆరోగ్యం అంతగా బాగాలేదు. మీ నుంచి నేను ఎప్పుడు వెళ్లిపోతానో తెలియదు. నిస్సహాయులైన, భరోసాలేని ఈ కోట్లాది మంది ప్రజల ప్రాణాలు కాపాడే యువకులు నాకు కనపడటం లేదు. ఆ బాధ్యతలు స్వీకరించడానికి ఎవరైనా యువకుడు ముందుకు వస్తే నేను నిశ్చింతగా వెళ్లిపోతాను’’ అని అంబేద్కర్ అన్నారు. ఆయన ఆకాంక్ష నేటికీ నెరవేరకుండానే మిగిలిపోయింది. అలా అని, ఆయన మాటలను ఆదర్శంగా తీసుకొని పనిచేసిన యువకులు, ఉద్యోగస్తులు, రాజకీయ నాయకులు అసలే లేరని కాదు. కానీ అట్టడుగు దళిత జాతి శాశ్వత విముక్తి ఇంకా కలగానే మిగిలింది. పైగా అంబేద్కర్ ఉద్యమ విజయ ఫలాలు ఒక్కటొక్కటిగా చేయి జారిపోతున్నాయి. ఇంతవరకు దళితుల పట్ల సమాజం చూపుతున్న వివక్ష నేడు ద్వేషంగా మారిపోయింది. కాబట్టే ఎన్ని చట్టాలు వచ్చినా అమలుకు నోచుకోని దుస్థితి నెలకొంది. పునరంకితం కావడమే నేటి కర్తవ్యం 1956లో అంబేద్కర్ ఆవేదన వ్యక్తం చేసిన నాటికంటే ఈ రోజు ఉద్యోగుల సంఖ్య ఎన్నోరెట్లు అధికమైంది. కానీ వారిలో తమ జాతి కోసం ఆలోచిస్తున్న వాళ్లు అతి తక్కువ మంది ఉన్నారు. ఏ సమాజంలోనైనా, దేశంలోనైనా, సామాజిక వర్గంలోనైనా చదువుకున్న మధ్యతరగతి వర్గం మౌనంగా ఉండే సమాజానికి, దేశానికి భవిత ఉండదు. ముఖ్యంగా దళితుల విషయంలో ఇది మరింత ఎక్కువగా వర్తిస్తుంది. ఈ కులాల ప్రజలకు భూమి లేదు. వ్యాపారంలో, వాణిజ్యంలో వాటా లేదు. పరిశ్రమలలో స్థానం లేదు. దళిత జాతికి ఉన్న ఆస్తి చదువుకున్న వాళ్లే. కులంలో ఎవరు ఇబ్బందుల్లో ఉన్నా, ఉన్నంతలోనే అందరూ వారిని ఆదుకోవాలనే విధానం గ్రామాల్లోని దళితుల్లో ఇంకా ఉంది. ఇంట్లో ఏ శుభ కార్యం జరిగినా దళిత సామాజిక వర్గంలోని ప్రతివారూ సాయపడతారు. ఉమ్మడిగా శ్రమిస్తారు. ఉమ్మడిగా ఆనందిస్తారు. పెళ్లయినా, చావైనా పదిమందీ ఆర్థికంగా తోడ్పడతారు. మృత్యు విషాదం నిండిన ఇంట్లో పొయ్యి వెలగకుండా రోజుకొకరు వండి తె స్తారు. దశదిన కర్మరోజు సైతం అందరూ బియ్యం, కోళ్లు, మేకలు ఇచ్చి ఆ కుటుంబంపై భారం పడకుండా చూస్తారు. ఇటువంటి సంప్రదాయం కలిగిన దళిత జాతికి చెందిన ఉద్యోగులు మాత్రం పైకి వెళ్లేకొద్దీ తాము ఎక్కి వచ్చిన మెట్లనే మరచిపోతున్నారు. అందుకే ఉద్యోగులు, రాజకీయ నాయకులు, విద్యార్థులు, యువకులు అంతా కలసి ఈ మార్చి 18న అంబేద్కర్ 1956 ఆగ్రా సభలో అందించిన సందేశాన్ని కలసి మననం చేసుకుందాం. ఆయన చూపిన బాటకు అంకితమవుదాం! (ఈ నెల 18న హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో మధ్యాహ్నం 2 గంటలకు జరగనున్న ‘‘పునరంకిత సభ ’’ సందర్భంగా..) (వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు) మొబైల్: 9705566213