ప్రతీకాత్మక చిత్రం
కోల్‌కతా: సామాజిక సమస్యలు, తక్కువ సంఖ్యలో పరీక్షలు జరడం.. ఈ రెండు కారణాల వల్లే పశ్చిమ బెంగాల్‌లో కోవిడ్–19 కారక మరణాల సంఖ్య ఎక్కువగా ఉందని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ నెల 7వ తేదీ నాటికి బెంగాల్‌లో మొత్తం 1,548 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 151 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం మరణాల సంఖ్యను తక్కువ చేసి చూపుతోందని, కరోనా వైరస్‌ను ఎదుర్కొనే విషయంలో అనేక తప్పటడుగులు వేసిందని కేంద్రం తరచూ ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్ర ఆరోగ్య శాఖ మాత్రం వైరస్ సోకి మరణించింది 79 మంది మాత్రమేనని, మిగితా వారు ఇతర జబ్బులతో మరణించారని అంటోంది. బెంగాల్‌లో ఏప్రిల్ 18వ తేదీ నాటికి కేవలం 4,400 పరీక్షలు చేపట్టగా.. ప్రస్తుతం రోజుకు 2,500 చొప్పున పరీక్షలు జరుగుతున్నాయి. మొత్తమ్మీద ఇప్పటివరకూ 30 వేల పరీక్షలు జరిగినట్లు అంచనా వేస్తున్నారు. (కరోనా: మృతుల్లో వారే ఎక్కువ.. ఎందుకు?)
నమోదైన కేసుల్లో అత్యధికం కోల్‌కతా, హౌరా, హుగ్లీ, నార్త్, సౌత్ 24 పరగణాల ప్రాంతాల్లోనే ఉన్నాయని.. దీన్నిబట్టి ప్రస్తుతానికి వ్యాధి కేవలం నగరాలకు పరిమితమైందని అనుకోవచ్చునని వైద్యనిపుణులు అంటున్నారు. రోగులు చాలామంది సామాజికంగా వెలివేతకు గురవుతున్న కారణంగా ఈ సమస్యను ఎదుర్కొనే విషయంలో చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయని కోవిడ్–19 రోగగ్రస్తులను గుర్తించడంలో సామాజిక వివక్ష ప్రధాన పాత్ర పోషిస్తోందని వివరించారు. కేసుల సంఖ్య ఎక్కువవుతున్న నేపథ్యంలో సామాజిక వివక్ష భయంతోనే చాలామంది ఆసుపత్రులకు రావడం మాసి, ఇళ్లకే పరిమితమవుతున్నారని, దీంతో వ్యాధి కాస్తా ముదురుతోందని ఎస్‌ఎస్‌కేఎం ఆసుపత్రి సీనియర్ సర్జన్ దీప్తీంద్ర సర్కార్ తెలిపారు. సామాజికంగా నిందలకు గురవుతామన్న భయం ప్రజల్లో పోతేనే ఎక్కువ మంది పరీక్షలు చేయించుకునేందుకు ముందుకు వస్తారని ఆయన అన్నారు. ఇతర దేశాల్లో కోవిడ్ మరణాల శాతం 2 నుంచి 3 శాతం మాత్రమే ఉంటే.. బెంగాల్‌లో ఇది 13.2 శాతంగా ఉందని, పరీక్షలు తక్కువ చేస్తూండటమే దీనికి కారణమని మరో వైద్యుడు మానస్ గుమ్టా అభిప్రాయపడ్డారు. (విదేశాల నుంచి వస్తే క్వారంటైన్‌కే..)
Comments
Please login to add a commentAdd a comment