ఎక్కివచ్చిన మెట్లనే మరుస్తారా? | Ekkivaccina marustara down the stairs? | Sakshi
Sakshi News home page

ఎక్కివచ్చిన మెట్లనే మరుస్తారా?

Published Thu, Mar 12 2015 12:25 AM | Last Updated on Mon, Oct 8 2018 9:06 PM

ఎక్కివచ్చిన మెట్లనే మరుస్తారా? - Sakshi

ఎక్కివచ్చిన మెట్లనే మరుస్తారా?

ఒకప్పటితో పోలిస్తే దళిత, బడుగు వర్గాల ఉద్యోగుల సంఖ్య ఎన్నో రెట్లు పెరిగింది. కానీ వారిలో తమ జాతి బాగు కోసం ఆలోచిస్తున్న వాళ్లు అతి తక్కువ. చదువుకున్న మధ్యతరగతి వర్గం మౌనంగా ఉండే సమాజానికి భవిత ఉండదు. ముఖ్యంగా దళితుల విషయంలో ఇది మరింత ఎక్కువగా వర్తిస్తుంది. దళితుల ఏకైక ఆస్తి చదువుకున్న వాళ్లే. ఎవరు ఇబ్బందుల్లో ఉన్నా ఉన్నంతలోనే అంతా తమ వారిని ఆదుకునే పద్ధతి గ్రామాల్లోని దళితుల్లో ఇంకా ఉంది. దళిత ఉద్యోగులు మాత్రం పైకి వెళ్లే కొద్దీ ఎక్కివచ్చిన మెట్లనే మరచిపోతున్నారు.
 
నవనీత ఆ చిన్నారి పేరు. ఆ చిన్ని గుండె రంపపు కోతకు రవ్వంత ఓదార్పు లేదు. కానీ అది సామాజిక వివక్ష కు, పాలకుల నిర్లక్ష్యానికి ఎదురొడ్డి నిలచిన దిటవు గుండె. కాకపోతే పన్నెండేళ్ల పసితనంలో తానే అమ్మా, నాన్న పాత్రలు రెండూ పోషించగలదా? బతుకు బండి లాక్కుంటూ జీవితం బడిలో పాఠాలు చదువుతున్న నవనీతది రంగారెడ్డి జిల్లా దోమ మండలం మోత్కూరు గ్రామం. గూడ రామచంద్ర, యాదమ్మలకు ముగ్గురు పిల్లలు. పెళ్లయిన అక్క, ఆరో తరగతి చదివే తమ్ముడు. బళ్లో చదువు, ఇంట్లో పనీపాటూ, ఆటా పాటే జీవితంగా గడుపుతున్న నవనీత తండ్రి రామచంద్రకు క్షయవ్యాధి సోకింది. సర్కారు ఆసుపత్రి వైద్యానికి కూడా స్తోమతలేని కటిక దారిద్య్రం అతని ప్రాణాన్ని హరించేసింది. దీంతో తల్లి పిచ్చిదయ్యింది. తండ్రిని ఎత్తుకెళ్లిన క్షయ వ్యాధి అక్కనూ కబళించింది. కనికరం లేని బావ, అక్క కొడుకునీ వదిలేసి వెళ్లాడు. శ్మశానాన్ని తలపించే ఇంట్లో ముగ్గురు చిన్నారులూ బిక్కుబిక్కుమంటూ మిగిలారు. అన్నం పెట్టే దిక్కులేక పస్తులున్నారు. ఏడ్చి ఏడ్చి కళ్లల్లో నీళ్లన్నీ ఎండిపోయాక, ఒకానొక ఆకలి రాత్రి నవనీత ప్రాణప్రదమైన చదువుకి స్వస్తి పలికి, కూలి పనులకు పోవాలని నిశ్చయించింది. తమ్ముడ్ని బడికి పంపుతూ, కూలి పని కోసం తను పత్తి చేల బాటపట్టింది. ఇది సాక్షిలో వచ్చిన కథనం. ఇలా వెలుగు చూడకుండా కనుమరుగైన, అవుతున్న వ్యథార్థ జీవితాలకు లెక్కలేదు. ఇద్దరు పసివాళ్ల కోసం మరో పసిపిల్ల నవనీత చేస్తున్న త్యాగంకన్నా ఎక్కువగా ఆలోచించాల్సిన అంశం మరొకటుంది. అది సామాజిక నిర్లక్ష్యం. ఎదిగి వచ్చిన సామాజిక వర్గం తమ వర్గ సహోదరుల పట్ల ఏ మాత్రం బాధ్యతతో ఆలోచించినా నవనీత బడి మాని, పనికి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చేదే కాదు.
 
సమాజం కోసం విద్యావంతులు పనిచేయాలి

ఇలాంటి దుస్థితిని డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ముందుగానే ఊహించారు. 1956, మార్చి 18న ఆయన ఆగ్రా బహిరంగసభలో మాట్లాడుతూ ఉద్యోగస్తులు, రాజకీయ నాయకులు, విద్యార్థి, యువజనుల వైఖరి పట్ల ఆందోళన, ఆవేదన వ్యక్తం చేశారు. అందివచ్చిన రిజర్వేషన్ల వలన అప్పటికే లబ్ధి పొందిన వారి నిర్వాకంపై ధ్వజమెత్తారు. ప్రభుత్వ ఉద్యోగులను ఉద్దేశిస్తూ ‘‘మన సమాజంలో కొంత పురోగతి కనిపిస్తోంది. విద్యావంతులైన కొందరు ఉన్నతస్థాయికి చేరారు. చదువు పూర్తయ్యాక వారు సమాజానికి సేవ చేస్తారని ఆశించాను. కానీ వారు నన్ను మోసగించారు. విద్యాభ్యాసంతో చిన్న, పెద్ద గుమస్తాల గుంపు బయలుదేరి, తమ పొట్టల్ని నింపుకోవడం మాత్రమే కనిపిస్తున్నది. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్న వారు తమ జీతంలో 20 శాతం తమ జాతి కోసం ఉద్యమ విరాళంగా ఇవ్వాలి. అప్పుడు మాత్రమే సమాజం పురోగమిస్తుంది. లేకపోతే, ఒక కుటుంబం మాత్రమే అభివృద్ధి చెందుతుంది. చదువుకున్న వారిపై గ్రామాలలో ఉన్న వారు ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. విద్యావంతుడైన సామాజిక కార్యకర్త లభించడం వారికి ఒక వరం లాంటిది’’ అని ఆయన ఎంతో మనోవ్యథతో అన్నారు.

గ్రామాలలోని భూమిలేని పేద కూలీలకు తాను ఏమీ చేయలేక పోయానని కూడా అంబేద్కర్ బాధపడ్డారు. ‘‘గ్రామాలలో నివసిస్తున్న భూమిలేని శ్రామికుల గురించి నేను చాలా బాధపడుతుంటాను. నేను వారికి ఏమీ చేయలేక పోయాను. వారు అత్యాచారాలకు, అవమానాలకు గురవుతున్నారు. భూమి పొందితేగానీ వారికి విముక్తి లేదు. ఆ భూమి కోసం ఎన్ని అడ్డంకులు వచ్చినా నా పోరాటం సాగిస్తాను’’ అని ఆ రోజు ఆయన ప్రతినబూనారు. కానీ అది ఇప్పటికీ నెరవేరని స్వప్నంగానే మిగిలింది. నూటికి డెభ్బై మంది దళితులు భూమిలేని వ్యవసాయ కూలీలుగానే బతుకు వెళ్లదీస్తున్నారు. వలసపోతూ, ఊరూరూ తిరుగుతున్నారు. అంబేద్కర్ ఉద్యమం సాధించిన రిజర్వేషన్ల ద్వారా లబ్ధి పొందిన రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు ఈ సమస్యలన్నిటినీ పరిష్కరించే బాధ్యతను తీసుకున్నారు. కానీ వారు ఆయా పార్టీల నాయకుల చేతుల్లో, ముఖ్యంగా అగ్రకులాల కనుసన్నల్లో మెలుగుతున్నారు. దీనికి నేటి మన ఎన్నికల విధానం ఒక కారణం కావచ్చు.
 
అవకాశవాదంతో అనర్థమే

దళితుల కోసమే పనిచేస్తే, మెజారిటీ హిందూ సమాజం నుంచి ఓట్లు రావేమోనని, అసలు సీటు ఇస్తారో, లేదోనని వారి మన సుల్లో భయం నిండి ఉంటోంది. దీంతో వారు మరింత అవకాశవాదం వైపు వెళుతున్నారు. ఇటువంటి వారిని ఉద్దేశించి అంబేద్కర్ అన్న మాటలను గుర్తు చేసుకుందాం. ‘‘ఎవరైనా మిమ్మల్ని తమ రాజభవనంలోకి ఆహ్వానిస్తే సంతోషంగా వెళ్లండి. కానీ మీ గుడిసెలను తగలబెట్టుకొని మాత్రం వెళ్లకండి. కొన్ని రోజుల తరువాత ఆ రాజు మిమ్మల్ని కోటలోంచి గెంటేస్తే ఎక్కడికి వెళతారు? మీరు అమ్మడుపోవాలనుకుంటే, అమ్ముడుపోండి. కానీ మీ సంస్థలను, పునాదులను నాశనం చేసి మాత్రం కాదు. బయటి వారి నుంచి నాకే ప్రమాదం లేదు. ప్రమాదమంతా సొంత వారి నుంచే’’ అన్న ఆయన వ్యాఖ్యలు కటువుగా అనిపించినా అందులోని నిజాన్ని విస్మరించలేం. అదే విధంగా ఆయన గ్రామాలు, పట్టణాల్లోని సామాన్య దళితులకు ఒక హెచ్చరిక, మార్గనిర్దేశన చేశారు. ‘‘గత ముప్పై సంవత్సరాల నుంచి మీకు రాజకీయ అధికారాలను సముపార్జించడానికి ప్రయాసపడుతున్నాను. చట్టసభల్లో మీకు సీట్లు రిజర్వు చేయించగలిగాను. మీ పిల్లల చదువు కోసం అవసరమైన నిబంధనలు చేయించాను. ఇక మనం పురోగమించవచ్చు. విద్య, ఆర్థిక, సామాజిక అసమానతలను తొలగించుకోవడానికి ఉమ్మడి పోరాటం సాగించడం మీ ప్రస్తుత కర్తవ్యం. ఈ అవసరం కోసం అన్ని రకాల త్యాగాలకూ అవసరమైతే రక్తాన్ని చిందించడానికి కూడా మీరు సిద్ధం కావలసి ఉంది’’ అని ఉద్బోధించారు.
 
‘‘విద్యార్థి, యువకులకు నా విజ్ఞాపన ఏమంటే, చదువు పూర్తికాగానే వారందరూ ఏదో ఓ ఉద్యోగం చూసుకోకుండా, వారి గ్రామ ప్రజలకు, స్థానికులకు సేవ చేయాలి. అజ్ఞానం వలన ఉత్పన్నం అవుతున్న దోపిడీని, అన్యాయాన్ని తద్వారా అరికట్టగలుగుతాం. మీ విముక్తి సమాజ విముక్తిపై ఆధారపడి ఉంది. నా పరిస్థితి ఇప్పుడు ఒక పెద్ద డేరాని నిలబెడుతున్న గుంజ లాంటిది. ఆ గుంజ ఉండని పరిస్థితి ఎలా ఉంటుందో అనే ఆవేదన నాకున్నది. నా ఆరోగ్యం అంతగా బాగాలేదు. మీ నుంచి నేను ఎప్పుడు వెళ్లిపోతానో తెలియదు. నిస్సహాయులైన, భరోసాలేని ఈ కోట్లాది మంది ప్రజల ప్రాణాలు కాపాడే యువకులు నాకు కనపడటం లేదు. ఆ బాధ్యతలు స్వీకరించడానికి ఎవరైనా యువకుడు ముందుకు వస్తే నేను నిశ్చింతగా వెళ్లిపోతాను’’ అని అంబేద్కర్ అన్నారు. ఆయన ఆకాంక్ష నేటికీ నెరవేరకుండానే మిగిలిపోయింది. అలా అని, ఆయన మాటలను ఆదర్శంగా తీసుకొని పనిచేసిన యువకులు, ఉద్యోగస్తులు, రాజకీయ నాయకులు అసలే లేరని కాదు. కానీ అట్టడుగు దళిత జాతి శాశ్వత విముక్తి ఇంకా కలగానే మిగిలింది. పైగా అంబేద్కర్ ఉద్యమ విజయ ఫలాలు ఒక్కటొక్కటిగా చేయి జారిపోతున్నాయి. ఇంతవరకు దళితుల పట్ల సమాజం చూపుతున్న వివక్ష నేడు ద్వేషంగా మారిపోయింది. కాబట్టే ఎన్ని చట్టాలు వచ్చినా అమలుకు నోచుకోని దుస్థితి నెలకొంది.
 
పునరంకితం కావడమే నేటి కర్తవ్యం

1956లో అంబేద్కర్ ఆవేదన వ్యక్తం చేసిన నాటికంటే ఈ రోజు ఉద్యోగుల సంఖ్య ఎన్నోరెట్లు అధికమైంది. కానీ వారిలో తమ జాతి కోసం ఆలోచిస్తున్న వాళ్లు అతి తక్కువ మంది ఉన్నారు. ఏ సమాజంలోనైనా, దేశంలోనైనా, సామాజిక వర్గంలోనైనా చదువుకున్న మధ్యతరగతి వర్గం మౌనంగా ఉండే సమాజానికి, దేశానికి భవిత ఉండదు. ముఖ్యంగా దళితుల విషయంలో ఇది మరింత ఎక్కువగా వర్తిస్తుంది. ఈ కులాల ప్రజలకు భూమి లేదు. వ్యాపారంలో, వాణిజ్యంలో వాటా లేదు. పరిశ్రమలలో స్థానం లేదు. దళిత జాతికి ఉన్న ఆస్తి చదువుకున్న వాళ్లే.
 
కులంలో ఎవరు ఇబ్బందుల్లో ఉన్నా, ఉన్నంతలోనే అందరూ వారిని ఆదుకోవాలనే విధానం గ్రామాల్లోని దళితుల్లో ఇంకా ఉంది. ఇంట్లో ఏ శుభ కార్యం జరిగినా దళిత సామాజిక వర్గంలోని ప్రతివారూ సాయపడతారు. ఉమ్మడిగా శ్రమిస్తారు. ఉమ్మడిగా ఆనందిస్తారు. పెళ్లయినా, చావైనా పదిమందీ ఆర్థికంగా తోడ్పడతారు. మృత్యు విషాదం నిండిన ఇంట్లో పొయ్యి వెలగకుండా రోజుకొకరు వండి తె స్తారు. దశదిన కర్మరోజు సైతం అందరూ బియ్యం, కోళ్లు, మేకలు ఇచ్చి ఆ కుటుంబంపై భారం పడకుండా చూస్తారు. ఇటువంటి సంప్రదాయం కలిగిన దళిత జాతికి చెందిన ఉద్యోగులు మాత్రం పైకి వెళ్లేకొద్దీ తాము ఎక్కి వచ్చిన మెట్లనే మరచిపోతున్నారు. అందుకే ఉద్యోగులు, రాజకీయ నాయకులు, విద్యార్థులు, యువకులు అంతా కలసి ఈ మార్చి 18న అంబేద్కర్ 1956 ఆగ్రా సభలో అందించిన సందేశాన్ని కలసి మననం చేసుకుందాం. ఆయన చూపిన బాటకు అంకితమవుదాం!

(ఈ నెల 18న హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో మధ్యాహ్నం  2 గంటలకు జరగనున్న ‘‘పునరంకిత సభ ’’ సందర్భంగా..)
 (వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు)
  మొబైల్: 9705566213

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement