జీసీసీల్లో హైరింగ్‌ జోరు | GCCs and mid and small caps may top IT hiring as larger firms step back | Sakshi
Sakshi News home page

జీసీసీల్లో హైరింగ్‌ జోరు

Published Wed, Feb 26 2025 3:34 AM | Last Updated on Wed, Feb 26 2025 6:45 AM

GCCs and mid and small caps may top IT hiring as larger firms step back

మిడ్, స్మాల్‌ ఐటీ కంపెనీల్లో కూడా

ఆచి తూచి బడా సంస్థలు

ఎంట్రీ స్థాయి నియామకాలు అంతంతే

మిడ్‌–సీనియర్‌ స్థాయిల్లో రిక్రూట్‌మెంట్‌

సాక్షి, బిజినెస్‌ డెస్క్‌: ఈ ఏడాది టెక్‌ నిపుణుల హైరింగ్‌లో గ్లోబల్‌ కేపబిలిటీ సెంటర్లు (జీసీసీ), మిడ్‌–స్మాల్‌ ఐటీ కంపెనీలు ముందువరుసలో ఉండనున్నాయి. బడా ఐటీ కంపెనీలు కాస్త ఆచి తూచి వ్యవహరించనున్నాయి. అలాగే మిడ్‌–సీనియర్‌ స్థాయిల్లో నియామకాలు మెరుగ్గానే ఉండనున్నప్పటికీ ఎంట్రీ లెవెల్‌ స్థాయిలో మాత్రం హైరింగ్‌ నెమ్మదించవచ్చని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ప్రాజెక్టులను అసైన్‌ చేయడానికి ముందు మళ్లీ ప్రత్యేకంగా శిక్షణనివ్వాల్సిన పరిస్థితి ఉండకూడదని కంపెనీలు భావిస్తుండటమే ఇందుకు కారణమని వివరించాయి. ఈ నేపథ్యంలోనే వచ్చే ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో పెద్ద ఎత్తున ఫ్రెషర్లను తీసుకోవడం కన్నా మిడ్‌ నుంచి సీనియర్‌ స్థాయి సిబ్బందిని తీసుకోవడానికే ప్రాధాన్యమివ్వొచ్చని పేర్కొన్నాయి.

‘చాలా మంది ఫ్రెషర్లలో ఉద్యోగ నైపుణ్యాలు ప్రశ్నార్థకంగా ఉండటం వల్ల ఐటీ సర్వీసుల కంపెనీలు హైరింగ్‌ విషయంలో ఆచి తూచి వ్యవహరిస్తున్నాయి’ అని మైఖేల్‌ పేజ్‌ ఇండియా ప్రాంతీయ డైరెక్టర్‌ ప్రాంశు ఉపాధ్యాయ్‌ తెలిపారు. బహుళ జాతి సంస్థలు దేశీయంగా గ్లోబల్‌ కేపబిలిటీ సెంటర్లు ఏర్పాటు చేస్తుండటం, విస్తరిస్తుండటంతో టెక్నాలజీ లో అనుభవమున్న ఉద్యోగులకు జీసీసీల్లో డిమాండ్‌ బాగా ఉంటోంది. 

టీమ్‌లీజ్‌ గణాంకాల ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దాదాపు 55 లక్షలుగా ఉన్న ఐటీ ఉద్యోగుల సంఖ్య 2027 ఆర్థిక సంవత్సరం నాటికి 65 లక్షలకు చేరే అవకాశం ఉంది. డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో టెక్‌ మహీంద్రా, టాటా కన్సల్టెన్సీ సర్విసెస్, ఇన్ఫోసిస్‌ మొదలైన సంస్థల్లో నియామకాలు పెరిగినా, హెచ్‌సీఎల్‌ టెక్, విప్రో, కాగ్నిజెంట్‌ తదితర సంస్థల్లో తగ్గాయి. 2024లో నియామకాలు 5–7 శాతం తగ్గినప్పటికీ, మొత్తం మీద 2025లో హైరింగ్‌ వృద్ధి కాస్త సానుకూలంగా 8–12 శాతం స్థాయిలో ఉండొచ్చని ఉపాధ్యాయ్‌ పేర్కొన్నారు.

స్పెషలైజ్డ్‌ నైపుణ్యాలకు డిమాండ్‌
సాధారణ విధులకు సంబంధించి వేరే సంస్థలకు వెళ్లిపోయిన ఉద్యోగుల స్థానాలను భర్తీ చేయడం లేదా కొత్తవారిని తీసుకోవడమనేది 2024లో 8–10 శాతం మేర తగ్గినట్లు రాండ్‌స్టాడ్‌ వర్గాలు వెల్లడించాయి. అయితే, చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు ఐటీ కంపెనీలు ప్రత్యేక టెక్‌ నైపుణ్యాలున్న వారిని నియమించుకునే ధోరణి పెరుగుతోందని పేర్కొన్నాయి. 2025లో ఏఐ, ఎంఎల్, డేటా అనలిటిక్స్, క్లౌడ్‌ టెక్నాలజీస్‌ తదితర విభాగాల్లో నిపుణులను దేశీ ఐటీ కంపెనీలు నియమించుకోవచ్చని వివరించాయి.

ఉత్పాదకతపైనే ఫోకస్‌ 
కంపెనీలు ఉత్పాదకత, వ్యయాల నియంత్రణపై మరింతగా దృష్టి పెడుతున్నాయి. అందుకే తక్కువ వేతనాలకే పెద్ద సంఖ్యలో ఫ్రెషర్లు దొరికే అవకాశం ఉన్నప్పటికీ నియామకాలపై సుముఖంగా లేవు. సాధారణంగా ఎంట్రీ లెవెల్‌ ఉద్యోగులు గరిష్ట స్థాయిలో ఉత్పాదకత సాధించాలంటే ఏడాది, రెండేళ్లు పట్టేస్తుందని, కంపెనీలు అంత కాలం నిరీక్షించే పరిస్థితి లేదని ఎగ్జిక్యూటివ్‌ సెర్చ్‌ సంస్థ ఏబీసీ కన్సల్టెంట్స్‌ వర్గాలు తెలిపాయి. ఉద్యోగులను నియమించుకున్న దగ్గర్నుంచే కంపెనీలు పనితీరు, ఉత్పాదకతను పరిశీలిస్తున్నాయని వివరించాయి.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement