దళిత అధ్యయనాలకు నిధులు కట్
– దేశవ్యాప్తంగా వివిధ వర్శిటీల్లో 35 స్టడీస్ సెంటర్లు
– ఇకపై నిధులు ఇవ్వబోమంటూ యూజీసీ లేఖ
– కాషాయీకరణ అజెండాలో భాగంగానే తాజా చర్య అని విమర్శలు
(సాక్షి నాలెడ్జ్ సెంటర్)
సాంఘిక అసమానతలు, వివక్షపై అధ్యయనం జరిపే కేంద్రాలకు నిధుల విడుదలను నిలిపివేయాలని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. దళితుల స్థితిగతులు, వివక్ష, రిజర్వేషన్లు... తదితర అంశాలపై అధ్యయనం చేయడం ద్వారా ఈ కేంద్రాలు గణంకాలను రూపొందిస్తాయి. దళితుల చేతుల్లో ఉన్న భూమి ఎంత, కుటుంబాల జీవనాధారం ఏమిటి? ఆరోగ్యపరంగా, విద్యపరంగా ఏ స్థాయిలో ఉన్నారనే గణాంకాలను తయారుచేస్తాయి. వీటి ఆధారంగా దళితులు, ఆదివాసీల అభివృద్ధికి ప్రభుత్వాలు దృష్టి కేంద్రీకరించాల్సిన అంశాలపై అవగాహన వస్తుంది. 11వ పంచవర్ష ప్రణాళిక (2007–12)లో వీటిని నెలకొల్పాల్సిన ఆవశ్యకతను ప్రస్తావించారు. తర్వాత 35 కేంద్ర వర్శిటీలు, రాష్ట్ర వర్శిటీల్లో ఇలాంటి అధ్యయన కేంద్రాలు ఏర్పాటయ్యాయి. తర్వాత ఆరో పంచవర్ష ప్రణాళికలో వీటికి నిధుల కేటాయింపును కొనసాగించారు. ఆరో పంచవర్ష ప్రణాళిక ఈనెల 31తో ముగియనున్న నేపథ్యంలో... ఇకమీదట వీటికి ఎలాంటి నిధుల కేటాయింపు ఉండదని స్పష్టం చేస్తూ జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్శిటీకి యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) నుంచి లేఖ అందింది.
’మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు... ఆరో పంచవర్ష ప్రణాళిక ముగిశాక ఈ కేంద్రాలకు యూజీసీ నుంచి ఎలాంటి నిధులు అందవని తెలియజేస్తున్నాం. ఈ అధ్యయన కేంద్రాల కొనసాగింపుతో ఇకపై యూజీసీకి ఎలాంటి సంబంధం ఉండదు. ఈ విషయంలో ఎలాంటి ఉత్తరప్రత్యుత్తరాలకు యూజీసీ ఆస్కారం ఇవ్వదు’ అని యూజీసీ కార్యదర్శి సుష్మా రాథోడ్ పేరిట వర్శిటీలకు లేఖలు అందాయి. ఇదే విషయంపై యూజీసీ చైర్మన్ వేద్ ప్రకాశ్‌ను టెలిగ్రాఫ్ పత్రిక సంప్రదించగా... ‘ప్రణాళిక పద్దు కింద నిధులు రావని చెప్పాం... ప్రణాళికేతర నిధులు కాదు’ అని అస్పష్టంగా సమాధానమిచ్చి ఫోన్ పెట్టేశారు. నిజానికి అధ్యయన కేంద్రాలకు ప్రణాళికేతర వ్యయంలో నుంచి నిధులేమీ రావు. దాంతో ఈ కేంద్రాల్లో ఎంఫిల్, పీహెచ్‌డీలకు నమోదు చేసుకున్న విద్యార్థులు, వీటిల్లో బోధిస్తున్న ప్రొఫెసర్ల భవిష్యత్తు ప్రశ్నార్థకమయ్యింది.
ఏడాదిన్నర కిందట సంఘ్ వారపత్రిక పాంచజన్యలో జేఎన్‌యూలో ఉన్న అధ్యయన కేంద్రాన్ని విమర్శిస్తూ వ్యాసం రావడం గమనార్హం. కుట్రలో భాగంగానే వీటి ఏర్పాటు జరిగిందని, లెఫ్టిస్టులను, క్రిస్టియన్ మిషనరీలను ఉద్యోగాల్లోకి తీసుకొని... చదువుకున్న యువత బుర్రలను పాడుచేస్తున్నారని అది పేర్కొంది.
‘ఒకవైపు వేదాలపై అధ్యయనానికి నిధులిస్తూ... మరోవైపు దళితుల స్థితిగతులు మెరుగుపర్చేందుకు అధ్యయనాలు చేసే కేంద్రాలను యూజీసీ మూసివేయిస్తోంది. తరతరాలుగా వస్తున్న బ్రాహ్మణ ఆధిపత్య పోకడలను ప్రశ్నించకూడదనేది యూజీసీ భావన’
– ప్రొఫెసర్ ఎన్.సుకుమార్, ఢిల్లీ యూనివర్శిటీ