representation
-
ఏఐ అభివృద్ధిలో వివక్ష!
న్యూఢిల్లీ: కృత్రిమ మేధస్సు (ఏఐ) రంగంలో మహిళల ప్రాతినిధ్యం తక్కువగా ఉంది. దీంతో భవిష్యత్ సాంకేతిక పరిజ్ఞానాలలో ప్రబలంగా ఉన్న సామాజిక వివక్ష శాశ్వతంగా పెరిగే ప్రమాదం ఉందని మైక్రోసాఫ్ట్ ఇండియా, దక్షిణాసియా చీఫ్ పార్ట్నర్ ఆఫీసర్ హిమానీ అగ్రవాల్ అన్నారు. ‘మహిళలను చేర్చుకోవడం అనేది ఉమ్మడి బాధ్యత. విభిన్న దృక్కోణాలు లేకుండా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌ను (ఏఐ) రూపొందించడం కొనసాగితే.. నేటి వివక్ష రేపటి సాంకేతికతలోకి బలంగా మారే ప్రమాదం ఉంది. ఇది కేవలం సంఖ్యల సమస్య కాదు. మనం నిర్మిస్తున్న భవిష్యత్తు గురించి. ఏఐ ప్రపంచాన్ని రూపొందిస్తుంటే.. ఏఐని రూపొందిస్తున్న వ్యక్తులు ప్రపంచ వైవిధ్యాన్ని ప్రతిబింబించాలి’ అని అభిప్రాయపడ్డారు. అందుకే మనం ముందుగానే అడుగు వేయాలని అన్నారు. ఏఐని ముందుకు నడిపించడానికి యువతులలో ఉత్సుకతను రేకెత్తించడం, మెంటార్షిప్ నెట్‌వర్క్‌లను బలోపేతం చేయడం, మహిళలకు నైపుణ్యాలు, నాయకత్వ అవకాశాలు ఉన్నాయని తెలియజెప్పాలని పిలుపునిచ్చారు. ఒక కఠిన పనిగా.. ఉద్యోగ రంగంలోకి ప్రవేశించడం, నిలదొక్కుకోవడం చాలా మంది మహిళలకు ఒక కఠిన పనిగా అనిపిస్తుందని హిమానీ అగ్రవాల్ అన్నారు. మైక్రోసాఫ్ట్ ప్రధాన ఉద్యోగులలో మహిళలు 31.6 శాతం ఉన్నారని చెప్పారు. మరింత మంది మహిళలను చేర్చుకోవడం కోసం కంపెనీ చురుకుగా పనిచేస్తోందని ఆమె వివరించారు. సైబర్ సెక్యూరిటీ వంటి అభివృద్ధి చెందుతున్న రంగాలలో మహిళల భాగస్వామ్యం ఎక్కువగా ఉండటం చాలా ముఖ్యమని చెప్పారు. అయితే ఈ విభాగంలో డిమాండ్ అధికంగా ఉన్నప్పటికీ మహిళల ప్రాతినిధ్యం తక్కువగా ఉందని తెలిపారు. మహిళలు కేవలం ఉద్యోగ రంగంలోకి ప్రవేశించడమేగాక కెరీర్లో అభివృద్ధి చెందేలా చూసుకోవడంలో నిజమైన సవాల్, అవకాశం ఉందన్నారు. ‘సాంకేతికత సమానత్వాన్ని అందించే శక్తిని కలిగి ఉంది. సౌకర్యవంత కెరీర్లు, విభిన్న ఉద్యోగ బాధ్యతలు అపరిమిత అవకాశాలను అందిస్తుంది. అయినప్పటికీ మధ్య స్థాయి నుండి నాయకత్వానికి కీలక మార్పు చాలా మంది మహిళలకు అడ్డంకిగా మిగిలిపోయింది. ఇక్కడే మహిళలను చేర్చుకునే సంస్కృతి మార్పును కలిగిస్తుంది’ అని వివరించారు. -
ఐరాస భద్రతా మండలిలో సంస్కరణలు అవసరం: భారత్
న్యూయార్క్: ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో సంస్కరణలు అవసరమని ఐరాసలోని భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీష్ అన్నారు. ఈ విషయంపై దశాబ్దాలుగా చర్చలు జరుగుతున్నప్పటికీ 1965 నుంచి ఎటువంటి గణనీయమైన మార్పులు చోటుచేసుకోలేదని వ్యాఖ్యానించారు. న్యూయార్క్‌లో నిర్వహించిన జనరల్ అసెంబ్లీ ప్లీనరీలో ఈ విషయాన్ని ఆయన గుర్తు చేశారు. భారత్‌కు శాశ్వత సభ్యత్వం కల్పించాలని హరీష్ కోరారు. ‘‘మేం(భారత్) ఈ సంవత్సరం చర్చలను ప్రారంభించిన సమయంలో యూఎన్ భద్రతా మండలిలో సంస్కరణల విషయాన్ని మరోసారి గుర్తించాం. భవిష్యత్ శిఖరాగ్ర సమావేశంలో కీలకమైన, తక్షణ ప్రాధాన్యతగా భావిస్తున్నాం. అయితే.. అనేక దశాబ్దాలుగా ఈ విషయాన్ని సమిష్టిగా తెలియజేసినప్పటికీ ఎలాంటి ఫలితాలు రాకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.#IndiaAtUN PR @AmbHarishP delivered 🇮🇳’s statement at the Plenary Meeting of the General Assembly on ‘Question of equitable representation on and increase in the membership of the Security Council and other matters related to the Security Council’ today. pic.twitter.com/1SDKiTSVtr— India at UN, NY (@IndiaUNNewYork) November 11, 2024..1965లో కౌన్సిల్ చివరిసారిగా నాన్-పర్మనెంట్ విభాగంలో మాత్రమే విస్తరించబడింది. సంస్కరణల పురోగతికి ఆటంకం కలిగించే మూడు ప్రధాన అంశాలు ఉన్నాయి. అసమర్థమైన అంతర్-ప్రభుత్వ చర్చల ప్రక్రియ, కొన్ని దేశాలు ఏకాభిప్రాయం కోసం పట్టుబట్టడం, గ్లోబల్ సౌత్‌కు ప్రాతినిధ్యం లేకపోవడం. ..అంతర్-ప్రభుత్వ చర్చల ప్రక్రియ ప్రారంభమైన పదహారు ఏళ్ల నుంచి ప్రకటనలు ఇచ్చిపుచ్చుకోవటం, చర్చలు జరపటానికి మాత్రమే పరిమితం అయింది. నిర్దిష్టమైన ముగింపు లక్ష్యం లేదు. కొన్ని దేశాల ఏకాభిప్రాయం అనే అంశం..ఎటువంటి మార్పలు కోరుకోని యథాతథ స్థితికి అనుకూలంగా ఉన్న కొన్ని దేశాలు మాత్రమే ముందుకు తెచ్చిన వాదన. గ్లోబల్ సౌత్ సభ్యునిగా.. కేవలం కౌన్సిల్ మాత్రమే కాకుండా ఐక్యరాజ్యసమితి చట్టబద్ధత, ప్రభావం రెండింటికీ ప్రాతినిథ్యం అవసరమని మేం విశ్వసిస్తున్నాం’’ అని అన్నారు. -
YSRCP 2024: మహిళలకు, విద్యాధికులకు పెద్దపీట
ఆంధ్రప్రదేశ్‌లోని 175 శాసనసభ, 25 లోక్‌సభ స్థానాల నుంచి వైఎస్ఆర్సీపీ తరపున పోటీచేసే అభ్యర్థుల జాబితాను ఆ పార్టీ వెల్లడించింది. ఈసారి మహిళలకు, విద్యాధికులకు టిక్కెట్ల కేటాయింపులో ప్రాధాన్యతనిచ్చారు. 2019తో పోల్చిచూస్తే మహిళలకు ఈ సారి ఐదు సీట్లు అధికంగా కేటాయించారు. రాబోయే లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి మహిళకు మొత్తం 24 సీట్లు కేటాయించగా, వాటిలో 19 ఎమ్మెల్యే, 5 ఎంపీ సీట్లు ఉన్నాయి. జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ తదితర స్థానాల్లో ఉంటూ, పార్టీ కోసం పాటుపడినవారిని గుర్తించి, వారిలో 14 మందికి పార్టీ సీట్లు కేటాయించింది. లోక్‌సభ, అసెంబ్లీ అభ్యర్థులుగా ఎంపిక చేసిన మొత్తం 200 మందిలో 77 శాతం మంది అంటే 153 మంది (131 ఎంఎల్ఏ, 22 ఎంపీ)లు పట్టభద్రులు. వారిలో 58మంది పోస్టు గ్రాడ్యుయేట్, ఆరుగురు డాక్టరేట్ చేసినవారు ఉన్నారు. మొత్తంగా చూసుకుంటే అభ్యర్థులలో 17 మంది వైద్యులు, 15మంది లాయర్లు, 34 మంది ఇంజినీర్లు, ఐదుగురు టీచర్లు, ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు, ఒక రక్షణ విభాగం ఉద్యోగి, ఒక జర్నలిస్టు ఉన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రకటించిన అభ్యర్థుల జాబితాలోని 50 శాతం సీట్లను బీసీ, ఎస్సీ, ఎస్టీ,మైనారిటీ వర్గాలకు కేటాయించారు. ఈ జాబితాలో 84 ఎంఎల్ఏ, 16 ఎంపీ అభ్యర్థులున్నారు. 2019 ఎన్నికల సీట్ల కేటాయింపుతో పోల్చి చూసుకుంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కమ్యూనిటికీ అదనంగా 7 ఎమ్మెల్యే సీట్లను వైఎస్ఆర్సీసీ పార్టీ కేటాయించింది. ఇక మహిళా అభ్యర్థుల విషయానికొస్తే 2019తో పోల్చిచూస్తే ఈసారి అదనంగా 4 ఎమ్మెల్యే సీట్లను కేటాయించారు. -
Minority Welfare Day: ముస్లింల ప్రాతినిధ్యం పెరగాలి
స్వాతంత్య్రం సిద్ధించి ఏడున్నర దశాబ్దాలైనా దేశంలో అనేక వర్గాలకు అభివృద్ధి ఫలాలు అందని ద్రాక్షలుగానే ఉన్నాయి. అందులో ముస్లింలు ముందు వరుసలో ఉన్నారు. అందుకే జస్టిస్ సచార్ నివేదిక వారిలో చాలా ఆశలు రేపింది. మిగతా వర్గాలతో పోలిస్తే ముస్లిం మైనారిటీల జీవన స్థితిగతులు ఏమాత్రం మెరుగ్గా లేవని నివేదిక తేల్చింది. అనేక వర్గాలు సామాజికంగా, రాజకీయంగా దూసుకుపోతుంటే ముస్లింలు మాత్రం ఈ పరుగు పందెంలో బాగా వెనుకబడ్డారు. పైగా అభద్రతా భావం పెరిగింది. ముస్లిం సమాజంలో పేదరికం కూడా ఎక్కువే. పల్లెటూళ్లలో సెంటు భూమికూడా లేనివారిలో ఎక్కువ మంది ముస్లింలే. దీంతో వారు రోజువారీ కూలీలుగా బతుకుతున్నారు. ఊళ్ళలో ఉపాధి అవకాశాలు తగ్గడంతో చాలా మంది దగ్గరలోని నగరాలు, పట్టణాలవైపు వలస బాట పట్టారు. రోడ్ల పక్కన కాయలు, పండ్లు అమ్ముకోవటం, రిపేరింగ్ లాంటి పనులతో సరిపెట్టుకుంటున్నారు. దేశ జనాభాలో ముస్లింల శాతం 14.9 అయినా ప్రభుత్వ ఉద్యోగాల్లో వాళ్ల శాతం 4.9కి మించిలేదు. కేంద్ర సర్వీసుల్లో మరీ తక్కువ (3.2 శాతం). సచార్ కమిటీ నివేదిక తర్వాత ఏర్పడిన అనేక కమిటీలు కూడా దేశంలోని ముస్లింల స్థితిగతులపై పెదవి విరిచాయి. ముస్లిం సమాజం ఇప్పటికీ గుర్తింపు సమస్య లోనే కొట్టుమిట్టాడుతోంది. ముస్లిం సమాజంపై ఇప్పటికీ మిగతా సామాజిక వర్గాల్లో కొన్ని అపోహలు ఉన్నాయి. మతోన్మాద శక్తుల ప్రాబల్యం పెరగడంతో నిజాలపై అపోహల ఆధిపత్యం ఎక్కువైంది. దీంతో ముస్లింల సమ స్యలు ఇనుమడిస్తున్నాయి. ఎస్సీ, ఎస్టీలకు అత్యాచార నిరోధక చట్టం ఉన్నట్లుగానే, ముస్లిముల కోసం కూడా అత్యాచార నిరోధక చట్టం తీసుకురావాలి. సబ్‌ప్లాన్ అమలు చేయాలి. మైనారిటీ తెలంగాణలో ఉర్దూను రెండవ అధికార భాషగా అమలు చేస్తామన్న వాగ్దానాన్ని కాగితాలకే పరిమితం చెయ్యకుండా ఆచరణలో పెట్టాలి. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి కల్పించిన 4 శాతం రిజర్వేషన్లు 12 శాతానికి పెంచుతానన్న హామీని గురించి కేసీఆర్‌ను నిలదీయాలి. ముస్లిం సముదాయం కూడా ఎవరో వచ్చి ఏదో చేస్తారని ఎదురుచూడకుండా రాజ్యాంగ ప్రసాదితమైన హక్కుల సాధనకు రాజ్యాంగ బద్ధంగానే పోరాడాలి. పాలక పక్షాలు చురుగ్గా స్పందించేలా దేశంలోని ప్రజాస్వామ్య ప్రియులు, హక్కుల నేతలు, లౌకిక వాదులు, వామపక్షీయులు, బహుజన శక్తులతో కలిసి మైనారిటీలను పట్టించుకోని ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకు రావాలి. మతపరమైన అంశాలను పక్కన పెట్టి అభివృద్ధి దిశగా ముస్లిం సమాజాన్ని నడిపించే బలమైన నాయకత్వం నేటి అవసరం. (క్లిక్ చేయండి: ఆలోచనాపరుల జాగరూకతే దేశానికి రక్ష) - ఎమ్డీ ఉస్మాన్ ఖాన్ సీనియర్ జర్నలిస్ట్ (నవంబర్ 11న జాతీయ మైనారిటీ సంక్షేమ దినోత్సవం) -
కేసీ కెనాల్‌కు సాగునీరు విడుదల చేయాలి
చాపాడు: మహరాష్ట్ర ప్రాంతంలో కురిసిన భారీ వర్షాల కారణంగా శ్రీశైలం జలాశయంలో భారీ వరద నీరు చేరిందని, ఇప్పటికే 856 అడుగులకు పైగా చేరిందని.. ఈ క్రమంలో తక్షణమే కేసీ కెనాల్‌కు సాగునీటి విడుదలపై ప్రభుత్వం ప్రకటన చేయాలని ఏపీ రైతుసంఘం నాయకులు పేర్కొన్నారు. కేసీ కెనాల్ సాగునీటి విడుదల ఉద్యమంలో భాగంగా సోమవారం చాపాడు తహసీల్దారు వి.పుల్లారెడ్డికి ఏపీ రైతు సంఘం నాయకులు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎగువ రాష్ట్రాలలో కురిసిన వర్షాల కారణంగా శ్రీ శైలం జలాశయంలో భారీగా వరద నీరు 856 అడుగలకు చేరిందని, ఇంకా చేరుతుందన్నారు. ఈ క్రమంలో ఇప్పటికై ఖరీఫ్‌లో వరిసాగుకు దూరమైన కేసీ రైతాంగానికి తక్షణమే కేసీ కెనాల్‌కు సాగునీటిని విడుదల చేయాలని, ఈ మేరకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, వెంటనే నీటి విడుదలపై ప్రకటన చేయాలన్నారు. శ్రీశైలంలో 875 అడుగుల మేరకు సాగునీటిని నిల్వ చేయాలని, ఆపై వచ్చే నీటిని క్రిందికి తీసుకెళ్లాలన్నారు. ప్రభుత్వం త్వరగా కేసీ సాగునీటి విడుదలపై ప్రకటన చేస్తే రైతులు వరిసాగు కోసం సంసిద్దమవుతారన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ రైతు సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏవీ రమణ, మండల నాయకులు రామాంజనేయుడు, జిల్లా ఉపాధ్యక్షులు అంకిరెడ్డి, సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి పి.శ్రీరాములు, రైతు సంఘం నాయకులు కేవీ రమణ, పుల్లయ్య, ప్రతాప్‌రెడ్డి, పట్నం వెంకటేశ్వర్లు, షర్పరుద్దీన్, ఇల్లూరు సుధాకర్‌రెడ్డి, సిద్దయ్య తదితరులు పాల్గొన్నారు. -
సీఎం స్థాయి వ్యక్తి ఇంత దిగజారాలా: వైఎస్ జగన్
-
సీఎం స్థాయి వ్యక్తి ఇంత దిగజారాలా: వైఎస్ జగన్
రాష్ట్రంలో ఉన్నది ప్రజాస్వామ్యమా.. లేక గూండాస్వామ్యమా అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రశ్నించారు. అసలు ఆంధ్రరాష్ట్రంలో ఉండాలంటేనే భయమేస్తోందన్నారు. హైదరాబాద్‌లో అందుబాటులో ఉన్న పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి ఆయన గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్‌ను సోమవారం ఉదయం కలిశారు. స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా తెలుగుదేశం పార్టీ సాగించిన అరాచకాలను సాక్ష్యాలతో సహా ఆయన దృష్టికి తీసుకెళ్లారు. మెజారిటీ లేకపోయినా.. ఇతర పార్టీల సభ్యులను ప్రలోభపెట్టడం దగ్గర్నుంచి భయానక వాతావరణం సృష్టించి ఎన్నికలను వాయిదా వేయించడం, వైఎస్ఆర్సీపీ సభ్యులందరినీ బయటకు పంపేసి టీడీపీ వాళ్లు జడ్పీ ఛైర్మన్లుగా ఎన్నికైనట్లు ప్రకటించడం లాంటి అరాచకాలన్నింటినీ గవర్నర్ నరసింహన్‌కు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వివరించారు. వీటికి సంబంధించిన దృశ్యాలను సీడీల రూపంలో ఆయనకు అందించారు. ప్రజాస్వామ్యం సిగ్గుపడేలా అధికార పార్టీ వ్యవహరిస్తోందని ఆయన తెలిపారు. ఈ వ్యవహారంపై గవర్నర్ వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఇంకా జగన్ ఏమన్నారంటే.. ఆ మూడు రోజులూ ప్రజాస్వామ్యం ఖూనీ ''గవర్నర్ గారిని కలిశాం. మొన్న 3, 4, 5 తేదీల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల తీరును వివరించాం. ఆ మూడు రోజులు మండల పరిషత్ ఛైర్మన్లు, జడ్పీ ఛైర్మన్లు, మునిసిపల్ ఛైర్మన్ల ఎన్నికల ప్రక్రియలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ, సాక్షాత్తు అధికార పార్టీయే దారుణాలకు పాల్పడింది. ఇది ఎంతవరకు న్యాయమని గవర్నర్‌కు డీవీడీ కాపీలు కూడా ఇచ్చాం. మామూలుగా ఎంపీటీసీ, జడ్పీటీసీ, మునిసిపల్ కార్పొరేషన్ల పదవుల్లోకి వేరే పార్టీల బీఫారాల మీద గెలిచినవాళ్లను లాక్కోవాలనే ప్రయత్నం ఇంతవరకు ఎవరూ చేయలేదు. ముఖ్యమంత్రి పదవితో సరిపెట్టుకోకుండా.. చివరకు మండలపరిషత్, మునిసిపాలిటీలు, జడ్పీ పదవులు కూడా లాక్కోవాలనుకోవడం దౌర్భాగ్యం. సీఎం స్థాయి వ్యక్తి ఇంత దిగజారాలా? టీడీపీ బీ ఫారాల మీద గెలవకపోయినా.. ప్రజలు వాళ్లకు వ్యతిరేకంగా ఓటేసి, వైఎస్ఆర్సీపీ వారిని గెలిపించినా, వారిని భయపెట్టి, బెదిరించి, కిడ్నాప్ చేసి వాళ్లతో బలవంతంగా ఓట్లేయించుకునే కార్యక్రమం చేశారు. సాక్షాత్తు సీఎం స్థాయి వ్యక్తి ఫోన్లు చేసి జడ్పీటీసీలతో మాట్లాడారంటే వ్యవస్థ ఎటు పోతోందో మనమంతా ఆలోచించాలి. ఈ రకంగానే స్థానిక పదవులను లాక్కోవాలనుకుంటే పార్టీ గుర్తుల మీద ఎన్నికలు ఎందుకు జరిపారు? మీరే నామినేట్ చేసుకుంటే సరిపోయేది కదా? ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదా అనే అనుమానం ఉంది. బలం ప్రకారం అయితే 4 జడ్పీ ఛైర్మన్లు మాకు రావాలి. కానీ కడప ఒక్కటే వచ్చింది. కోరం ఉన్నా కూడా కావాలని రెండుచోట్ల వాయిదా వేయించారు. టీడీపీవాళ్లతో కలెక్టర్ సమక్షంలోనే పోలీసుల సాయంతో దిగజారి రాజకీయాలు చేస్తే చెప్పుకోడానికి ఎక్కడికి పోవాలి? మాకున్న బలం ప్రకారం 239 ఎంపీపీలు గెలవాలి, 200 మాత్రమే గెలిచాం. అలాగే 36 మున్సిపల్ ఛైర్మన్ పదవులు దక్కించుకోవాలి.. 19 మాత్రమే దక్కాయి. ప్రజలు మాకు బలం ఇచ్చినా అధికార దుర్వినియోగంతో పదవులను చేజిక్కించుకోవాలని సీఎం పదవిలో ఉన్న వ్యక్తి చేయడం ఎంతవరకు న్యాయం, ధర్మం? చంద్రబాబుకు ఒక్కమాట చెప్పదలచుకున్నా. ప్రతిపక్షాల గొంతు నొక్కాలనుకుంటే.. అధికారంలో ఉన్నాం కదా అనుకోవడం మూర్ఖత్వం. నిజమైన ప్రతిపక్షం మీకు ఓట్లేసిన ప్రజలే. మేనిఫెస్టోలో మీరు చెప్పిన హామీలు నెరవేర్చలేని పరిస్థితిలో ఉన్న మీరు నిజంగా మనుషులు కారనిపిస్తోంది. ప్రజలే విపక్షం.. వారే కాలర్ పట్టుకుంటారు ప్రజాస్వామ్యంలో విపక్షమన్నదే లేకుండా చేయాలని గొంతు నొక్కుతున్నారు. ప్రజలే కాలర్ పట్టుకునే రోజు వస్తుంది . రైతులకు రుణమాఫీ చేస్తామని అబద్ధాలు చెప్పారు. ఇంటింటికీ ఉద్యోగం, ఇవ్వలేకపోతే 2వేల రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. రైతులు, నిరుద్యోగులు మీ కాలర్ పట్టుకుంటారు. రాబోయే రోజుల్లో మీకు డిపాజిట్లు కూడా రాని పరిస్థితి ఏర్పడుతుంది. గవర్నర్ గారికి లేఖ ఇచ్చాం. చంద్రబాబు ఎన్నికైన తర్వాత 17 మంది వైసీపీ కార్యకర్తలను చంపించడం, 110 మందిని తీవ్రంగా గాయపర్చడం, చీనీ చెట్లను నరికించడం.. ఇవీ చంద్రబాబు చేయించిన పనులు. ఈ నేరాలపై కేసులు పెట్టడానికి వైఎస్సార్సీపీ కార్యకర్తలు స్టేషన్లకు వెళ్తే, కేసులు ఎందుకు పెట్టడంలేదు? టీడీపీ కార్యకర్తలను ప్రోత్సహించి ఇలా చేయించడం ఎంతవరకు న్యాయం? మృతుల్లో సగానికి పైగా ఎస్సీలు, మహిళలని కూడా చూడకుండా దౌర్జన్యాలు చేయిస్తున్నారు. ఇది భావ్యమేనా? రాష్ట్రపతిని, ప్రధానిని కూడా కలిసి ఫిర్యాదుచేస్తాం మేం ఇంతటితో ఆపం. రాబోయే రోజుల్లో రాష్ట్రపతిని, ప్రధానమంత్రిని, కేంద్ర హోం మంత్రిని కూడా కలిసి చెబుతాం. రాబోయే రోజుల్లో ఆళ్లగడ్డ, నందిగామ అసెంబ్లీ, నంద్యాల ఎంపీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. అవి ఎలా జరుగుతాయోనని ఆశ్చర్యంగా ఉంది. ఇంత భయాందోళనల మధ్య ఎస్పీలు, కలెక్టర్లు అందరూ చంద్రబాబు చెప్పినట్లే చేస్తుంటే ఎలాగోనని భయమేస్తోంది. ఆంధ్రరాష్ట్రంలో బతకాలంటేనే భయం వేస్తోంది. రాబోయే రోజుల్లో ప్రతి అధికార పార్టీ ఇదే తరహాలో ప్రవర్తిస్తుంది. అందరినీ నామినేట్ చేసేస్తారు. ఇదే జరిగితే రాబోయే తరాలకు తప్పుడు సందేశం పంపినట్లవుతుంది. చంద్రబాబు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని, వైఖరి మార్చుకోండి. గవర్నర్ గారు బాగానే స్పందించారు. ఆయన చర్య తీసుకుంటారని ఆశిస్తున్నాం.'' లేఖ పూర్తి ప్రతి ఇక్కడ చదవండి..