స్వాతంత్య్రం సిద్ధించి ఏడున్నర దశాబ్దాలైనా దేశంలో అనేక వర్గాలకు అభివృద్ధి ఫలాలు అందని ద్రాక్షలుగానే ఉన్నాయి. అందులో ముస్లింలు ముందు వరుసలో ఉన్నారు. అందుకే జస్టిస్ సచార్ నివేదిక వారిలో చాలా ఆశలు రేపింది. మిగతా వర్గాలతో పోలిస్తే ముస్లిం మైనారిటీల జీవన స్థితిగతులు ఏమాత్రం మెరుగ్గా లేవని నివేదిక తేల్చింది. అనేక వర్గాలు సామాజికంగా, రాజకీయంగా దూసుకుపోతుంటే ముస్లింలు మాత్రం ఈ పరుగు పందెంలో బాగా వెనుకబడ్డారు. పైగా అభద్రతా భావం పెరిగింది.
ముస్లిం సమాజంలో పేదరికం కూడా ఎక్కువే. పల్లెటూళ్లలో సెంటు భూమికూడా లేనివారిలో ఎక్కువ మంది ముస్లింలే. దీంతో వారు రోజువారీ కూలీలుగా బతుకుతున్నారు. ఊళ్ళలో ఉపాధి అవకాశాలు తగ్గడంతో చాలా మంది దగ్గరలోని నగరాలు, పట్టణాలవైపు వలస బాట పట్టారు. రోడ్ల పక్కన కాయలు, పండ్లు అమ్ముకోవటం, రిపేరింగ్ లాంటి పనులతో సరిపెట్టుకుంటున్నారు.
దేశ జనాభాలో ముస్లింల శాతం 14.9 అయినా ప్రభుత్వ ఉద్యోగాల్లో వాళ్ల శాతం 4.9కి మించిలేదు. కేంద్ర సర్వీసుల్లో మరీ తక్కువ (3.2 శాతం). సచార్ కమిటీ నివేదిక తర్వాత ఏర్పడిన అనేక కమిటీలు కూడా దేశంలోని ముస్లింల స్థితిగతులపై పెదవి విరిచాయి.
ముస్లిం సమాజం ఇప్పటికీ గుర్తింపు సమస్య లోనే కొట్టుమిట్టాడుతోంది. ముస్లిం సమాజంపై ఇప్పటికీ మిగతా సామాజిక వర్గాల్లో కొన్ని అపోహలు ఉన్నాయి. మతోన్మాద శక్తుల ప్రాబల్యం పెరగడంతో నిజాలపై అపోహల ఆధిపత్యం ఎక్కువైంది. దీంతో ముస్లింల సమ స్యలు ఇనుమడిస్తున్నాయి.
ఎస్సీ, ఎస్టీలకు అత్యాచార నిరోధక చట్టం ఉన్నట్లుగానే, ముస్లిముల కోసం కూడా అత్యాచార నిరోధక చట్టం తీసుకురావాలి. సబ్‌ప్లాన్ అమలు చేయాలి. మైనారిటీ తెలంగాణలో ఉర్దూను రెండవ అధికార భాషగా అమలు చేస్తామన్న వాగ్దానాన్ని కాగితాలకే పరిమితం చెయ్యకుండా ఆచరణలో పెట్టాలి. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి కల్పించిన 4 శాతం రిజర్వేషన్లు 12 శాతానికి పెంచుతానన్న హామీని గురించి కేసీఆర్‌ను నిలదీయాలి.
ముస్లిం సముదాయం కూడా ఎవరో వచ్చి ఏదో చేస్తారని ఎదురుచూడకుండా రాజ్యాంగ ప్రసాదితమైన హక్కుల సాధనకు రాజ్యాంగ బద్ధంగానే పోరాడాలి. పాలక పక్షాలు చురుగ్గా స్పందించేలా దేశంలోని ప్రజాస్వామ్య ప్రియులు, హక్కుల నేతలు, లౌకిక వాదులు, వామపక్షీయులు, బహుజన శక్తులతో కలిసి మైనారిటీలను పట్టించుకోని ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకు రావాలి. మతపరమైన అంశాలను పక్కన పెట్టి అభివృద్ధి దిశగా ముస్లిం సమాజాన్ని నడిపించే బలమైన నాయకత్వం నేటి అవసరం. (క్లిక్ చేయండి: ఆలోచనాపరుల జాగరూకతే దేశానికి రక్ష)
- ఎమ్‌డీ ఉస్మాన్ ఖాన్
సీనియర్ జర్నలిస్ట్
(నవంబర్ 11న జాతీయ మైనారిటీ సంక్షేమ దినోత్సవం)
Comments
Please login to add a commentAdd a comment