
AI (Artificial intelligence) తలుచుకుంటే ఏదైనా చేయగలదు. అంతెందుకు ఎంచక్కా సినిమా కూడా తీసిపెట్టగలదు. హీరోహీరోయిన్లను కూడా తనే సృష్టించగలదు. వినడానికి ఒకింత ఆశ్చర్యంగా ఉన్నా ఇటువంటి ప్రయోగాలు ఆల్‌రెడీ జరిగిపోయాయి. ఏఐ సినిమాలు వచ్చేశాయి. ఇంతకీ భారత్‌లో ఏఐ తీసిన తొలి సినిమా ఏంటో తెలుసా? నైషా. వివేక్ అంచలియా ఏఐ సాయంతో దీన్ని డైరెక్ట్ చేశాడు.
ఏఐ సాయంతో సినిమా
రోజూవారీ దినచర్యలో టెక్నాలజీ ఎంతగా భాగమైంది? భవిష్యత్తులో ఏఐ ఇంకెంత విస్తరించనుంది? మానవ సంబంధాలు ఎలా మారనున్నాయి? అనే అంశాలను నైషా సినిమాలో చూపించారు. సంగీతాన్ని కూడా ఏఐ సాయంతోనే సృష్టించారు. డేనియల్ బి జార్జ్, ప్రోటిజ్యోతి జియోష్, ఉజ్వల్ కశ్యప్ వంటి సంగీతకారులు కొన్ని మ్యూజిక్ బిట్స్ ఇస్తే దాని ఆధారంగా వారికి నచ్చిన సౌండ్‌ట్రాక్ రెడీ చేసేసింది. ఏఐ అడ్వాన్స్‌డ్ టూల్స్‌తో విజువల్స్ కూడా అద్భుతంగా వచ్చేలా చేశారు. ఇంతకీ హీరోహీరోయిన్లు ఎవరనుకుంటున్నారు? జైన్ కపూర్, నైషా బోస్.. వీరిని కూడా టెక్నాలజీయే సృష్టించింది.
మేలో రిలీజ్
ఏఐ స్టూడియో సాయంతో పోరి భుయాన్, శ్వేత వర్మ, జోసెఫ్ నిర్మించిన ఈ మూవీ ఈ ఏడాది మేలో రిలీజ్ కానుంది. ఈ సినిమా ఎలా ఉండబోతుంది? ఎమోషన్స్‌ను టెక్నాలజీ రక్తికట్టించగలిగిందా? లేదా? అని సినీప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సినిమా ఇండస్ట్రీలో కూడా ఏఐ చొచ్చుకుని పోతే భవిష్యత్తులో ఎటువంటి ఛాలెంజ్‌లు ఎదురవుతాయన్న చర్చకు సైతం నైషా నాంది పలకనుంది.
విదేశాల్లో కొన్ని సినిమాలకు ఇదివరకే ఏఐ టెక్నాలజీని వాడుకున్నారు. అవేంటో కింద చూసేద్దాం..
సన్‌స్పింగ్ (Sunspring): 2016లో వచ్చిన ఈ చిత్రానికి ఏఐ స్క్రిప్ట్ అందించింది.
జోన్ అవుట్ (Zone Out): కొన్ని యాక్షన్ సన్నివేశాల కోసం ఏఐ విజువల్స్ వాడుకున్నారు. ఇది 2020లో రిలీజైంది.
ద నెక్స్ట్ రెంబ్రాండ్ (The Next Rembrandt): 2016లో వచ్చిన ఈ సినిమాలో ఏఐ సాయంతో పెయింటింగ్స్ వేస్తారు.
మోర్గాన్ (Morgan): సినిమా ట్రైలర్ రెడీ చేసేందుకు ఏఐ వాడారు.
ఏఐ: మోర్ ద హ్యూమన్ (AI: More Than Human): సమాజంలో ఏఐ ఎలాంటి ప్రభావం చూపుతుందని డాక్యుమెంటరీ ద్వారా చక్కగా చూపించారు.
ద సేఫ్ జోన్ (The Safe Zone): ఏఐ కథ రాసుకుని, డైరెక్ట్ చేసిన షార్ట్ ఫిలిం ఇది.
ద ఫ్రోస్ట్ (The Frost): ఏఐ టూల్స్ ఉపయోగించి తీసిన షార్ట్ ఫిలిం.
క్రిటర్జ్ (Critterz): ఏఐ నిర్మించిన యానిమేటెడ్ షార్ట్ ఫిలిం.
ప్లానెట్ జెబులాన్ ఫైవ్ (Planet Zebulon Five): ఏఐ ప్రకృతిపై తీసిన డాక్యుమెంటరీ.
థాంక్యూ ఫర్ నాట్ ఆన్సరింగ్ (Thank You for Not Answering): షార్ట్ యానిమేటెడ్ ఫిలిం.
Comments
Please login to add a commentAdd a comment