
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: స్టాక్స్‌కి సంబంధించి నిర్దిష్ట లక్షణాల ప్రాతిపదికన పెట్టుబడులు పెట్టే ఫ్యాక్టర్ ఇన్వెస్టింగ్‌లో భాగంగా ముమెంటం ఇన్వెస్టింగ్‌కి గణనీయంగా ప్రాచుర్యం పెరుగుతోందని టాటా అసెట్ మేనేజ్‌మెంట్ హెడ్ (ప్యాసివ్ ఇన్వెస్ట్‌మెంట్) ఆనంద్ వరదరాజన్ తెలిపారు.
డిమాండ్ దృష్ట్యా ఎన్‌ఎస్‌ఈ ప్రస్తుతం దాదాపు 31 ఫ్యాక్టర్ ఆధారిత సూచీలను అందిస్తోందని వివరించారు. ధరపరంగా బలమైన ట్రెండ్‌ను ప్రదర్శిస్తున్న స్టాక్స్‌ను గుర్తించి, క్రమశిక్షణతో పెట్టుబడులు పెట్టడం ద్వారా అధిక రాబడులను అందించడంపై ముమెంటం ఇన్వెస్టింగ్ ప్రధానంగా దృష్టి పెడుతుందని తెలిపారు. దీర్ఘకాలికంగా మెరుగైన రాబడులను అందుకునేందుకు, పోర్ట్‌ఫోలియోలో వైవిధ్యాన్ని పాటించేందుకు ఇన్వెస్టర్లు కొంత భాగాన్ని ఈ వ్యూహానికి కేటాయించే అవకాశాన్ని పరిశీలించవచ్చని వరదరాజన్ చెప్పారు.
గత కొన్నాళ్లుగా మార్కెట్లు కరెక్షన్‌కు లోను కావడంతో పాటు ఒడిదుడుకులమయంగా ఉంటున్నప్పటికీ నిఫ్టీ మిడ్‌క్యాప్ 150 ముమెంటం 50 ఇండెక్స్‌ను ట్రాక్ చేసే ఇండెక్స్ ఫండ్స్ మాత్రం మెరుగ్గా రాణిస్తున్నాయని పేర్కొన్నారు. తమ టాటా నిఫ్టీ మిడ్‌క్యాప్ 150 ముమెంటం 50 ఇండెక్స్ ఫండ్‌లోకి గతేడాది పెట్టుబడులు మూడింతలై సుమారు రూ. 500 కోట్లకు చేరడం వీటిపై పెరుగుతున్న ఆకర్షణకు నిదర్శనమని వరదరాజన్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment