న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్, యూరప్ కార్యకలాపాలపై దాదాపు రూ.12,000 కోట్ల మేర పెట్టుబడులు పెట్టనున్నట్లు టాటా స్టీల్ సీఈవో టీవీ నరేంద్రన్ వెల్లడించారు. భారత్‌లో రూ.8,500 కోట్లు, యూరప్‌లో రూ.3,500 కోట్లు ఇన్వెస్ట్ చేసే ప్రణాళికలు ఉన్నట్లు వివరించారు.
భారత్‌లో ప్రధానంగా కళింగనగర్ ప్రాజెక్టు విస్తరణ, మైనింగ్ కార్యకలాపాలపై దృష్టి పెట్టనున్నట్లు నరేంద్రన్ చెప్పారు. ఒరిస్సాలోని కళింగనగర్ ప్లాంటు సామర్థ్యాన్ని 3 మిలియన్ టన్నుల నుంచి 8 మిలియన్ టన్నులకు పెంచుకుంటున్నట్లు వివరించారు. మరోవైపు, ఈ పెట్టుబడులకు అదనంగా నీలాచల్ ఇస్పాత్ నిగమ్ (ఎన్‌ఐఎన్‌ఎల్) కొనుగోలు కోసం రూ. 12,000 కోట్లు వెచ్చిస్తున్నట్లు నరేంద్రన్ పేర్కొన్నారు. ఉక్రెయిన్–రష్యా యుద్ధంతో భౌగోళిక–రాజకీయ పరిస్థితులు మారిపోయాయని, ఉక్కు పరిశ్రమపైనా ప్రభావం పడిందని ఆయన చెప్పారు.
వ్యయ నియంత్రణలతో పాటు సరఫరా వ్యవస్థలను పటిష్టంగా తీర్చిదిద్దుకోవాల్సిన అవసరాన్ని కూడా కోవిడ్–19 మహమ్మారి తెలియజేసిందని పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో యుద్ధ పరిణామాలు, చైనాలో కోవిడ్‌పరమైన షట్‌డౌన్‌లు, భారత్‌లో ఉక్కు ఎగుమతులపై సుంకాల విధింపు వంటి అంశాలు ఉక్కు రంగంపై ప్రభావం చూపుతాయని నరేంద్రన్ పేర్కొన్నారు.
అయితే, మౌలిక సదుపాయాల కల్పన ఊపందుకుంటున్న నేపథ్యంలో ఉక్కుకు డిమాండ్ పెరిగి ద్వితీయార్ధంలో పరిశ్రమ పరిస్థితి సానుకూలంగా ఉండగలదని ఆశిస్తున్నట్లు వివరించారు. ఎగుమతి సుంకాల ప్రభావాలను పరిగణనలోకి తీసుకుని ఉక్కు ధరలు కూడా ఒక స్థాయిలో స్థిరపడవచ్చని, కోవిడ్ షట్‌డౌన్‌లపరమైన ఆర్థిక నష్టాల నుంచి చైనా కోలుకోవచ్చని అంచనా వేస్తున్నట్లు నరేంద్రన్ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment