మొత్తం శ్రామిక శక్తిలో 20 శాతం లోపే..
సీఎఫ్‌ఏ ఇనిస్టిట్యూట్ నివేదిక
న్యూఢిల్లీ: ఉద్యోగుల్లో మహిళల సంఖ్యను పెంచుకోవడంపై కంపెనీలు మరింత దృష్టి పెడుతున్నప్పటికీ అంతగా ప్రయోజనం కనిపించడం లేదు. దేశీయంగా మొత్తం శ్రామిక శక్తిలో మహిళల వాటా 20 శాతం లోపే ఉంటోంది. కీలక హోదాల్లో (కేఎంపీ) ఉన్న వారి సంఖ్య కేవలం పది శాతం స్థాయిలో ఉంది. ఇక బోర్డ్ డైరెక్టర్ల స్థాయిలో మహిళల సంఖ్య 20 శాతం కన్నా తక్కువే ఉంది.
లింగ అసమానతలపై సీఎఫ్‌ఏ ఇనిస్టిట్యూట్, సీఎఫ్‌ఏ సొసైటీ ఇండియా రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. 300 కంపెనీలు తమ బిజినెస్ రెస్పాన్సిబిలిటీ, సస్టైనబిలిటీ రిపోర్ట్‌లలో (బీఆర్‌ఎస్‌ఆర్) వెల్లడించిన వివరాల ఆధారంగా ఈ నివేదిక రూపొందింది. దీని ప్రకారం పురుషులతో పోలిస్తే మహిళా బోర్డు మెంబర్లు, కేఎంపీలకు అతి తక్కువ ప్రతిఫలం దక్కుతోంది. మహిళా డైరెక్టర్లకు లభించే ప్రతిఫలం .. పురుష డైరెక్టర్ల వేతనాల్లో సగటున 44 శాతమే ఉంటోంది. ఇక పురుష కేఎంపీలతో పోలిస్తే మహిళా కేఎంపీలకు జీతభత్యాలు 25 శాతం కన్నా తక్కువే ఉంటున్నాయి.
మరిన్ని అంశాలు..
→ ఐటీ రంగంలో అత్యధికంగా (34 శాతం) మహిళలు ఉన్నారు. ఆ తర్వాత స్థానాల్లో నిత్యావసరయేతర ఉత్పత్తులు, సేవల రంగం (25 శాతం), ఆర్థిక రంగం (24 శాతం) ఉన్నాయి. యుటిలిటీస్ విభాగంలో మహిళ సిబ్బంది అత్యంత తక్కువగా (4 శాతం) ఉన్నారు.
→ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ (బీవోడీ) విషయానికొస్తే రియల్ ఎస్టేట్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, నిత్యావసరాలు, ఆరోగ్య సంరక్షణ తదితర రంగాల్లో లింగ సమానత్వం మరింత మెరుగ్గా ఉంది. అయితే, ఫైనాన్షియల్ సరీ్వసెస్, ఎనర్జీ రంగాల్లో మాత్రం లింగ అసమానతలు ప్రస్ఫుటంగా ఉంటున్నాయి.
→ దేశీయంగా కార్పొరేట్ వ్యవస్థలో లింగ సమానత్వాన్ని సాధించేందుకు మరింతగా పటిష్టమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ విషయంలో గణనీయంగా పురోగతి సాధించినప్పటికీ సీనియర్ హోదాల్లో మహిళల ప్రాతినిధ్యం, జీతభత్యాల విషయంలో వ్యత్యాసాలు ఉన్నాయి. వీటిని సరిదిద్దడంపై విధాన నిర్ణేతలు, కంపెనీలు తక్షణం దృష్టి పెట్టాలి.
Comments
Please login to add a commentAdd a comment