
ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ తన విభాగమైన ఏఎన్ఎస్ కామర్స్ వ్యాపారాన్ని మూసివేసి, మొత్తం ఉద్యోగులను తొలగించింది. 2017లో స్థాపించిన ఈ సంస్థ తమ ఉత్పత్తిని ఆన్‌లైన్లో విక్రయించాలనుకునే సంస్థలకు మార్కెటింగ్ టూల్స్, వేర్‌హౌసింగ్ వంటి సహకారాన్ని అందిస్తోంది. దీన్ని ఫ్లిప్‌కార్ట్ 2022లో కొనుగోలు చేసింది.
‘పరిస్థితులన్నీ క్షుణ్ణంగా పరిశీలించి 2022లో ఫ్లిప్‌కార్ట్ కొనుగోలు చేసిన ఫుల్ స్టాక్ ఈ-కామర్స్ సంస్థ ఏఎన్ఎస్ కామర్స్ తన కార్యకలాపాలను మూసివేయాలని నిర్ణయించింది. కార్యకలాపాలను మూసివేస్తున్న క్రమంలో ఉద్యోగులు, వినియోగదారులతో సహా భాగస్వాములందరికీ పరివర్తనను సజావుగా జరిగేలా మేము కట్టుబడి ఉన్నాము’ అని కంపెనీ వర్గాలు ధ్రువీకరించాయి.
ఈ పరివర్తన సమయంలో ఉద్యోగులపై ప్రభావాన్ని తగ్గించడానికి, ఫ్లిప్‌కార్ట్‌లో అంతర్గత అవకాశాలు, అవుట్ ప్లేస్మెంట్ సేవలు, సెవెరెన్స్ ప్యాకేజీలను అందించాలని యోచిస్తున్నట్లు ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. మూసివేత వల్ల ఎంతమంది ఉద్యోగులు ప్రభావితమయ్యారో తెలియరాలేదు. 2022 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి ఏఎన్ఎస్ కామర్స్‌లో 600 మంది ఉద్యోగులు ఉన్నారు.