‘ఇంతి’తై.. ఏలుకో!
ఆమె.. ఆకాశంలో సగం. మరి చట్టసభల్లో, ఇతరత్రా అవకాశాల్లో..?!. గ్రేటర్ పరిధిలో చట్టసభల్లో ప్రాతినిధ్యం విషయంలో ఆమె సగం కంటే తీసికట్టే.. మహా నగరం పరిధిలో 1951 హైదరాబాద్ రాష్ట్ర శాసనసభకు జరిగిన ఎన్నికలు మొదలు 2009లో జరిగిన సార్వత్రిక ఎన్నికల వరకు శాసనసభ్యులుగా ఎన్నికైన మహిళల సంఖ్య చాలా తక్కువ.
మహిళా సాధికారత, హక్కుల గురించి వల్లెవేసే ప్రధాన రాజకీయ పార్టీలు.. టికెట్ల విషయానికి వచ్చే సరికి 33 శాతమైనా కేటాయించట్లేదు. 2011 జనాభా లెక్కల ప్రకారం గ్రేటర్ పరిధిలో పురుషులు 39,18,570, స్త్రీలు 37,43,425 మంది ఉన్నారు. అంటే 1,75,145 మేర పురుషులే అత్యధికంగా ఉన్నారన్నమాట. అయితే ఈసారి జనాభా ప్రాతిపదికన గ్రేటర్ పరిధిలోని 25 శాసనసభ స్థానాల్లో కనీసం సగం స్థానాల్లోనైనా ప్రధాన రాజకీయ పార్టీలు మహిళలకు టిక్కెట్లు కేటాయించాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. మహిళలపై పెరుగుతున్న అకృత్యాలను కట్టడి చేసేలా చట్టాలను రూపొందించాలంటే మహిళలు అత్యధికంగా చట్టసభల్లో ప్రవేశించాల్సిందేనని అంటున్నాయి. ఆయా రాజకీయ పార్టీలు ఈసారి మహిళలకు సముచిత స్థానం కల్పించకుంటే తిరస్కారానికి గురికాక తప్పదని హెచ్చరిస్తున్నాయి.
గ్రేటర్‌లో ఇదీ అతివల ‘స్థానం’
1951 సార్వత్రిక ఎన్నికల్లో శాలిబండ నుంచి మాసూమా బేగం తొలి మహిళా కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలుపొంది అసెంబ్లీలో అడుగుపెట్టారు. 1957 ఎన్నికల్లో పత్తర్‌ఘట్టి నుంచి గెలుపొందిన ఆమె.. 1962లో ఓటమి పాలయ్యారు
1957 ఎన్నికల్లో మలక్‌పేట నుంచి ఫతీజా ఆలం (పీడీపీ) పోటీచేసి ఓడిపోయారు. అవే ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నుంచి సుమిత్రాదేవి (కాంగ్రెస్) విజయం సాధించారు 1962లో హైదరాబాద్ (తూర్పు) నియోజకవర్గం నుంచి సుమిత్రాదేవి, జూబ్లీహిల్స్ నుంచి రొడామిస్త్రీ విజయకేతనం ఎగురవేశారు
1967 ఎన్నికల్లో మలక్‌పేట నుంచి సరోజిని పుల్లారెడ్డి విజయదుందుభి మోగించారు. 1972లోనూ తన స్థానాన్ని పదిలం చేసుకున్నారు
1978లో లక్ష్మీకాంతమ్మ (హిమాయత్‌నగర్), 1983లో కాట్రగడ్డ ప్రసూన (సనత్‌నగర్-టీడీపీ) విజయం సాధించారు
1989లో మేరీ రవీంద్రనాథ్ (సికింద్రాబాద్-కాంగ్రెస్) గెలుపొంది.. 1994, 1999 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు
1989లో మాజీ ముఖ్యమంత్రి టి.అంజయ్య సతీమణి మణెమ్మ సికింద్రాబాద్ ఎంపీగా గెలుపొందారు. 2009 శాసనసభ ఎన్నికల్లో ముషీరాబాద్ అభ్యర్థినిగా మణెమ్మ, సికింద్రాబాద్ నుంచి సినీనటి జయసుధ, మహేశ్వరం నుంచి సబితా ఇంద్రారెడ్డి (కాంగ్రెస్) విజయం సాధించారు. సబిత.. దేశంలో తొలి మహిళా హోంమంత్రిగా రికార్డు సృష్టించారు.
అక్షరాస్యతలోనూ వెనుకంజే..
నగరంలో అక్షరాస్యులైన పురుషులు 29,97,979 మంది ఉండగా, మహిళలు 25,93,017 మంది ఉన్నారు
పాఠశాల స్థాయిలో డ్రాపవుట్స్, బస్తీల్లో పాఠశాలలు అందుబాటులో లేకపోవడం వంటివి ఇందుకు కారణాలని తెలుస్తోంది
0-6 వయసు గ్రూపులో బాలుర కంటే బాలికల సంఖ్య తక్కువ. ఈ గ్రూపులో బాలురు 4,73,195, బాలికలు 4,36,255 మంది ఉన్నారు.