సాక్షి, హైదరాబాద్: అయోధ్య.. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఈ పేరు మారుమోగుతోంది. ప్రపంచంలో మూడో అతిపెద్ద హిందూ దేవాలయంగా రూపొందిన భవ్య రామమందిరంలో బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్టకు ఆ ఆధ్యాత్మిక నగరి ముస్తాబైంది. సోమవారం జరిగే ప్రాణప్రతిష్ట కార్యక్రమాన్ని పలు దేశాల్లో లైవ్ టెలికాస్ట్ చేస్తున్నారు కూడా. ప్రపంచవ్యాప్తంగా పేరున్న చారిత్రక కూడళ్లలో భారీ తెరలు ఏర్పాటు చేసి మరీ ప్రత్యక్ష ప్రసారం చేయబోతున్నారు. ఈ ఘనత ఇక్కడికే పరిమితం కాకుండా.. అయోధ్యను ప్రపంచస్థాయి ఆధ్యాత్మిక నగరంగా తీర్చిదిద్దేందుకు కేంద్ర, యూపీ రాష్ట్ర ప్రభుత్వాలు భారీ ప్రాజెక్టులు చేపడుతున్నాయి.
రూ.85 వేల కోట్లతో అభివృద్ధి పనులు
కొత్త రామాలయ నిర్మాణ ప్రారంభానికి ముందు అయోధ్యకు నిత్యం సగటున 2వేల మంది భక్తులు వచ్చేవారు. పనులు ప్రారంభమయ్యాక ఆ సంఖ్య 50 వేలకు చేరింది. జనవరి ఒకటిన 2 లక్షల మంది భక్తులు తరలివచ్చారు. ఆలయంలో దర్శనాలు మొదలయ్యాక నిత్యం లక్ష మంది వరకు వస్తారని.. క్రమంగా 3 లక్షల వరకు పెరగవచ్చని అంచనా. ఇప్పుడు ఇరుకుగా ఉన్న అయోధ్య అంత తాకిడిని తట్టుకోలేదని తేల్చిన ప్రభుత్వ యంత్రాంగం.. 2031 లక్ష్యంగా ప్రత్యేక మాస్టర్‌ప్లాన్ సిద్ధం చేసింది. ఆర్కిటెక్ట్, అర్బన్ ప్లానర్ దీక్షు కుక్రేజా ఆధ్వర్యంలో దీనిపై విజన్ డాక్యుమెంట్‌ను సిద్ధం చేశారు. ప్రపంచస్థాయి నగరంగా అయోధ్యను రూపొందించటమే తమ లక్ష్యమని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు కూడా.
నగరాన్ని భారీగా విస్తరించి..
కొత్త మాస్టర్ ప్లాన్‌లో అయోధ్య పట్టణం, దానికి జంటగా ఉన్న ఫైజాబాద్‌తోపాటు సమీపంలోని దాదాపు 26 గ్రామాలను చేర్చి.. 875 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఆధునిక అయోధ్యను తీర్చిదిద్దబోతున్నారు. ఇందులో భాగంగా 1,200 ఎకరాల్లో రూ.2,200 కోట్ల వ్యయంతో న్యూఅయోధ్య పేరుతో భారీ టౌన్‌షిప్ పనులను ఇప్పటికే మొదలుపెట్టారు. ఇది సరయూ నది కేంద్రంగా రూపుదిద్దుకుంటోంది. అందులో ఇటీవల హోటల్ కోసం ఓ ప్లాట్‌ను వేలం వేయగా చదరపు మీటరుకు రూ.1,09,000 చొప్పున ధర పలకడం గమనార్హం. ఇలాంటి మరికొన్ని టౌన్‌షిప్‌లకూ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
► అయోధ్య పాత పట్టణంలో ఇప్పటికే భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు పనులు ప్రారంభించారు. ప్రధాన రోడ్లను వెడల్పు చేస్తున్నారు. రామాలయానికి దారితీసే మూడు ప్రధాన మార్గాలను ఇప్పటికే విస్తరించారు. రూ.33 కోట్లతో ఓ మల్టీలెవల్ పార్కింగ్‌ను అందుబాటులోకి తెచ్చారు.
► పట్టణంలో డీజిల్ ఆటోలకు బదులు 250 ఎలక్ట్రిక్ ఆటోలు తిప్పుతున్నారు. విమానాశ్రయం నుంచి పట్టణానికి, ఆలయం వద్దకు తిప్పేందుకు 250 ఎలక్ట్రిక్ బస్సులను సిద్ధం చేశారు. వాటి సంఖ్యను 500కు పెంచబోతున్నారు.
► అయోధ్య పట్టణం నుంచి వెలువడే మురికినీరు సరయూ నదిలోకి చేరుతోంది. దాన్ని పూర్తిగా నిరోధించి, మురికి నీటి శుద్ధికోసం ట్రీట్‌మెంట్ ప్లాంట్ల (ఎస్టీపీల)ను ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే ఒక ఎస్టీపీ అందుబాటులోకి రాగా.. మరో రెండింటి పనులు జరుగుతున్నాయి.
సోలార్ సిటీగా అయోధ్య
అయోధ్యలో సౌర విద్యుత్ వి్రస్తృత వినియోగం కోసం ఐదేళ్ల కాలపరిమితితో ప్రత్యేక ప్రాజెక్టును చేపట్టారు. ఇళ్లు, వ్యాపార సముదాయాలు, పరిశ్రమల రూఫ్ టాప్‌పై సౌర ఫలకాలను అమరుస్తున్నారు. వీటితో 8.5 మెగావాట్ల విద్యుత్ సమకూరనుంది. ఇక సరయూ నది తీరంలో 40మెగావాట్ల సోలార్ ప్లాంట్‌ను ఎనీ్టపీసీ ఏర్పాటు చేస్తోంది. ఇందులో 10 మెగావాట్ల ప్లాంటు ఇప్పటికే అందుబాటులోకి వచ్చింది.
► అయోధ్య శివార్లలో సరయూ తీరం వెంట 12.90 కిలోమీటర్ల పొడవునా జాతీయ రహదారిపై సోలార్ లైట్లను ఏర్పాటు చేస్తున్నారు. ఇంత నిడివిలో సోలార్ లైట్లు ఉండటం రికార్డు అని, దీనికి గిన్నిస్‌బుక్‌లో చోటు దక్కనుందని యూపీ ప్రభుత్వ యంత్రాంగం ప్రకటించింది.
► సౌర ఫలకాలతో కూడిన ‘సోలార్ ట్రీ’లను నగరవ్యాప్తంగా ఏర్పాటు చేస్తున్నారు. 1 కేవీ సామర్థ్యం ఉన్నవి 40.. 2.5 కేవీ సామర్థ్యం ఉన్నవి 18 సిద్ధమవుతున్నాయి. తాగునీటి కియోస్‌్కలు, మొబైల్‌ఫోన్ చార్జింగ్ పాయింట్లు ఈ విద్యుత్‌తోనే పనిచేయనున్నాయి.
► సరయూ నదిలో సౌర విద్యుత్‌తో పనిచేసే పవర్ బోట్లను అందుబాటులోకి తెస్తున్నారు.
ప్లాస్టిక్ నుంచి ఇంధనం
అయోధ్యలో ప్లాస్టిక్ వ్యర్ధాలను వాహనాల ఇంధనంగా మార్చే రీసైక్లింగ్ యూనిట్ త్వరలో అందుబాటులోకి రానుంది. అయోధ్య మున్సిపల్ కార్పొరేషన్‌తో కుదిరిన ఒప్పందం మేరకు బెంగుళూరుకు చెందిన సంస్థ దీన్ని ఏర్పాటు చేస్తోంది. ఇది ఏటా 7,300 టన్నుల ప్లాస్టిక్ వ్యర్ధాలను ఇంధనంగా మార్చగలదు. ఉత్తర భారతంలో ఈ తరహా అతిపెద్ద ప్లాంటు ఇదే కానుంది.
విస్తృతంగా వసతి సౌకర్యాలు
అయోధ్యకు భారీ సంఖ్యలో భక్తులు వస్తున్నందున హోటల్ పరిశ్రమ కూడా విస్తృతమవుతోంది. దేశవ్యాప్తంగా ఫైవ్‌స్టార్ హోటళ్లను నిర్వహిస్తున్న ఓ పెద్ద సంస్థ 120 గదులతో ఒకటి, 100 గదులతో మరోటి చొప్పున రెండు స్టార్ హోటళ్ల నిర్మాణ పనులు ప్రారంభించింది. చిన్న, మధ్యస్థాయి హోటళ్లు, భోజన వసతి ఇళ్లను నిర్వహించే మరో కంపెనీ.. వెయ్యి గదులతో కూడిన 50 హోటళ్లను, భోజన నివాసాలను అందుబాటులోకి తెచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది. మరికొన్ని సంస్థలు 1,100 గదులతో కూడిన హోటళ్లను నిర్మించనున్నాయి. దేశవ్యాప్తంగా ఆకాశహరŠామ్యలు నిర్మిస్తున్న బడా సంస్థ 51 ఎకరాల విస్తీర్ణంలో రూ.1,500 కోట్లతో లగ్జరీ విల్లాలు, సాధారణ ఇళ్లు, హోటళ్లను నిర్మించేందుకు ఒప్పందాలు చేసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment