ఒకే రాతితో చెక్కిన అతి పెద్ద పురాతన హిందూ దేవాలయాలలో ఒకటి కైలాసాలయం. దీనిని కైలాసం అని కూడా అంటారు. కొండను పై నుంచి తొలిచి ఏకశిలతో నిర్మించిన ఈ అతి పెద్ద దేవాలయం మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో కనిపిస్తుంది. ఎల్లోరాలో ఉన్న గుహాలయాలలో ఇది ఒకటి. 276 అడుగుల పోడవు, 154 అడుగుల వెడల్పు ఉన్న ఈ ఆలయాన్ని నిర్మించడానికి దాదాపు 400,000 టన్నుల శిలలను వందల సంవత్సరాలుగా తవ్వించారని అంచనా.
ప్రపంచంలోని అత్యంత ఆకర్షణీయమైన గుహాలయాలలో ఇది ఒకటి. ఆలయ గోడలపై లభించిన ఉలి జాడల ఆధారంగా మూడు రకాల ఉలులను ఉపయోగించారని పురావస్తు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఆలయ నిర్మాణం 46.92 మీటర్ల వెడల్పుతో పిరమిడ్ రూపంలో మూడు అంతస్తులు కలిగి ఉంది. ఎల్లోరా గుహలుగా పిలువబడే 34 గుహ దేవాలయాలలో కైలాస దేవాలయం ఒకటి. ఇది 16వ గుహ. దీనిని 8వ శతాబ్దానికి చెందిన రాష్ట్రకూట రాజు నిర్మించాడు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద రాతి కట్టడం.
స్థలపురాణం ప్రకారం స్థానిక రాజు తీవ్ర అనారోగ్యానికి గురవ్వడంతో అతడి భార్య శివుడిని ప్రార్థించింది. రాజు పూర్తిగా ఆరోగ్యవంతంగా కోలుకుంటే ఆలయాన్ని కట్టిస్తానని, ఆలయం గోపురం చూసేవరకు తాను ఉపవాసం ఉంటానని మొక్కుకుంది. వెంటనే ఆ రాజు కోలుకున్నాడు. రాణి మొక్కు తీర్చేందుకు అప్పటి శిల్పులు కొండను తొలచి ఆలయ నిర్మాణం చేపట్టేందుకు ప్రయత్నించారు. ఈ విషయం తెలుసుకున్న కోకసా అనే శిల్పి అలా నిర్మాణం చేపడితే ఆమె ఆలయ గోపురాన్ని చూసేందుకు కొన్ని వందల ఏళ్లు పడుతుందని చె΄్పాడు. దీంతో ఆలయాన్ని ముందు నుంచి కాకుండా కొండ పై భాగం నుంచి చెక్కుకుని వచ్చారు. ముందుగా ఆలయం గోపురాన్ని చెక్కి రాణిని ఉపవాస దీక్ష విరమించేలా చేశారు.
శిల్పరీతి
ఈ ఆలయ ప్రవేశ ద్వారం వద్ద రెండు అంతస్తుల గోపురం ఉంది. ప్రవేశ ద్వారం వైపున శైవులు, వైష్ణవులు పూజించే దేవతల శిల్పాలు ఉన్నాయి. ప్రవేశ ద్వారం నుంచి రెండు అంతర్గత ప్రాంగణాలు కనిపిస్తాయి. ఉత్తరం, దక్షిణ ప్రాంగణంలోని రాయిల మీద పెద్ద ఏనుగు నిలుచుని ఘీంకరిస్తున్నట్లు కనిపిస్తుంది. రాష్ట్రకూట రాజులు తమ గజ దళంతో అనేక యుద్ధాల్లో గెలిచి, ఏనుగులను తమకు ఇష్టమైన జంతువులలో ఒకటిగా మార్చుకున్నారు. ఆలయంలో గజ శిల్పాలు ఉండటం రాష్ట్రకూట రాజుల బలాన్ని సూచిస్తుంది. ప్రధాన ఆలయంలో లోపల గోడపైన కమలంపై ఆసీనురాలై ఉన్న గజలక్ష్మి ప్రతిమ దర్శనమిస్తుంది. ఆ ప్రతిమ వెనుక నాలుగు ఏనుగులు ఉన్నాయి.
రెండు పెద్ద ఏనుగులలో ప్రతి ఒక్కటి పై వరుసలో ఒక కుండ నుండి గజలక్ష్మి పైన తొండంతో నీటిని అభిషేకిస్తున్నట్లు, రెండు చిన్న ఏనుగులు దిగువ వరుసలో తామర చెరువు నుంచి కుండలను నింపుతున్నట్లు చిత్రీకరించబడ్డాయి. శిఖరం దాని కింద అంతస్తునుండి 96 అడుగుల ఎత్తులో ఉంది. గర్భగుడి చుట్టూ ఒక చిన్న అంతరాళ గది ఉంది, ఇది ఒక పెద్ద సభ–మండపం (స్తంభాల హాలు) తో కలిసి ఉంటుంది. దీనికి పక్కల అర్ధమండపం, ముందు భాగంలో అగ్రమండపం ఉన్నాయి. నంది–మండపం, గోపురం, పూజా మందిర అగ్ర–మండ΄ానికి మధ్య ఉంది, మూడు భాగాలను ఏకరాతి దూలంతో కలిపారు. ప్రధాన ఆలయం పునాది పైన ఆలయ నిర్మాణ మొత్తం బరువును మోస్తున్నట్లుగా కనిపించే ఏనుగుల శిల్పాల వరుసలు ఉన్నాయి.
కొండ పక్కన ఉన్న ప్రదక్షిణ మార్గ ఆలయ ్ర΄ాంగణంలో ఐదు వేరు వేరు దేవాలయాలు ఉన్నాయి, ఆలయ నిర్మాణంలో రెండు వేర్వేరు 45 అడుగుల ఎత్తయిన విజయ స్తంభాలు కూడా ఉన్నాయి. ఒకప్పుడు ఈ స్తంభం పైన త్రిశూలం ఉండేది, కానీ ఇప్పుడు లేదు. ప్రధాన ఆలయానికి ఇరువైపులా ధ్వజ స్తంభం వెనుక వెలుపలి గోడపై మహాభారతం, రామాయణం నుండి కొన్ని ఆసక్తికరమైన సన్నివేశాలు చిత్రీకరించారు. ప్రధాన ఆలయానికి దక్షిణం వైపున ఉన్న రావణమూర్తి త్రిమితీయ శిల్పం వలన ఈ ఆలయానికి ‘కైలాస‘ అని పేరు వచ్చింది.
రావణుడు కైలాస పర్వతాన్ని ఎత్తడానికి ప్రయత్నించడం అక్కడ శివుడు విశ్రాంతిలో కూర్చున్నట్లు, శివుని బొటనవేలు ఒత్తిడితో రావణుడి అహం తొక్కినట్లు చిత్రీకరించారు. ఒక మండపం నుంచి మరొక మండపానికి వెళ్ళేటప్పుడు హాలు పరిమాణం, స్థలం క్రమేపీ తగ్గుతూ ΄ోతుంది. వెలుతురు కూడా తగ్గిపోతుంది. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు అనేక పర్యాయాలు ఈ ఆలయాన్ని ధ్వంసం చేయడానికి ప్రయత్నించి విఫలమయ్యాడు.
Comments
Please login to add a commentAdd a comment