న్యూఢిల్లీ: ముస్లింల సారథ్యంలో నిర్మాణం పూర్తిచేసుకున్న దేశంలోని ప్రఖ్యాత కట్టడాలన్నింటినీ కూల్చేస్తారా అంటూ బీజేపీకి కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే సూటి ప్రశ్న వేశారు. దేశంలోని ప్రతి మసీదు వద్దా సర్వేలు చేపడుతూ బీజేపీ నాయకత్వం భారతీయ సమాజాన్ని విభజిస్తోందని ఆరోపించారు.
‘‘అర్థంపర్థం లేని సర్వేలతో ప్రజలను మోదీ ఐక్యంగా, శాంతంగా జీవించకుండా చేస్తున్నారు. ముస్లింలు నిర్మించారు కాబట్టి ఎర్రకోట, తాజ్‌మహల్, కుతుబ్ మినార్, చార్మినార్ వంటివాటన్నింటినీ కూల్చేస్తారా?’’ అని సూటిగా ప్రశ్నించారు.
ఉత్తర ప్రదేశ్‌లోని సంభాల్‌లో మసీదు ఉన్న చోట గతంలో హిందూ ఆలయం ఆనవాళ్లున్నాయా అని తెల్సుకునేందుకు సర్వే చేపట్టడం, దానిపై ముస్లింల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడం, ఆ ఉద్రిక్తత చివరికి పోలీసు ఘర్షణలకు, మరణాలకు దారి తీయడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆదివారం ఢిల్లీలోని రాంలీలా మైదాన్‌లో జరిగిన భారీ బహిరంగ సభలో పాల్గొన్న ఖర్గే కూల్చివేతల అంశాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు. దళితులు, మైనారిటీలు, గిరిజనులు, ఇతర వెనుకబడిన వర్గాల సమాఖ్య ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
‘‘ఒక తీర్పు తర్వాత దేశ చరిత్రలో ఎన్నడూలేని పోకడ మొదలైంది. మసీదుల కింద ఆలయాల ఆనవాళ్లున్నాయో కనుగొనేందుకు సర్వేల పేరిట బయల్దేరారు. వీటికి మద్దతు పలికే వారి సంఖ్యా పెరిగింది. దశాబ్దాలుగా ఉన్న ప్రార్థనాస్థలాల స్వభావాన్ని కొత్తగా మార్చకూడదని 1991నాటి చట్టం స్పష్టంచేస్తోంది. అయినాసరే ఆ చట్ట ఉల్లంఘనకు బీజేపీ బరితెగిస్తోంది’’ అంటూ మండిపడ్డారు. మోదీని ఉద్దేశిస్తూ.. ‘‘ ఐక్యంగా ఉంటే భద్రంగా ఉంటామని మీరన్నారు. మేము ఇప్పటికే ఐక్యంగా ఉన్నాం. ఐక్యంగా ఉన్న మమ్మల్ని విభజించేది మీరే’’ అని ఖర్గే దుయ్యబట్టారు.
భాగవత్ మాటా బీజేపీ వినదా?
‘‘2023లో ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ ఒక మంచి విషయం చెప్పారు. ‘రామమందిర నిర్మాణమే మన లక్ష్యం. అంతేగానీ మనం ప్రతి మసీదు కింద శివాలయం వెతకకూడద’ని చెప్పారు. కానీ భాగవత్ మాటను కూడా మోదీ, అమిత్‌షా సహా బీజేపీ నేతలెవరూ అస్సలు పట్టించుకోవట్లేదు. బహుశా భాగవత్ తాను బహిరంగంగా చెప్పే కొన్ని విషయాలను బీజేపీ నేతలకు చెప్పరేమో. వీళ్లందరిదీ మొదటినుంచీ ద్వంద్వ వైఖరే’’ అంటూ ఖర్గే మండిపడ్డారు.
‘‘గిరిజనులు, మైనారిటీలు, ఓబీసీలు తమ హక్కులను మాత్రమే గాక రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కూడా కాపాడుకోవాలి. అప్పుడే వారి లక్ష్యాలను నెరవేర్చుకోగలరు. ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా మనందరం ఐక్యంగా నిలబడదాం. ఐక్యంగా ఉంటే కులాల ప్రాతిపదికన ప్రయతి్నంచినా మన ఐక్యతను మోదీ విచి్ఛన్నం చేయలేరు. సాధారణ ప్రజానీకం అంటే మోదీకి గిట్టదు. మనల్ని ద్వేషించే వాళ్లతోనే మన పోరు. అందుకే రాజకీయ శక్తి అనేది చాలా ముఖ్యం’’ అని ఖర్గే అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment