ramamandiram
-
ప్రపంచ నగరిగా అయోధ్య
సాక్షి, హైదరాబాద్: అయోధ్య.. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఈ పేరు మారుమోగుతోంది. ప్రపంచంలో మూడో అతిపెద్ద హిందూ దేవాలయంగా రూపొందిన భవ్య రామమందిరంలో బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్టకు ఆ ఆధ్యాత్మిక నగరి ముస్తాబైంది. సోమవారం జరిగే ప్రాణప్రతిష్ట కార్యక్రమాన్ని పలు దేశాల్లో లైవ్ టెలికాస్ట్ చేస్తున్నారు కూడా. ప్రపంచవ్యాప్తంగా పేరున్న చారిత్రక కూడళ్లలో భారీ తెరలు ఏర్పాటు చేసి మరీ ప్రత్యక్ష ప్రసారం చేయబోతున్నారు. ఈ ఘనత ఇక్కడికే పరిమితం కాకుండా.. అయోధ్యను ప్రపంచస్థాయి ఆధ్యాత్మిక నగరంగా తీర్చిదిద్దేందుకు కేంద్ర, యూపీ రాష్ట్ర ప్రభుత్వాలు భారీ ప్రాజెక్టులు చేపడుతున్నాయి. రూ.85 వేల కోట్లతో అభివృద్ధి పనులు కొత్త రామాలయ నిర్మాణ ప్రారంభానికి ముందు అయోధ్యకు నిత్యం సగటున 2వేల మంది భక్తులు వచ్చేవారు. పనులు ప్రారంభమయ్యాక ఆ సంఖ్య 50 వేలకు చేరింది. జనవరి ఒకటిన 2 లక్షల మంది భక్తులు తరలివచ్చారు. ఆలయంలో దర్శనాలు మొదలయ్యాక నిత్యం లక్ష మంది వరకు వస్తారని.. క్రమంగా 3 లక్షల వరకు పెరగవచ్చని అంచనా. ఇప్పుడు ఇరుకుగా ఉన్న అయోధ్య అంత తాకిడిని తట్టుకోలేదని తేల్చిన ప్రభుత్వ యంత్రాంగం.. 2031 లక్ష్యంగా ప్రత్యేక మాస్టర్‌ప్లాన్ సిద్ధం చేసింది. ఆర్కిటెక్ట్, అర్బన్ ప్లానర్ దీక్షు కుక్రేజా ఆధ్వర్యంలో దీనిపై విజన్ డాక్యుమెంట్‌ను సిద్ధం చేశారు. ప్రపంచస్థాయి నగరంగా అయోధ్యను రూపొందించటమే తమ లక్ష్యమని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు కూడా. నగరాన్ని భారీగా విస్తరించి.. కొత్త మాస్టర్ ప్లాన్‌లో అయోధ్య పట్టణం, దానికి జంటగా ఉన్న ఫైజాబాద్‌తోపాటు సమీపంలోని దాదాపు 26 గ్రామాలను చేర్చి.. 875 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఆధునిక అయోధ్యను తీర్చిదిద్దబోతున్నారు. ఇందులో భాగంగా 1,200 ఎకరాల్లో రూ.2,200 కోట్ల వ్యయంతో న్యూఅయోధ్య పేరుతో భారీ టౌన్షిప్ పనులను ఇప్పటికే మొదలుపెట్టారు. ఇది సరయూ నది కేంద్రంగా రూపుదిద్దుకుంటోంది. అందులో ఇటీవల హోటల్ కోసం ఓ ప్లాట్‌ను వేలం వేయగా చదరపు మీటరుకు రూ.1,09,000 చొప్పున ధర పలకడం గమనార్హం. ఇలాంటి మరికొన్ని టౌన్‌షిప్‌లకూ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ► అయోధ్య పాత పట్టణంలో ఇప్పటికే భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు పనులు ప్రారంభించారు. ప్రధాన రోడ్లను వెడల్పు చేస్తున్నారు. రామాలయానికి దారితీసే మూడు ప్రధాన మార్గాలను ఇప్పటికే విస్తరించారు. రూ.33 కోట్లతో ఓ మల్టీలెవల్ పార్కింగ్‌ను అందుబాటులోకి తెచ్చారు. ► పట్టణంలో డీజిల్ ఆటోలకు బదులు 250 ఎలక్ట్రిక్ ఆటోలు తిప్పుతున్నారు. విమానాశ్రయం నుంచి పట్టణానికి, ఆలయం వద్దకు తిప్పేందుకు 250 ఎలక్ట్రిక్ బస్సులను సిద్ధం చేశారు. వాటి సంఖ్యను 500కు పెంచబోతున్నారు. ► అయోధ్య పట్టణం నుంచి వెలువడే మురికినీరు సరయూ నదిలోకి చేరుతోంది. దాన్ని పూర్తిగా నిరోధించి, మురికి నీటి శుద్ధికోసం ట్రీట్మెంట్ ప్లాంట్ల (ఎస్టీపీల)ను ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే ఒక ఎస్టీపీ అందుబాటులోకి రాగా.. మరో రెండింటి పనులు జరుగుతున్నాయి. సోలార్ సిటీగా అయోధ్య అయోధ్యలో సౌర విద్యుత్ వి్రస్తృత వినియోగం కోసం ఐదేళ్ల కాలపరిమితితో ప్రత్యేక ప్రాజెక్టును చేపట్టారు. ఇళ్లు, వ్యాపార సముదాయాలు, పరిశ్రమల రూఫ్ టాప్‌పై సౌర ఫలకాలను అమరుస్తున్నారు. వీటితో 8.5 మెగావాట్ల విద్యుత్ సమకూరనుంది. ఇక సరయూ నది తీరంలో 40మెగావాట్ల సోలార్ ప్లాంట్‌ను ఎనీ్టపీసీ ఏర్పాటు చేస్తోంది. ఇందులో 10 మెగావాట్ల ప్లాంటు ఇప్పటికే అందుబాటులోకి వచ్చింది. ► అయోధ్య శివార్లలో సరయూ తీరం వెంట 12.90 కిలోమీటర్ల పొడవునా జాతీయ రహదారిపై సోలార్ లైట్లను ఏర్పాటు చేస్తున్నారు. ఇంత నిడివిలో సోలార్ లైట్లు ఉండటం రికార్డు అని, దీనికి గిన్నిస్‌బుక్‌లో చోటు దక్కనుందని యూపీ ప్రభుత్వ యంత్రాంగం ప్రకటించింది. ► సౌర ఫలకాలతో కూడిన ‘సోలార్ ట్రీ’లను నగరవ్యాప్తంగా ఏర్పాటు చేస్తున్నారు. 1 కేవీ సామర్థ్యం ఉన్నవి 40.. 2.5 కేవీ సామర్థ్యం ఉన్నవి 18 సిద్ధమవుతున్నాయి. తాగునీటి కియోస్‌్కలు, మొబైల్‌ఫోన్ చార్జింగ్ పాయింట్లు ఈ విద్యుత్‌తోనే పనిచేయనున్నాయి. ► సరయూ నదిలో సౌర విద్యుత్‌తో పనిచేసే పవర్ బోట్లను అందుబాటులోకి తెస్తున్నారు. ప్లాస్టిక్ నుంచి ఇంధనం అయోధ్యలో ప్లాస్టిక్ వ్యర్ధాలను వాహనాల ఇంధనంగా మార్చే రీసైక్లింగ్ యూనిట్ త్వరలో అందుబాటులోకి రానుంది. అయోధ్య మున్సిపల్ కార్పొరేషన్‌తో కుదిరిన ఒప్పందం మేరకు బెంగుళూరుకు చెందిన సంస్థ దీన్ని ఏర్పాటు చేస్తోంది. ఇది ఏటా 7,300 టన్నుల ప్లాస్టిక్ వ్యర్ధాలను ఇంధనంగా మార్చగలదు. ఉత్తర భారతంలో ఈ తరహా అతిపెద్ద ప్లాంటు ఇదే కానుంది. విస్తృతంగా వసతి సౌకర్యాలు అయోధ్యకు భారీ సంఖ్యలో భక్తులు వస్తున్నందున హోటల్ పరిశ్రమ కూడా విస్తృతమవుతోంది. దేశవ్యాప్తంగా ఫైవ్‌స్టార్ హోటళ్లను నిర్వహిస్తున్న ఓ పెద్ద సంస్థ 120 గదులతో ఒకటి, 100 గదులతో మరోటి చొప్పున రెండు స్టార్ హోటళ్ల నిర్మాణ పనులు ప్రారంభించింది. చిన్న, మధ్యస్థాయి హోటళ్లు, భోజన వసతి ఇళ్లను నిర్వహించే మరో కంపెనీ.. వెయ్యి గదులతో కూడిన 50 హోటళ్లను, భోజన నివాసాలను అందుబాటులోకి తెచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది. మరికొన్ని సంస్థలు 1,100 గదులతో కూడిన హోటళ్లను నిర్మించనున్నాయి. దేశవ్యాప్తంగా ఆకాశహరŠామ్యలు నిర్మిస్తున్న బడా సంస్థ 51 ఎకరాల విస్తీర్ణంలో రూ.1,500 కోట్లతో లగ్జరీ విల్లాలు, సాధారణ ఇళ్లు, హోటళ్లను నిర్మించేందుకు ఒప్పందాలు చేసుకుంది. -
ఆంజనేయుని ఆనందబాష్పాలు
బ్రహ్మానందం నటుడని అందరికీ తెలుసు. సాహితీప్రియుడు అని కొందరికి తెలుసు. ఆయన చిత్రలేఖనం చేస్తారని చాలా కొద్దిమందికి తెలుసు. కరోనా లాక్డౌన్ తర్వాత బ్రహ్మానందం చిత్రకళను సాధన చేస్తున్నారు. సుప్రసిద్ధ చిత్రకారుడు శేషబ్రహ్మంతో ఆయన తన చిత్రాలు పంచుకుంటూ ఆనందం పొందుతున్నారు. బ్రహ్మానందం ఎక్కువగా పెన్సిల్ డ్రాయింగ్స్ సాధన చేస్తున్నారు. ఆయన కొద్ది రోజుల క్రితం వేసిన మదర్ థెరిసా బొమ్మ ఆ కారుణ్యమూర్తి కరుణను రేఖల్లో పట్టుకోగలిగింది. ఇప్పుడు రామమందిర నిర్మాణ సందర్భం. ఈ సందర్భం రాముడి భక్తులందరికీ ఆనందదాయకం. ఇక అపర భక్తుడైన ఆంజనేయస్వామికి ఆనంద బాష్పాల సమయం కాకుండా ఉంటుందా. అందుకే బ్రహ్మానందం కాగితం, పెన్సిల్ అందుకున్నారు. ‘ఆంజనేయుని ఆనందబాష్పాలు’ పేరుతో ఈ చిత్రం గీశారు. రాముని కోవెలకు ఈ బొమ్మ ఒక భక్తిపూర్వక సమర్పణం అనుకోవచ్చు. -
అయోధ్యపై రాజ్యాంగ ధర్మాసనం
న్యూఢిల్లీ: అయోధ్యలోని రామమందిరం–బాబ్రీమసీదు భూవివాదానికి సంబంధించి సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసును విచారించేందుకు సీజేఐ జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ ఎస్ఏ బాబ్డే, జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఎస్ఏ నజీర్‌లతో ఐదుగురు సభ్యులతో కొత్త రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటుచేసింది. ఈ నేపథ్యంలో కొత్తగా ఏర్పాటైన రాజ్యాంగ ధర్మాసనం 2019, జనవరి 29 నుంచి ఈ కేసును విచారించనుంది. ఈ మేరకు సుప్రీంకోర్టు రిజిస్ట్రీ అన్ని పక్షాలకు నోటీసులు జారీచేసింది. 2010లో ఈ కేసును విచారించిన అలహాబాద్ హైకోర్టు మొత్తం 2.77 ఎకరాల స్థలాన్ని సున్నీ వక్ఫ్ బోర్డుకు, నిర్మోహి అఖారాకు, రామ్ లల్లాకు సమానంగా పంచాలని తీర్పు వెలువరించడం తెల్సిందే. -
హిందువుల జనాభా పెంచండి
వీహెచ్‌పీ అంతర్జాతీయ కార్యాధ్యక్షుడు ప్రవీణ్ తొగాడియా సామ్రాజ్యంలా విస్తరించాలని పిలుపు నలుగురు భార్యల విధానం తొలగిపోవాలి ఘనంగా భాగ్యనగర్ హిందూశక్తి సంగమం సాక్షి, హైదరాబాద్: హిందూ మతానికి చెందిన ఏ ఒక్కరూ మత మార్పిడి ప్రభావానికి లోనుకావద్దని విశ్వహిందూ పరిషత్ అంతర్జాతీయ కార్యాధ్యక్షుడు ప్రవీణ్ తొగాడియా పిలుపునిచ్చారు. దేశంలో నానాటికి హిందువుల జనాభా తగ్గిపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. మళ్లీ పాత రోజులు రావాలని, దేశంలో వంద శాతం హిందువులు ఉండాలని ఆకాంక్షించారు. ముస్లింలు, క్రైస్తవులు ఎవరైనా హిందువుల్లో కలవాలనుకుంటే వారిని మనసారా ఆహ్వానిస్తున్నామని, వారిని తమలో కలుపుకునేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు. విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్‌పీ) స్వర్ణజయంతి మహోత్సవాలను పురస్కరించుకొని ఎన్టీఆర్ స్టేడియంలో ఆదివారం భాగ్యనగర్ హిందూశక్తి సంగమం పేరుతో నిర్వహించిన హనుమాన్ చాలీసా కోటి పారాయణ యజ్ఞం కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. హిందువులు ఉత్సవాలు జరుపుకోవాలంటే అయోధ్యలో రామమందిరం నిర్మించాల్సిందేనన్నారు. కశ్మీర్లో ఉన్న నాలుగు లక్షల మంది హిందువులు సురక్షితంగా ఉన్నప్పుడే అందరూ ఉత్సవాలు జరుపుకోవాలన్నారు. ఈ భూమి మీద గోవధ జరగనప్పుడే హిందువులకు నిజమైన సంబరాలని అన్నారు. హిందువుల సంఖ్య తగ్గితే భవిష్యత్‌లో మందిరాలు ఉండవని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఒకప్పుడు బంగ్లాదేశ్‌లో 30 శాతంగా ఉన్న హిందువులు 8 శాతానికి తగ్గిపోయారని, పాకిస్తాన్లో పది శాతం ఉన్నవారు ఒక శాతానికి పడి పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇండియాలో ఒకప్పుడు నూరు శాతం ఉన్న హిందూ జనాభా రోజు రోజుకు తగ్గిపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో నలుగురు భార్యల సంస్కృతి తొలగిపోవాలన్నారు. భారత్‌లో తగ్గిపోతున్న హిందూ జనాభాను పెంచుకోవాలని సూచించారు. ఏ ఒక్క హిందువు కూడా విద్యా, వైద్య సౌకర్యాలు లేకుండా ఉండకూడదన్నారు. ఆకలితో అలమటించకూడదని అన్నారు. అత్యవసర సమయాల్లో వైద్యం అవసరమైన హిందువులు 1860 2333 666 నంబర్లో సంప్రదించాలన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఉర్దూ అకాడమీకి 30 కోట్ల రూపాయలు కేటాయించి, తెలుగు అకాడమీకి 30 లక్షల రూపాయలను కేటాయించడాన్ని ఆయన తప్పు పట్టారు. ముస్లింలను హజ్‌కు, క్రైస్తవులను జెరూసలెంకు పంపుతున్న ప్రభుత్వాలు హిందువులను ఏ ఒక్కరినైనా తిరుపతికి పంపిన దాఖలాలు ఉన్నాయా అని ప్రశ్నించారు. హిందువుల కోసం ఆలోచించే నాయకులను మాత్రమే ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కమలానంద భారతి స్వామి మాట్లాడుతూ మన దేశంలో ఏ వారసత్వానికైనా, ఏ సంప్రదాయానికైనా వేల సంవత్సరాల చరిత్ర ఉందన్నారు. 2300 సంవత్సరాల క్రితం మేకల కాపరి రాజ్యాన్ని పరిపాలిస్తే, నేడు చాయ్‌వాలా దేశాన్ని పరిపాలిస్తున్నాడని పేర్కొన్నారు. భగవంతుడికి జన్మనిచ్చింది హిందువేనన్నారు. యుగాలు తరాలు మారినా ధర్మం మారదన్నారు. అలాంటి ధర్మమే హిందూ ధర్మమని కొనియాడారు. హిందూ ధర్మంలో అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఉంటాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీత్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామి, మంత్రాలయం మఠాధిపతి సుభుదేంద్ర తీర్థస్వామి, ఆర్ఎస్ఎస్ సర్ కార్యవాహ సురేష్ జోషిజీ, వీహెచ్‌పీ అంతర్జాతీయ అధ్యక్షుడు రాఘవరెడ్డి, విశ్వ హిందూ పరిషత్ నాయకుడు కేశవరాజు, స్వర్ణ జయంతి మహోత్సవ సమితి ప్రాంత అధ్యక్షులు త్రిపురనేని హనుమాన్ చౌదరి, భాగ్యనగర్ అధ్యక్షుడు నంగునూరి చంద్రశేఖర్లతో పాటు అనేక మంది పీఠాధిపతులు, మఠాధిపతులు పాల్గొన్నారు.