- వీహెచ్‌పీ అంతర్జాతీయ కార్యాధ్యక్షుడు ప్రవీణ్ తొగాడియా
- సామ్రాజ్యంలా విస్తరించాలని పిలుపు
- నలుగురు భార్యల విధానం తొలగిపోవాలి
- ఘనంగా భాగ్యనగర్ హిందూశక్తి సంగమం
సాక్షి, హైదరాబాద్: హిందూ మతానికి చెందిన ఏ ఒక్కరూ మత మార్పిడి ప్రభావానికి లోనుకావద్దని విశ్వహిందూ పరిషత్ అంతర్జాతీయ కార్యాధ్యక్షుడు ప్రవీణ్ తొగాడియా పిలుపునిచ్చారు. దేశంలో నానాటికి హిందువుల జనాభా తగ్గిపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. మళ్లీ పాత రోజులు రావాలని, దేశంలో వంద శాతం హిందువులు ఉండాలని ఆకాంక్షించారు. ముస్లింలు, క్రైస్తవులు ఎవరైనా హిందువుల్లో కలవాలనుకుంటే వారిని మనసారా ఆహ్వానిస్తున్నామని, వారిని తమలో కలుపుకునేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు.
విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్‌పీ) స్వర్ణజయంతి మహోత్సవాలను పురస్కరించుకొని ఎన్టీఆర్ స్టేడియంలో ఆదివారం భాగ్యనగర్ హిందూశక్తి సంగమం పేరుతో నిర్వహించిన హనుమాన్ చాలీసా కోటి పారాయణ యజ్ఞం కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. హిందువులు ఉత్సవాలు జరుపుకోవాలంటే అయోధ్యలో రామమందిరం నిర్మించాల్సిందేనన్నారు. కశ్మీర్‌లో ఉన్న నాలుగు లక్షల మంది హిందువులు సురక్షితంగా ఉన్నప్పుడే అందరూ ఉత్సవాలు జరుపుకోవాలన్నారు.
ఈ భూమి మీద గోవధ జరగనప్పుడే హిందువులకు నిజమైన సంబరాలని అన్నారు. హిందువుల సంఖ్య తగ్గితే భవిష్యత్‌లో మందిరాలు ఉండవని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఒకప్పుడు బంగ్లాదేశ్‌లో 30 శాతంగా ఉన్న హిందువులు 8 శాతానికి తగ్గిపోయారని, పాకిస్తాన్‌లో పది శాతం ఉన్నవారు ఒక శాతానికి పడి పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇండియాలో ఒకప్పుడు నూరు శాతం ఉన్న హిందూ జనాభా రోజు రోజుకు తగ్గిపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో నలుగురు భార్యల సంస్కృతి తొలగిపోవాలన్నారు. భారత్‌లో తగ్గిపోతున్న హిందూ జనాభాను పెంచుకోవాలని సూచించారు.
ఏ ఒక్క హిందువు కూడా విద్యా, వైద్య సౌకర్యాలు లేకుండా ఉండకూడదన్నారు. ఆకలితో అలమటించకూడదని అన్నారు. అత్యవసర సమయాల్లో వైద్యం అవసరమైన హిందువులు 1860 2333 666 నంబర్‌లో సంప్రదించాలన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఉర్దూ అకాడమీకి 30 కోట్ల రూపాయలు కేటాయించి, తెలుగు అకాడమీకి 30 లక్షల రూపాయలను కేటాయించడాన్ని ఆయన తప్పు పట్టారు. ముస్లింలను హజ్‌కు, క్రైస్తవులను జెరూసలెంకు పంపుతున్న ప్రభుత్వాలు హిందువులను ఏ ఒక్కరినైనా తిరుపతికి పంపిన దాఖలాలు ఉన్నాయా అని ప్రశ్నించారు.
హిందువుల కోసం ఆలోచించే నాయకులను మాత్రమే ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కమలానంద భారతి స్వామి మాట్లాడుతూ మన దేశంలో ఏ వారసత్వానికైనా, ఏ సంప్రదాయానికైనా వేల సంవత్సరాల చరిత్ర ఉందన్నారు. 2300 సంవత్సరాల క్రితం మేకల కాపరి రాజ్యాన్ని పరిపాలిస్తే, నేడు చాయ్‌వాలా దేశాన్ని పరిపాలిస్తున్నాడని పేర్కొన్నారు. భగవంతుడికి జన్మనిచ్చింది హిందువేనన్నారు. యుగాలు తరాలు మారినా ధర్మం మారదన్నారు. అలాంటి ధర్మమే హిందూ ధర్మమని కొనియాడారు.
హిందూ ధర్మంలో అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఉంటాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీత్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామి, మంత్రాలయం మఠాధిపతి సుభుదేంద్ర తీర్థస్వామి, ఆర్‌ఎస్‌ఎస్ సర్ కార్యవాహ సురేష్ జోషిజీ, వీహెచ్‌పీ అంతర్జాతీయ అధ్యక్షుడు రాఘవరెడ్డి, విశ్వ హిందూ పరిషత్ నాయకుడు కేశవరాజు, స్వర్ణ జయంతి మహోత్సవ సమితి ప్రాంత అధ్యక్షులు త్రిపురనేని హనుమాన్ చౌదరి, భాగ్యనగర్ అధ్యక్షుడు నంగునూరి చంద్రశేఖర్‌లతో పాటు అనేక మంది పీఠాధిపతులు, మఠాధిపతులు పాల్గొన్నారు.