సెలబస్: కమల్... ఓ కళాంశం!
కమల్ జెఎన్‌టియులో ఆర్కిటెక్చర్ చేశారు. కళాపిపాస ఉన్నా, కమర్షియల్ చిత్రకారుడు కావాలని అనుకోకపోవడంతో పెయింటింగ్స్ వేయడం తగ్గింది. సినీరంగంలో ప్రవేశించాక... ఛత్రపతి, అనుకోకుండా ఒకరోజు వంటి సినిమాలకు అసిస్టెంట్ ఆర్ట్ డెరైక్టర్‌గా పనిచేశారు. ఆ తర్వాత గోదావరి, ఆవకాయ్ బిర్యానీ, కలవరమాయె మదిలో వంటి చిత్రాల్లో నటించారు. షూటింగ్స్ లేని ఖాళీ సమయాల్లో చిత్రకళ చేతికొచ్చింది. రెండు పడవల ప్రయాణం మొదలైంది. ఇప్పటిదాకా 3 పెయింటింగ్ సిరీస్ చేశారు. 3 ఎగ్జిబిషన్లు నిర్వహించారు.
‘‘ఇది నాకు ఆదాయమార్గం కాదు. ఆనందమార్గం మాత్రమే’’ అనే కమల్‌ది సామాజికాంశాల మీద వెనువెంటనే స్పందించే మనసున్న కుంచె. ‘మిన్ను’ పేరుతో గర్ల్ చైల్డ్ మీద తొలి ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. గోడలమీద వాల్‌పోస్టర్లు అనే అంశాన్ని థీమ్‌గా తీసుకుని చేసిన ‘వాల్ ఆర్ట్ సిరీస్’ అందరినీ ఆకట్టుకుంది. నిర్భయ సంఘటన సమయంలో కూడా స్పందించి అప్పటికప్పుడు చిత్రాలు గీశారు. ప్రస్తుతం నాలుగో సిరీస్ చేసే ప్రయత్నంలో ఉన్నారు!