సాక్షి, అనంతపురం : రోడ్డు రవాణాశాఖ అధికారులకు వాస్తు భయం పట్టుకుంది. గతకొన్నేళ్లుగా కొనసాగుతూ వస్తున్న చాంబర్‌లను మార్పు చేస్తున్నారు. ముఖ్యంగా జిల్లా ఉన్నతాధికారి అయిన ఉప రవాణా కమిషనర్ చాంబర్‌ను ఆర్టీఓ చాంబర్‌లోకి మారుస్తున్నారు. ఆర్టీఓకు మరో చాంబర్ ఏర్పాటు చేస్తున్నారు. రెండు రోజులుగా రవాణాశాఖ కార్యాలయంలో ఈ పనులు జరుగుతున్నాయి. దీంతో అధికారులు ఇతర గదుల్లో కూర్చొని విధులు నిర్వహిస్తున్నారు.
గతంలో పనిచేసిన సీ.హెచ్.ప్రతాప్, సుందర్‌వద్దీలకు అవినీతి, అక్రమాల మరకలు అంటుకోవడంతో ప్రస్తుత డీటీసీ శివరామప్రసాద్ వాస్తు ప్రకారం చాంబర్ మార్చుకోవాలని భావించినట్లు కార్యాలయవర్గాలు వెల్లడిస్తున్నాయి. వాస్తు పనుల్లో భాగంగా గ్రానైట్ ఫ్లోరింగ్, పీఓపీ సీలింగ్ తదితర పనులు చేపడుతున్నారు. ఇందుకోసం రూ.3లక్షలకు పైగానే ఖర్చవుతున్నట్లు తెలిసింది. కాగా ఇందుకోసం రవాణశాఖ కమిషనరేట్ నుంచి నిధులు కోరగా.. రూ.2లక్షల వరకే అనుమతిచ్చినట్లు సమాచారం. అయితే మిగిలిన డబ్బును ఏదోలా సర్దుబాటు చేయొచ్చని భావిస్తున్నారు. వాస్తు మార్చాలనుకోవడంలో తప్పు లేదు.. కానీ బాగా ఉన్న చాంబర్లను వాస్తు పేరుతో మారుస్తూ ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తుండటం సర్వత్రా చర్చనీయాంశంగా మారుతోంది.
Comments
Please login to add a commentAdd a comment