దివాకర్‌ ట్రావెల్స్‌..రాంగ్‌రూట్‌లో రైట్‌రైట్‌ | Transport Officers Seized Diwakar Travel Buses In Anantapur | Sakshi
Sakshi News home page

దివాకర్‌ ట్రావెల్స్‌..రాంగ్‌రూట్‌లో రైట్‌రైట్‌

Published Mon, Oct 21 2019 9:03 AM | Last Updated on Mon, Oct 21 2019 12:39 PM

Transport Officers Seized Diwakar Travel Buses In Anantapur  - Sakshi

ఆయనో పెద్ద మనిషి. మైకు దొరికితే నీతులు చెబుతుంటారు. ముఖ్యమంత్రులు, ప్రధానులకు సైతం సలహా ఇచ్చే రీతిలో వ్యాఖ్యలు చేస్తుంటారు. కానీ ఆయన బిజనెస్‌ మొత్తం అడ్డదారిలో సాగుతోంది. కొన్నేళ్లుగా అధికారాన్ని అడ్డుపెట్టుకొని తమ ట్రావెల్స్‌ బస్సుల ద్వారా రూ. కోట్లు కొల్లగొట్టారు. అన్నాతమ్ముడు ఏకమై పాతికేళ్లుగా ప్రైవేటు ట్రావెల్స్‌ సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటూ పోయారు. నిబంధనలకు విరుద్ధంగా బస్సులు నడుపుతూ ఎన్నో ప్రాణాలు తీశారు. మరెంతో మందిని క్షతగాత్రులుగా మిగిల్చారు. అందుకే ఆ బస్సు చూస్తే చాలు జనం మృత్యుశకటమొచ్చనంటూ పరుగులు తీస్తున్నారు.  

సాక్షి, అనంతపురం: మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డిలకు చెందిన దివాకర్‌ ట్రావెల్స్‌...జిల్లాలోనే కాదు...రాష్ట్ర వ్యాప్తంగా సర్వీసులు నడుపుతోంది. కానీ అన్నీ అడ్డదారిలోనే...పర్మిట్‌ ఓ రూట్‌లో తీసుకుని...మరో రూట్‌లో బస్సులు నడుపుతారు. కొన్నింటికి అసలు పర్మిటే ఉండదు. ఇలా అడ్డదారిలో అడ్డంగా తిరుగుతున్న ట్రావెల్స్‌పై ఇటీవల రవాణాశాఖ అధికారులు నిఘా వేశారు. ఆకస్మిక తనిఖీలు చేయగా.. ట్రావెల్స్‌ గుట్టు రట్టయ్యింది.  ఇటీవల రోడ్డు రవాణాశాఖ అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీలు ప్రారంభించారు. ఈ క్రమంలో జిల్లాలోనూ ఉపరవాణా కమిషనర్‌ శివరామప్రసాద్‌ ఆధ్వర్యంలో బృందాలుగా విడిపోయిన అధికారులు ఈనెల 16న వివిధ ప్రాంతాల్లో తనిఖీలు చేశారు. తొలిరోజు 8, మరుసటి రెండు బస్సులను సీజ్‌ చేశారు. జిల్లాలో సీజన్‌ చేసిన వాటిలో 8 బస్సులు దివాకర్‌ ట్రావెల్స్‌వే కావడం గమనార్హం. ఇలా అనంతపురంలో 4, గుంతకల్లులో 3, పెనుకొండలో ఒక దివాకర్‌ బస్సును సీజ్‌ చేశారు. రవాణాశాఖ నిబంధనలను తుంగలోకి తొక్కి బస్సులు నడుపుతున్నట్లు అధికారులు గుర్తించారు.  

అంతా అడ్డదారిలోనే... 
ఇంటర్‌స్టేట్‌ క్యారేజ్‌ అనుమతులు తీసుకొని జిల్లా వ్యాప్తంగా మొత్తం 196 ప్రైవేటు బస్సులు రాకపోకలు సాగిస్తున్నాయి. స్టేజ్‌ క్యారెజ్‌ అనుమనుతులు తీసుకున్న ప్రైవేటు ట్రావెల్స్‌ రాష్ట్రంలోనే అత్యధికంగా జిల్లాలోనే ఉండటం గమనార్హం. అనంతపురం టూ బెంగుళూరు, అనంతపురం టూ బళ్లారి, అనంతపురం టూ చెళికర, అనంతపురం టూ హైదరాబాద్‌ సర్వీసుల పేరుతో పలు ట్రావెల్స్‌కు చెందిన బస్సులు తిరుగుతున్నాయి.  

ఒక పర్మిట్‌తో రెండు, మూడు బస్సులు 
ఇంటర్‌ స్టేజ్‌ వ్యవహారం వెనుక భారీ అక్రమాలు జరుగుతున్నాయి. ప్రైవేటు ట్రావెల్స్‌ అనుమతులు తీసుకున్నది ఒక రూట్‌ అయితే.. మరో రూట్‌లో బస్సులు తిప్పితున్నారు. కొన్నింటికి గడువు మీరిపోయినా అలాగా కొనసాగిస్తున్నారు. మరికొందరు అనుమతి ఒక బస్సుపై ఉంటే.. రెండు మూడు బస్సులు అదనంగా తిప్పుతున్నారు. ఇందులో దివాకర్‌ ట్రావెల్స్‌ బస్సులు కూడా మినహాయింపేమి కాదు. ఇటీవల అధికారులు సీజ్‌ చేసిన 8 దివాకర్‌ బస్సుల్లో రెండింటికీ పూర్తిగా అనుమతి లేకపోవడం, మరికొన్నింటిలో నిబంధనలకు విరుద్ధంగా సీటింగ్‌ కెపాసిటీ పెంచి ప్రయాణికులను ఎక్కించుకోవడం, మరికొన్నింటిలో డ్రైవర్లు, కండెక్టర్‌లకు లైసెన్స్‌లు లేనట్లు అధికారులు గుర్తించారు. దీంతో  (ఏపీ02టీహెచ్‌4220, ఏపీ02టీఈ2196, ఏపీ02టీసీ3969, ఏపీ02టీఏ6373, ఏపీ02టీఈ0135, కేఏ01ఏకే3929, కేఏ34ఏ0987, కేఏ34ఏ8874) సీజ్‌ చేసినట్లు రవాణాశాఖ అధికారులు వివరించారు.  

ప్రభుత్వానికి రూ.కోట్లలో గండి... 
ప్రభుత్వ ఖజానాకు గండికొడుతూ జిల్లాలో దివాకర్‌ ట్రావెల్స్‌ బస్సులు రాకపోకలు సాగిస్తున్నాయి. అనుమతులు లేకుండా తిరుగుతుండడంతో పాటు అనుమతి లేని రహదారులపై కూడా దర్జాగా రాకపోకలు  సాగిస్తున్నాయి. తాజాగా రవాణాశాఖ అధికారుల దాడులతో బట్టబయలు అయిన వ్యవహారం జిల్లాలో కొన్నేళ్ల నుంచి జరుగుతున్నా అధికారాన్ని అడ్డుపెట్టుకొని ట్రావెల్స్‌ దందా కొనసాగించారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. గతంలో పనిచేసిన రవాణాశాఖ అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరించారు.  రహదారులపై అడ్డదారిలో తిరగడమే కాకుండా ఏపీఎస్‌ ఆర్టీసీకి నష్టం కలిగించేలా కొన్ని రూట్లలో అతివేగంతో రాకపోకలు సాగిస్తూ అనేక మంది ప్రజల ప్రాణాలను కూడా జేసీ ట్రావెల్స్‌ బస్సులు తీశాయి.  

ఇటీవల రవాణా శాఖ అధికారులు సీజ్‌ చేసిన దివాకర్‌ ట్రావెల్స్‌ బస్సులు
8 2017 నవంబర్‌ 3న ఆత్మకూరు సమీపంలోని వడ్డుపల్లి వద్ద వేగంగా వచ్చిన దివాకర్‌ ట్రావెల్స్‌ బస్సు ఎదురుగా వచ్చిన బొలొరో వాహనాన్ని ఢీ కొంది. ఈ ఘటనలో ‘ఆత్మ’ డీపీడీ రమణ ప్రాణాలు కోల్పోయారు. 2017 సెప్టెంబర్‌లో ఆత్మకూరు మండలం వై.కొత్తపల్లెకు చెందిన వెంకటేష్‌ అనే వ్యక్తిని కామారుపల్లివద్ద దివాకర్‌ బస్సు ఢీ కొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు. సదరు ట్రావెల్స్‌ నిర్వాహకులు ఆస్పత్రి ఖర్చులు కూడా చెల్లించకపోవడంతో బాధితుడు గ్రామస్తుల సాయంతో ధర్నా చేశాడు. ఇలా గత నాలుగేళ్లలో దివాకర్‌ ట్రావెల్స్‌ బస్సుల ప్రమాదాలతో అనేక మంది ప్రాణాలు కోల్పోగా, చాలా మంది క్షతగాత్రులుగా మిగిలి జీవచ్ఛవాల్లో బతుకుతున్నారు. ప్రమాదాలకు కారణమైన బస్సులకు అనుమతి లేనట్లు గుర్తించినా.. అప్పటి రవాణాశాఖ అధికారులు చర్యలకు వెనుకంజ వేశారు.

ఫిర్యాదుల మేరకే దాడులు  
నిబంధనలకు విరుద్ధంగా బస్సులు తిరుగుతున్నాయని వచ్చిన ఫిర్యాదుల మేరకు ఆకస్మిక తనిఖీలు నిర్వహించాం. ఇందులో పదిబస్సులు పట్టుబడగా దివాకర్‌ ట్రావెల్స్‌కు చెందినవి 8 ఉన్నాయి. అనుమతులు లేకపోవడం, డ్రైవర్, కండెక్టర్‌లకు లైసెన్స్‌ లేకపోవడం, అక్రమంగా సీటింగ్‌ కెపాసిటీ పెంచి ప్రయాణికులను తరలిస్తుండడం తదితర కారణాలతో వాటిని సీజ్‌ చేశాం. ఈ దాడులు కొనసాగుతాయి. రోజూ 20 చొప్పున ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సులను తనిఖీలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం.  
– శివరామప్రసాద్, ఉపరవాణా కమిషనర్‌     

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/1

ఇటీవల రవాణా శాఖ అధికారులు సీజ్‌ చేసిన దివాకర్‌ ట్రావెల్స్‌ బస్సులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement