
అద్దె ఇంటికి చంద్రబాబు!
- జూబ్లీహిల్స్ రోడ్ నం. 24లో ఇల్లు ఖరారు?
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఇప్పుడు అద్దె ఇంటి వేటలో పడ్డారు. ప్రస్తుతం నివసిస్తున్న ఇంటిని కూల్చి దాని స్థానంలో భారీ భవంతిని నిర్మించాలని ఆయన నిర్ణయించుకున్నారు. అది పూర్తి కావడానికి దాదాపు రెండేళ్ల సమయం పడుతుందని అంచనా. అంతవరకు కుటుంబ సమేతంగా నివసించడానికి ఓ అద్దె ఇంటి కోసం బాబు అన్వేషిస్తున్నారు.
ఆయన, కుటుంబం, వాస్తు, భద్రత ఈ నాలుగింటి మధ్యా ఏకాభిప్రాయం కుదరక గత పదిహేను రోజులుగా జరుగుతున్న ఇంటి అన్వేషణ ఓ కొలిక్కి రాలేదు. ఎట్టకేలకు జూబ్లీహిల్స్ రోడ్ నం. 24లో ఉన్న భవనం దాదాపుగా ఖరారైనట్టు తెలిసింది. బాబు మూడోసారి సీఎం పీఠం ఎక్కిన తరవాత వాస్తుకు ప్రాధాన్యం ఇస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే రూ.కోట్లు వెచ్చించి సచివాలయంలోని ముఖ్యమంత్రి చాంబర్, క్యాంపు కార్యాలయంగా వినియోగిస్తున్న లేక్ వ్యూ గెస్ట్‌హౌస్‌లలో అనేక మార్పుచేర్పులు చేశారు. ఇలా బయటి కార్యక్రమాలు పూర్తి చేసిన ఆయన ఇప్పుడు ఇంటిపై దృష్టి పెట్టారు. ఈ ఇంటిని చంద్రబాబుతో పాటు ఆయన భార్య భువనేశ్వరి, కోడలు బ్రాహ్మణి పరిశీలించి అవసరమైన మార్పుచేర్పులు సూచించారు.